Medaram Jatara 2024
-
వనం చేరిన సమ్మక్క..
సాక్షి ప్రతినిధి, వరంగల్: తెలంగాణ కుంభమేళాగా పిలిచే మేడారం మహాజాతర ముగిసింది. నాలుగు రోజులుగా కోటిన్నర మంది భక్తుల మొక్కులందుకున్న వన దేవతలు సమ్మక్క, సారలమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజులను శనివారం సాయంత్రం వడ్డెలు (గిరిజన పూజారులు) ప్రత్యేక పూజల మధ్య వనప్రవేశం చేయించారు. ఉద్విగ్నంగా సాగిన ఈ ఘట్టాన్ని వీక్షించేందుకు జాతర చివరిరోజు కూడా భక్తులు పోటెత్తారు. వనదేవతలు అడవికి చేరే వేడుక సమయంలో వాన జల్లులు కురవడం గమనార్హం. చివరిరోజు కార్యక్రమం ఇలా.. సమ్మక్క, సారలమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజుల వన ప్రవేశం ప్రక్రియ శనివారం సాయంత్రం 4 గంటలకు మొదలై సుమారు రాత్రి ఏడున్నర వరకు సాగింది. తల్లులను వనం నుంచి జనంలోకి తీసుకొచ్చిన పూజారులే తిరిగి అడవిలోకి చేర్చారు. ఈ క్రమంలో మధ్యాహ్నం నుంచే గద్దెల దగ్గర గిరిజన ఆచారాలతో ప్రత్యేక పూజలు జరిగాయి. సమ్మక్క ప్రధాన పూజారి కొక్కెర కృష్ణయ్య నేతృత్వంలోని వడ్డెల బృందం గద్దెలపైకి చేరుకుంది. పూజల తర్వాత సమ్మక్క తల్లిని గద్దెల ప్రాంగణం నుంచి భక్తులను దాటుకుంటూ బయటికి తీసుకెళ్లి రాత్రి 7.27 గంటల సమయంలో చిలకలగుట్టకు చేర్చారు. ఇలా ఓవైపు వనప్రవేశ పూజలు జరుగుతుండగానే గిరిజన సంప్రదాయం ప్రకారం.. సమ్మక్క గద్దెలపై భక్తులు సమర్పించిన చీరసారెలు, బంగారం, పసుపు కుంకుమలను స్థానికులు తీసుకునే కార్యక్రమం జరిగింది. బయటి ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు కూడా ఈ ప్రసాదాన్ని తీసుకునేందుకు పోటీపడ్డారు. దీనితో ఒక్కసారిగా గద్దెల ప్రాంగణమంతా కోలాహలంగా మారింది. కన్నెపల్లికి సారలమ్మ.. సారలమ్మ ప్రధాన పూజారి కాక సారయ్య, ఇతర వడ్డెలు సారలమ్మ గద్దె వద్ద గిరిజన సంప్రదాయం ప్రకారం రహస్య పూజలు నిర్వహించారు. గద్దెలపై ఉన్న సారలమ్మ రూపాన్ని కాక సారయ్య నేతృత్వంలోని పూజారుల బృందం కన్నెపల్లికి తీసుకెళ్లింది. గద్దెపై ప్రతిష్టించిన మొంటె (వెదురుబుట్ట)ను తీసుకుని జంపన్న వాగు మీదుగా కన్నెపల్లికి చేర్చారు. ఈ సమయంలో భక్తులు పూజారులను తాకడానికి ప్రయత్నించారు. మరోవైపు గోవిందరాజులు, పగిడిద్దరాజుల గద్దెల వద్ద కూడా చివరిరోజు పూజలు జరిగాయి. ఊరేగింపుగా పగిడిద్దరాజును మహబూబాబాద్ జిల్లా గంగారం మండలం పూనుగొండ్లకు.. గోవిందరాజులును ఏటూరునాగారం మండలం కొండాయికి తీసుకెళ్లారు. కాగా గతంలో ఎన్నడూ లేనివిధంగా ఈసారి దేవతల వనప్రవేశ సమయంలోనూ భారీ సంఖ్యలో భక్తులు తరలి వచ్చి మొక్కులు సమర్పించుకున్నారు. దేవతల వనప్రవేశంతో మేడారం మహా జాతర ముగిసిందని ములుగు జిల్లా కలెక్టర్ త్రిపాఠి ప్రకటించారు. ప్రస్తుత మేడారం జాతరకు మొత్తంగా 1.45 కోట్ల మంది భక్తులు వచ్చారని.. వారు ఇక్కడికి చేరుకునేందుకు లక్షన్నర వాహనాలు వచ్చాయని అధికారులు వెల్లడించారు. బుధవారం తిరుగువారం పండుగ.. సమ్మక్క–సారలమ్మలకు ఈనెల 28న పూజారులు తిరుగువారం పండుగ నిర్వహించనున్నారు. మహాజాతర ముగిసిన తర్వాత ఇలా తిరుగువారం పండుగ సంప్రదాయబద్ధంగా నిర్వహిస్తామని.. జాతరకు వచ్చిన భక్తులు చల్లంగా ఉండాలని, పాడి పంటలు సమృద్ధిగా పండాలని వేడుకుంటామని పూజారులు తెలిపారు. తిరుగువారం పండుగ సందర్భంగా బుధవారం మేడారం గ్రామస్తులు, ఆదివాసీలు, పూజారుల కుటుంబీకులు ఇళ్లను అలికి శుద్ధి చేస్తారు. సమ్మక్కకు ప్రత్యేక పూజలు చేస్తారు. మేడారంలోని సమ్మక్క, కన్నెపల్లిలోని సారలమ్మ గుడి వద్ద అమ్మవార్లను దర్శించుకుని మొక్కులు చెల్లించుకుంటారు. పూజారులు జాతర సమయంలో తమకు ఇళ్లకు ఆహా్వనించిన బంధువులకు కొత్త వస్త్రాలు పెట్టి సాగనంపుతారు. మేడారం మహాజాతర తిరిగి 2026 మాఘమాసంలో జరగనుంది. గద్దెను వీడి వనప్రవేశం చేసినదిలా.. 5.10 గంటలకు గోవిందరాజులు 5.30 గంటలకు పగిడిద్దరాజు 7.27 గంటలకు సమ్మక్క వనప్రవేశం 7.40 గంటలకు సారలమ్మ వనప్రవేశం ఆనవాయితీ ప్రకారం తొలుతగా గోవిందరాజులు, పగిడిద్దరాజులను గద్దెల మీది నుంచి సాగనంపుతారు. వారు వెళ్లగానే సమ్మక్క వన ప్రవేశ కార్యక్రమం ఉంటుంది. చివరిగా సారలమ్మను తీసుకెళతారు. -
Medaram: నేడే వనప్రవేశం
ములుగు, సాక్షి: నాలుగు రోజులపాటు గిరిజన జాతరతో మేడారం పులకరించిపోయింది. గద్దెలపై కొలువుదీరిన సమ్మక్క-సారలమ్మలను దర్శించుకునేందుకు భక్తులు పోటెత్తున్నారు. ఇద్దరు తల్లులు నేటి సాయంత్రమే వన ప్రవేశం చేయనున్నారు. కన్నెపల్లికి సారలమ్మ, చిలకలగుట్టకు సమక్కలు చేరుకోవడంతో జాతర ముగుస్తుంది. జాతర నేపథ్యంలో.. భక్తిశ్రద్ధలతో వనదేవతలకు మొక్కులు చెల్లించుకుంటున్నారు. మేడారంలో సమ్మక్క, సారలమ్మలను శుక్రవారం రాత్రి వరకు 1.20 కోట్ల మంది భక్తులు దర్శించుకున్నట్లు రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గిరిజన సంక్షేమశాఖ మంత్రి సీతక్క ప్రకటించారు. నిన్న ఒక్కరోజే 60 లక్షల మందికి పైగా భక్తులు గద్దెలను దర్శించుకున్నట్లు అధికారులు చెబుతున్నారు. దీంతో ఈసారి భక్తుల సంఖ్య కూడా కోటిన్నర దాటి ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. ఇవాళ సమ్మక్క సారలమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజులను గద్దెలపై నుంచి ఆదివాసీ పూజారులు వారి వారి ఆలయాలకు తీసుకెళ్లనున్నారు. సమ్మక్క ప్రతిరూపమైన కుంకుమభరిణెతో సాయంత్రం సూర్యాస్తమయం తర్వాత పూజారులు వన ప్రవేశం చేయడంతో జాతర ముగియనుంది. సారలమ్మ రాక తర్వాత మహాజాతర లాంఛనంగా ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఆ మరుసటి రోజు సమ్మక్కను గద్దెపైకి తీసుకురాగా.. శుక్రవారంనాడు అశేష భక్త జనం వన దేవతలకు మొక్కులు సమర్పించారు. భక్తులు పోటెత్తడంతో మేడారం జనజాతరను తలపించింది. జంపన్న వాగులో పుణ్య స్నానాలతో మొక్కుల సమర్పణ, సమ్మక్క బంగారం తులా భారం, వంటలువార్పులు ఒకవైపు.. మరోవైపు భద్రతా సిబ్బంది, జాతర పర్యవేక్షణతో మేడారం పరిసర ప్రాంతాలు కిక్కిరిసిపోయాయి. -
మేడారం జాతరకు అంతర్జాతీయ గుర్తింపు కోసం ప్రయత్నిస్తాం: కిషన్రెడ్డి
సాక్షి, ములుగు: మేడారం జాతరకు అంతర్జాతీయ గుర్తింపు కోసం ప్రయత్నిస్తామని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్రెడ్డి తెలిపారు. మేడారం జాతరను జాతీయ పండుగగా నిర్వహించాలని చాలా మంది అడుగుతున్నారని, జాతీయ పండుగ విధానం అనేది ఎక్కడా లేదని ఆయన స్పష్టం చేశారు. సమ్మక్క, సారలమ్మ జాతర సందర్భంగా అమ్మవార్లను గురువారం ఆయన దర్శించుకున్నారు. అనంతరం నిలువెత్తు బంగారాన్ని(బెల్లం) సమర్పించి మొక్కు తీర్చుకున్నారు. ముందుగా ములుగు జిల్లాలో పర్యటించిన కిషన్రెడ్డి గట్టమ్మ ఆలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం కేంద్రీయ విశ్వ విద్యాలయానికి ఎంపిక చేసిన స్థలాన్ని అధికారులతో కలిసి పరిశీలించారు. మరోసారి బీజేపీ అధికారంలోకి రాగానే దేశ వ్యాప్తంగా గిరిజన రిజర్వేషన్లు అమలు చేస్తామని వెల్లడించారు. ములుగులో గిరిజన వర్సిటీ తాత్కలిక క్యాంపస్ ఏర్పాటు చేస్తామని తెలిపారు. వర్సిటీలో ఎక్కువ సీట్లు తెలంగాణ విద్యార్థులకు కేటాయించేలా చూస్తామని పేర్కొన్నారు. ఇదీ చదవండి: మేడారం.. అసలు ఘట్టం ఆవిష్కరణ -
వన జాతర నుంచి జన జాతరగా మారిన మేడారం
-
గద్దెలపై కొలువుదీరిన సారలమ్మ
-
మేడారంలో కీలక ఘట్టం ఆవిష్కరణ.. గద్దెపైకి సమ్మక్క
ములుగు, సాక్షి: ఆసియాలో అతిపెద్ద గిరిజన పండుగ.. తెలంగాణ కుంభమేళాగా ఖ్యాతిగాంచిన మేడారం సమ్మక్క, సారలమ్మ మహా జాతర బుధవారం ప్రారంభమైంది. వనదేవతల్ని దర్శించుకునేందుకు భక్తులు మొదటిరోజు తండోపతండాలుగా తరలి వచ్చారు. రెండో రోజైన ఇవాళ.. మేడారంలో కీలక ఘట్టం ప్రారంభమైంది. సమ్మక్క తల్లి ఇవాళ గద్దెపై కొలువు దీరింది. సమ్మక్కను ప్రధాని పూజారి ప్రతిష్టించారు. మేడారం జాతరకు భక్తులు పోటెత్తారు చిలకల గుట్ట నుంచి సమ్మక్కను మేడారానికి తీసుకురావడమే ఈ జాతరలో అసలైన ఘట్టం. ఇవాళ కుంకుమ భరణి రూపంలో సమక్కను తీసుకొచ్చి గద్దెపై ప్రతిష్టించారు. ప్రభుత్వం తరఫున స్థానిక ఎమ్మెల్యే, మంత్రి సీతక్క సమ్మక్కకు ఆహ్వానం పలికారు. జిల్లా ఎస్పీ, కలెక్టర్లు గాల్లోకి కాల్పులు జరిపి వనదేవతలను ఆహ్వానించారు. మేడారం జన జాతరగా మారింది. గత రాత్రి సారలమ్మతో పాటు సారలమ్మ, పడిగిద్ద రాజు, గోవిందా రాజులు గద్దెపై కొలువుదీరారు. వనదేవతలకు మొక్కు చెల్లించుకునే క్రమంలో.. జంపన్నవాగులో భక్తులు పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు. ఈ నెల 24వ తేదీన సమక్క-సారలమ్మ వన ప్రవేశంతో జాతర ముగుస్తుంది. -
గద్దెపైకి సారలమ్మ..
-
మేడారం జాతర.. నేడు కీలక ఘట్టం
-
Medaram Jathara: తెలంగాణ ప్రజలకు ప్రధాని మోదీ శుభాకాంక్షలు
సాక్షి,హైదరాబాద్: మేడారం జాతర ప్రారంభమైన సందర్భంగా తెలంగాణ ప్రజలకు ప్రధాని నరేంద్రమోదీ శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు ఎక్స్ (ట్విటర్)లో బుధవారం ఆయన ఒక పోస్ట్ చేశారు. ‘గిరిజనుల అతిపెద్ద పండుగలలో ఒకటి..మేడారం జాతర. భక్తి, సంప్రదాయం, సమాజ స్ఫూర్తిల గొప్ప కలయిక ఈ జాతర. సమ్మక్క-సారక్కలకు ప్రణమిల్లుదాం. వారు ప్రదర్శించిన గొప్ప ఐక్యతా స్ఫూర్తిని, పరాక్రమాన్ని గుర్తుచేసుకుందాం’అని ట్వీట్లో ప్రధాని పేర్కొన్నారు. తెలంగాణ కుంభమేళాగా పిలిచే మేడారం మహా జాతర బుధవారం(ఫిబ్రవరి 21) నుంచి ప్రారంభం కానుంది. సమ్మక్క, సారలమ్మలు వనం వీడి జనారణ్యంలోకి వచ్చి గద్దెలపై కొలువుదీరనున్నారు. ములుగు జిల్లా తాడ్వాయి మండలంలో మేడారంలో మహా జాతర ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరగనున్నాయి. మొక్కులు, దర్శనం కోసం భారీగా తరలి వచ్చే వారితో మేడారం పరిసరాలు పూర్తి జనసంద్రంగా మారనున్నాయి. 24 వరకు ఈ జాతర జరగనుంది. గిరిజనుల అతిపెద్ద పండుగలలో ఒకటైన,మన సాంస్కృతిక వారసత్వానికి చిరకాల స్ఫూర్తిగా నిలిచే చైతన్యవంతమైన వ్యక్తీకరణ అయిన ఈ సమ్మక్క-సారక్క మేడారం జాతర ప్రారంభోత్సవానికి శుభాకాంక్షలు. ఈ జాతర భక్తి, సంప్రదాయం, సమాజ స్ఫూర్తిల గొప్ప కలయిక. మనం సమ్మక్క-సారక్కలకు ప్రణమిల్లుదాం, వారు… — Narendra Modi (@narendramodi) February 21, 2024 ఇదీ చదవండి.. నేటి నుంచి మేడారం జాతర -
Medaram: నేటి నుంచి సమక్క-సారలమ్మ మహా జాతర
ములుగు,సాక్షి: ఆసియాలో అతిపెద్ద గిరిజన కుంభమేళా.. తెలంగాణలో జరిగే చారిత్రాత్మక క్రతువు మేడారం మహా జాతర నేటి నుంచి ప్రారంభం కానుంది. సమ్మక్క, సారలమ్మలు వనం వీడి జనారణ్యంలోకి వచ్చి గద్దెలపై కొలువుదీరనున్నారు. ములుగు జిల్లా తాడ్వాయి మండలంలో మేడారంలో మహా జాతర ఉత్సవాలు బుధవారం నుంచి ఆరంభం కానున్నాయి. ఈ మహాజాతర ప్రారంభం కానుండడంతో మొక్కులు, దర్శనం కోసం వచ్చే వారి సంఖ్యతో మేడారం పరిసరాలు పూర్తిగా జనసంద్రంగా మారనున్నాయి. భక్తుల కొంగు బంగారం సమ్మక్క-సారలమ్మ జాతర మాఘశుద్ధ పౌర్ణమి (సమ్మక్కల పున్నం) రోజున రెండేళ్లకోసారి జరుగుతుందని చెప్పనక్కర్లేదు. మేడారం మహాజాతర పూజల తొలిఘట్టం గత బుధవారమే అత్యంత వైభవంగా ప్రారంభమయింది. జాతరకు సరిగ్గా వారం ముందు నిర్వహించే మండమెలిగే పండగను మేడారంలోని సమ్మక్క దేవత, కన్నెపల్లిలోని సారలమ్మ తల్లి పూజారులు పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభించారు. ఇక.. ఈసారి ఈ ఏడాది ఫిబ్రవరి 21 నుంచి 24 వరకు నిర్వహించనున్నారు. నిన్న(మంగళవారం) మేడారం మహాజాతర జంపన్న గద్దెకు చేరే క్రతువుతో ఆరంభమైంది. పూజారి పోలెబోయిన సత్యం, వడ్డె అయిన గొంది సాంబశివరావు ఆధ్వర్యంలో మంగళవారం కన్నెపల్లి నుంచి జంపన్న ఆదివాసీ సంప్రదాయాలతో రాత్రి 7:09 గంటలకు బయల్దేరారు. సరిగ్గా 8:31 గంటలకు జంపన్నను గద్దెకు చేర్చారు. జంపన్న గద్దెకు వచ్చే క్రమంలో గ్రామస్థులు, ఆడపడుచులు మంగళ హారతులు ఇస్తూ, నీళ్లు ఆరగిస్తూ స్వాగతం పలికారు. ఆదివాసీ పెద్ద మనుషులు, యువత రక్షణ కవచంలా ఉంటూ గద్దెల వరకు చేర్చారు. భక్తులు రహదారులకు ఇరువైపులా కన్నెపల్లి నుంచి జంపన్నవాగు వరకు 2 కిలోమీటర్ల మేర శరణు వేడుతూ జంపన్నకు స్వాగతం పలికారు. గద్దెకు చేరిన తర్వాత భక్తులు జంపన్నను దర్శించుకున్నారు. ఇవాళ సమ్మక్క కూతురైన సారలమ్మ సాయంత్రం నాలుగు గంటలకు కొలువుదీరనుంది. సారలమ్మతో పాటు, పగిడిద్దరాజు, గోవిందరాజును గద్దెపైకి చేరుకుంటారు. సంప్రదాయబద్దంగా ఆదివాసి, గిరిజన పూజారులు ఈ అమ్మవారిని తీసుకొస్తారు. గురువారం చిలకలగుట్ట నుంచి సమ్మక్క తల్లి గద్దెపైకి రానుంది. శుక్రవారం ఇద్దరు తల్లులు భక్తులకు దర్శనమిస్తారు. భక్తులు పెద్ద ఎత్తున మొక్కులు చెల్లించుకుంటారు. శనివారం సాయంత్రం దేవతలు వన ప్రవేశం చేయడంతో జాతర ఉత్సవాలు ముగుస్తాయి. సారలమ్మ రాక: మొదటి రోజు (ఫిబ్రవరి 21) కన్నెపల్లి నుంచి సారలమ్మ దేవి గంభీరమైన ఆగమనాన్ని సూచిస్తుంది. ఆధ్యాత్మిక ఉత్సవాలకు నాంది పలికే రోజు ఇది. గాలి దేవత సన్నిధికి స్వాగతం పలుకుతూ కీర్తనలు, సంగీతంతో అలరిస్తుంది. సమ్మక్క ప్రవేశం: రెండోరోజు (ఫిబ్రవరి 22) చిలుకలగుట్ట నుంచి సమ్మక్క అమ్మవారి జాతరతో దివ్యగాథ కొనసాగుతుంది. దేవత రాకను సూచిస్తూ డప్పులు, శంఖం ధ్వనులతో అడవి ప్రతిధ్వనిస్తుంది. ఆధ్యాత్మిక ఉత్సవాన్ని బలపరిచే రోజు ఇది. ఉత్సవాల కొనసాగింపు: మూడోరోజు (ఫిబ్రవరి 23) ఉత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతాయి. దేవతలకు భక్తులు మొక్కులు చెల్లించుకుంటారు. సాంస్కృతిక ప్రదర్శనలు, సంప్రదాయ నృత్యాలు, సంగీతంతో గిరిజన వారసత్వం శక్తిమంతంగా కళ్లకు కడుతుంది. అడవికి తిరుగు ప్రయాణం: నాలుగోరోజు (ఫిబ్రవరి 24) గంభీరమైన వన ప్రవేశం వేడుక పాటిస్తారు. ఇక్కడ దేవతలు తిరిగి అడవికి ప్రయాణం చేస్తారు. ఇది జాతర ముగింపును సూచిస్తుంది. జీవిత ప్రక్రియ స్వభావం, దైవ, సహజ ప్రపంచం మధ్య ఉండే లోతైన సంబంధాన్ని గుర్తు చేస్తుంది. తెలంగాణ నుంచే కాకుండా, ఏపీ, కర్ణాటక, మధ్యప్రదేశ్, జార్ఖండ్, మహారాష్ట్ర, ఛత్తీస్ గఢ్..ఇలా ఎనిమిది రాష్ట్రాల నుంచి కూడా ఈ జాతరకు భారీగా భక్తులు వస్తారు. ఈసారి మేడారం జాతరకు కోటి మంది భక్తులు వస్తారని అధికారులు అంచనా వేశారు. ఈ మేరకు భారీ ఏర్పాట్లు చేశారు. 2014లో అప్పటి తెలంగాణ ప్రభుత్వం మేడారం జాతరను రాష్ట్ర పండుగగా గుర్తించింది.