ఏటూరునాగారం: రాష్ట్ర స్థాయి హ్యాండ్ బాల్ పోటీలకు ఏటూరునాగారం నుంచి ఇద్దరు క్రీడాకారులు ఎంపికై నట్లు ఏటూరునాగారం కోచ్ పర్వతాల కుమారస్వామి తెలిపారు. ఇటీవల వరంగల్‌లో జరిగిన సీనియర్ మహిళల హ్యాండ్ బాల్ జిల్లా స్థాయి పోటీల్లో రాధిక, సాయి కీర్తన అత్యుత్తమ ప్రతిభ కనబరిచినట్లు పేర్కొన్నారు. కాగా.. ఈనెల 29 నుంచి 30 వరకు ఆదిలాబాద్‌లో జరిగే రాష్ట్ర రాష్ట్ర స్థాయి పోటీల్లో ఉమ్మడి వరంగల్ టీం తరఫున పాల్గొంటారని ఆయన తెలిపారు.
శిక్షణార్థులకు అన్ని సౌకర్యాలు కల్పించాలి
ములుగు/ములుగు రూరల్: జిల్లా కేంద్రంలో నిర్వహిస్తున్న తెలంగాణ అకాడమీ ఫర్ స్కిల్ అండ్ నాలెడ్జ్ (టాస్క్)సెంటర్‌ను గురువారం జిల్లా గ్రంథాలయ చైర్మన్ బానోత్ రవిచందర్ ఆకస్మికంగా పరిశీలించారు. నిరుద్యోగులకు అందిస్తున్న శిక్షణ వివరాలను అడిగి తెలుసుకున్నారు. శిక్షణకు వచ్చే వారికి అన్ని సౌకర్యాలు అందించాలని సూచించారు. ఏమైనా అవసరాలుంటే వెంటనే మంత్రి సీతక్క దృష్టికి తీసుకెళ్లి వసతులు కల్పిస్తామన్నారు. ఆయన వెంట యూత్ కాంగ్రెస్ నాయకుడు గూడెపు రాకేశ్, తదితరులు ఉన్నారు. మల్లంపల్లి మండల కేంద్రానికి చెందిన అజ్మీర దులమ్మ ఇటీవల అనారోగ్యంతో మృతి చెందగా ఆమె కుటుంబాన్ని గురువారం రవిచందర్ పరామర్శించారు. చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు.
మద్యం మత్తులో మహిళ ఆత్మహత్యాయత్నం!
కన్నాయిగూడెం: మండలంలోని చిట్యాలలో ఓ మహిళ మద్యం మత్తులో పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించింది. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని సర్వాయి గ్రామ పంచాయతీలోని చిట్యాలకు చెందిన బంధం సమ్మక్క(42) మద్యం మత్తులో పురుగుల మందు తాగిందా? లేక కుటుంబ గొడవలు ఏమైనా జరిగాయా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. గ్రామస్తుల సహకారంతో మహిళను భర్త లక్ష్మయ్య 108లో వైద్యం కోసం ఏటూరునాగారం తరలించారు. అక్కడి నుంచి వైద్యుల సలహా మేరకు ములుగు ఏరియా హాస్పిటల్‌కు తరలించినట్లు తెలిసింది.
రాత్రి పది తర్వాతే లారీలు అనుమతించాలి..
వెంకటాపురం(కె): రాత్రి పది గంటల తర్వాతే ఇసుక లారీలను మండలం నుంచి బయటకు వెళ్లేలా అనుమతించాలని ఆది వాసీ నవ నిర్మాణసేన రాష్ట్ర అధ్యక్షుడు కోర్సా నర్సింహమూర్తి గురువారం ఒక ప్రకటనలో కోరారు. బుధవారం రాత్రి బర్గూడెం పంచాయతీ చిరుతపల్లి గ్రామానికి చెందిన ఇద్దరు వ్యక్తులు ఇసుక లారీ ఢీకొని చనిపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. విచ్చలవిడిగా ఇసుక లారీలను అనుమతించడంతోనే జిల్లాలో నిత్యం ఎక్కడో ఒక చోట ప్రమాదాలు జరుగుతున్నాయన్నారు. ప్ర మాదం జరిగితే లారీ ఓనర్స్ బాధ్యత తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇసుక లారీల అతివేగం, ఓవర్‌లోడ్‌తో వెళ్తున్నాయన్నారు. వేగాన్ని నియంత్రిండంతో పాటు ప్రమాదాలు తగ్గేలా రాత్రి సమయాల్లో మాత్రమే లారీలను అనుమతించాలని కోరారు.
అంగన్‌వాడీ సెంటర్లకు వేసవి సెలవులివ్వాలి..
ములుగు రూరల్: అంగన్‌వాడీ సెంటర్లకు మే నెలలో వేసవి సెలవులివ్వాలని సీఐటీయూ జిల్లా కార్యదర్శి రత్నం రాజేందర్ అన్నారు. ఈమేరకు గురువారం కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా చేశారు. అనంతరం డీడబ్యూఓ శిరీష, అదనపు కలెక్టర్ మహేందర్‌జీకి వినతిపత్రాలు అందించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ..ఎండల తీవ్రత కారణంగా చిన్నారులు, గర్భిణులు, బాలింతలు అంగన్‌వాడీ కేంద్రాలకు రాలేకపోతున్నారన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అంగన్‌వాడీ కేంద్రాలకు సెలవులు ప్రకటిస్తూ సర్క్యూలర్ జారీ చేయాలన్నారు. కార్యక్రమంలో అంగన్‌వాడీ యూనియన్ జిల్లా కార్యదర్శి సమ్మక్క, భాగ్యలక్ష్మి, సరిత, జమున, రాణి, సత్యనారాయణమ్మ, మీనా పాల్గొన్నారు.
రాష్ట్ర స్థాయి హ్యాండ్ బాల్ పోటీలకు ఇద్దరు ఎంపిక


