కలలుగన్న తెలంగాణ రావాలి
* అప్పుడే కాళోజీ వంటి వారికి నిజమైన నివాళి
* రవీంద్రభారతిలో కాళోజీ శతజయంతి వేడుకల్లో కేసీఆర్
సాక్షి, హైదరాబాద్: ‘తెలంగాణ ప్రాంత పురోగతికి ప్రణాళిక రచన జరగాలి. రాష్ర్ట సమగ్రాభివృద్ధికి కొత్త చట్టాలు రావాలి. ఇంకా ఆంధ్రప్రదేశ్ యావ ఎందుకు? కాళోజీ, దాశరథి, జయశంకర్‌లాంటివారు కలలుగన్న తెలంగాణ సాక్షాత్కారం కావాల్సి ఉంది. అలాంటి తెలంగాణను సృష్టించడమే వారికి మనమిచ్చే నిజమైన నివాళి. ప్రస్తుతం తెలంగాణ ప్రభుత్వం అదే దిశలో వాస్తవ దృక్పథంతో ముందుకు సాగుతోంది. ప్రజల కు ఏం కావాలో చెప్పిన మాటలను సిన్సియర్‌గా చేసి చూపిస్తానని ప్రామిస్ చేస్తున్నాను’ అని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు.
రవీంద్రభారతిలో మంగళవారం రాత్రి జరిగిన కాళోజీ శత జయంతి వేడుకల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ప్రభుత్వం వచ్చిన వంద రోజుల్లో ఏం జరిగిందంటూ కొందరు కురచ మనస్తత్వం ఉన్నవారు ప్రశ్నిస్తున్నారని, కానీ ధైర్యంగా సాహసోపేత నిర్ణయాలతో ప్రభుత్వం సాగుతోందని అన్నారు. మేధావులతో త్వరలో ఓ ప్రజాసంఘాన్ని ఏర్పాటు చేస్తామని, దాని ఆధ్వర్యంలోనే పాలన సాగుతుందని ప్రకటించారు.
‘‘రోడ్డని పలికేవాడికి సడకంటే ఏవగింపు.. ఆఫీసని అఘోరిస్తూ కచ్చీరంటే కటువు. సీరియలంటే తెలుగు.. సిల్సిలా అంటే ఉరుదు. టీ అంటే తేట తెనుగు.. చా అంటే తుర్కము. బర్రె అంటే నవ్వులాట.. గేదంటేనే పాలు. రెండున్నర జిల్లాలదే దండి భాష తెలుగు... తక్కినోళ్ల నోళ్ల యాస త్రొక్కి నొక్కి పెట్టు తీర్పు. వహ్వారే! సమగ్రాంధ్రవాదుల ఔదార్యమ్ము..’’ అంటూ కాళోజీ మాటలను కేసీఆర్ ఈ సందర్భంగా వినిపించారు.
అనంతరం ప్రముఖ కళాకారుడు అంబాజీ రూపొందించిన కాళోజీ చిత్రపటాన్ని, జీహెచ్‌ఎంసీలో ఉప కమిషనర్‌గా పనిచేస్తున్న యాదగిరిరావు రాసిన కాళోజీ సమగ్ర సాహిత్య పరిశోధన గ్రంథాన్ని సీఎం ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో శాసన మండలి చైర్మన్ స్వామిగౌడ్, శాసనసభ స్పీకర్ మధుసూధనచారి, కాళోజీ ఫౌండేషన్ అధ్యక్షులు నాగిళ్ల రామశాస్త్రి, రచయిత అంపశయ్య నవీన్, కవి దేశపతి శ్రీనివాస్, ప్రభుత్వసలహాదారులు రమణాచారి, గోయల్, రామ్‌లక్ష్మణ్, కాళోజీ కుమారుడు రవికుమార్, కోడలు వాణి తదితరులు పాల్గొన్నారు.
కేసీఆర్ ప్రసంగం ఆయన మాటల్లోనే..
* రెండు రాష్ట్రాలు విడిపోయిన తర్వాత ‘తెలుగు’ అంటూ మళ్లీ బయలు దేరిన్రు. జొచ్చేటప్పుడు చాలా తియ్యగ మాట్లాడతరు.. జొచ్చినాక మీది తెలుగే కాదంటరు. ఇప్పుడు మళ్లీ తెలుగువాళ్లమన్న పేరుతో అదే జరుగుతుంది. వాళ్లెన్నిజేయాలో అన్ని జేసిన్రు.. ఇంకా మానలేదు. కొట్లాడుకుంటు కూడా ఎట్ల బతకాల్నో తెలంగాణ వాళ్లకు తెలుసు.. మీరే దెబ్బదింటరు. గెలిచి నిలవడం తెలంగాణ రక్తంలోనే ఉంది.
* నేను తెలంగాణ తల్లి అంటే బిత్తిరిబిత్తిరైన్రు. అది నేను చెప్పిన మాట కాదు. అప్పట్లోనే దాశరథిలాంటి వాళ్లు చెప్పిందే. చెన్నై రాజధాని సమయంలో వాళ్లు ఆంధ్రమాత అన్నరు. చివరకు ఆ ఆంధ్రమాతను, తెలంగాణ త ల్లిని ముంచి తెలుగుతల్లిని పుట్టిచ్చిన్రు. కాళోజీ ఆవహించాడో ఏమోగాని నేను కోపంతో ఎవని తెలుగుతల్లి అంటే నా మీదకు ఇంతెత్తు లేచిన్రు.
* తెలంగాణ యాస అంటే మోటుగా ఉంటుందనే భావన కొందరిలో ఉంది. ఈ యాసను ఘనంగా చాటాలనే సోయి వారిలో రావాల్సి ఉంది. కాళోజీ కలలుగన్న తెలంగాణే కాదు, తెలంగాణ యాస కూడా వర్ధిల్లాలి.
కాళోజీ సెటైర్ వేసేవారేమో...
ఇటీవల సమగ్ర సర్వే చేసినప్పుడు నగరంలో అదనంగా నాలుగు లక్షల కుటుంబాలు ఇళు ్లకట్టుకుని ఉన్న సంగతి తేలిందని, జీహెచ్‌ఎంసీ కమిషనర్‌కు ఈ విషయమే తెలియదని పేర్కొన్నారు. కాళోజీ బతికి ఉంటే దీనిపై పెద్ద సెటైర్ వేసేవారేమోనని కేసీఆర్ చమత్కరించారు.
ఉన్నదే చెబుదాం.. మాయ మాటలొద్దు!
పరిపాలన విషయంలో ప్రజలకు వాస్తవాలే చెబుదామని, మంత్రులు దీన్నే పాటించాలని కేసీఆర్ హితవు పలికారు. గత ప్రభుత్వాలు ఏవో మాటలు చెప్పి ప్రజలను మోసం చేశాయన్నారు. ‘మా ఉప ముఖ్యమంత్రి రాజయ్య నేను వంద రోజుల్లో అద్భుతాలు చేసిన అని అన్నరు. నేను ఏం జేయలే.. అసలు పనే మొదలుకాలే. దసర నుంచి పని మొదలైతదని నేను మొదటే చెప్పిన. ఇంత గడబిడ ఎందుకు? డంబాచారం చెప్పడం, గోల్‌మాల్ దిప్పడం నాకు రాదు.
మంత్రులు ఎవరు కూడా ఇలా చేయవద్దని చెప్పిన. చెబితే మీరే దెబ్బతింటరని చెప్పిన. రాజయ్య గారు వినకుండా ఇక్కడ హెల్త్‌వర్సిటీ పెడ్తమని వచ్చినప్పడుల్లా అంటున్నరు. ఒళ్లు దగ్గర పెట్టుకుని మాట్లాడాలె. సాధ్యమైతదా? చెయ్యగలిగిందే చెప్పా లె. కాళోజీ అదే చెప్పిండు. అడ్డం పొడుగు మాట్లాడి లేని మాటలు పడుడెందుకు. గత ప్రభుత్వాలన్నీ అదే పని జేసినయ్. ప్రజలను మోసపుచ్చే, మాయామశ్చీంద్ర మాటలు ఎందుకు’ అని కేసీఆర్ అన్నారు.
కేశవరావు శాసన మండలి సభ్యుడిగా ఉన్నప్పుడు తాను వర్సిటీలో ఎం.ఏ (పొలిటికల్ సైన్స్) చేసేవాడినని కేసీఆర్ గుర్తు చేసుకున్నారు. ఆ సమయంలో కేకే ప్రసంగాలను అసెంబ్లీ గ్యాలరీలో కూర్చుని వినేవాడినని చెప్పారు. అప్పుడు కేకే... దేశంలో బంగళాల భారతదేశం, గుడిసెల భారతదేశం రెండూ ఉన్నాయని వ్యాఖ్యానిస్తే ఆంధ్ర మీడియా కార్టూన్లు వేసి పెద్ద రాద్ధాంతం చేశాయని కేసీఆర్ వివరించారు.