మేడారం నుంచి సాక్షిప్రతినిధి, వరంగల్: ములుగు జిల్లా మేడారం అడవి సమ్మక్క నామస్మరణతో మా ర్మోగింది. జాతరలో అతి ముఖ్యమైన ఘట్టం గురు వారం రాత్రి ఆవిష్కృతమైంది. లక్షల మంది భక్తుల పారవశ్యం, గిరిజన యువతుల నృత్యాలు, కోయ దొరల డోలు వాయిద్యాలు, శివసత్తుల పూనకాలు, హిజ్రాల మొక్కులు, అధికారుల లాంఛనాల మధ్య ఆదివాసీ పూజారులు, వడ్డెలు వన దేవత సమ్మక్క ను మేడారం గద్దెలపైకి చేర్చారు. ఈ సందర్భంగా చిలకలగుట్ట నుంచి మేడారం గద్దెల దాకా భక్త జనంతో కిటకిటలాడింది. చిలకలగుట్ట నుంచి మేడారానికి సమ్మక్కను తీసుకువచ్చే క్రతువు గురువారం సాయంత్రం ఐదు గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు ఉద్విగ్నభరితంగా సాగింది.
ఉదయం నుంచే మొదలై..
సమ్మక్కను మేడారం గద్దెలపైకి చేర్చే ఏర్పాట్లు గురువారం ఉదయమే మొదలయ్యాయి. సమ్మక్క వడ్డెలు, పూజారులు ఉదయం 5.30 గంటలకే మే డారం సమీపంలోని చిలకలగుట్ట అడవిలోకి వెళ్లి కంకవనాలు (వెదురు కర్రలు) తెచ్చి గద్దెలపై ప్రత్యే క పూజలు చేశారు. సమీపంలోని సమ్మక్క పూజా మందిరం నుంచి వడరాలు (కొత్త కుండలు) తెచ్చి గద్దెలపైకి చేర్చారు. తర్వాత సాయంత్రం ఐదు గంటల సమయంలో కుంకుమ భరిణె రూపంలో ఉన్న సమ్మక్కను గద్దెపైకి తెచ్చేందుకు పూజారులు, వడ్డెల బృందం చిలకలగుట్టపైకి బయలుదేరారు. అప్పటికే చిలకలగుట్ట ప్రాంతం మొత్తం భక్తులతో నిండిపోయింది.
భక్తులు సమ్మక్క వచ్చే దారి పొడవునా రంగురంగుల పట్నాలు, ముగ్గులతో నింపేశా రు. సాయంత్రం ఏడు గంటల సమయంలో సమ్మక్క తల్లితో పూజారులు చిలకలగుట్ట దిగడం ప్రారంభించారు. ఇది చూసి భక్తులు, శివసత్తులు పూనకాలతో ఊగిపోయారు. పూజారులు సిద్దబో యిన మునీందర్, లక్ష్మణ్‌రావు, మహేష్, చందా బాబూరావు, దూప వడ్డె నాగేశ్వర్‌రావు అమ్మవా రిని వడ్డె కొక్కెర కృష్ణయ్యకు అప్పగించాక మేడారం వైపు కదిలారు. ప్రభుత్వం తరఫున అధికారిక లాం ఛనాల ప్రకారం సమ్మక్కకు ఆహ్వానిస్తూ, ఆమె రాకకు సూచనగా ములు గు జిల్లా ఎస్పీ సంగ్రామ్‌సింగ్ జి.పాటిల్ గాల్లోకి కాల్పులు జరిపారు. వెంటనే చిలకలగుట్ట నుంచి మేడా రం దాకా లక్షలాది మంది భక్తజనం సమ్మక్క నామస్మరణతో ఆ ప్రాంతం మార్మోగింది. ప్రభుత్వం తరఫున మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, ఇంద్రకరణ్‌రెడ్డి సమ్మక్క తల్లికి స్వాగతం పలికారు.
రక్షణ వలయం మధ్య
ఆదివాసీ యువకుల రక్షణ వలయం, పోలీసు బలగాల మధ్య వడ్డెల బృందం సమ్మక్క ప్రతిరూపంతో మేడారం వైపు బయలుదేరారు. దారిపొడవునా భక్తులు అమ్మకు దండం పెట్టుకున్నారు. మొక్కుల కోసం తెచ్చుకున్న ఒడి బియ్యాన్ని చల్లారు. సమ్మక్కను తీసుకువస్తున్న బృందం అక్కడి నుంచి ఎదుర్కోళ్ల పూజా మందిరం చేరుకుంది. అక్కడ వడ్డెలు, పూజారులు ఎదురుకోళ్లు జరిపించారు. సమ్మక్కకు సెలపెయ్యను బలి ఇచ్చారు. మేడారం గద్దెల ముఖ ద్వారం వద్ద ఆ ఊరి ఆడబిడ్డలు సమ్మక్కను తీసుకువస్తున్న పూజారుల కాళ్లు కడిగి స్వాగతం పలికారు. తర్వాత 9.19 గంటల సమయంలో గద్దెలపైకి తీసుకువచ్చారు. సమ్మక్క తల్లి గద్దెపైకి వచ్చినప్పటి నుంచి ప్రతిష్టించే వరకు గద్దెల ఆవరణలో విద్యుత్ దీపాలను ఆపివేశారు. రహస్య పూజలు చేసిన అ నంతరం రాత్రి 9.43 గంటల సమయంలో దీపా లను ఆన్ చేశారు. మొదట మేడారం వాసులు, జిల్లా అధికారులు మొక్కులు చెల్లించుకున్నారు.
కేసీఆర్ పేరిట బెల్లం బంగారం సమర్పణ
గురువారం సీఎం కేసీఆర్ పుట్టినరోజు కావడంతో మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు.. కేసీఆర్ పేరిట అమ్మవార్లకు బెల్లం బంగారం మొక్కు సమర్పించారు. మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి కూడా అమ్మవార్లకు సీఎం పేరుమీద బెల్లం సమర్పించారు.
నలుగురు దేవతలు.. నలుదిక్కులా మొక్కులు
బుధవారం మేడారం గద్దెలకు సారలమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజు రాగా.. గురువారం సమ్మక్క తల్లిని ప్రతిష్టించారు. దీనితో మొత్తం నలుగురు దేవతలు గద్దెలపైకి చేరి.. మహా జాతర పూర్తిస్థాయిలో ప్రారంభమైంది. మొక్కులు సమర్పించేందుకు లక్షల మంది భక్తులు భారీగా తరలివచ్చారు. దేవతలను దర్శించుకొని, మొక్కులు చెల్లించుకున్నారు. బుధ, గురువారాల్లో సుమారు 75 లక్షల మంది భక్తులు అమ్మవార్లను దర్శించుకున్నట్లు జిల్లా కలెక్టర్ కృష్ణ ఆదిత్య ప్రకటించారు.
Comments
Please login to add a commentAdd a comment