sammakka saralakka jathara
-
Medaram: నేడే వనప్రవేశం
ములుగు, సాక్షి: నాలుగు రోజులపాటు గిరిజన జాతరతో మేడారం పులకరించిపోయింది. గద్దెలపై కొలువుదీరిన సమ్మక్క-సారలమ్మలను దర్శించుకునేందుకు భక్తులు పోటెత్తున్నారు. ఇద్దరు తల్లులు నేటి సాయంత్రమే వన ప్రవేశం చేయనున్నారు. కన్నెపల్లికి సారలమ్మ, చిలకలగుట్టకు సమక్కలు చేరుకోవడంతో జాతర ముగుస్తుంది. జాతర నేపథ్యంలో.. భక్తిశ్రద్ధలతో వనదేవతలకు మొక్కులు చెల్లించుకుంటున్నారు. మేడారంలో సమ్మక్క, సారలమ్మలను శుక్రవారం రాత్రి వరకు 1.20 కోట్ల మంది భక్తులు దర్శించుకున్నట్లు రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గిరిజన సంక్షేమశాఖ మంత్రి సీతక్క ప్రకటించారు. నిన్న ఒక్కరోజే 60 లక్షల మందికి పైగా భక్తులు గద్దెలను దర్శించుకున్నట్లు అధికారులు చెబుతున్నారు. దీంతో ఈసారి భక్తుల సంఖ్య కూడా కోటిన్నర దాటి ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. ఇవాళ సమ్మక్క సారలమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజులను గద్దెలపై నుంచి ఆదివాసీ పూజారులు వారి వారి ఆలయాలకు తీసుకెళ్లనున్నారు. సమ్మక్క ప్రతిరూపమైన కుంకుమభరిణెతో సాయంత్రం సూర్యాస్తమయం తర్వాత పూజారులు వన ప్రవేశం చేయడంతో జాతర ముగియనుంది. సారలమ్మ రాక తర్వాత మహాజాతర లాంఛనంగా ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఆ మరుసటి రోజు సమ్మక్కను గద్దెపైకి తీసుకురాగా.. శుక్రవారంనాడు అశేష భక్త జనం వన దేవతలకు మొక్కులు సమర్పించారు. భక్తులు పోటెత్తడంతో మేడారం జనజాతరను తలపించింది. జంపన్న వాగులో పుణ్య స్నానాలతో మొక్కుల సమర్పణ, సమ్మక్క బంగారం తులా భారం, వంటలువార్పులు ఒకవైపు.. మరోవైపు భద్రతా సిబ్బంది, జాతర పర్యవేక్షణతో మేడారం పరిసర ప్రాంతాలు కిక్కిరిసిపోయాయి. -
ములుగు జిల్లాకు సమ్మక్క సారలమ్మ పేరు పెట్టాలి: రేవంత్‌రెడ్డి
సాక్షి, ములుగు జిల్లా: కాలాంతకులైన పాలకులు నుంచి విముక్తి కోసం మేడారం సమ్మక్క సారలమ్మ స్ఫూర్తి అని తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు, ఎంపీ రేవంత్‌రెడ్డి అన్నారు. ఆయన మేడారం సమ్మక్క సారలమ్మను శనివారం దర్శించుకున్నారు. అనంతరం రేవంత్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. మేడారం జాతర కోసం పని చేసిన వారందరికీ కృతజ్ఞతలు తెలిపారు. సమైక్య పాలకులు ఉమ్మడి రాష్ట్రంలో వైఎస్సార్, చంద్రబాబు,రోశయ్య మేడారం జాతరను రాష్ట్ర పండుగగా నిర్వహించారని తెలిపారు. వందల కోట్లు కేటాయించిన చరిత్ర కూడా ఉందని పేర్కొన్నారు. సీఎం కేసిఆర్ మేడారాన్ని ప్రపంచ పర్యాటక కేంద్రంగా, పుణ్యస్థలంగా మార్చుతామని హామి ఇచ్చారని, సమ్మక్క సారలమ్మ జిల్లా ఏర్పాటు చేస్తామని చేయలేదని మండిపడ్డారు. మేడారంపై వివక్ష చూపుతూ.. ఆటవికమైన ఆలోచనతో కేసిఆర్ కుట్ర చేస్తున్నారని దుయ్యబట్టారు. పోరాట స్ఫూర్తి ఇలానే ఉంటే తిరుగుబాటు వస్తుందని మేడారంకు ప్రాధాన్యత ఇవ్వడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. దక్షిణాది కుంభమేళా మేడారాన్ని ప్రధానమంత్రి మోదీ, సీఎం కేసిఆర్ గుర్తించడం లేదని ధ్వజమెత్తారు. మచ్చింతల్లో చినజీయర్ స్వామి ఆధ్వర్యంలో రియల్టర్ నిర్మిస్తే, దానికి ఇచ్చిన విలువ కొట్లాది మంది ఆరాధించే సమ్మక్క సారలమ్మ పై పాలకులు ఇవ్వలేదని మండిపడ్డారు. ధనవంతులు, శ్రీమంతులకు ఇచ్చే విలువ మేడారానికి ఇవ్వడంలేదని అన్నారు.ములుగు జిల్లాకు సమ్మక్క సారలమ్మ పేరు పెట్టాలని డిమాండ్ చేశారు.ఆదివాసి గిరిజనుల ఓట్లే కావాలి తప్ప వారి అభివృద్ది పట్టదని ఫైర్ అయ్యారు. జాతీయ పండుగగా గుర్తించాలని అసెంబ్లీలో తీర్మానం చేసి రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి పంపాలని డిమాండ్ చేశారు. పార్లమెంటులో దాని గురించి తాము మాట్లాడుతామని చెప్పారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే మేడారానికి రూ.వెయ్యి కోట్లు కెటాయించి అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు. కేసిఆర్ చేసిన కొత్త జిల్లాలను సవరించి సమ్మక్క సారలమ్మ జిల్లా ఏర్పాటు చేస్తామని అన్నారు. 12 నెలలు ఓపిక పట్టండి సోనియాగాంధీ నేతృత్వంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.కాంగ్రెస్ అధికారంలోకి వస్తే జాతీయ పండుగగా గుర్తింపు ఇస్తామని అన్నారు. రాహుల్ గాంధీ ప్రధానమంత్రి హోదాలో మేడారం జాతరకు తీసుకువస్తామని తెలిపారు. గిరిజన యూనివర్సిటీకి రాష్ట్ర ప్రభుత్వం సహకరించకపోడం వల్లే రాలేదని కేంద్రం ప్రకటించిందని గుర్తుచేశారు.ఇప్పటికైనా గిరిజన యూనివర్సిటీ ఏర్పాటు చేసేలా ప్రతిపాదనలు పంపాలని రేవంత్‌రెడ్డి డిమాండ్ చేశారు. -
జన సమ్మోహనం.. జగజ్జనని ఆగమనం
మేడారం నుంచి సాక్షిప్రతినిధి, వరంగల్: ములుగు జిల్లా మేడారం అడవి సమ్మక్క నామస్మరణతో మా ర్మోగింది. జాతరలో అతి ముఖ్యమైన ఘట్టం గురు వారం రాత్రి ఆవిష్కృతమైంది. లక్షల మంది భక్తుల పారవశ్యం, గిరిజన యువతుల నృత్యాలు, కోయ దొరల డోలు వాయిద్యాలు, శివసత్తుల పూనకాలు, హిజ్రాల మొక్కులు, అధికారుల లాంఛనాల మధ్య ఆదివాసీ పూజారులు, వడ్డెలు వన దేవత సమ్మక్క ను మేడారం గద్దెలపైకి చేర్చారు. ఈ సందర్భంగా చిలకలగుట్ట నుంచి మేడారం గద్దెల దాకా భక్త జనంతో కిటకిటలాడింది. చిలకలగుట్ట నుంచి మేడారానికి సమ్మక్కను తీసుకువచ్చే క్రతువు గురువారం సాయంత్రం ఐదు గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు ఉద్విగ్నభరితంగా సాగింది. ఉదయం నుంచే మొదలై.. సమ్మక్కను మేడారం గద్దెలపైకి చేర్చే ఏర్పాట్లు గురువారం ఉదయమే మొదలయ్యాయి. సమ్మక్క వడ్డెలు, పూజారులు ఉదయం 5.30 గంటలకే మే డారం సమీపంలోని చిలకలగుట్ట అడవిలోకి వెళ్లి కంకవనాలు (వెదురు కర్రలు) తెచ్చి గద్దెలపై ప్రత్యే క పూజలు చేశారు. సమీపంలోని సమ్మక్క పూజా మందిరం నుంచి వడరాలు (కొత్త కుండలు) తెచ్చి గద్దెలపైకి చేర్చారు. తర్వాత సాయంత్రం ఐదు గంటల సమయంలో కుంకుమ భరిణె రూపంలో ఉన్న సమ్మక్కను గద్దెపైకి తెచ్చేందుకు పూజారులు, వడ్డెల బృందం చిలకలగుట్టపైకి బయలుదేరారు. అప్పటికే చిలకలగుట్ట ప్రాంతం మొత్తం భక్తులతో నిండిపోయింది. భక్తులు సమ్మక్క వచ్చే దారి పొడవునా రంగురంగుల పట్నాలు, ముగ్గులతో నింపేశా రు. సాయంత్రం ఏడు గంటల సమయంలో సమ్మక్క తల్లితో పూజారులు చిలకలగుట్ట దిగడం ప్రారంభించారు. ఇది చూసి భక్తులు, శివసత్తులు పూనకాలతో ఊగిపోయారు. పూజారులు సిద్దబో యిన మునీందర్, లక్ష్మణ్‌రావు, మహేష్, చందా బాబూరావు, దూప వడ్డె నాగేశ్వర్రావు అమ్మవా రిని వడ్డె కొక్కెర కృష్ణయ్యకు అప్పగించాక మేడారం వైపు కదిలారు. ప్రభుత్వం తరఫున అధికారిక లాం ఛనాల ప్రకారం సమ్మక్కకు ఆహ్వానిస్తూ, ఆమె రాకకు సూచనగా ములు గు జిల్లా ఎస్పీ సంగ్రామ్‌సింగ్ జి.పాటిల్ గాల్లోకి కాల్పులు జరిపారు. వెంటనే చిలకలగుట్ట నుంచి మేడా రం దాకా లక్షలాది మంది భక్తజనం సమ్మక్క నామస్మరణతో ఆ ప్రాంతం మార్మోగింది. ప్రభుత్వం తరఫున మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, ఇంద్రకరణ్‌రెడ్డి సమ్మక్క తల్లికి స్వాగతం పలికారు. రక్షణ వలయం మధ్య ఆదివాసీ యువకుల రక్షణ వలయం, పోలీసు బలగాల మధ్య వడ్డెల బృందం సమ్మక్క ప్రతిరూపంతో మేడారం వైపు బయలుదేరారు. దారిపొడవునా భక్తులు అమ్మకు దండం పెట్టుకున్నారు. మొక్కుల కోసం తెచ్చుకున్న ఒడి బియ్యాన్ని చల్లారు. సమ్మక్కను తీసుకువస్తున్న బృందం అక్కడి నుంచి ఎదుర్కోళ్ల పూజా మందిరం చేరుకుంది. అక్కడ వడ్డెలు, పూజారులు ఎదురుకోళ్లు జరిపించారు. సమ్మక్కకు సెలపెయ్యను బలి ఇచ్చారు. మేడారం గద్దెల ముఖ ద్వారం వద్ద ఆ ఊరి ఆడబిడ్డలు సమ్మక్కను తీసుకువస్తున్న పూజారుల కాళ్లు కడిగి స్వాగతం పలికారు. తర్వాత 9.19 గంటల సమయంలో గద్దెలపైకి తీసుకువచ్చారు. సమ్మక్క తల్లి గద్దెపైకి వచ్చినప్పటి నుంచి ప్రతిష్టించే వరకు గద్దెల ఆవరణలో విద్యుత్ దీపాలను ఆపివేశారు. రహస్య పూజలు చేసిన అ నంతరం రాత్రి 9.43 గంటల సమయంలో దీపా లను ఆన్ చేశారు. మొదట మేడారం వాసులు, జిల్లా అధికారులు మొక్కులు చెల్లించుకున్నారు. కేసీఆర్ పేరిట బెల్లం బంగారం సమర్పణ గురువారం సీఎం కేసీఆర్ పుట్టినరోజు కావడంతో మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు.. కేసీఆర్ పేరిట అమ్మవార్లకు బెల్లం బంగారం మొక్కు సమర్పించారు. మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి కూడా అమ్మవార్లకు సీఎం పేరుమీద బెల్లం సమర్పించారు. నలుగురు దేవతలు.. నలుదిక్కులా మొక్కులు బుధవారం మేడారం గద్దెలకు సారలమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజు రాగా.. గురువారం సమ్మక్క తల్లిని ప్రతిష్టించారు. దీనితో మొత్తం నలుగురు దేవతలు గద్దెలపైకి చేరి.. మహా జాతర పూర్తిస్థాయిలో ప్రారంభమైంది. మొక్కులు సమర్పించేందుకు లక్షల మంది భక్తులు భారీగా తరలివచ్చారు. దేవతలను దర్శించుకొని, మొక్కులు చెల్లించుకున్నారు. బుధ, గురువారాల్లో సుమారు 75 లక్షల మంది భక్తులు అమ్మవార్లను దర్శించుకున్నట్లు జిల్లా కలెక్టర్ కృష్ణ ఆదిత్య ప్రకటించారు. -
సమ్మక్కను తీసుకొచ్చేది తనే.. కోటికొక్కడు
మేడారం జాతరలో ప్రధాన ఘట్టం చిలకలగుట్ట మీద నుంచి సమ్మక్కను గద్దెలపైకి తీసుకురావడం. ఈ ఘట్టంలో అత్యంత ఉద్విగ్న భరిత క్షణాలు చిలకలగుట్ట కిందికి సమ్మక్క దిగిరావడం ఆ సమయంలో జిల్లా కలెక్టర్, ఎస్పీలు ఎదురేగి వెళ్లి తుపాకులతో గాలిలోకి కాల్పులు జరపడం. ఈ క్షణాల్లో అందరి కళ్లు భరణి రూపంలో ఉన్న సమ్మక్కపైనే ఆ తర్వాతి స్థానం ఆ భరణి తీసుకువచ్చే ప్రధాన వడ్డే కొక్కెర కృష్ణయ్యపైనే ఉంటాయి. వేలది మంది ప్రత్యక్షంగా లక్షలాది మంది ప్రసార మాధ్యమాల్లో కోట్లాది మంది పరోక్షంగా ఉత్కంఠను అనుభవిస్తారు. అంతటి ఉత్కంఠ, ఉద్విగ్నభరిత క్షణాలను తన భూజాలపై మోసే కొక్కర కృష్ణయ్య మనోగతం సాక్షి పాఠకులకు ప్రత్యేకం. ఆరోసారి 2022 ఫిబ్రవరి 17వ తేదిన చిలకలగుట్ట మీద నుంచి సమ్మక్కను కొక్కెర కృష్ణయ్య తీసుకురానున్నారు. అంతకు ముందు ఆయన మొదటిసారిగా 2012 జాతరలో ఈ అదృష్టాన్ని దక్కించుకున్నారు. అంతకు ముందు జాతరలో కొక్కెర కృష్ణయ్యకు∙బాబాయ్ అయిన కొక్కెర వెంకన్న ఈ బాధ్యతలను చేపట్టారు. ఆ తర్వాత ఆయన కొడుకు సాంబశివరావు చేశారు. వారిద్దరి తర్వాత కృష్ణయ్యకు ఈ భాగ్యం దక్కింది. కొక్కెర కృష్ణయ్య మేడారంలోనే నివాసం ఉంటారు. సాధరణ సమయంలో వ్యవసాయం ప్రధాన వృత్తి. భార్య వినోద, ఎనిమిదో తరగతి చదివే కొడుకు, డిగ్రీ, ఏడో తరగతి చదువుతున్న ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. ఆ వారం రోజులు నిష్టతో ఉంటాను గుడిమెలిగె పండుగతో సమ్మక్క–సారలమ్మ జాతరకు తొలి అడుగు పడుతుంది. అయితే జాతర మొదలయ్యేది మండెమెలిగే పండుగతోనే. మండెమెలిగే పండుగ నాడు మేడారంలో ఉన్న సమ్మక్క గుడిలో పూజలు చేస్తాం. ఆ రోజు నుంచి చిలకలగుట్ట పైనుంచి సమ్మక్కతల్లిని గద్దెలపైకి చేర్చే వరకు నియమనిష్టలతో ఉంటాం. పగటి వేళ కేవలం పాలు, అరటిపళ్లు ఆహారంగా తీసుకుంటారు. రాత్రి పొద్దుపోయాక పూజ చేసిన అనంతరం అన్నం తింటారు. ఆ రోజున దేవాదాయశాఖ ఇచ్చిన కొత్త బట్టలు ధరిస్తాం మేడారం సమ్మక్క గుడిలో పూజలు చేస్తాం. ఆ తర్వాత రహాస్యం అయిన పూజా సామగ్రిని తీసుకుని నాతో పాటు వడ్డెల బృందం చిలకలగుట్టకు బయల్దేరుతుంది. సమ్మక్క వడ్డేలైన దోబేపగడయ్య దూపం వేస్తుండగా మల్యాల ముత్తయ్య జలకంపట్టి వేస్తూ ముందుకు కదులుతాం. జనికపు కొమ్ములతో సిద్ధబోయిన సమ్మయ్య జనికపు కొమ్ములతో సిద్ధబోయిన సమ్మయ్య (తండ్రిపేరు పొట్టయ్య), సిద్ధబోయిన సమ్మయ్య (తండ్రిపేరు దానయ్య). భజంత్రీలు మాదిరి పుల్లయ్య, మాదిరి నారయణలు మమ్మల్ని అనుసరిస్తారు. అయితే చిలకలగుట్ట సగం వరకే వీరికి ప్రవేశం. ఆ తర్వాత సమ్మక్క తల్లి కొలువై ఉండే రహాస్య ప్రదేశానికి నేనొక్కడినే వెళ్తాను. అక్కడ పూజాలు నిర్వహించిన తర్వాత సమ్మక్క తల్లి భరిణి రూపంలో కిందకు తీసుకువస్తాను. నేను రావడం కనిపించగానే జనికపు కొమ్ములతో సిద్ధబోయిన సమ్మయ్య (తండ్రిపేరు పొట్టయ్య), సిద్ధబోయిన సమ్మయ్య (తండ్రిపేరు దానయ్య). భజంత్రీలు మాదిరి పుల్లయ్యలు తమ వాయిద్యాలతో శబ్ధం చేస్తారు. అలా గుట్టమధ్య నుంచి సమ్మక్క తల్లి చిలకలగుట్ట పాదల వద్దకు చేరుకోగానే చేరుకోగానే ప్రభుత్వం తరఫున జిల్లా కలెక్టర్, ఎస్పీలు గాల్లోకి కాల్పులు జరిగి ఆ తల్లికి ఘనస్వాగతం పలుకుతారు. మేము మద్యం సేవించం - కొక్కెర కృష్ణయ్య సమ్మక్క, సారలమ్మ పూజారులు తాగుతారనే అపోహా అందరిలో ఉంది. తాగితేనే దేవత పూనుతుందని అనుకుంటారు. తాగడం అనేది పూజా విధానంలో ఓ భాగంగా అంతా భావిస్తున్నారు. కానీ అది నిజం కాదు. తాగడం అనేది వడ్డెల వ్యక్తిగత విషయం. జాతర సంబరాల్లో భాగంగా మద్యం తీసుకునే అలవాటు ఉన్న వడ్డేలు తాగువారు. మద్యం సేవించడం పూజా విధానంలో భాగం కాదు. నా వరకు నేను మండెమెలిగె పండగ నాటి నుంచే నిష్టతో ఒక్క పొద్దు ఉంటాను. గద్దెలకు చేర్చేవరకు మద్యం సేవించను. నాతో పాటు ఉండే వడ్డేలు వారి వ్యక్తిగత అలవాట్లను బట్టి మద్యం తీసుకుంటారు. అలా మద్యం సేవించడం తప్పు కాదు. అదేవిధంగా సేవించడం తప్పనిసరి కాదు. గతంలో సాయంత్రం 4 గంటలకు కల్లా గద్దెల మీదికి సమ్మక్క తల్లిని తీసుకువచ్చేవాళ్లం. కానీ ఇప్పుడు జాతరకు జనం పెరగడం వల్ల సాయంత్రం 5 అవుతోంది. అయితే ఏడుగంటలల్లోపు ఎప్పుడు వచ్చినా మంచిదే. అందరిలానే నేను ఎంతో మంది భక్తులు తమ కోరికలు తీరాలని, తమ కష్టాలు తొలగిపోవాలని ఆ తల్లిని కొలుస్తారు. వారు అనుకున్న పనిని తల్లి చేసిపెడుతుంది. అందుకే ఏ ఏడుకి ఆ ఏడు భక్తుల సంఖ్య పెరుగుతూ వస్తోంది. అయితే ఆ తల్లిని స్వయంగా తీసుకువచ్చే నాకు మరింత మేలు జరుగుతుంది అని అనుకుంటారు. అందరిలానే నేను. తీసుకురావడం అనేది బాధ్యత అంతే. అందరికీ మేలు చేసే తల్లి నా కుటుంబానికి మేలు చేస్తుంది. -
ముగిసిన మేడారం మహా జాతర
మేడారం నుంచి సాక్షి ప్రతినిధి: తెలంగాణ కుంభమేళా మేడారం మహాజాతర అధికారికంగా ముగిసింది. నాలుగు రోజులపాటు భక్తుల పూజలు అందుకున్న వనదేవతలు సమ్మక్క–సారలమ్మ శనివారం సాయంత్రం తిరిగి అడవిలోకి ప్రవేశించారు. ఆదివాసీ సంప్రదాయాలతో పూజారులు, వడ్డెలు వనదేవతలను వనంలోకి తీసుకెళ్లారు. మేడారం గద్దెలపై కొలువుదీరిన నలుగురు దేవతల వనప్రవేశం ఉద్విఘ్నంగా సాగింది. ఆ దృశ్యం చూసేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు వచ్చారు. జాతర చివరి రోజున సుమారు 15 లక్షల మంది భక్తులు వనదేవతలను దర్శించుకున్నారు. శనివారం మేడారంలో భారీ వర్షం కురవడం, ఎక్కడికక్కడ ట్రాఫిక్ స్తంభించడంతో సొంతూళ్లకు తిరుగు పయనమైన భక్తులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ప్రత్యేక పూజలతో వనంలోకి... దేవతల వనప్రవేశ ఘట్టం శనివారం సాయంత్రం ప్రత్యేక పూజలతో ప్రారంభమైంది. సాయంత్రం ఆరు గంటల సమయంలో దర్శనాలను పూర్తిగా నిలిపివేశారు. మొదట గోవిందరాజును దబ్బగట్ల గోవర్దన్, పోదెం బాబు నేతృత్వంలోని పూజారుల బృందం గద్దెల నుంచి .. గంటలకు కదిలించి ఏటూరునాగారం మండలం కొండాయికి తరలించింది. అనంతరం ... గంటలకు సమ్మక్క పూజారులు కొక్కెర కృష్ణయ్య, సిద్దబోయిన మునీందర్లతో కూడిన మరో బృందం గద్దెల వద్ద పూజలు నిర్వహించాక సమ్మక్కను అక్కడి నుంచి కదిలించి చిలుకలగుట్టకు చేర్చింది. ఇక సమ్మక్క భర్త పగిడిద్దరాజున.. గంటలకు పెనక మురళీధర్, పూజారుల బృందం తరలించి కొత్తగూడ మండలం పూనుగొండ్ల వైపు తీసుకెళ్లింది. ఆదివారం సాయంత్రంలోగా వారు గమ్యాన్ని చేరుకుంటారు. ఇక సారలమ్మను కాక సారయ్య, కాక కిరణ్, సోలం వెంకటేశ్వర్లతో కూడిన పూజారుల బృందం గద్దెపై ప్రతిష్టించిన ముట్టె (వెదురుబుట్ట)ను.. గంటలకు తీసుకొని జంపన్నవాగు మీదుగా కన్నెపల్లికి చేర్చింది. భక్తులు ఈ సమయంలో పూజారులను తాకి, మొక్కుకోవడానికి ప్రయత్నించారు. దేవతల వనప్రవేశంతో మేడారం మహాజాతర అధికారికంగా ముగిసింది. బుధవారం నిర్వహించే తిరుగువారం పండుగతో మహా జాతర పరిసమాప్తమవుతుంది. అప్పటిదాకా భక్తులు గద్దెల వద్ద మొక్కులు చెల్లించుకుంటూనే ఉంటారు. నాలుగోరోజు వీఐపీల తాకిడి మేడారం జాతర చివరి రోజూ వీఐపీల తాకిడి కొనసాగింది. కేంద్ర గిరిజనశాఖ మంత్రి అర్జున్ ముండా సమ్మక్క–సారలమ్మను దర్శించుకున్నారు. తులాభారంతో నిలువెత్తు (75 కిలోలు) బంగారాన్ని తల్లులకు సమర్పించారు. శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి, మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి అమ్మవార్లకు మొక్కులు చెల్లించారు. మంత్రులు పువ్వాడ అజయ్ కుమార్, ఇంద్రకరణ్‌రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్‌రావు, సత్యవతి రాథోడ్ తల్లులను దర్శించుకున్నారు. కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే వివేకానందగౌడ్, ఉప్పల్ ఎమ్మెల్యే సుభాశ్‌రెడ్డి, కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికపూడి గాంధీ, ఎమ్మెల్సీలు శంబీపూర్ రాజు, షేరి సుభాశ్‌రెడ్డి, నవీన్‌రావు అమ్మలను దర్శించుకున్న వారిలో ఉన్నారు. వారితోపాటు తెలంగాణ సీఎస్ సోమేశ్ కుమార్, డీజీపీ మహేందర్‌రెడ్డి, ప్రభుత్వ సలహాదారు అనురాగ్‌శర్మ, ఛత్తీస్‌గఢ్ డీజీపీ డీఎం అవస్థి, ఆ రాష్ట్ర సీఎస్ ఆర్.పి. మండల్, పలువురు ఐఏఎస్‌లు, ఐపీఎస్‌లు అమ్మవార్లను దర్శించుకున్నారు. సీఎం అభినందనలు... మేడారం సమ్మక్క–సారలమ్మ జాతరను విజయవంతంగా ముగించడంపై సీఎం కేసీఆర్ హర్షం వ్యక్తం చేశారు. జాతరను విజయవంతం చేసేందుకు అహర్నిశలు పనిచేసిన అన్ని శాఖల అధికారులు, ఉద్యోగులు, సిబ్బందికి ముఖ్యమంత్రి అభినందనలు తెలిపారు. అన్ని శాఖలను సమన్వయపరిచి జాతరను అద్భుతంగా జరిగేందుకు కృషి చేసిన మంత్రులు, ములుగు జిల్లా కలెక్టర్, ఎస్పీ, ఇతర శాఖల అధికారులు, జిల్లా ప్రజాప్రతినిధులకు సీఎం అభినందనలు తెలిపారు. తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాల్లో ముందుకెళ్లే విధంగా సమ్మక్క–సారలమ్మ దీవిస్తారని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆశాభావం వ్యక్తం చేశారు. మేడారం జాతర విజయవంతం మేడారం జాతరను అందరి సహాయ సహకారాలతో విజయవంతంగా నిర్వహించగలిగాం. జాతరలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూసుకున్నాం. ముఖ్యమంత్రి కేసీఆర్ సూచనల మేరకు సహచర మంత్రులు, ప్రజాప్రతిని«ధులు, కలెక్టర్, ఎస్పీ ఇతర ఉన్నతాధికారులు మొదటి నుంచి ప్రణాళికతో సాగారు. తద్వారా జాతరలో భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగలేదు. మేడారం జాతరకు జాతీయ హోదా కల్పించాలని పలుమార్లు కేంద్రాన్ని కోరినా ఫలితం కనిపించలేదు. శనివారం మేడారాన్ని సందర్శించిన కేంద్ర మంత్రి అర్జున్ ముండాను కూడా ఈ విషయమై కోరాం. – అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి, రాష్ట్ర దేవాదాయశాఖ మంత్రి -
మేడారం మహా జాతరలో భారీ వర్షం
-
వనమో..మేడారం
-
మేడారం జాతరలో సీఎం కేసీఆర్
-
మేడారం జాతర : గద్దెను చేరుకున్న సమ్మక్క
-
భక్తులతో మేడారం కిటకిట
-
జనసంద్రమైన మేడారం జాతర
-
మేడారం: నేడు గద్దెపైకి పగిడిద్దరాజు
సాక్షి, మేడారం(మహబూబాబాద్): సమ్మక్క-సారలమ్మ జాతరలో భాగంగా బుధవారం మేడారంలోని గద్దెలపై సమ్మక్క భర్త పగిడిద్దరాజును పూజరులు ప్రతిష్టించనున్నారు. ఈ క్రమంలో గంగారం మండలం పోనుగొండ్ల నుంచి పగిడిద్దరాజును తీసుకుని పెనుక వంశస్తులు కాలినడకన ప్రయణమయ్యారు. అటవీ మార్గం గుండా దాదాపు 66 కి.మీ నడుచుకుంటూ మేడారం గద్దెల వద్దకు చేరుకుని పగిడిద్దను రాజును ప్రతిష్టించనున్నారు. ఈ సందర్భంగా పోనుగొండ్ల గ్రామ ప్రజలంతా నేడు తమ ఇళ్లను మట్టితో పూతపూసి, రంగురంగు ముగ్గులతో అలంకరించుకుంటారు. పెనుక వంశస్థులు ఇంటి నుంచి స్వామి వారిని కుంకుమ భరణి రూపంలో ఆలయానికి తీసుకొస్తారు. పడగ రూపంలో అలంకరించిన స్థానిక స్వామివారి ప్రతిమతో అటవీ మార్గం గుండా కాలినడకన గిరిజనులు మేడారం బయలుదేరారు. కన్నెపల్లి నుంచి సారక్క, కొండాయి నుంచి గోవిందరాజులు సైతం రాత్రికి సమ్మక్క ఆలయానికి చేరుకుంటారు. అక్కడ పూజారులంతా కలిసి పూజలు చేసి దేవుళ్లను గద్దెలపై ప్రతిష్టిస్తారు. ఈ క్రమంలో ఆలయ అధికారులు సమ్మక్క, సారక్క గద్దెలను ఆలయ ప్రాంగణాన్ని వివిధ రకాల పువ్వులతో అలంకరిస్తారు. ఇందుకోసం దాత వద్దిరాజు రవిచంద్ర ప్రత్యేకంగా బెంగుళూరు నుంచి పువ్వులను తెప్పించారు. కాగా సమ్మక్క సారలమ్మ జాతరకు సీఎస్ సోమేష్ కుమార్, డీజీపీ మహేందర్‌రెడ్డి హెలికాప్టర్లో అక్కడి చేరుకున్నారు. ఈ సందర్భంగా అధికారులతో జాతర సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. సమ్మక్క-సారలమ్మలను దర్శించుకునేందుకు ఛత్తిష్‌ఘడ్ హోంమంత్రి కుటుంబంతో ఆలయాన్ని వచ్చారు. -
మేడారం జాతర: నిలువెత్తు దోపిడి
సాక్షి, వరంగల్ : సమ్మక్క – సారలమ్మ జాతరకు వెళ్లాలనుకునే భక్తులు ముందుగానే నిలువు దోపిడీకి గురవుతున్నారు. నిలువెత్తు బంగారం(బెల్లం) అమ్మలకు సమర్పించే భక్తులకు వ్యాపారులు చుక్కలు చూపెడుతున్నారు. అడ్డదారిలో 14 దుకాణాలను దక్కించుకున్న పాలమూరుకు చెందిన ఓ కాంట్రాక్టర్ ఇష్టారాజ్యంగా విక్రయాలు జరుపుతుండటం భక్తులకు శాపంగా మారుతోంది. జాతర సమీపిస్తున్న కొద్దీ ధరలు పెంచుతున్న వ్యాపారులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. కొద్దిరోజుల క్రితం కిలో బెల్లం రూ.43కు విక్రయించగా.. ప్రస్తుతం రూ.60 నుంచి రూ.80కు అమ్ముతున్నారు. అమ్మవార్ల గద్దెల సమీపంలో మరో రూ.10 అదనంగానే తీసుకుంటున్నారని భక్తులు వాపోతున్నారు. లారీకి రూ.5లక్షలకు పైగానే లాభం నాందేడ్ తదితర ప్రాంతాల్లో 17 టన్నుల లారీలో కిలోకు రూ.33 చొప్పున రూ.5,61,000 పెట్టుబడితో తెప్పించే వ్యాపారులు... కిలోకు రూ.10 పెంచి అమ్మినా రూ.7,31,000 వస్తాయి. అంటే ఒక్క 17 టన్నుల లారీపై రూ.1.70లక్షలు లాభం వస్తుంది. కానీ కిలోకు రూ.27 నుంచి, రూ.47 వరకు అమ్ముతుండడంతో ఒక్కో లారీపై రూ.4,59,000 నుంచి రూ.7,99,000 వరకు లాభం పొందుతున్నారు. ఒక్క మేడారం జాతర సీజన్లో 200 లారీల (17 టన్నుల) బెల్లం విక్రయించే అవకాశం ఉండగా... ఈ బెల్లం రూ.60 కిలో చొప్పున అమ్మితే రూ.9.18 కోట్లు, రూ.80కి విక్రయిస్తే రూ.15.98 కోట్లు భక్తుల సొమ్ము అదనంగా వ్యాపారుల జేబుల్లోకి వెళ్లనుంది. కాగా బెల్లం కొనుగోలు చేసే భక్తులకు ఎలాంటి బిల్లులు ఇవ్వకుండా ‘అనామతు’గా రాసిస్తున్నారు. అమ్మవార్ల జాతరలోనే బంగారం కొనుగోలు చేయాలని దూరప్రాంతాల నుంచి మేడారం వస్తున్న తాము వ్యాపారుల తీరుతో నిలువుదోపిడీకి గురికావాల్సి వస్తోందని భక్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఒచ్కో చోట ఒకలా... ఉమ్మడి వరంగల్ జిల్లాలోని వరంగల్, హన్మకొండ, భూపాలపల్లి, జనగామ, నర్సంపేట, మహబూబాబాద్, పరకాల తదితర ప్రాంతాలకు సమ్మక్క–సారలమ్మ జాతర సందర్భంగా లారీల కొద్దీ బెల్లం దిగుమతి అవుతోంది. ఈ మేరకు వ్యాపారులు ధరలను కొండెక్కిస్తున్నా రు. ప్రధానంగా వరంగల్ పాత బీటుబజార్‌కు చెందిన 9 మంది వ్యాపారులు ‘సిండికేట్’గా ఏర్పడి అధిక ధరలకు విక్రయిస్తూ రూ.లక్షల గడిస్తున్నా అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు. ఫిర్యాదు చేసినా పట్టించుకోకపోవడంతో ఈ 9 మంది వ్యాపారుల ఇష్టారాజ్యం సాగుతోందని భక్తులు ఆరోపిస్తున్నారు. నాందేడ్, పూణే, ఛత్తీస్‌గఢ్, సోలాపూర్, అకోలా(మహారాష్ట్ర) తదితర ప్రాంతాల నుంచి సదరు వ్యాపారులు రోజుకు 20 లారీల వరకు బెల్లాన్ని దిగుమతి చేసుకుంటున్నారు. శనివా రం నుంచి ఈ వ్యాపారం మరింత పుంజుకునే అవకాశం ఉండగా.. ఫిబ్రవరి 8 వరకు సుమా రు 150 లారీల బెల్లం విక్రయించే అవకాశం ఉంది. ధరల నియంత్రణలో సంబంధిత శాఖల అధికారులు నిర్లక్ష్యం.. మేడారం వెళ్లకుండానే భక్తులు నిలువు దోపిడీకి కారణమవుతోంది. మేడారంలో పాలమూరు కాంట్రాక్టర్ గిరిజన సంక్షేమశాఖకు చెందిన ఓ కీలక అధికారి అండదండలతో పాలమూరుకు చెందిన ఓ కాంట్రాక్టర్ మేడారంలో 14 దుకాణాలను తెరిచి ధరలు పెంచి బెల్లం విక్రయాలు చేస్తున్నారు. ఇదేమిటని భక్తులు ప్రశ్నిస్తే ‘ఇష్టముంటే తీసుకో, లేకుంటే వెళ్లిపో.. రేటు మాత్రం తగ్గించేది లేదు’ అంటూ దబాయిస్తున్నారు. గిరిజన సంక్షేమం, దేవాదాయశాఖల అధికారులను అడిగితే ‘అధిక ధరలకు విక్రయిస్తే దుకాణాలు సీజ్ చేస్తాం’ అని చెబుతున్నారే తప్ప ఏ ఒక్కరిపై చర్యలు తీసుకున్న దాఖలాలు లేవని భక్తులు ఆరోపిస్తున్నారు. ఇదిలా ఉండగా వరంగల్ పాత బీటుబజార్‌లో ఆ తొమ్మిది బెల్లం వర్తకుల హవా కొనసాగుతోంది. ప్రతీ శనివారం, ఆదివారం మేడారం వెళ్లే భక్తులు పాత బీటు బజార్‌కు వస్తే కిలో రూ.50 నుంచి 60 వరకు అమ్ముతున్నారు. ఎవరైనా వ్యాపారులు రూ.38, రూ.40కు అమ్మితే.. సంబంధిత అధికారులపై ఒత్తిడి తెచ్చి దాడులు చేయిస్తున్నారని వాపోతున్నారు. కాగా ‘అధిక ధరలకు విక్రయిస్తే వచ్చే లాభం ఒక్క మాకే కాదు.. ఈ వ్యాపారంపై అజమాయిషీ చేసే మూడు శాఖల అధికారులకు వాటా ఇస్తున్నాం.. ఎవరేం ఫిర్యాదు చేసినా మాకేం కాదు’’ అంటూ వ్యాపారులు దబాయిస్తుండడం గమనార్హం. -
బెల్లం మాఫియా!
సాక్షి ప్రతినిధి, వరంగల్ : సమ్కక్క – సారలమ్మ జాతరకు వెళ్లేందుకు భక్తులు ఓ వైపు సిద్ధం అవుతున్నారు. తల్లులకు సమర్పించేందుకు బంగారం (బెల్లం) కొనుగోలు చేసే యత్నాల్లో ఉన్న భక్తులను నిలువు దోపిడీ చేసేందుకు బెల్లం వ్యాపారులు ‘సిండికేట్’ అవుతున్నారు. మేడారం వెళ్లకముందే భక్తులకు శఠగోపం పెట్టేందుకు సిండికేట్‌గా ఏర్పడిన తొమ్మిది మంది వ్యాపారులు.. తమకు ఓ ఎక్సైజ్ «అధికారి అండ ఉందని బహిరంగంగానే చెబుతుండడం వ్యాపారవర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. కాగా, మేడారం సమ్మక్క – సారలమ్మ జాతర ప్రతిసారి వరంగల్ బీట్‌బజార్ కేంద్రంగా సుమారు 150 నుంచి 200 లారీల బెల్లం విక్రయాలు జరుగుతాయి. ఇదే అదునుగా భావించిన కొందరు అధికారులు, వ్యాపారులుమిలాఖత్ అయి ఈసారి పెద్ద మొత్తంలో ధరలు పెంచేందుకు సిద్ధం కావడం వివాదస్పదమవుతోంది. లారీకి రూ.1.70 లక్షల లాభం మహారాష్ట్రలోని పూణెతో పాటు నాందేడ్ తదితర ప్రాంతాల నుంచి వరంగల్ బీట్‌బజార్‌కు బెల్లం దిగుమతి అవుతుంది. 10 టైర్ల లారీ నుంచి 16 టైర్ల లారీ వరకు ఒక్కో లారీలో 17(17వేల కిలోలు) టన్నుల నుంచి 22(22వేల కిలోలు) టన్నులు తీసుకొస్తారు. ఇందుకోసం వ్యాపారులు డీడీ చెల్లిస్తే రవాణా చార్జీలతో సహా రూ.33కు కిలో చొప్పున దిగుమతి చేస్తారు. 17 టన్నుల్లో కిలోకు రూ.33 చొప్పున ఖరీదు చేస్తే పెట్టుబడిగా రూ.5,61,000 వెచ్చించాల్సి ఉంటుంది. వ్యాపారులు ఈ బెల్లాన్ని కిలోకు రూ.10 పెంచి అమ్మినా రూ.7,31,000 వస్తాయి. అంటే ఒక్క 17 టన్నుల లారీపై రూ.1.70లక్షలు, 22 టన్నులపై రూ.2.20లక్షల లాభం వస్తుంది. ఈ సీజన్లో ఇప్పటి వరకు అమ్మింది పోను ఇంకా సుమారు 150 లారీల (17 టన్నుల) బెల్లం విక్రయించే అవకాశం ఉందని వ్యాపారులే చెబుతున్నారు. అంటే కిలోకు రూ.10లు పెంచి (రూ.43కు కిలో) అమ్మినా రూ.2.25 కోట్ల లాభం వ్యాపారులకు అందుతుంది. కానీ ఇప్పటికే హోల్‌సేల్‌గా కిలోకు రూ.43 వరకు విక్రయిస్తుండగా.. బుధవారం నుంచి సిండికేట్‌గా మారి ధర పెంచితే ఎన్ని రూ.కోట్ల ఆదాయం వస్తుందో అంచనా వేయొచ్చని కొందరు వ్యాపారులే చెబుతున్నారు. ఈ వ్యవహారంపై ఇప్పటికైనా అధికారులు దృష్టి సారించి మేడారం జాతరను దృష్టిలో ఉంచుకుని బెల్లం ధరలు పెంచకుండా చర్యలు చేపట్టాలని భక్తులు కోరుతున్నారు. -
నిలువెత్తు బంగారం సమర్పించిన కేసీఆర్
జయశంకర్ భూపాలపల్లి: మేడారంలో శాశ్వత ఏర్పాట్ల కోసం రూ.200 కోట్లు కేటాయిస్తున్నట్లు తెలంగాణ ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్‌రావు ప్రకటించారు. రానున్న బడ్జెట్లోనే రెండువందల కోట్లు కేటాయిస్తామని ఆయన తెలిపారు. సీఎం కేసీఆర్ దంపతులు శుక్రవారం సమ్మక్క-సారలమ్మను దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. ఆయన నిలువెత్తు బంగారంతో పాటు పట్టు వస్త్రాలు సమర్పించుకున్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ... తెలంగాణ పోరాట పటిమకు సమ్మక్క-సారలమ్మ నిదర్శనమన్నారు. ఉద్యమ సమయంలోనే తెలంగాణ కోసం వనదేవతకు మొక్కుకున్నట్లు తెలిపారు. సమైఖ్య పాలనలో జాతర నిర్లక్ష్యానికి గురైందని, రాబోయే జాతరను కనివినీ ఎగరని రీతిలో నిర్వహిస్తామని కేసీఆర్ పేర్కొన్నారు. అలాగే తెలంగాణలో సాగునీటి ప్రాజెక్ట్‌లకు ఆటంకాలు కలగకుండా చూడాలని మొక్కుకున్నట్లు తెలిపారు. మేడారం జాతరను ఆయన దక్షిణ భారతదేశ కుంభమేళగా అభివర్ణించారు. ఆరు రాష్ట్రాల నుంచి భక్తులు వచ్చి...సమ్మక్క-సారలమ్మలను దర్శించుకుంటున్నారని తెలిపారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలుగకుండా దగ్గరుండి ఏర్పాట్లు పర్యవేక్షిస్తున్న మంత్రులు,అధికారులను సీఎం అభినందించారు. -
వనదేవతకు మొక్కులు చెల్లించుకున్న కేసీఆర్
-
మేడారానికి పగిడిద్దరాజు
మేడారం సమ్మక్క–సారలమ్మ జాతరకు గుండాల మండలం యాపలగడ్డ నుంచి పగిడిద్దరాజును తోడ్కొని అరెం వంశీయులు సోమవారం బయలుదేరారు. కాలినడకన పడగ (జెండా)లతో జాతర ప్రారంభానికి(ఈ నెల 31కి) ముందే వారు మేడారం చేరుకుంటారు. గుండాల: గుండాల మండలం యాపలగడ్డ గ్రామం నుంచి సోమవారం మేడారం సమ్మక్క–సారలమ్మ జాతరకు పగిదిద్దరాజు బయల్దేరాడు. కాలినడక ఆయన(అరెం) వంశీయులు పడగలలో పయనమయ్యారు. రెండేళ్లకోసారి భూపాలపల్లి జిల్లా తాడ్వాయి మండలంలో జరిగే మేడారం జాతరకు సమ్మక్క భర్త పగిడిద్దరాజును యాపలగడ్డ గ్రామస్తులే తీసుకెళ్తారు. ఈ క్రమంలో సోమవారం అరెం వంశీయులు పగిడిద్దరాజు గర్భగుడి వద్ద పడగలకు( జెండాలకు), శివసత్తులకు పురాతన కాలంనాటి ఆభరణాలకు పూజారులు, వడ్డెలు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం స్థానిక పగిడిద్దరాజు గద్దెల వద్దకు తీసుకెళ్లి అక్కడ పూజలు నిర్వహించారు. పడగలను, నగలు, గజ్జెలు ధరంచిన వడ్డెలు భుజాన పెట్టుకుని ఊరేగింపుతో పయననమయ్యారు. గ్రామ గ్రామం మీదుగా గిరిజన నృత్యాలతో, డప్పు వాయిద్యాల నడుమ ఊరేగింపు నిర్వహించుకుంటూ తీసుకెళ్లారు. యాపలగడ్డ గ్రామ ప్రజలంతా చిన్నా,పెద్దా తేడా లేకుండా డ్యాన్సులు వేశారు. పగిడిద్ద రాజు పూజలను, ఊరేగింపును అంగరంగ వైభవంగా నిర్వహించారు. వరంగల్ జిల్లా పూనుగొండ్ల పెనకం వంశీయులు లక్ష్మిపురం గ్రామం వద్ద వీరిని కలుసుకుంటారు. రెండు రోజుల పాటు పాదయాత్ర చేసి జాతర ముందురోజు జంపన్న వాగులో బస చేస్తారు. బుధవారం రోజు పగిడిద్దరాజుతో పాటు, కొండాయిగూడెం నుంచి గోవిందరాజును, కన్నెపల్లి నుంచి సారలమ్మను ఆయా గ్రామాల పూజారులు తీసుకువస్తారు. ఆ ముగ్గురు వన దేవతలకు మేడారంలోని గర్భగుడిలో ప్రత్యేక పూజలు చేస్తారు. గురువారం నాటికి సమ్మక్క (దేవత)ను చిలకలగుట్ట నుంచి గద్దెల వద్దకు తీసుకువస్తారు. అదేరోజు రాత్రి పగిడిద్దరాజు–సమ్మక్కల దేవతలకు నాగవెళ్లి(పెళ్లి) చేస్తారు. దీంతో నిండు జాతర ప్రారంభమవుతుంది. సమ్మక్కను శనివారం వనానికి తీసుకెళ్లగా జాతర ముగుస్తుంది. తిరిగి అరెం వంశీయలు పగిడిద్ద రాజును పాదయాత్రతో గుండాలకు చేర్చుతారు. అనంతరం ప్రతీ ఏటా యాపలగడ్డలో పగిడిద్ద రాజు–సమ్మక్కల నాగవెళ్లి జాతరను మార్చి మొదటి వారంలో నిర్వహిస్తామని అరెం వంశీయులు తెలిపారు. ఈ కార్యక్రమంలో సీఐ తుమ్మ గోపి, ఎస్సై శ్రావన్ కుమార్, వడ్డెలు, పూజారులు అర్రెం అప్పయ్య, బుచ్చయ్య, లక్ష్మినర్సు, చిన్న కాంతారావు, సత్యం, జోగయ్య, ఇద్దయ్య, పెద్ద కాంతారావు, నాగేశ్వరావు, సమ్మయ్య, ముత్తయ్య, భిక్షం రమేష్,నాగేష్, చంద్రయ్య తదితరులు పాల్గొన్నారు. -
నేటి నుంచి మేడారం మహాజాతర
-
జాతరెల్లి పోదామా..
నేటి నుంచి మేడారం మహాజాతర పోటెత్తుతున్న భక్తులు జాతర ఇలా... బుధవారం : సాయంత్రం గద్దెపైకి సారలమ్మ, గోవిందరాజు, పగిడిద్దరాజులు రాక గురువారం : సమ్మక్క గద్దెలపైకి రాక శుక్రవారం : గద్దెలపై కొలువుదీరనున్న అమ్మలు శనివారం : అమ్మల వనప్రవేశం ఇప్పటి వరకు దర్శించుకున్న భక్తులు: 30 లక్షల మంది సాక్షిప్రతినిధి, వరంగల్ : మేడారం సమ్మక్క-సారలమ్మ మహా జాతర అసలు ఘట్టం కొన్ని గంటల్లో మొదలుకానుంది. అటవీ ప్రాంతం ఇప్పటికే భక్తజన గుడారంగా మారగా, వన దేవత సారలమ్మ బుధవారం సాయంత్రం మేడారంలోని గద్దెపై కొలువుతీరనుంది. వన దేవతల వడ్డెలు (పూజారులు) ఇందుకోసం వారం రోజులుగా ఏర్పాట్లు చేస్తున్నారు. మేడారం సమీపంలోని కన్నెపల్లిలో ఉన్న సారలమ్మ గుడిలో మంగళవారం ప్రత్యేకంగా పూజలు నిర్వహించారు. ఆదివాసీ సంప్రదాయం ప్రకారం గిరిజన పూజారులు సారలమ్మను కన్నెపల్లి నుంచి మేడారం గద్దెలపైకి తెచ్చే ప్రక్రియ బుధవారం ఉదయం నుంచే మొదలవుతుంది. సాయంత్రం 6గంటలకు పూజా కార్యక్రమాలు నిర్వహిస్తారు. తర్వాత కన్నెపల్లి నుంచి గిరిజన పూజారులు, జిల్లా అధికారులు సారలమ్మను తీసుకువస్తారు. సారలమ్మ గద్దెపైకి వచ్చేలోపే ఏటూరునాగారం మండలం కొండాయిలో కొలువైన గోవిందరాజులు, కొత్తగూడ మండలం పూనుగొండ్లలో కొలువైన పగిడిద్దరాజును సైతం మేడారం గద్దెల వద్దకు తీసుకువస్తారు. మంగళవారం కొత్తగూడ మండలం పూనుగొండ్ల నుంచి పగిడిద్దరాజు పయనమయ్యూడు. పూనుగొండ్ల నుంచి కాలిబాటన 50 కిలోమీటర్లు ఉండడంతో వడ్డెలు ముందుగానే బయలుదేరారు. మేడారం సారలమ్మను కన్నెపల్లి నుంచి మేడారానికి తీసుకువచ్చే వేడుకను చూసేందుకు లక్షలాదిగా భక్తులు తరలివస్తున్నారు. వరాల తల్లి సమ్మక్క గురువారం మేడారం గద్దెలపై చేరనుంది. ఇద్దరు దేవతలు గద్దెలపై ఉండే శుక్రవారం మేడారం మొత్తం భక్తులతో నిండిపోనుంది. శనివారం దేవతలు గద్దెలపై నుంచి వనంలోకి వెళ్లడంతో జాతర ముగుస్తుంది. అతిపెద్ద ఆదివాసీ గిరిజన జాతరకు ఈసారి కోటి ఇరవై లక్షల మంది వస్తారని అధికారులు చెబుతున్నారు. ఈ మేరకు వారు ఏర్పాట్లు పూర్తి చేశా రు. అరుుతే జాతరకు నెల రోజుల ముందు నుంచే భక్తులు వస్తున్నారు. మంగళవారం వరకు 30 లక్షల మంది భక్తులు మేడారంలో మొక్కులు చెల్లించుకున్నారు. వందల ఏళ్లుగా... కాకతీయులతో సమ్మక్క పరివారం యుద్ధం క్రీస్తు శకం 1150-1159 మధ్యకాలంలో జరిగిందని తెలుగు విశ్వవిద్యాలయం శాస్త్రీయంగా చెబుతోంది. సమ్మక్క-సారలమ్మ జాత ర 12వ శతాబ్దం నుంచి జరుగుతోందని పలు శాసనాలు చెబుతున్నాయి. సమ్మక్కతో పోరు విషయంలో యుద్ధనీతికి వ్యతిరేకంగా సైనికులు చేసిన పనికి పశ్చాత్తాపపడిన రుద్రదేవుడు కోయ రాజ్యాన్ని తిరిగి వారికే అప్పగించాడు. తర్వాత ఈ కాకతీయరాజు సైతం సమ్మక్క భక్తుడయ్యారని 12 శతాబ్దంలోని శాసనాలు చెబుతున్నాయి. కాకతీయుల పరిపాలన ముగిసిన తర్వాతే మేడారం జాతర మొదలయ్యిందనే వాదనలు ఉన్నాయి. మొదట సమ్మక్కకు, సారలమ్మకు వేర్వేరు ప్రాంతాల్లో పూజలు చేసేవారు. సమ్మక్కతోపాటు యుద్ధంలో వీరమరణం పొందిన సారలమ్మకు మొదట మేడారంనకు మూడు కిలోమీటర్ల దూరంలోని కన్నెపల్లిలో మొక్కులు చెల్లించేవారు. 1960 తర్వాత సారలమ్మకు కూడా సమ్మక్క గద్దె పక్కనే గద్దెను నిర్మించారు. అప్పటి నుంచి మేడారం జాతర సమ్మక్క-సారలమ్మ జాతరగా మారింది. ప్రభుత్వపరంగా 1944లోనే మేడారం జాతరపై తహసీల్దారుతో కమిటీ ఏర్పాటైనట్లు పత్రాలు ఉన్నాయి. 1967లో జాతర దేవాదాయ శాఖ అధీనంలోకి వచ్చింది. 1968 నుంచి ప్రభుత్వం ఈ జాతర ఏర్పాట్లు చేస్తోంది. 1996లో రాష్ట్ర ప్రభుత్వం మేడారం జాతరను రాష్ట్ర పండుగగా ప్రకటించింది. పాలకమండలి లేకుండానే... ఆసియాలోనే అతిపెద్ద గిరిజన ఉత్సవంగా పేరొందిన మేడారం జాతర ఈసారి పాలకమండలి లేకుండానే జరుగుతోంది. గిరిజన జాతరపై పూర్తి స్థాయి పెత్తనం కోసం ప్రయత్నిస్తున్న ప్రభుత్వ తీరు వల్లే ఈ దుస్థితి దాపురించినట్లు విమర్శలు వ్యక్తమవుతున్నారుు. రెండేళ్లకోసారి జరిగే సమ్మక్క-సారలమ్మ జాతర పూర్తిగా గిరిజన సంప్రదాయాల ప్రకారం జరుగుతుంది. మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర పాలకమండలి పదవీ కాలం జనవరి 8తో ముగిసింది. ప్రస్తుతం సమ్మక్క-సారలమ్మ జాతరకు పాలకమండలి లేదు. ఈ పాలకమండలి గడువు ముగిసిపోతుందని ముందే తెలిసినా, దేవాదాయ శాఖ ఉద్దేశపూర్వకంగానే పట్టించుకోలేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. జాతరపై పెత్తనం కోసమే... కొత్త పాలకమండలి ఏర్పాటుకు ప్రతిపాదనలు పంపలేదని గిరిజనులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వనదేవతలకు ఎములాడ వస్త్రాలు వేములవాడ, న్యూస్‌లైన్: మేడారం సమ్మక్క, సారలమ్మ అమ్మవార్లకు కరీంనగర్ జిల్లా వేములవాడ శ్రీరాజరాజేశ్వరస్వామి దేవస్థానం తరఫున పట్టువస్త్రాలు సమర్పించనున్నారు. ఆలయ పాలకమండలి చైర్మన్ బొమ్మ వెంకటేశ్వర్లు ప్రతిపాదనతో తొలిసారిగా ఈ సంప్రదాయానికి శ్రీరాజరాజేశ్వరస్వామి ఆలయం శ్రీకారం చుట్టింది. సమ్మక్కకు పసుపు వర్ణపు పట్టుచీర, రెండు కనుములు.. సారలమ్మకు కుంకుమ వర్ణపు పట్టుచీర, రెండు కనుములు సమర్పిస్తారు. పగిడిద్దరాజుకు పట్టుపంచెను.. వీటితో పాటు 40 కిలోల బంగారం(బెల్లం) సమర్పించనున్నారు. ఆలయ చైర్మన్ వెంకటేశ్వర్లు, పాలకమండలి సభ్యులు, ఈవో సీహెచ్‌వీ కృష్ణాజీరావ్, ఏఈవో గౌరీనాథ్‌లు బుధవారం ఉదయం 10 గంటలకు వీటిని మేడారంలో సమర్పిస్తారు. ప్రతి రెండేళ్లకోసారి జరిగే జాతరలో ఈ సంప్రదాయం కొనసాగించేలా దేవాదాయ శాఖ అనుమతి పొందారు. నేడు 3,525 బస్సులు మేడారం జాతరను పురస్కరించుకుని బుధవారం ఒక్కరోజే వివిధ ప్రాంతాల నుంచి 3,525 బస్సులు నడుపుతున్నట్టు ఆర్టీసీ మంగళవారం వెల్లడించింది. హైదరాబాద్, కరీంనగర్, మంచిర్యాల, గోదావరిఖని, పెద్దపల్లి, వరంగల్, హన్మకొండ, ఇల్లందు, కొత్తగూడెం, నిజామాబాద్, ఆదిలాబాద్‌ల నుంచి ఈ బస్సులు నడుస్తాయని పేర్కొంది. -
కెనడా టూ మేడారం
ఖండాంతరాలు దాటొచ్చి కెనడా యువతి ఎమెలీ మేడారంలోని సమ్మక్క, సారలమ్మను సోమవారం రాత్రి 8 గంటల సమయంలో దర్శించుకుంది. తనకు పరిచయం ఉన్న వ్యక్తుల ద్వారా జాతర గురించి తెలిసిందని.. పేర్కొంది. పగలు వస్తే ఎక్కువ సంఖ్యలో భక్తులు ఉంటారనే ఉద్దేశంతో రాత్రివేళలో దర్శనానికి వచ్చానని.. కానీ ఇప్పుడు కూడా వందల సంఖ్యలో భక్తులు ఉండటం ఆశ్చర్యంగా ఉందని తెలిపింది. 15 రోజులకు ముందే ఇలా ఉంటే జాతరవేళ ఎలా ఉంటుందో అని ఆశ్చర్యపోయింది. - సాక్షి, మేడారం -
జాతర కష్టాలు తీరేనా..
మేడారం(తాడ్వాయి), న్యూస్‌లైన్ : తాడ్వాయి మండలం మేడారంలో రెండేళ్ల కోసా రి జరిగే సమ్మక్క-సారలమ్మ జాతరకు మన రాష్ట్రంతోపాటు పొరుగు రాష్ట్రాల నుంచి భక్తులు లక్షలాదిగా తరలివస్తారు. సౌకర్యాల విషయంలో ప్రతీసారి భక్తులకు ఇబ్బందులు తప్పడంలేదు. గత జాతర సందర్భంగా కొంత మేరకు సమస్యలు తగ్గినా ఈసారి 2014 ఫిబ్రవ రి 12 నుంచి 15వ తేదీ వరకు జరిగే జాతరకు ముందస్తుగానే భక్తులకు సౌకర్యాలు అందుబాటులోకి తీసుకు రావలసిన అవసరం ఎంతైనా ఉంది. నెరవేరని హామీలు.. మేడారంలో గిరిజన మ్యూజియం, చిలకలగుట్టకు చు ట్టూ ఫెన్సింగ్, పస్రా నుంచి ఏటూరునాగారం వరకు రోడ్డు విస్తరణ పనుల హామీలు నెరవేరలేదు. గత జాతరలో *57కోట్ల వ్యయంతో హడావుడిగా చేపట్టిన అభివృద్ధి పనుల్లో నాణ్యత ప్రామాణాలు కొరవడ్డాయి. సీసీ రోడ్లు, చిన్నబోయినపల్లి-తాడ్వాయి మధ్య నిర్మించిన తారు రోడ్డు పనుల్లో నాణ్యతాలోపం కొట్టొచ్చినట్లు కన్పించింది. జాతర సమయం వరకూ అభివృద్ధి పను లు జరగడంతో దేవతల దర్శనానికి ముందస్తుగా వచ్చి న భక్తులకు ఇబ్బంది కలిగింది. తాత్కాలిక మరుగుదొ డ్లు పూర్తికాలేదు. నీటి సరఫరా లేక అవి పూర్తిస్థాయిలో వినియోగంలోకి రాలేదు. తాగునీటి కొరత వేధించింది. ఈసారైనా ముందస్తుగా చేపట్టాలి ఈసారి జరిగే జాతరకు తరలివచ్చే లక్షాలాది మంది భక్తుల సౌకర్యార్థం ముందుగానే అభివృద్ధి పనులు పూర్తి చేసేలా కలెక్టర్ జాతరపై పూర్తి స్థాయిలో చొరవచూపాల్సిన అవసం ఉంది. ఇందుకు నిధుల కొరత రాకుండా జాగ్రత్త పడాలి. నార్లాపూర్ నుంచి జంపన్నవాగు వరకు ఉన్న రోడ్డు వెంట లైటింగ్ సిస్టమ్ ఏర్పాటు చేస్తే భక్తులకు సౌకర్యంగా ఉటుంది. నార్లాపూర్ చెక్‌పోస్ట్ నుంచి కాల్వపల్లి వరకు నాలుగు కిలోమీటర్ల రోడ్డును అభివృద్ధి చేయాలి. భక్తులు సులభంగా దేవతలను దర్శించుకునేందుకు క్యూలైన్లు పెంచాల్సిన అవస రం ఉంది. గత అనుభావలను దృష్టిలో పెట్టుకని అధికారులు జాతరలో భక్తులకు ఇబ్బంది కలగకుండా సౌకర్యాలు కల్పించాలి. పస్రా అతిథి గృహంలో సమావేశం కలెక్టరేట్ : కలెక్టర్ కిషన్ శనివారం ఉదయం తాడ్వాయి మండలంలోని మేడారం గ్రామాన్ని సందర్శించనున్నారు. శ్రీ సమ్మక్క-సారలమ్మ జాతరకు భక్తుల సౌకర్యార్థం చేపట్టనున్న ఏర్పాట్లపై ఉదయం 10.30 గంటలకు సంబంధిత అధికారలతో క్షేత్ర పర్యటన నిర్వహిస్తారు. ఉదయం 9.00 గంటల కల్లా అధికారులంతా పస్రా అతిథి గృహానికి చేరుకోవాలని, సమీక్ష సమావేశం ఉంటుందని ఆయన ఒక ప్రకటనలో పేర్కొన్నారు.