thadwai mandal
-
మేడారం జాతర : మండమెలిగె.. మది వెలిగె
సాక్షి, ఎస్ఎస్ తాడ్వాయి(వరంగల్) : మండమెలిగె పండుగకు వచ్చాం.. సల్లంగజూడు సమ్మక్కా అంటూ భక్తుల మొక్కులతో మేడారం మహాజాతర కిక్కిరిసిపోయింది. ములుగు జిల్లా ఎస్ఎస్ తాడ్వాయి మండలం మేడారం శ్రీసమ్మక్క–సారలమ్మ మహాజాతరలో భాగంగా బుధవారం అమ్మవార్ల ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించిన పూజారులు మండమెలిగె పండుగను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామ పొలిమేరల్లో దిష్టితోరణాలు కట్టారు. రాత్రి సమక్క, సారలమ్మ పూజారులు గద్దెల వద్ద జాగారం చేసి సంబురాలు జరుపుకున్నారు. ఈ మేరకు గద్దెల వద్ద పూజారులు రహస్య పూజలు చేస్తుండడంతో బుధవారం రాత్రి నుంచి గురువారం ఉదయం 5 గంటల వరకు భక్తుల దర్శనాన్ని నిలిపివేశారు. తరలివచ్చి.. తరించి.. ఈ సందర్భంగా వనదేవతలను దర్శించుకోవడానికి వివిధ ప్రాంతాల నుంచి వేల సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. జంపన్నవాగు వద్ద స్నానఘట్టాల షవర్ల వద్ద స్నానాలు చేసి తల్లుల గద్దెలకు చేరుకొని దర్శించుకొని బెల్లం, కోళ్లు, చీరెసారెలను సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. భక్తుల రద్దీతో అమ్మవార్ల గద్దెలు కిటకిటలాడాయి. క్యూలైన్లు భక్తులతో నిండిపోయింది. మధ్యాహ్నం వాహనాల రద్దీ పెరగడంతో ట్రాఫిక్ నియంత్రణ కోసం కొత్తూరు నుంచి కన్నెపల్లి బీటీ రోడ్డు నుంచి పార్కింగ్ స్థలానికి వాహనాలు మళ్లించారు. పగిడిద్దరాజు దేవాలయంలో మండమెలిగె గంగారం : మహబూబాబాద్ జిల్లా గంగారం మండలం పూనుగొండ్లలోని పగిడిద్దరాజు దేవాలయంలో బుధవారం ప్రత్యేక పూజలు ప్రారంభమయ్యాయి. మేడారం సమ్మక్క–సారలమ్మ జాతర ప్రారంభం కావాలంటే సమ్మక్క భర్త అయిన పగిడిద్దరాజు పూనుగొండ్ల నుంచి బయలుదేరి రావాల్సి ఉంటుంది. ఈ మేరకు పగిడిద్దరాజు దేవాలయంలో బుధవారం మండమెలిగె పూజలు చేశారు. పెనక వంశీయులతోపాటు గిరిజనులు పగిడిద్దరాజు ఆలయం శుద్ధి1 చేసి అమ్మవారికి మొక్కులు చెల్లించారు. ఆ తర్వాత పసుపు, గాజులను, నూతన వస్త్రాలను పట్టుకుని ప్రధాన పూజారులైన పెనక మురళీధర్, సురేందర్, బుచ్చిరాములు, సమ్మయ్య తదితరులు మేడారానికి బయలుదేరారు. కొండాయిలో.. ఏటూరునాగారం: ఏటూరునాగారం మండలంలోని కొండాయిలో కొలువై ఉన్న గోవిందరాజుల గుడిని పూజారులు దబ్బగట్ల గోవర్ధన్, వడ్డె బాబులు శుద్ధి చేసి ప్రత్యేక పూజలు చేశారు. ఆలయంలో ఉన్న గోవిందరాజులకు దూపదీప నైవేద్యాలను సమర్పించారు. బెల్లం శాక, కొబ్బరికాయలు, కుంకుమ, పసుపులతో పూజలు చేశారు. అనంతరం బెల్లంశాక, పూజ సామగ్రిని తీసుకొని మేడారానికి పూజారులు చేరుకున్నారు. -
ఔరా అనిపిస్తున్న ఆడబిడ్డ
ఆకాశంలో సగమంటూ అన్ని రంగాల్లో దూసుకుపోతున్న మహిళలు అంతర్జాతీయంగా విమానాలు, దేశీయంగా మెట్రో రైళ్లు నడుపుతూ మగవాళ్లకు దీటుగా నిలుస్తున్నారు. మెట్రో నగరాల్లో పురుషులతో పోటీ పడుతున్నప్పటికీ గ్రామీణ ప్రాంతాల్లో కట్టుబాట్లు, ఆచార వ్యవహారాల మూలంగా బయటికి రాలేక తమలోని ప్రతిభను మరుగున పడేస్తున్నారు. కానీ ఇలాంటి కట్టుబాట్లను తెంచుకుని ఆచారాలను పాటిస్తునే స్వంతంగా వ్యాపారం చేస్తూ కుటుంబానికి ఆసరాగా నిలుస్తున్న స్వాతిపై ‘సాక్షి’ కథనం. – ఎస్‌ఎస్‌తాడ్వాయి నీటి సరఫరా కోసం డ్రైవింగ్ సాక్షి, ములుగు : తన వ్యాపారాన్ని విస్తరించుకునే బాధ్యతను తనే మీద వేసుకుంది స్వాతి. దీని కోసం ఏకంగా ఆటోడ్రైవింగ్ నేర్చుకుంది. ఉదయం వేళ హోటల్ నిర్వాహణకు సంబంధించిన పనులు పూర్తయిన తర్వాత ఆటోలో క్యాన్లు వేసుకుని మేడారం చుట్టు పక్కల ఉన్న ఊరట్టం, కన్నెపల్లి, నార్లపల్లి, వెంగళరావునగర్, ప్రాజెక్టు నగర్, తాడ్వాయి, కామారం వరకు ఉన్న పల్లెలకు వెళుతూ నీటిని సరఫరా చేస్తోంది. మధ్యాహ్నం సమయానికల్లా మేడారం చేరుకుని హోటల్ పనుల్లో నిమగ్నమవుతోంది. సాయంత్రం వేళ తిరిగి వాటర్ ప్లాంట్ మెయింటనెన్స్‌ను చేపడుతోంది. మహిళా సాధికరత, ధైర్య సాహసాలకు నిలువెత్తు నిదర్శంగా నిలిచే సమ్మక్క సారలమ్మ చెంత స్వాతి ఆటో నడిపిస్తున్న తీరు చూసి ఇక్కడకు వచ్చే భక్తులు, చుట్టు పక్కల గ్రామాలకు చెందిన మహిళలు ఔరా అనుకుంటున్నారు. సమస్యలు వస్తే తమ వైపు చూడకుంటా తన కాళ్లపై తాను నిలబడుతూ తన పిల్లలకు మంచి భవిష్యత్ అందించేందుకు స్వాతి పడుతున్న తపన చూసి ఆమె తల్లిదండ్రులు సంతోషపడుతున్నారు. ఈ అంశంపై స్వాతిని ’సాక్షి‘ పలకరించగా ఒకరిపై ఆధారపడకుండా ఉండేందుకు డ్రైవింగ్ నేర్చుకున్నాని, పట్టుదల ఉంటే ఏదైనా సాధించొచ్చని చెబుతుంది. ఆడవాళ్లు ఏ అంశంలో తక్కువ కాదని, ఏ రంగంలోనైనా రాణించగలరని అంటుంది. అడవుల గుండా ఆటో నడిస్తున్నప్పుడు భయంగా ఉండదా అని ప్రశ్నిస్తే సమ్మక్క సారలమ్మ సన్నిధిలో ఉంటూ భయమెందుకు అంటూ ఎదురు ప్రశ్నిస్తుంది. ఈ మాటతీరు చూస్తేనే తెలుస్తుంది స్వాతి ఎంత ధైర్యంగా ముందుకెళ్తుందో.. తాగునీటి సరఫరా.. ఉపాధి మేడారం వంటి ఏజెన్సీ ఏరియాల్లో తాగునీటి కోసం సామాన్యులు పడుతున్న ఇబ్బందులు గమినించింది. ప్రజల కష్టాలు తీర్చడంతో పాటు తనకు ఉపాధి దొరుకుతుందనే అంచనాతో ధైర్యం చేసి దట్టమైన అడవుల మధ్య ఉన్న మేడారంలో వాటర్ ప్లాంటు నెలకొల్పింది. ప్లాంటు నెలకొల్పిన తర్వా త మేడారంతో పాటు చుట్టు ప్రక్కల గ్రామాల ప్రజల నుంచి డిమాండ్ వచ్చింది. దీంతో వారికి కూడా నీటిని అందించాల ని అనుకుంది కానీ సరఫరా చేయడం కష్టంగా మారింది. ఆదివారం, సెలవు రోజులు తప్పితే మేడారం వైపు వచ్చే ఆటోలు తక్కువ. దీంతో మినరల్ వాటర్‌ను కావాల్సిన వాళ్ల కు సరఫరా చేయడం తలకు మించిన భారమైంది. స్థానికంగా ఉన్న ఆటో వాళ్లను సర్వీస్ అడిగితే రానన్నారు. ఏజెన్సీ పల్లెల్లో తాగునీటికి డిమాండ్ ఉంది, తన దగ్గర వాటర్ ఉం ది, సమస్యల్లా సరఫరా చేయడం. రోజుల తరబడి ఎదు రు చూసినా నీటిని సరఫరా చేసేందుకు ఎవరూ ముందుకు రా లేదు. సమస్య ఉన్న చోటనే అవకాశం ఉంటుందనే నానుడిని అనుసరిస్తూ తానే ఆటో డ్రైవింగ్ చేసేందుకు స్వాతి ముందుకొచ్చింది. పది రోజుల వ్యవధిలో డ్రైవింగ్ నేర్చుకుంది. -
‘గురుకులం’ ఖాళీ!
ఆర్భాటంగా గురుకులాన్ని ప్రారంభించిన అధికారులు.. వసతుల కల్పనపై దృష్టి సారించలేదు. విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా గదులు సమకూర్చలేదు. దీంతో చదువుకోవడానికి, పడుకోవడానికి సైతం ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి.. సమస్యను అధికారుల దృష్టికి తీసుకెళ్లినా పరిస్థితిలో మార్పు రాకపోవడంతో విసిగిపోయిన తల్లిదండ్రులు.. తమ పిల్లలను తీసుకుని ఇళ్లకు వెళ్లిపోయారు. దీంతో ఆ గురుకులం ఖాళీ అయ్యింది. సాక్షి, కామారెడ్డి(నిజామాబాద్) : పేద విద్యార్థులకు కార్పొరేట్ స్థాయి విద్యను ఉచితంగా అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం గురుకుల విద్యను అందుబాటులోకి తీసుకువచ్చింది. అయితే గురుకులాలను అద్దె భవనాల్లో ఏర్పాటు చేయడంతో సరైన వసతులు లేక విద్యార్థులు ఇబ్బందులు పడాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. జిల్లాలోని తాడ్వాయి మండలం ఎర్రాపహడ్ గ్రామంలో నిర్వహిస్తున్న మహాత్మా జ్యోతిబా పూలే బీసీ గురుకుల పాఠశాలలో విద్యార్థులకు సరిపడా వసతులు లేకపోవడంతో.. ఈ బడిలో ఉండలేమంటూ ఇంటికి వెళ్లిపోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఇది గురుకులాల్లో నెలకొన్న అసౌకర్యాలకు తార్కాణంగా నిలుస్తోంది. తాడ్వాయి మండలంలో 2017లో మహాత్మా జ్యోతిబా పూలే బీసీ గురుకుల పాఠశాల ఏర్పాటు చేశారు. అయితే హాస్టల్‌కు సరిపడా భవనం దొరక్క కామారెడ్డి పట్టణంలో మూడు నెలల పాటు గురుకులాన్ని నిర్వహించారు. అప్పటి ఎమ్మెల్యే ఏనుగు రవీందర్‌రెడ్డి చొరవ తీసుకుని, ఎర్రాపహడ్లోని అద్దె భవనంలోకి 2017 సెప్టెంబరులో గురుకులాన్ని తరలించారు. 5, 6,7 తరగతులతో ప్రారంభమైన గురుకులంలో 243 మంది విద్యార్థులు ఉండేవారు. విద్యార్థుల సంఖ్యకు ఈ భవనం సరిపోకపోవడంతో విద్యార్థులు ఇబ్బందులు పడాల్సి వచ్చింది. దీంతో గదుల కొరతను తీర్చేందుకు మరో ఇంటి నిర్మాణం మొదలుపెట్టారు. అది అసంపూర్తిగా మిగిలిపోయింది. 2018లో ఎనిమిదో తరగతి ప్రారంభించారు. మరో యాభై మంది విద్యార్థులు పెరిగారు. ఈ ఏడాది తొమ్మిదో తరగతికి అప్‌గ్రేడ్ అయ్యింది. మొత్తం విద్యార్థుల సంఖ్య 330కి చేరింది. దీంతో పాటే గదుల సమస్య మరింత పెరిగింది. అందుబాటులో 13 గదులే.. గురుకుల పాఠశాలలో ప్రస్తుతం 330 మంది విద్యార్థులున్నారు. ఐదు తరగతులకు బోధనతో పాటు వసతి, భోజనశాల, ల్యాబ్, స్టాఫ్ రూం, ఆఫీసుకు కలిపి 28 గదులు అవసరం కాగా 13 గదులు మాత్రమే ఉన్నాయి. గదులు ఏమాత్రం సరిపోకపోవడంతో తరగతులను వరండాల్లో నిర్వహిస్తున్నారు. సరిపడా గదులు లేకపోవడంతో విద్యార్థులు అదే గదిలో చదువుకోవడంతో పాటు అదే గదిలో పడుకోవాల్సి వస్తోంది. ఈ గురుకులంలో విద్యార్థులకు సరిపడా మరుగుదొడ్లు లేవు. క్రీడామైదానం లేదు. ఈ విషయాన్ని ప్రజాప్రతినిధులు, జిల్లా అధికారుల దృష్టికి తీసుకెళ్లినా ఫలితం లేకుండా పోయింది. ఇరుకు గదులకు తోడు సరైన వసతులు లేకపోవడంతో విద్యార్థులు అనేక ఇబ్బందులు పడుతున్నారు. తల్లిదండ్రుల ఆందోళన విద్యార్థుల అవస్థలను తల్లిదండ్రులు పలుమార్లు అధికారులు, ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకెళ్లారు. కానీ సమస్య మాత్రం అపరిష్కృతంగానే ఉండిపోయింది. ఈ ఏడాది పాఠశాలలు పునఃప్రారంభమైన తరువాత విద్యార్థులు గురుకులానికి చేరుకున్నారు. కానీ సమస్యలు అలాగే ఉండడంతో తల్లిదండ్రులు విసిగిపోయారు. ఈ నెల 13న విద్యార్థుల తల్లిదండ్రులు గురుకులానికి చేరుకుని అసౌకర్యాలపై అక్కడి సిబ్బందిని నిలదీశారు. విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చేస్తున్న విషయం తెలుసుకున్న పోలీసులు.. గురుకులానికి వచ్చి వారిని సముదాయించారు. గురుకుల పాఠశాల అధికారులు మాత్రం రాకపోవడంతో విసిగిపోయిన కొందరు తల్లిదండ్రులు అదే రోజు తమ పిల్లల్ని ఇళ్లకు తీసుకెళ్లిపోయారు. ఆదివారం మరికొందరు తల్లిదండ్రులు వచ్చి విద్యార్థులను ఇంటికి తీసుకెళ్లడంతో గురుకులం ఖాలీ అయిపోయింది. జిల్లా అంతటా ఇదే పరిస్థితి జిల్లాలో ఏర్పాటు చేసిన గురుకుల పాఠశాలల్లో సరైన సౌకర్యాలు లేకపోవడంతో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. గురుకులాల్లో విద్యాబోధన కోసం ప్రభుత్వం ఏడాదికి ఒక్కో విద్యార్థిపై రూ.లక్షకు పైగా ఖర్చు చేస్తోంది. అయినా వసతులు కల్పించడంలో మాత్రం అధికారుల వైఫల్యం స్పష్టంగా కనిపిస్తోంది. విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా సౌకర్యాలు కల్పించాల్సి ఉన్నా.. అధికారులు పట్టించుకోవడం లేదన్న ఆరోపణలున్నాయి. ఇప్పటికైనా ప్రభుత్వం గురుకులాలలో సౌకర్యాల కల్పనపై దృష్టి సారించాలని పలువురు కోరుతున్నారు. -
మేడారానికి పగిడిద్దరాజు
మేడారం సమ్మక్క–సారలమ్మ జాతరకు గుండాల మండలం యాపలగడ్డ నుంచి పగిడిద్దరాజును తోడ్కొని అరెం వంశీయులు సోమవారం బయలుదేరారు. కాలినడకన పడగ (జెండా)లతో జాతర ప్రారంభానికి(ఈ నెల 31కి) ముందే వారు మేడారం చేరుకుంటారు. గుండాల: గుండాల మండలం యాపలగడ్డ గ్రామం నుంచి సోమవారం మేడారం సమ్మక్క–సారలమ్మ జాతరకు పగిదిద్దరాజు బయల్దేరాడు. కాలినడక ఆయన(అరెం) వంశీయులు పడగలలో పయనమయ్యారు. రెండేళ్లకోసారి భూపాలపల్లి జిల్లా తాడ్వాయి మండలంలో జరిగే మేడారం జాతరకు సమ్మక్క భర్త పగిడిద్దరాజును యాపలగడ్డ గ్రామస్తులే తీసుకెళ్తారు. ఈ క్రమంలో సోమవారం అరెం వంశీయులు పగిడిద్దరాజు గర్భగుడి వద్ద పడగలకు( జెండాలకు), శివసత్తులకు పురాతన కాలంనాటి ఆభరణాలకు పూజారులు, వడ్డెలు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం స్థానిక పగిడిద్దరాజు గద్దెల వద్దకు తీసుకెళ్లి అక్కడ పూజలు నిర్వహించారు. పడగలను, నగలు, గజ్జెలు ధరంచిన వడ్డెలు భుజాన పెట్టుకుని ఊరేగింపుతో పయననమయ్యారు. గ్రామ గ్రామం మీదుగా గిరిజన నృత్యాలతో, డప్పు వాయిద్యాల నడుమ ఊరేగింపు నిర్వహించుకుంటూ తీసుకెళ్లారు. యాపలగడ్డ గ్రామ ప్రజలంతా చిన్నా,పెద్దా తేడా లేకుండా డ్యాన్సులు వేశారు. పగిడిద్ద రాజు పూజలను, ఊరేగింపును అంగరంగ వైభవంగా నిర్వహించారు. వరంగల్ జిల్లా పూనుగొండ్ల పెనకం వంశీయులు లక్ష్మిపురం గ్రామం వద్ద వీరిని కలుసుకుంటారు. రెండు రోజుల పాటు పాదయాత్ర చేసి జాతర ముందురోజు జంపన్న వాగులో బస చేస్తారు. బుధవారం రోజు పగిడిద్దరాజుతో పాటు, కొండాయిగూడెం నుంచి గోవిందరాజును, కన్నెపల్లి నుంచి సారలమ్మను ఆయా గ్రామాల పూజారులు తీసుకువస్తారు. ఆ ముగ్గురు వన దేవతలకు మేడారంలోని గర్భగుడిలో ప్రత్యేక పూజలు చేస్తారు. గురువారం నాటికి సమ్మక్క (దేవత)ను చిలకలగుట్ట నుంచి గద్దెల వద్దకు తీసుకువస్తారు. అదేరోజు రాత్రి పగిడిద్దరాజు–సమ్మక్కల దేవతలకు నాగవెళ్లి(పెళ్లి) చేస్తారు. దీంతో నిండు జాతర ప్రారంభమవుతుంది. సమ్మక్కను శనివారం వనానికి తీసుకెళ్లగా జాతర ముగుస్తుంది. తిరిగి అరెం వంశీయలు పగిడిద్ద రాజును పాదయాత్రతో గుండాలకు చేర్చుతారు. అనంతరం ప్రతీ ఏటా యాపలగడ్డలో పగిడిద్ద రాజు–సమ్మక్కల నాగవెళ్లి జాతరను మార్చి మొదటి వారంలో నిర్వహిస్తామని అరెం వంశీయులు తెలిపారు. ఈ కార్యక్రమంలో సీఐ తుమ్మ గోపి, ఎస్సై శ్రావన్ కుమార్, వడ్డెలు, పూజారులు అర్రెం అప్పయ్య, బుచ్చయ్య, లక్ష్మినర్సు, చిన్న కాంతారావు, సత్యం, జోగయ్య, ఇద్దయ్య, పెద్ద కాంతారావు, నాగేశ్వరావు, సమ్మయ్య, ముత్తయ్య, భిక్షం రమేష్,నాగేష్, చంద్రయ్య తదితరులు పాల్గొన్నారు. -
సారీ... సమ్మక్క
వనదేవతను మరిచిన ఉన్నతాధికారులు పునర్విభజన నోటిఫికేషన్లో పొరపాటు తాడ్వాయి మండలంగా ప్రకటన ఆదివాసీ సంఘాల అసంతృప్తి సాక్షి ప్రతినిధి, వరంగల్ : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన జిల్లాల పునర్విభజన నోటిఫికేషన్లో తప్పులు పెరుగుతూనే ఉన్నాయి. రెవెన్యూ డివిజన్ కేంద్రాలు, మండలాల విషయంలో అయోమయానికి గురి చేసి సవరణ ఉత్తర్వులు జారీ చేసిన అధికారులు... ప్రతిష్టాత్మక విషయాలను మరిచిపోయారు. వరంగల్ జిల్లాకు ప్రత్యేక గుర్తింపు తెచ్చిన సమ్మక్క–సారలమ్మ జాతర ప్రాముఖ్యతను జిల్లా ఉన్నతాధికారులు పట్టించుకోలేదు. ప్రపంచస్థాయి గుర్తింపు ఉన్న మేడారం జాతర జరిగే తాడ్వాయి మండలాన్ని సమ్మక్క, సారలమ్మ తాడ్వాయి మండలంగా మార్చారు. 2014 జాతర సమయంలో ఈ మేరకు రాష్ట్ర పభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రెవెన్యూ శాఖ ఈ ప్రక్రియను పూర్తి చేసింది. జిల్లాల పునర్విభజన ప్రక్రియ రెవెన్యూ శాఖ ఆధ్వర్యంలోనే జరుగుతోంది. సమ్మక్క–సారలమ్మ తాడ్వాయి మండలాన్ని భూపాలపల్లి జిల్లాలో కలిపారు. అయితే రెవెన్యూ శాఖ మాత్రం తాడ్వాయి మండలంగానే ముసాయిదాలో పేర్కొంది. ప్రతిష్టాత్మక సమ్మక్క–సారలమ్మ ప్రాశస్త్యాన్ని తెలిపేలా ప్రభుత్వం మార్చిన పేరును కాకుండా కేవలం తాడ్వాయిగా పేర్కొనడంపై ఆదివాసీ సంఘాలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి. జిల్లాల పునర్విభజన విషయంలో అంతా రహస్యం అన్నట్లుగా వ్యవహరించిన రెవెన్యూ ఉన్నతాధికారులు ముసాయిదాను తప్పుల తడకగా రూపొందించారు. వరంగల్ జిల్లాలో 51 మండలాలు ఉన్నాయనే విషయాన్ని మరిచిపోయినట్లుగా వ్యవహరించారు. జిల్లా కేంద్రంగా మార్చాలని నెలలుగా ఉద్యమం చేస్తున్న జనగామ మండలాన్ని కనీసం ముసాయిదాలో చేర్చకపోవడం విమర్శలకు తావిస్తోంది. జిల్లాల పునర్విభజనలో మొత్తం ముసాయిదాపైనే న్యాయపరమైన సమస్యలు వచ్చేలా దేవరుప్పుల మండలాన్ని హన్మకొండ జిల్లాలో, యాదాద్రి జిల్లాలో కలిపేలా ముసాయిదాలో పేర్కొనడం గమనార్హం. రాష్ట్ర స్థాయి ఉన్నతాధికారులు ఈ పొరపాటును గుర్తించి సవరణ ఉత్తర్వులు జారీ చేయాల్సి వచ్చింది. కొత్త మండలాల ఏర్పాటు విషయంలోనూ జిల్లా అధికారుల తీరు ఇలాగే ఉంటోంది. కొత్తగా ఏర్పాటు చేస్తున్న మండలాల మ్యాపులను తయారు చేయడంలో రెవెన్యూ అధికారులు తీవ్ర నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తున్నారు. ఏ గ్రామాలు ఎక్కడ ఉంటాయి, చెరువుల పరిస్థితి, వాటి ఆయకట్టు ఏమిటనేది తెలియక ఆయా మండలాల ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ముసాయిదా వెల్లడించి వారం రోజులు దాటినా రెవెన్యూ అధికారులు మాత్రం పట్టనట్లుగానే ఉంటున్నారు.