పడగలతో మేడారం పయనమైన పూజారులు
మేడారం సమ్మక్క–సారలమ్మ జాతరకు గుండాల మండలం యాపలగడ్డ నుంచి పగిడిద్దరాజును తోడ్కొని అరెం వంశీయులు సోమవారం బయలుదేరారు. కాలినడకన పడగ (జెండా)లతో జాతర ప్రారంభానికి(ఈ నెల 31కి) ముందే వారు మేడారం చేరుకుంటారు.
గుండాల: గుండాల మండలం యాపలగడ్డ గ్రామం నుంచి సోమవారం మేడారం సమ్మక్క–సారలమ్మ జాతరకు పగిదిద్దరాజు బయల్దేరాడు. కాలినడక ఆయన(అరెం) వంశీయులు పడగలలో పయనమయ్యారు. రెండేళ్లకోసారి భూపాలపల్లి జిల్లా తాడ్వాయి మండలంలో జరిగే మేడారం జాతరకు సమ్మక్క భర్త పగిడిద్దరాజును యాపలగడ్డ గ్రామస్తులే తీసుకెళ్తారు. ఈ క్రమంలో సోమవారం అరెం వంశీయులు పగిడిద్దరాజు గర్భగుడి వద్ద పడగలకు( జెండాలకు), శివసత్తులకు పురాతన కాలంనాటి ఆభరణాలకు పూజారులు, వడ్డెలు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం స్థానిక పగిడిద్దరాజు గద్దెల వద్దకు తీసుకెళ్లి అక్కడ పూజలు నిర్వహించారు. పడగలను, నగలు, గజ్జెలు ధరంచిన వడ్డెలు భుజాన పెట్టుకుని ఊరేగింపుతో పయననమయ్యారు.
గ్రామ గ్రామం మీదుగా గిరిజన నృత్యాలతో, డప్పు వాయిద్యాల నడుమ ఊరేగింపు నిర్వహించుకుంటూ తీసుకెళ్లారు. యాపలగడ్డ గ్రామ ప్రజలంతా చిన్నా,పెద్దా తేడా లేకుండా డ్యాన్సులు వేశారు. పగిడిద్ద రాజు పూజలను, ఊరేగింపును అంగరంగ వైభవంగా నిర్వహించారు. వరంగల్ జిల్లా పూనుగొండ్ల పెనకం వంశీయులు లక్ష్మిపురం గ్రామం వద్ద వీరిని కలుసుకుంటారు. రెండు రోజుల పాటు పాదయాత్ర చేసి జాతర ముందురోజు జంపన్న వాగులో బస చేస్తారు. బుధవారం రోజు పగిడిద్దరాజుతో పాటు, కొండాయిగూడెం నుంచి గోవిందరాజును, కన్నెపల్లి నుంచి సారలమ్మను ఆయా గ్రామాల పూజారులు తీసుకువస్తారు. ఆ ముగ్గురు వన దేవతలకు మేడారంలోని గర్భగుడిలో ప్రత్యేక పూజలు చేస్తారు.
గురువారం నాటికి సమ్మక్క (దేవత)ను చిలకలగుట్ట నుంచి గద్దెల వద్దకు తీసుకువస్తారు. అదేరోజు రాత్రి పగిడిద్దరాజు–సమ్మక్కల దేవతలకు నాగవెళ్లి(పెళ్లి) చేస్తారు. దీంతో నిండు జాతర ప్రారంభమవుతుంది. సమ్మక్కను శనివారం వనానికి తీసుకెళ్లగా జాతర ముగుస్తుంది. తిరిగి అరెం వంశీయలు పగిడిద్ద రాజును పాదయాత్రతో గుండాలకు చేర్చుతారు. అనంతరం ప్రతీ ఏటా యాపలగడ్డలో పగిడిద్ద రాజు–సమ్మక్కల నాగవెళ్లి జాతరను మార్చి మొదటి వారంలో నిర్వహిస్తామని అరెం వంశీయులు తెలిపారు. ఈ కార్యక్రమంలో సీఐ తుమ్మ గోపి, ఎస్సై శ్రావన్ కుమార్, వడ్డెలు, పూజారులు అర్రెం అప్పయ్య, బుచ్చయ్య, లక్ష్మినర్సు, చిన్న కాంతారావు, సత్యం, జోగయ్య, ఇద్దయ్య, పెద్ద కాంతారావు, నాగేశ్వరావు, సమ్మయ్య, ముత్తయ్య, భిక్షం రమేష్,నాగేష్, చంద్రయ్య తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment