
మేడారం నుంచి సాక్షి ప్రతినిధి: తెలంగాణ కుంభమేళా మేడారం మహాజాతర అధికారికంగా ముగిసింది. నాలుగు రోజులపాటు భక్తుల పూజలు అందుకున్న వనదేవతలు సమ్మక్క–సారలమ్మ శనివారం సాయంత్రం తిరిగి అడవిలోకి ప్రవేశించారు. ఆదివాసీ సంప్రదాయాలతో పూజారులు, వడ్డెలు వనదేవతలను వనంలోకి తీసుకెళ్లారు. మేడారం గద్దెలపై కొలువుదీరిన నలుగురు దేవతల వనప్రవేశం ఉద్విఘ్నంగా సాగింది. ఆ దృశ్యం చూసేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు వచ్చారు. జాతర చివరి రోజున సుమారు 15 లక్షల మంది భక్తులు వనదేవతలను దర్శించుకున్నారు. శనివారం మేడారంలో భారీ వర్షం కురవడం, ఎక్కడికక్కడ ట్రాఫిక్ స్తంభించడంతో సొంతూళ్లకు తిరుగు పయనమైన భక్తులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.
ప్రత్యేక పూజలతో వనంలోకి...
దేవతల వనప్రవేశ ఘట్టం శనివారం సాయంత్రం ప్రత్యేక పూజలతో ప్రారంభమైంది. సాయంత్రం ఆరు గంటల సమయంలో దర్శనాలను పూర్తిగా నిలిపివేశారు. మొదట గోవిందరాజును దబ్బగట్ల గోవర్దన్, పోదెం బాబు నేతృత్వంలోని పూజారుల బృందం గద్దెల నుంచి .. గంటలకు కదిలించి ఏటూరునాగారం మండలం కొండాయికి తరలించింది. అనంతరం ... గంటలకు సమ్మక్క పూజారులు కొక్కెర కృష్ణయ్య, సిద్దబోయిన మునీందర్‌లతో కూడిన మరో బృందం గద్దెల వద్ద పూజలు నిర్వహించాక సమ్మక్కను అక్కడి నుంచి కదిలించి చిలుకలగుట్టకు చేర్చింది. ఇక సమ్మక్క భర్త పగిడిద్దరాజున.. గంటలకు పెనక మురళీధర్, పూజారుల బృందం తరలించి కొత్తగూడ మండలం పూనుగొండ్ల వైపు తీసుకెళ్లింది. ఆదివారం సాయంత్రంలోగా వారు గమ్యాన్ని చేరుకుంటారు. ఇక సారలమ్మను కాక సారయ్య, కాక కిరణ్, సోలం వెంకటేశ్వర్లతో కూడిన పూజారుల బృందం గద్దెపై ప్రతిష్టించిన ముట్టె (వెదురుబుట్ట)ను.. గంటలకు తీసుకొని జంపన్నవాగు మీదుగా కన్నెపల్లికి చేర్చింది. భక్తులు ఈ సమయంలో పూజారులను తాకి, మొక్కుకోవడానికి ప్రయత్నించారు. దేవతల వనప్రవేశంతో మేడారం మహాజాతర అధికారికంగా ముగిసింది. బుధవారం నిర్వహించే తిరుగువారం పండుగతో మహా జాతర పరిసమాప్తమవుతుంది. అప్పటిదాకా భక్తులు గద్దెల వద్ద మొక్కులు చెల్లించుకుంటూనే ఉంటారు.
నాలుగోరోజు వీఐపీల తాకిడి
మేడారం జాతర చివరి రోజూ వీఐపీల తాకిడి కొనసాగింది. కేంద్ర గిరిజనశాఖ మంత్రి అర్జున్ ముండా సమ్మక్క–సారలమ్మను దర్శించుకున్నారు. తులాభారంతో నిలువెత్తు (75 కిలోలు) బంగారాన్ని తల్లులకు సమర్పించారు. శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి, మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి అమ్మవార్లకు మొక్కులు చెల్లించారు. మంత్రులు పువ్వాడ అజయ్ కుమార్, ఇంద్రకరణ్‌రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్‌రావు, సత్యవతి రాథోడ్ తల్లులను దర్శించుకున్నారు. కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే వివేకానందగౌడ్, ఉప్పల్ ఎమ్మెల్యే సుభాశ్‌రెడ్డి, కూకట్‌పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికపూడి గాంధీ, ఎమ్మెల్సీలు శంబీపూర్ రాజు, షేరి సుభాశ్‌రెడ్డి, నవీన్‌రావు అమ్మలను దర్శించుకున్న వారిలో ఉన్నారు. వారితోపాటు తెలంగాణ సీఎస్ సోమేశ్ కుమార్, డీజీపీ మహేందర్‌రెడ్డి, ప్రభుత్వ సలహాదారు అనురాగ్‌శర్మ, ఛత్తీస్‌గఢ్ డీజీపీ డీఎం అవస్థి, ఆ రాష్ట్ర సీఎస్ ఆర్.పి. మండల్, పలువురు ఐఏఎస్‌లు, ఐపీఎస్‌లు అమ్మవార్లను దర్శించుకున్నారు.
సీఎం అభినందనలు...
మేడారం సమ్మక్క–సారలమ్మ జాతరను విజయవంతంగా ముగించడంపై సీఎం కేసీఆర్ హర్షం వ్యక్తం చేశారు. జాతరను విజయవంతం చేసేందుకు అహర్నిశలు పనిచేసిన అన్ని శాఖల అధికారులు, ఉద్యోగులు, సిబ్బందికి ముఖ్యమంత్రి అభినందనలు తెలిపారు. అన్ని శాఖలను సమన్వయపరిచి జాతరను అద్భుతంగా జరిగేందుకు కృషి చేసిన మంత్రులు, ములుగు జిల్లా కలెక్టర్, ఎస్పీ, ఇతర శాఖల అధికారులు, జిల్లా ప్రజాప్రతినిధులకు సీఎం అభినందనలు తెలిపారు. తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాల్లో ముందుకెళ్లే విధంగా సమ్మక్క–సారలమ్మ దీవిస్తారని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆశాభావం వ్యక్తం చేశారు.
మేడారం జాతర విజయవంతం
మేడారం జాతరను అందరి సహాయ సహకారాలతో విజయవంతంగా నిర్వహించగలిగాం. జాతరలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూసుకున్నాం. ముఖ్యమంత్రి కేసీఆర్ సూచనల మేరకు సహచర మంత్రులు, ప్రజాప్రతిని«ధులు, కలెక్టర్, ఎస్పీ ఇతర ఉన్నతాధికారులు మొదటి నుంచి ప్రణాళికతో సాగారు. తద్వారా జాతరలో భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగలేదు. మేడారం జాతరకు జాతీయ హోదా కల్పించాలని పలుమార్లు కేంద్రాన్ని కోరినా ఫలితం కనిపించలేదు. శనివారం మేడారాన్ని సందర్శించిన కేంద్ర మంత్రి అర్జున్ ముండాను కూడా ఈ విషయమై కోరాం. – అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి, రాష్ట్ర దేవాదాయశాఖ మంత్రి
Comments
Please login to add a commentAdd a comment