
జయశంకర్ భూపాలపల్లి: మేడారంలో శాశ్వత ఏర్పాట్ల కోసం రూ.200 కోట్లు కేటాయిస్తున్నట్లు తెలంగాణ ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్‌రావు ప్రకటించారు. రానున్న బడ్జెట్‌లోనే రెండువందల కోట్లు కేటాయిస్తామని ఆయన తెలిపారు. సీఎం కేసీఆర్ దంపతులు శుక్రవారం సమ్మక్క-సారలమ్మను దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. ఆయన నిలువెత్తు బంగారంతో పాటు పట్టు వస్త్రాలు సమర్పించుకున్నారు.
అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ... తెలంగాణ పోరాట పటిమకు సమ్మక్క-సారలమ్మ నిదర్శనమన్నారు. ఉద్యమ సమయంలోనే తెలంగాణ కోసం వనదేవతకు మొక్కుకున్నట్లు తెలిపారు. సమైఖ్య పాలనలో జాతర నిర్లక్ష్యానికి గురైందని, రాబోయే జాతరను కనివినీ ఎగరని రీతిలో నిర్వహిస్తామని కేసీఆర్ పేర్కొన్నారు. అలాగే తెలంగాణలో సాగునీటి ప్రాజెక్ట్‌లకు ఆటంకాలు కలగకుండా చూడాలని మొక్కుకున్నట్లు తెలిపారు. మేడారం జాతరను ఆయన దక్షిణ భారతదేశ కుంభమేళగా అభివర్ణించారు. ఆరు రాష్ట్రాల నుంచి భక్తులు వచ్చి...సమ్మక్క-సారలమ్మలను దర్శించుకుంటున్నారని తెలిపారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలుగకుండా దగ్గరుండి ఏర్పాట్లు పర్యవేక్షిస్తున్న మంత్రులు,అధికారులను సీఎం అభినందించారు.