Sammakka temple
-
Medaram: నేటి నుంచి సమక్క-సారలమ్మ మహా జాతర
ములుగు,సాక్షి: ఆసియాలో అతిపెద్ద గిరిజన కుంభమేళా.. తెలంగాణలో జరిగే చారిత్రాత్మక క్రతువు మేడారం మహా జాతర నేటి నుంచి ప్రారంభం కానుంది. సమ్మక్క, సారలమ్మలు వనం వీడి జనారణ్యంలోకి వచ్చి గద్దెలపై కొలువుదీరనున్నారు. ములుగు జిల్లా తాడ్వాయి మండలంలో మేడారంలో మహా జాతర ఉత్సవాలు బుధవారం నుంచి ఆరంభం కానున్నాయి. ఈ మహాజాతర ప్రారంభం కానుండడంతో మొక్కులు, దర్శనం కోసం వచ్చే వారి సంఖ్యతో మేడారం పరిసరాలు పూర్తిగా జనసంద్రంగా మారనున్నాయి. భక్తుల కొంగు బంగారం సమ్మక్క-సారలమ్మ జాతర మాఘశుద్ధ పౌర్ణమి (సమ్మక్కల పున్నం) రోజున రెండేళ్లకోసారి జరుగుతుందని చెప్పనక్కర్లేదు. మేడారం మహాజాతర పూజల తొలిఘట్టం గత బుధవారమే అత్యంత వైభవంగా ప్రారంభమయింది. జాతరకు సరిగ్గా వారం ముందు నిర్వహించే మండమెలిగే పండగను మేడారంలోని సమ్మక్క దేవత, కన్నెపల్లిలోని సారలమ్మ తల్లి పూజారులు పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభించారు. ఇక.. ఈసారి ఈ ఏడాది ఫిబ్రవరి 21 నుంచి 24 వరకు నిర్వహించనున్నారు. నిన్న(మంగళవారం) మేడారం మహాజాతర జంపన్న గద్దెకు చేరే క్రతువుతో ఆరంభమైంది. పూజారి పోలెబోయిన సత్యం, వడ్డె అయిన గొంది సాంబశివరావు ఆధ్వర్యంలో మంగళవారం కన్నెపల్లి నుంచి జంపన్న ఆదివాసీ సంప్రదాయాలతో రాత్రి 7:09 గంటలకు బయల్దేరారు. సరిగ్గా 8:31 గంటలకు జంపన్నను గద్దెకు చేర్చారు. జంపన్న గద్దెకు వచ్చే క్రమంలో గ్రామస్థులు, ఆడపడుచులు మంగళ హారతులు ఇస్తూ, నీళ్లు ఆరగిస్తూ స్వాగతం పలికారు. ఆదివాసీ పెద్ద మనుషులు, యువత రక్షణ కవచంలా ఉంటూ గద్దెల వరకు చేర్చారు. భక్తులు రహదారులకు ఇరువైపులా కన్నెపల్లి నుంచి జంపన్నవాగు వరకు 2 కిలోమీటర్ల మేర శరణు వేడుతూ జంపన్నకు స్వాగతం పలికారు. గద్దెకు చేరిన తర్వాత భక్తులు జంపన్నను దర్శించుకున్నారు. ఇవాళ సమ్మక్క కూతురైన సారలమ్మ సాయంత్రం నాలుగు గంటలకు కొలువుదీరనుంది. సారలమ్మతో పాటు, పగిడిద్దరాజు, గోవిందరాజును గద్దెపైకి చేరుకుంటారు. సంప్రదాయబద్దంగా ఆదివాసి, గిరిజన పూజారులు ఈ అమ్మవారిని తీసుకొస్తారు. గురువారం చిలకలగుట్ట నుంచి సమ్మక్క తల్లి గద్దెపైకి రానుంది. శుక్రవారం ఇద్దరు తల్లులు భక్తులకు దర్శనమిస్తారు. భక్తులు పెద్ద ఎత్తున మొక్కులు చెల్లించుకుంటారు. శనివారం సాయంత్రం దేవతలు వన ప్రవేశం చేయడంతో జాతర ఉత్సవాలు ముగుస్తాయి. సారలమ్మ రాక: మొదటి రోజు (ఫిబ్రవరి 21) కన్నెపల్లి నుంచి సారలమ్మ దేవి గంభీరమైన ఆగమనాన్ని సూచిస్తుంది. ఆధ్యాత్మిక ఉత్సవాలకు నాంది పలికే రోజు ఇది. గాలి దేవత సన్నిధికి స్వాగతం పలుకుతూ కీర్తనలు, సంగీతంతో అలరిస్తుంది. సమ్మక్క ప్రవేశం: రెండోరోజు (ఫిబ్రవరి 22) చిలుకలగుట్ట నుంచి సమ్మక్క అమ్మవారి జాతరతో దివ్యగాథ కొనసాగుతుంది. దేవత రాకను సూచిస్తూ డప్పులు, శంఖం ధ్వనులతో అడవి ప్రతిధ్వనిస్తుంది. ఆధ్యాత్మిక ఉత్సవాన్ని బలపరిచే రోజు ఇది. ఉత్సవాల కొనసాగింపు: మూడోరోజు (ఫిబ్రవరి 23) ఉత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతాయి. దేవతలకు భక్తులు మొక్కులు చెల్లించుకుంటారు. సాంస్కృతిక ప్రదర్శనలు, సంప్రదాయ నృత్యాలు, సంగీతంతో గిరిజన వారసత్వం శక్తిమంతంగా కళ్లకు కడుతుంది. అడవికి తిరుగు ప్రయాణం: నాలుగోరోజు (ఫిబ్రవరి 24) గంభీరమైన వన ప్రవేశం వేడుక పాటిస్తారు. ఇక్కడ దేవతలు తిరిగి అడవికి ప్రయాణం చేస్తారు. ఇది జాతర ముగింపును సూచిస్తుంది. జీవిత ప్రక్రియ స్వభావం, దైవ, సహజ ప్రపంచం మధ్య ఉండే లోతైన సంబంధాన్ని గుర్తు చేస్తుంది. తెలంగాణ నుంచే కాకుండా, ఏపీ, కర్ణాటక, మధ్యప్రదేశ్, జార్ఖండ్, మహారాష్ట్ర, ఛత్తీస్ గఢ్..ఇలా ఎనిమిది రాష్ట్రాల నుంచి కూడా ఈ జాతరకు భారీగా భక్తులు వస్తారు. ఈసారి మేడారం జాతరకు కోటి మంది భక్తులు వస్తారని అధికారులు అంచనా వేశారు. ఈ మేరకు భారీ ఏర్పాట్లు చేశారు. 2014లో అప్పటి తెలంగాణ ప్రభుత్వం మేడారం జాతరను రాష్ట్ర పండుగగా గుర్తించింది. -
ఘనంగా గుడిమెలిగె..
ఎస్‌ఎస్‌తాడ్వాయి: మేడారం సమ్మక్క గుడిలో గుడిమెలిగె పండుగను బుధవారం ఘనంగా నిర్వహించారు. ఉదయం తలస్నానాలు ఆచరించిన పూజారులు గుడికి చేరుకున్నారు. పూజారులు గుడిని శుద్ధి చేసిన అనంతరం ఐదుగురు ఆడపడచులు సమ్మక్క గద్దెలపై పసుపు, కుంకుమలతో ముగ్గులు వేసి అందంగా అలకరించారు. ఆరాధ్య దైవమైన సమ్మక్క తల్లికి ధూపదీపాలతో ప్రత్యేక పూజలు నిర్వహించి యాటను బలి ఇచ్చి నైవేద్యంగా సమర్పించారు. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పూజలు జరిగాయి. పూజలు ఇలా.. ప్రధాన పూజారి కొక్కెర కృష్ణయ్య, సిద్ధబోయిన మునీందర్, సిద్ధబోయిన లక్ష్మణ్‌రావు, భోజరావు, నర్సింగరావు, మల్లెల ముత్తయ్య, నాగేశ్వర్రావు, పూర్ణ, దూప వడ్డె దొబె పగడయ్య.. సమ్మక్క గుడికి చేరుకున్నారు. ప్రధాన పూజారి కృష్ణయ్య కొత్త చీపురుతో గుడి లోపల బూజును తొలగించి అమ్మవారి శక్తిపీఠాన్ని కడిగి శుద్ధి చేశారు. అలాగే, పూజ దీపాంతాలు గుడి లోపల, బయట శుభ్రపరిచారు. మరోవైపు పూజారి నాగేశ్వర్రావు అమ్మవారి దీపంతాలను శుద్ధి చేశారు. నాగేశ్వర్రావు, మరో పూజారితో కలిసి విత్ర స్థలంలోని ఎర్ర మట్టిని తీసుకొచ్చారు. కృష్ణయ్యే స్వయంగా సమ్మక్క గద్దెను మట్టితో అలికారు. అనంతరం పూజారులందరూ కలిసి పూజారి మునీందర్ ఇంటికి వెళ్లారు. ( గుడిని శుద్ధి చేస్తున్న పూజారులు ) మునీందర్ ఇంటి నుంచి పసుపు, కుంకుమలు.. పూజారి మునీందర్ ఇంట్లో అమ్మవారికి కావాల్సిన పసుపు, కుంకుమ, పూజ సామగ్రిని తయారు చేశారు. పూజ సామగ్రిని సిద్ధం చేసే వరకు ఇతరులను ఇంట్లోకి అనుమతించలేదు. తర్వాత ప్రధాన పూజారి కొక్కెర కృష్ణయ్య పసుపు, కుంకుమ, పూజ వస్తువులను పట్టుకోగా, నాగేశ్వర్రావు దీపాలను తీసుకొచ్చారు. మరో పూజారి మల్లెల ముత్తయ్య ఇత్తడి చెంబులో నీళ్లు, ఐదురుగు ఆడపడచుల్లో సిద్ధబోయిన భారతి మరో ఇత్తడి చెంబులో నీళ్లు పట్టుకుని డోలి వాయిద్యాలతో సమ్మక్క గుడికి చేరుకున్నారు. మూడుసార్లు గుడి చూట్టూ ప్రదక్షిణలు చేశారు. అప్పటికే పూజారులు ఐదు కట్టల కొత్తగడ్డిని తీసుకొచ్చి గుడి వద్ద ఉంచారు. దానిని పూజారి కృష్ణయ్య చేతుల మీదుగా ఈశాన్యంలోని గుడిపై సంప్రదాయబద్ధంగా పేర్చారు. ఆ తర్వాత గుడిలోపలికి ప్రవేశించారు. పూజారులకు సంబంధించిన ఐదుగురు ఆడపడచులు సిద్ధబోయిన భారతి, సునీత, సుగుణ, రాణి, కొక్కెర వినోద కలిసి మట్టితో అలికిన సమ్మక్క గద్దెపై పసుపు, కుంకుమలతో ముగ్గులు వేసి అలంకరించారు. ప్రధాన ప్రవేశ ద్వారం ముందు కూడా ముగ్గులు వేశారు. తల్లులకు నైవేద్యం.. గుడి అలంకరణ పూర్తయ్యాక వడ్డెలు సమ్మక్కకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. పసుపు, కుంకుమలతో అలంకరించిన అమ్మవారి శక్తి పీఠాన్ని వడ్డెలు ముగ్గులు వేసిన గద్దెపై ప్రతిష్ఠించారు. ధూపదీపాలు, కల్లుసారా అరగించి తల్లికి రహస్య పూజలు నిర్వహించారు. గుడిమెలిగె పండుగ సందర్భంగా తల్లికి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం యాటను జడత పట్టి బలి ఇచ్చి నైవేద్యంగా సమర్పించారు. పూజలు ముగిసే వరకు గుడి తలుపులు మూసివేశారు. గుడిమెలిగె సందర్భంగా కన్నెపల్లిలోని సారలమ్మ గుడిలోని వడ్డెలు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అలాగే వడ్డెలు రాత్రంతా దేవతల గద్దెల ప్రాంగణంలో జగారాలు చేశారు. -
వన దేవత వచ్చె..
-
వన దేవత వచ్చె..
ఘనంగా మేడారం జాతర ప్రారంభం గద్దెపైకి చేరిన సారలమ్మ పగిడిద్దరాజు, గోవిందరాజులు కూడా.. దారిపొడవునా భక్తుల దండాలు నేడు సమ్మక్క ఆగమనం మేడారం నుంచి సాక్షి ప్రతినిధి: మేడారం గిరిజన జాతర ఘనంగా మొదలైంది. కోరిన కోరికలు నెరవేర్చే వన దేవత సారలమ్మ బుధవారం మేడారం గద్దెపై కొలువుదీరారు. పగిడిద్దరాజు, గోవిందరాజులు కూడా సారలమ్మతోనే గద్దెలపైకి చేరారు. బుధవారం సాయంత్రం కన్నెపల్లిలోని సారలమ్మ గుడి వద్ద ఆదివాసీ సంప్రదాయాల ప్రకారం వడ్డెలు(పూజారులు) ప్రత్యేక పూజలు నిర్వహించారు. సాయంత్రం 6.18 గంటలకు గుడి నుంచి మొంటె (వెదురు బుట్ట)లో అమ్మవారి ప్రతిరూపమైన పసుపు, కుంకుమలు తీసుకుని మేడారానికి బయలుదేరారు. జంపన్నవాగులో నుంచి సమ్మక్క గుడికి చేరుకున్నారు. అప్పటికే అక్కడికి చేరుకున్న పగిడిద్దరాజు, గోవిందరాజులతో కలసి వడ్డెలు ముగ్గురి రూపాలను రాత్రి 9.40ని.లకు గద్దెలపైకి చేర్చారు. కన్నెపల్లి నుంచి నాలుగు కిలోమీటర్ల దూరంలోని మేడారం గద్దెల వద్దకు సారలమ్మ వస్తున్న వేడుకను చూసేందుకు లక్షలాది మంది భక్తులు పోటీపడ్డారు. సారలమ్మ ప్రధాన పూజారి కాక సారయ్య అమ్మవారి ప్రతిమను మొంటెలో తీసుకొస్తుండగా ఆలయం మెట్ల నుంచి వంద మీటర్ల పొడవునా భక్తులు కింద పడుకుని వరం పట్టారు. సారలమ్మను తీసుకువస్తున్న పూజారులు వీరిపై దాటి వెళ్లారు. ఇలా చేస్తే సంతానభాగ్యం కలుగుతుందని, కోర్కెలు నెరవేరుతాయని భక్తుల నమ్మకం. సారలమ్మ గద్దెలకు రాకను సూచిస్తూ ఆదివాసీ పూజారులు కొమ్ముబూరలు ఊదారు. ప్రత్యేక డోలు వాద్యాలు, శివసత్తుల పూనకాలు, హిజ్రాల శివాలుతో కన్నెపల్లిలోని సారలమ్మ ఆలయం భక్తితో ఉప్పొంగింది. పూజారులు కాక సారయ్య, లక్ష్మీబా యమ్మ, కోరె ముత్యంబాయి, కాక కిరణ్, కాక వెంకన్న, కాక కనుకమ్మ, కాక భుజంగరావులు సారలమ్మను కన్నెపల్లి నుంచి గద్దెలపైకి తీసుకువచ్చారు. ములుగు ఎమ్మెల్యే సీతక్క వీరికి తోడుగా వచ్చారు. హనుమాన్ జెండా నీడలో కన్నెపల్లి వెన్నెలమ్మగా పేరున్న సారలమ్మ గద్దెలపైకి చేరింది. ప్రభుత్వం తరఫున జేసీ పౌసమిబసు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. జిల్లా కలెక్టర్ కిషన్ అంతకుముందు కన్నెపల్లికి చేరుకుని అక్కడ వడ్డెలు నిర్వహించిన పూజల్లో పాల్గొన్నారు. సీఆర్పీఎఫ్ పోలీసులు భద్రత కల్పించారు. జనమే... జనం: సారలమ్మ, ఆమె భర్త గోవిందరాజు, తండ్రి పగిడిద్దరాజులు ప్రతిమలను గద్దెలపైకి తీసుకురావడంతో మేడారం, కన్నెపల్లి, రెడ్డిగూడెం, జంపన్నవాగు, నార్లాపూర్ పరిసర ప్రాంతాలు భక్తులతో కిక్కిరిసిపోయాయి. లక్షలాదిగా వస్తున్న భక్తులతో అటవీదారులన్నీ కిటకిటలాడాయి. పుణ్యస్నానాలతో జంపన్నవాగు మొత్తం జనంతో నిండిపోయింది. నాలుగు కిలోమీటర్ల పొడవునా దారులు కిక్కిరిసిపోయాయి. సారలమ్మ గద్దెలపైకి రాగానే భక్తులు దర్శనం కోసం ఒక్కసారిగా గద్దెల వద్దకు వచ్చేందుకు ప్రయత్నించడంతో తోపులాట జరిగింది. నేడు సమ్మక్క రాక...: జాతరలో అత్యంత ప్రధాన ఘట్టం సమ్మక్క మేడారం గద్దెలపైకి చేరడం. చిలుకలగుట్ట నుంచి మేడారానికి సమ్మక్క ప్రతిమను తీసుకువచ్చే ప్రక్రియ గురువారం జరుగుతుంది. సా.5గంటల సమయంలో గిరిజన సంప్రదాయం ప్రకారం ప్రధాన పూజారి చిలుకలగుట్టపై నుంచి కుంకుమ భరిణె రూపంలో ఉన్న సమ్మక్కను వెదురు బొంగులో భద్రపర్చుకుని తీసుకొస్తారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున కలెక్టర్ జి.కిషన్ సమ్మక్కను తీసుకువచ్చే కార్యక్రమాన్ని పర్యవేక్షిస్తారు. వరంగల్ రూరల్ ఎస్పీ ఎల్.కాళిదాసు గాలిలోకి కాల్పులు జరిపిన తర్వాత సమ్మక్క ప్రతిమతో వడ్డెలు బయల్దేరుతారు. ఆ సమయంలో భక్తులు సమ్మక్కకు ఎదురేగి కోళ్లను, మేకలను బలి ఇస్తారు. వన దేవతలందరు కొలుైవె ఉండటంతో గురువారం రాత్రి నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు మొక్కులు చెల్లించుకుంటారు. మేడారం.. ట్రాఫిక్‌జాం సాక్షి, హన్మకొండ: మహా జాతర తొలిరోజే ట్రాఫిక్‌జాం అయ్యింది. పోలీసు శాఖ కనబరిచిన అతివిశ్వాసం మొదటికే మోసం తెచ్చింది. దీన్ని సరిదిద్దేందుకు పోలీసులకు పద్దెనిమిది గంటల సమయం పట్టింది. జాతరకు ముందు పోలీసు శాఖ చేసిన కసరత్తు, విధించిన నిబంధనలు పనికిరాకుండా పోయాయి. కాగా, భక్తుల రద్దీ అనూహ్యంగా పెరగడంతో మంగళవారం సాయంత్రం మేడారానికి 25 కిలోమీటర్ల దూరంలో ఉన్న పస్రా దగ్గర ట్రాఫిక్ జాం అయింది. మంగళవారం సాయంత్రం 5.00 గంటల నుంచి బుధవారం మధ్యాహ్నం 11.30 గంటల వరకు పస్రా నుంచి మల్లంపల్లి వరకు 40 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ సమస్య ఏర్పడింది. గంటల తరబడి వాహనాలు నిలిచిపోవడంతో భక్తులు తీవ్ర ఇబ్బందులుపడ్డారు. రూరల్, అర్బన్ పోలీసుల మధ్య సమన్వయం లోపించిందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. అమ్మలకు రాజన్న పట్టు వస్త్రాలు తాడ్వాయి, న్యూస్‌లైన్: మేడారం సమ్మక్క, సారలమ్మలకు వేములవాడ రాజన్న దేవస్థానం తరఫున బుధవారం పట్టు వస్త్రాలను సమర్పించారు. వేములవాడ పాల కమండలి చైర్మన్ బొమ్మ వెంకటేశ్వర్లు పట్టు వస్త్రాలను తెచ్చారు. తొలుత సమ్మక్క గుడిలో అమ్మవారికి వస్త్రాలు సమర్పించారు.