
నాలుగు రోజులపాటు గిరిజన జాతరతో మేడారం పులకరించిపోయింది.
ములుగు, సాక్షి: నాలుగు రోజులపాటు గిరిజన జాతరతో మేడారం పులకరించిపోయింది. గద్దెలపై కొలువుదీరిన సమ్మక్క-సారలమ్మలను దర్శించుకునేందుకు భక్తులు పోటెత్తున్నారు. ఇద్దరు తల్లులు నేటి సాయంత్రమే వన ప్రవేశం చేయనున్నారు. కన్నెపల్లికి సారలమ్మ, చిలకలగుట్టకు సమక్కలు చేరుకోవడంతో జాతర ముగుస్తుంది.
జాతర నేపథ్యంలో.. భక్తిశ్రద్ధలతో వనదేవతలకు మొక్కులు చెల్లించుకుంటున్నారు. మేడారంలో సమ్మక్క, సారలమ్మలను శుక్రవారం రాత్రి వరకు 1.20 కోట్ల మంది భక్తులు దర్శించుకున్నట్లు రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గిరిజన సంక్షేమశాఖ మంత్రి సీతక్క ప్రకటించారు. నిన్న ఒక్కరోజే 60 లక్షల మందికి పైగా భక్తులు గద్దెలను దర్శించుకున్నట్లు అధికారులు చెబుతున్నారు. దీంతో ఈసారి భక్తుల సంఖ్య కూడా కోటిన్నర దాటి ఉండొచ్చని అంచనా వేస్తున్నారు.
ఇవాళ సమ్మక్క సారలమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజులను గద్దెలపై నుంచి ఆదివాసీ పూజారులు వారి వారి ఆలయాలకు తీసుకెళ్లనున్నారు. సమ్మక్క ప్రతిరూపమైన కుంకుమభరిణెతో సాయంత్రం సూర్యాస్తమయం తర్వాత పూజారులు వన ప్రవేశం చేయడంతో జాతర ముగియనుంది.
సారలమ్మ రాక తర్వాత మహాజాతర లాంఛనంగా ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఆ మరుసటి రోజు సమ్మక్కను గద్దెపైకి తీసుకురాగా.. శుక్రవారంనాడు అశేష భక్త జనం వన దేవతలకు మొక్కులు సమర్పించారు. భక్తులు పోటెత్తడంతో మేడారం జనజాతరను తలపించింది. జంపన్న వాగులో పుణ్య స్నానాలతో మొక్కుల సమర్పణ, సమ్మక్క బంగారం తులా భారం, వంటలువార్పులు ఒకవైపు.. మరోవైపు భద్రతా సిబ్బంది, జాతర పర్యవేక్షణతో మేడారం పరిసర ప్రాంతాలు కిక్కిరిసిపోయాయి.