ములుగు,సాక్షి: ఆసియాలో అతిపెద్ద గిరిజన కుంభమేళా.. తెలంగాణలో జరిగే చారిత్రాత్మక క్రతువు మేడారం మహా జాతర నేటి నుంచి ప్రారంభం కానుంది. సమ్మక్క, సారలమ్మలు వనం వీడి జనారణ్యంలోకి వచ్చి గద్దెలపై కొలువుదీరనున్నారు. ములుగు జిల్లా తాడ్వాయి మండలంలో మేడారంలో మహా జాతర ఉత్సవాలు బుధవారం నుంచి ఆరంభం కానున్నాయి. ఈ మహాజాతర ప్రారంభం కానుండడంతో మొక్కులు, దర్శనం కోసం వచ్చే వారి సంఖ్యతో మేడారం పరిసరాలు పూర్తిగా జనసంద్రంగా మారనున్నాయి.
భక్తుల కొంగు బంగారం సమ్మక్క-సారలమ్మ జాతర మాఘశుద్ధ పౌర్ణమి (సమ్మక్కల పున్నం) రోజున రెండేళ్లకోసారి జరుగుతుందని చెప్పనక్కర్లేదు. మేడారం మహాజాతర పూజల తొలిఘట్టం గత బుధవారమే అత్యంత వైభవంగా ప్రారంభమయింది. జాతరకు సరిగ్గా వారం ముందు నిర్వహించే మండమెలిగే పండగను మేడారంలోని సమ్మక్క దేవత, కన్నెపల్లిలోని సారలమ్మ తల్లి పూజారులు పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభించారు. ఇక..
ఈసారి ఈ ఏడాది ఫిబ్రవరి 21 నుంచి 24 వరకు నిర్వహించనున్నారు. నిన్న(మంగళవారం) మేడారం మహాజాతర జంపన్న గద్దెకు చేరే క్రతువుతో ఆరంభమైంది. పూజారి పోలెబోయిన సత్యం, వడ్డె అయిన గొంది సాంబశివరావు ఆధ్వర్యంలో మంగళవారం కన్నెపల్లి నుంచి జంపన్న ఆదివాసీ సంప్రదాయాలతో రాత్రి 7:09 గంటలకు బయల్దేరారు. సరిగ్గా 8:31 గంటలకు జంపన్నను గద్దెకు చేర్చారు. జంపన్న గద్దెకు వచ్చే క్రమంలో గ్రామస్థులు, ఆడపడుచులు మంగళ హారతులు ఇస్తూ, నీళ్లు ఆరగిస్తూ స్వాగతం పలికారు. ఆదివాసీ పెద్ద మనుషులు, యువత రక్షణ కవచంలా ఉంటూ గద్దెల వరకు చేర్చారు. భక్తులు రహదారులకు ఇరువైపులా కన్నెపల్లి నుంచి జంపన్నవాగు వరకు 2 కిలోమీటర్ల మేర శరణు వేడుతూ జంపన్నకు స్వాగతం పలికారు. గద్దెకు చేరిన తర్వాత భక్తులు జంపన్నను దర్శించుకున్నారు.
ఇవాళ సమ్మక్క కూతురైన సారలమ్మ సాయంత్రం నాలుగు గంటలకు కొలువుదీరనుంది. సారలమ్మతో పాటు, పగిడిద్దరాజు, గోవిందరాజును గద్దెపైకి చేరుకుంటారు. సంప్రదాయబద్దంగా ఆదివాసి, గిరిజన పూజారులు ఈ అమ్మవారిని తీసుకొస్తారు. గురువారం చిలకలగుట్ట నుంచి సమ్మక్క తల్లి గద్దెపైకి రానుంది. శుక్రవారం ఇద్దరు తల్లులు భక్తులకు దర్శనమిస్తారు. భక్తులు పెద్ద ఎత్తున మొక్కులు చెల్లించుకుంటారు. శనివారం సాయంత్రం దేవతలు వన ప్రవేశం చేయడంతో జాతర ఉత్సవాలు ముగుస్తాయి.
సారలమ్మ రాక: మొదటి రోజు (ఫిబ్రవరి 21) కన్నెపల్లి నుంచి సారలమ్మ దేవి గంభీరమైన ఆగమనాన్ని సూచిస్తుంది. ఆధ్యాత్మిక ఉత్సవాలకు నాంది పలికే రోజు ఇది. గాలి దేవత సన్నిధికి స్వాగతం పలుకుతూ కీర్తనలు, సంగీతంతో అలరిస్తుంది.
సమ్మక్క ప్రవేశం: రెండోరోజు (ఫిబ్రవరి 22) చిలుకలగుట్ట నుంచి సమ్మక్క అమ్మవారి జాతరతో దివ్యగాథ కొనసాగుతుంది. దేవత రాకను సూచిస్తూ డప్పులు, శంఖం ధ్వనులతో అడవి ప్రతిధ్వనిస్తుంది. ఆధ్యాత్మిక ఉత్సవాన్ని బలపరిచే రోజు ఇది.
ఉత్సవాల కొనసాగింపు: మూడోరోజు (ఫిబ్రవరి 23) ఉత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతాయి. దేవతలకు భక్తులు మొక్కులు చెల్లించుకుంటారు. సాంస్కృతిక ప్రదర్శనలు, సంప్రదాయ నృత్యాలు, సంగీతంతో గిరిజన వారసత్వం శక్తిమంతంగా కళ్లకు కడుతుంది.
అడవికి తిరుగు ప్రయాణం: నాలుగోరోజు (ఫిబ్రవరి 24) గంభీరమైన వన ప్రవేశం వేడుక పాటిస్తారు. ఇక్కడ దేవతలు తిరిగి అడవికి ప్రయాణం చేస్తారు. ఇది జాతర ముగింపును సూచిస్తుంది. జీవిత ప్రక్రియ స్వభావం, దైవ, సహజ ప్రపంచం మధ్య ఉండే లోతైన సంబంధాన్ని గుర్తు చేస్తుంది.
తెలంగాణ నుంచే కాకుండా, ఏపీ, కర్ణాటక, మధ్యప్రదేశ్, జార్ఖండ్, మహారాష్ట్ర, ఛత్తీస్ గఢ్..ఇలా ఎనిమిది రాష్ట్రాల నుంచి కూడా ఈ జాతరకు భారీగా భక్తులు వస్తారు. ఈసారి మేడారం జాతరకు కోటి మంది భక్తులు వస్తారని అధికారులు అంచనా వేశారు. ఈ మేరకు భారీ ఏర్పాట్లు చేశారు. 2014లో అప్పటి తెలంగాణ ప్రభుత్వం మేడారం జాతరను రాష్ట్ర పండుగగా గుర్తించింది.
Comments
Please login to add a commentAdd a comment