Gurukula School hostel
-
‘గురుకులం’ ఖాళీ!
ఆర్భాటంగా గురుకులాన్ని ప్రారంభించిన అధికారులు.. వసతుల కల్పనపై దృష్టి సారించలేదు. విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా గదులు సమకూర్చలేదు. దీంతో చదువుకోవడానికి, పడుకోవడానికి సైతం ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి.. సమస్యను అధికారుల దృష్టికి తీసుకెళ్లినా పరిస్థితిలో మార్పు రాకపోవడంతో విసిగిపోయిన తల్లిదండ్రులు.. తమ పిల్లలను తీసుకుని ఇళ్లకు వెళ్లిపోయారు. దీంతో ఆ గురుకులం ఖాళీ అయ్యింది. సాక్షి, కామారెడ్డి(నిజామాబాద్) : పేద విద్యార్థులకు కార్పొరేట్ స్థాయి విద్యను ఉచితంగా అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం గురుకుల విద్యను అందుబాటులోకి తీసుకువచ్చింది. అయితే గురుకులాలను అద్దె భవనాల్లో ఏర్పాటు చేయడంతో సరైన వసతులు లేక విద్యార్థులు ఇబ్బందులు పడాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. జిల్లాలోని తాడ్వాయి మండలం ఎర్రాపహడ్ గ్రామంలో నిర్వహిస్తున్న మహాత్మా జ్యోతిబా పూలే బీసీ గురుకుల పాఠశాలలో విద్యార్థులకు సరిపడా వసతులు లేకపోవడంతో.. ఈ బడిలో ఉండలేమంటూ ఇంటికి వెళ్లిపోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఇది గురుకులాల్లో నెలకొన్న అసౌకర్యాలకు తార్కాణంగా నిలుస్తోంది. తాడ్వాయి మండలంలో 2017లో మహాత్మా జ్యోతిబా పూలే బీసీ గురుకుల పాఠశాల ఏర్పాటు చేశారు. అయితే హాస్టల్‌కు సరిపడా భవనం దొరక్క కామారెడ్డి పట్టణంలో మూడు నెలల పాటు గురుకులాన్ని నిర్వహించారు. అప్పటి ఎమ్మెల్యే ఏనుగు రవీందర్‌రెడ్డి చొరవ తీసుకుని, ఎర్రాపహడ్లోని అద్దె భవనంలోకి 2017 సెప్టెంబరులో గురుకులాన్ని తరలించారు. 5, 6,7 తరగతులతో ప్రారంభమైన గురుకులంలో 243 మంది విద్యార్థులు ఉండేవారు. విద్యార్థుల సంఖ్యకు ఈ భవనం సరిపోకపోవడంతో విద్యార్థులు ఇబ్బందులు పడాల్సి వచ్చింది. దీంతో గదుల కొరతను తీర్చేందుకు మరో ఇంటి నిర్మాణం మొదలుపెట్టారు. అది అసంపూర్తిగా మిగిలిపోయింది. 2018లో ఎనిమిదో తరగతి ప్రారంభించారు. మరో యాభై మంది విద్యార్థులు పెరిగారు. ఈ ఏడాది తొమ్మిదో తరగతికి అప్‌గ్రేడ్ అయ్యింది. మొత్తం విద్యార్థుల సంఖ్య 330కి చేరింది. దీంతో పాటే గదుల సమస్య మరింత పెరిగింది. అందుబాటులో 13 గదులే.. గురుకుల పాఠశాలలో ప్రస్తుతం 330 మంది విద్యార్థులున్నారు. ఐదు తరగతులకు బోధనతో పాటు వసతి, భోజనశాల, ల్యాబ్, స్టాఫ్ రూం, ఆఫీసుకు కలిపి 28 గదులు అవసరం కాగా 13 గదులు మాత్రమే ఉన్నాయి. గదులు ఏమాత్రం సరిపోకపోవడంతో తరగతులను వరండాల్లో నిర్వహిస్తున్నారు. సరిపడా గదులు లేకపోవడంతో విద్యార్థులు అదే గదిలో చదువుకోవడంతో పాటు అదే గదిలో పడుకోవాల్సి వస్తోంది. ఈ గురుకులంలో విద్యార్థులకు సరిపడా మరుగుదొడ్లు లేవు. క్రీడామైదానం లేదు. ఈ విషయాన్ని ప్రజాప్రతినిధులు, జిల్లా అధికారుల దృష్టికి తీసుకెళ్లినా ఫలితం లేకుండా పోయింది. ఇరుకు గదులకు తోడు సరైన వసతులు లేకపోవడంతో విద్యార్థులు అనేక ఇబ్బందులు పడుతున్నారు. తల్లిదండ్రుల ఆందోళన విద్యార్థుల అవస్థలను తల్లిదండ్రులు పలుమార్లు అధికారులు, ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకెళ్లారు. కానీ సమస్య మాత్రం అపరిష్కృతంగానే ఉండిపోయింది. ఈ ఏడాది పాఠశాలలు పునఃప్రారంభమైన తరువాత విద్యార్థులు గురుకులానికి చేరుకున్నారు. కానీ సమస్యలు అలాగే ఉండడంతో తల్లిదండ్రులు విసిగిపోయారు. ఈ నెల 13న విద్యార్థుల తల్లిదండ్రులు గురుకులానికి చేరుకుని అసౌకర్యాలపై అక్కడి సిబ్బందిని నిలదీశారు. విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చేస్తున్న విషయం తెలుసుకున్న పోలీసులు.. గురుకులానికి వచ్చి వారిని సముదాయించారు. గురుకుల పాఠశాల అధికారులు మాత్రం రాకపోవడంతో విసిగిపోయిన కొందరు తల్లిదండ్రులు అదే రోజు తమ పిల్లల్ని ఇళ్లకు తీసుకెళ్లిపోయారు. ఆదివారం మరికొందరు తల్లిదండ్రులు వచ్చి విద్యార్థులను ఇంటికి తీసుకెళ్లడంతో గురుకులం ఖాలీ అయిపోయింది. జిల్లా అంతటా ఇదే పరిస్థితి జిల్లాలో ఏర్పాటు చేసిన గురుకుల పాఠశాలల్లో సరైన సౌకర్యాలు లేకపోవడంతో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. గురుకులాల్లో విద్యాబోధన కోసం ప్రభుత్వం ఏడాదికి ఒక్కో విద్యార్థిపై రూ.లక్షకు పైగా ఖర్చు చేస్తోంది. అయినా వసతులు కల్పించడంలో మాత్రం అధికారుల వైఫల్యం స్పష్టంగా కనిపిస్తోంది. విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా సౌకర్యాలు కల్పించాల్సి ఉన్నా.. అధికారులు పట్టించుకోవడం లేదన్న ఆరోపణలున్నాయి. ఇప్పటికైనా ప్రభుత్వం గురుకులాలలో సౌకర్యాల కల్పనపై దృష్టి సారించాలని పలువురు కోరుతున్నారు. -
22మంది విద్యార్థినుల అస్వస్థత
చిట్యాల: కలుషిత ఆహారం తిని 22మంది విద్యార్థినులు అస్వస్థతకు గురైన సంఘటన మండల పరిధిలోని సాంఘిక సంక్షేమ బాలికల గురుకుల, కళాశాలలో ఆదివారం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే...గురుకుల పాఠశాల, కళాశాలలో కేర్ టేకర్ లేకపోవడం, భోజన నిర్వహణపై పర్య వేక్షణ కొరవడింది. దీంతో కాంట్రాక్టర్ కుళ్లిన కూరగాయాలతో కూర, సాంబారు, ఉడికి ఉడకని అన్నం పెట్టాడు. దీంతో విద్యార్థినులు తీవ్ర అస్వస్థతకు గురుయ్యారు. ఉదయం ఆలుగడ్డతో కిచిడీ చేసి అందులో పెరుగు కలిపి ఇవ్వడం వల్ల ఐదుగురు విద్యార్థినులు వాంతులు చేసుకున్నారు. అలాగే సాయంత్రం ఉడికి ఉడకని అన్నం, క్యాబేజీ కూర, కుళ్లిన కూరగాయలతో చేసిన సాంబారుతో అన్నం తిన్న విద్యార్థులు రాత్రంతా వాంతులు, విరేచనాలు చేసుకోవడంతో ఆదివారం తెల్లవారుజామున టీచర్లు సాహిత్య, శిరీష, సునీతలు విద్యార్థినులను చికిత్స నిమిత్తం స్థానిక సివిల్ ఆస్పత్రిలో చేర్పించారు. చికిత్స పొందుతున్న విద్యార్థినులు.. చిట్యాల సివిల్ ఆస్పత్రిలో ప్రస్తుతం 8 మంది విద్యార్థినులు చికిత్సపొందుతున్నారు. అందులో రమ్య, ఝాన్సీ, సౌజన్య, ప్రవళిక, స్నేహ, నందిని, కావ్య, ప్రవళిక ఉన్నారు. ప్రాణాపాయం లేదని వైద్యులు తెలిపారు. మిగతా 14 మందిని వైద్యులు డిశ్చార్జీ చేశారు. ఈ విషయం తెలుసుకున్న జిల్లా వైద్యాధికారి అప్పయ్య, ఉప వైద్యాధికారి నాగూర్ల గోపాల్‌రావు, సీఐ శ్రీనివాస్, ఎస్సై అనిల్‌కుమార్ ,రెవెన్యూ అధికారులు ఆస్పత్రిని సందర్శించారు. అలాగే గురుకుల పాఠశా లను సందర్శించి విద్యార్థినుల బాగోగులు అడిగి తెలుసుకున్నారు. ప్రిన్సిపాల్ జయశ్రీతో పరిస్థితిపై చర్చించారు. బాధ్యులపై చర్య తీసుకోవాలి: ఎస్ఎఫ్ఐ బాలికల గురుకుల పాఠశాలలో ఉడికి ఉడకని అన్నం, కుళ్లిన కూరగాయలతో చేసిన కూర, సాంబారు పెట్టిన బాధ్యులపై కలెక్టర్ చర్యలు తీసుకోవాలని ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి పసుల వినయ్‌కుమార్, అంబేద్కర్ యువజన సంఘం మండల అధ్యక్ష, ప్రధానకార్యదర్శులు బొడ్డు ప్రభాకర్, గుర్రపు రాజేందర్, ఏబీవీపీ మండల నాయకులు గుండా మణికుమార్, తిరుపతి, రాహుల్ డిమాండ్ చేశారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న విద్యార్థినులను వారు పరామర్శించారు. అనంతరం వారు మాట్లాడుతూ గురుకుల విద్యాలయంలోని ప్రిన్సిపాల్ జయశ్రీని జిల్లా కోఆర్డినేటర్‌గా నియమించడం వల్ల ఆమె స్థానికంగా ఉండడం లేదన్నారు. గురుకులంలో పరిశుభ్రత లేదని విమర్శించారు. మెను ప్రకారం భోజనం పెట్టడం లేదని మండి పడ్డారు. పేరుకే సంక్షేమ వసతి గృహమని సకల సమస్యలకు నిలయంగా ఉందని వారు విమర్శించారు. బాధ్యుల పై చర్య తీసుకోకపోతే ఆందోళనలు తప్పవని వారు హెచ్చరించారు. భోజనం చేసిన అరగంటకే కడుపులో నొప్పి.. క్యాబేజీ, సాంబారుతో అన్నం తిన్న అరగంటకే కడుపులో నొప్పి వచ్చిందని బాధిత విద్యార్థినులు సౌమ్య, దివ్య, అఖిల, నవ్య, నిఖిత తెలిపారు. అనంతరం వాంతులు, విరేచనాలు అయ్యాయి. గమనించిన టీచర్లు తొందరగా స్పందించి ఆస్పత్రికి తీసుక వచ్చారు. -
ఉడికీ ఉడకని అన్నం తినేదెట్టా?
బల్మూర్ నాగర్‌కర్నూల్ : దాదాపు పదిహేను రోజులుగా మధ్యాహ్న భోజనంలో ఉడికి ఉడకని అన్నం.. నీళ్ల చారు వడ్డిస్తుండటంతో ఆకలి మంటలు తాళలేని విద్యార్థులు ఆందోళనకు దిగారు. మండల కేంద్రంలోని జిల్లా పరిషత ఉన్నత పాఠశాలలో పదిహేను రోజుల నుంచి మధ్యాహ్న భోజనం నాసిరకంగా ఉడికి ఉడకని అన్నం.. నాణ్యత లేని కూరగాయలతో వడ్డిస్తున్నారని శుక్రవారం విద్యార్థులు తహసీల్దార్ కార్యాలయం ఎదుట ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా పలువురు విద్యార్థులు మాట్లాడుతూ సరిగా ఉడకని అన్నం తినడంతో కడుపునొప్పితో ఇబ్బంది పడుతున్నామని తహసీల్దార్ అంజిరెడ్డి ఎదుట వాపోయారు. స్పందించిన తహసీల్దార్ వెంటనే పాఠశాలకు చేరుకొని విద్యార్థుల మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించారు. నిత్యం పర్యవేక్షణ చేయాల్సిన హెచ్ఎం కూడా సరైన సమాధానం చెప్పకుండా దాటవేయడంతో తహసీల్దార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మధ్యాహ్న భోజనాన్ని నాణ్యతగా అందించకుంటే తర్యలు తీసుకుంటామని ఏజెన్సీ మహిళలను హెచ్చరించారు. ఇక ముందు ఎలాంటి సమస్య వచ్చినా కఠిన చర్యలు తీసుకుంటామని, ఈ విషయమై ఉన్నతాధికారులకు నివేదిస్తామని ఆయన తెలిపి విద్యార్థులను శాంతింపజేశారు. -
‘గురుకులం’లో మృత్యుఘంటికలు
అవి సరస్వతీ నిలయూలు.. బాలబాలికలకు విద్యాబుద్ధులు నేర్పి ఉన్నత స్థానంలో నిలబెట్టాల్సిన గురుకులాలు.. బడుగు, బలహీన వర్గాల చిన్నారులకు ఆశ్రయం కల్పిస్తూ పాఠాలు బోధిస్తున్న వసతి గృహాలు.. ఇంతటి ప్రాముఖ్యమున్న సాంఘిక సంక్షేమ హాస్టళ్లు, గురుకుల పాఠశాలల్లో మృత్యు ఘంటికలు మోగుతున్నాయి. వరుస ఆత్మహత్యలు, బాలికలపై అత్యాచారాలు ఉలికిపాటుకు గురిచేస్తున్నాయి. పెదపాడు మండలం వట్లూరులోని గురుకుల పాఠశాల హాస్టల్లో నెల వ్యవధిలో ఇద్దరు అమ్మాయిలు ఆత్మహత్యలకు పాల్పడటం కలవరపాటుకు గురిచేస్తోంది. వసతి గృహాల్లో కొరవడిన పర్యవేక్షణ విద్యార్థుల తల్లిదండ్రులకు కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. అధికారుల అలస్వతమే ఇందుకు కారణమని వామపక్ష నేతలు మండిపడుతున్నారు. - ఏలూరు (వన్‌టౌన్) ఏలూరు శివారు జాతీయ రహదారి పక్కన ఉన్న వట్లూరు గురుకుల పాఠశాలలో వరుస ఆత్మహత్యలపై పలు అనుమానాలు రేకెత్తుతున్నారుు. ఇక్కడ ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి. గతనెలలో చింతలపూడికి చెందిన రుక్మిణీబాయి బలవన్మరణానికి పాల్పడగా బుధవారం మరో పసిమొగ్గ రచన ఆత్మహత్య చేసుకుంది. నాలుగు నెలల క్రితం ఇదే హాస్టల్లో ఓ చిన్నారి మరిగే సాంబారులో పడిపోగా గుట్టుచప్పుడు కాకుండా సిబ్బంది ఆసుపత్రిలో చికిత్స అందించారు. ఏదైనా సంఘటన జరిగిన తర్వాత హడావుడిగా అధికారులు రావడం రెండు రోజులు తూతూమంత్రంగా తనిఖీలు నిర్వహించడం సాధారణమై పోయింది. ప్రస్తుత జేడీ శోభారాణి ఒక్కసారి కూడా ఇక్కడ హాస్టల్‌ను తనిఖీ చేయలేదని పలువురు అంటున్నారు. పెరుగుతున్న అకృత్యాలు కొన్నేళ్ల క్రితం ఏలూరు అమీనాపేటలోని బాలికల వసతి గృహంలో ఒక బాలిక బిడ్డకు జన్మనివ్వగా పుట్టిన శిశువును పక్కనే ఉన్న మురుగు కాల్వలో పడేసింది. అదే వసతి గృహంలో రాత్రి కాపలాదారుడిగా ఉండే ఓ వ్యక్తి ఓ ఇంటర్మీడియెట్ విద్యార్థినిని లోబర్చుకుని గర్భిణిని చేశాడు. ఈ సంఘటనలు అప్పట్లో సంచలనం రేకెత్తించారుు. బుట్టాయగూడెం బాలికల వసతి గృహంలో గతేడాది ముగ్గురు బాలికలపై వసతి గృహ సిబ్బంది అత్యాచారానికి పాల్పడి వ్యభిచార వృత్తిలో దింపేం దుకు ప్రయత్నించారు. ఆయూ సంఘటనలపై అధికారులు విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకున్నా రు. ఇలా సాంఘిక సంక్షేమ వసతి గృహాల్లో అకృత్యాలు, బాలికల ఆత్మహత్యలకు పాల్పడటం వంటి ఘటనలు తల్లిదండ్రులను భయభ్రాంతులకు గురిచేస్తున్నాయి. అన్ని కోణాల్లో దర్యాప్తు : డీఎస్పీ రచన ఆత్మహత్యపై దర్యాప్తు అధికారిగా వ్యవహరిస్తున్న ఏలూరు డీఎస్పీ కేజీవీ సరిత మాట్లాడుతూ అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నామని, పోస్టుమార్టం నివేదిక వచ్చిన తర్వాత పూర్తిస్థాయిలో విచారణ సాగుతుందని చెప్పారు. బాలికలు ప్రతి చిన్న విషయానికి కుంగిపోకుండా ఉండేందుకు వారానికి ఓసారి మానసిక వైద్య నిపుణులతో ప్రత్యేక తరగతులు నిర్వహించాలని అభిప్రాయపడ్డారు. ఎవరైనా అకృత్యాలకు పాల్పడితే ప్రతిఘటించి అధికారుల దృష్టికి తీసుకురావాలని బాలికలకు ఆమె సూచించారు. హాస్టల్ ప్రాంగణం చిట్టడవిని తలపించేలా ఉందని, ఊరి చివర ఉండటం శ్రేయస్కరం కాదని అన్నారు. విచారణ అనంతరం బాధ్యులపై చర్యలు తీసుకుంటామని డీఎస్పీ చెప్పారు.