విద్యార్థులు వెళ్లిపోవడంతో బోసిపోయిన గది
ఆర్భాటంగా గురుకులాన్ని ప్రారంభించిన అధికారులు.. వసతుల కల్పనపై దృష్టి సారించలేదు. విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా గదులు సమకూర్చలేదు. దీంతో చదువుకోవడానికి, పడుకోవడానికి సైతం ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి.. సమస్యను అధికారుల దృష్టికి తీసుకెళ్లినా పరిస్థితిలో మార్పు రాకపోవడంతో విసిగిపోయిన తల్లిదండ్రులు.. తమ పిల్లలను తీసుకుని ఇళ్లకు వెళ్లిపోయారు. దీంతో ఆ గురుకులం ఖాళీ అయ్యింది.
సాక్షి, కామారెడ్డి(నిజామాబాద్) : పేద విద్యార్థులకు కార్పొరేట్ స్థాయి విద్యను ఉచితంగా అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం గురుకుల విద్యను అందుబాటులోకి తీసుకువచ్చింది. అయితే గురుకులాలను అద్దె భవనాల్లో ఏర్పాటు చేయడంతో సరైన వసతులు లేక విద్యార్థులు ఇబ్బందులు పడాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. జిల్లాలోని తాడ్వాయి మండలం ఎర్రాపహడ్ గ్రామంలో నిర్వహిస్తున్న మహాత్మా జ్యోతిబా పూలే బీసీ గురుకుల పాఠశాలలో విద్యార్థులకు సరిపడా వసతులు లేకపోవడంతో.. ఈ బడిలో ఉండలేమంటూ ఇంటికి వెళ్లిపోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఇది గురుకులాల్లో నెలకొన్న అసౌకర్యాలకు తార్కాణంగా నిలుస్తోంది.
తాడ్వాయి మండలంలో 2017లో మహాత్మా జ్యోతిబా పూలే బీసీ గురుకుల పాఠశాల ఏర్పాటు చేశారు. అయితే హాస్టల్‌కు సరిపడా భవనం దొరక్క కామారెడ్డి పట్టణంలో మూడు నెలల పాటు గురుకులాన్ని నిర్వహించారు. అప్పటి ఎమ్మెల్యే ఏనుగు రవీందర్‌రెడ్డి చొరవ తీసుకుని, ఎర్రాపహడ్‌లోని అద్దె భవనంలోకి 2017 సెప్టెంబరులో గురుకులాన్ని తరలించారు. 5, 6,7 తరగతులతో ప్రారంభమైన గురుకులంలో 243 మంది విద్యార్థులు ఉండేవారు. విద్యార్థుల సంఖ్యకు ఈ భవనం సరిపోకపోవడంతో విద్యార్థులు ఇబ్బందులు పడాల్సి వచ్చింది. దీంతో గదుల కొరతను తీర్చేందుకు మరో ఇంటి నిర్మాణం మొదలుపెట్టారు. అది అసంపూర్తిగా మిగిలిపోయింది. 2018లో ఎనిమిదో తరగతి ప్రారంభించారు. మరో యాభై మంది విద్యార్థులు పెరిగారు. ఈ ఏడాది తొమ్మిదో తరగతికి అప్‌గ్రేడ్ అయ్యింది. మొత్తం విద్యార్థుల సంఖ్య 330కి చేరింది. దీంతో పాటే గదుల సమస్య మరింత పెరిగింది.
అందుబాటులో 13 గదులే..
గురుకుల పాఠశాలలో ప్రస్తుతం 330 మంది విద్యార్థులున్నారు. ఐదు తరగతులకు బోధనతో పాటు వసతి, భోజనశాల, ల్యాబ్, స్టాఫ్ రూం, ఆఫీసుకు కలిపి 28 గదులు అవసరం కాగా 13 గదులు మాత్రమే ఉన్నాయి. గదులు ఏమాత్రం సరిపోకపోవడంతో తరగతులను వరండాల్లో నిర్వహిస్తున్నారు. సరిపడా గదులు లేకపోవడంతో విద్యార్థులు అదే గదిలో చదువుకోవడంతో పాటు అదే గదిలో పడుకోవాల్సి వస్తోంది. ఈ గురుకులంలో విద్యార్థులకు సరిపడా మరుగుదొడ్లు లేవు. క్రీడామైదానం లేదు. ఈ విషయాన్ని ప్రజాప్రతినిధులు, జిల్లా అధికారుల దృష్టికి తీసుకెళ్లినా ఫలితం లేకుండా పోయింది. ఇరుకు గదులకు తోడు సరైన వసతులు లేకపోవడంతో విద్యార్థులు అనేక ఇబ్బందులు పడుతున్నారు.
తల్లిదండ్రుల ఆందోళన
విద్యార్థుల అవస్థలను తల్లిదండ్రులు పలుమార్లు అధికారులు, ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకెళ్లారు. కానీ సమస్య మాత్రం అపరిష్కృతంగానే ఉండిపోయింది. ఈ ఏడాది పాఠశాలలు పునఃప్రారంభమైన తరువాత విద్యార్థులు గురుకులానికి చేరుకున్నారు. కానీ సమస్యలు అలాగే ఉండడంతో తల్లిదండ్రులు విసిగిపోయారు. ఈ నెల 13న విద్యార్థుల తల్లిదండ్రులు గురుకులానికి చేరుకుని అసౌకర్యాలపై అక్కడి సిబ్బందిని నిలదీశారు. విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చేస్తున్న విషయం తెలుసుకున్న పోలీసులు.. గురుకులానికి వచ్చి వారిని సముదాయించారు. గురుకుల పాఠశాల అధికారులు మాత్రం రాకపోవడంతో విసిగిపోయిన కొందరు తల్లిదండ్రులు అదే రోజు తమ పిల్లల్ని ఇళ్లకు తీసుకెళ్లిపోయారు. ఆదివారం మరికొందరు తల్లిదండ్రులు వచ్చి విద్యార్థులను ఇంటికి తీసుకెళ్లడంతో గురుకులం ఖాలీ అయిపోయింది.
జిల్లా అంతటా ఇదే పరిస్థితి
జిల్లాలో ఏర్పాటు చేసిన గురుకుల పాఠశాలల్లో సరైన సౌకర్యాలు లేకపోవడంతో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. గురుకులాల్లో విద్యాబోధన కోసం ప్రభుత్వం ఏడాదికి ఒక్కో విద్యార్థిపై రూ.లక్షకు పైగా ఖర్చు చేస్తోంది. అయినా వసతులు కల్పించడంలో మాత్రం అధికారుల వైఫల్యం స్పష్టంగా కనిపిస్తోంది. విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా సౌకర్యాలు కల్పించాల్సి ఉన్నా.. అధికారులు పట్టించుకోవడం లేదన్న ఆరోపణలున్నాయి. ఇప్పటికైనా ప్రభుత్వం గురుకులాలలో సౌకర్యాల కల్పనపై దృష్టి సారించాలని పలువురు కోరుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment