
తహసీల్దార్ కార్యాలయం ఎదుట బైఠాయించిన విద్యార్థులు
బల్మూర్ నాగర్‌కర్నూల్ : దాదాపు పదిహేను రోజులుగా మధ్యాహ్న భోజనంలో ఉడికి ఉడకని అన్నం.. నీళ్ల చారు వడ్డిస్తుండటంతో ఆకలి మంటలు తాళలేని విద్యార్థులు ఆందోళనకు దిగారు. మండల కేంద్రంలోని జిల్లా పరిషత ఉన్నత పాఠశాలలో పదిహేను రోజుల నుంచి మధ్యాహ్న భోజనం నాసిరకంగా ఉడికి ఉడకని అన్నం.. నాణ్యత లేని కూరగాయలతో వడ్డిస్తున్నారని శుక్రవారం విద్యార్థులు తహసీల్దార్ కార్యాలయం ఎదుట ఆందోళన చేపట్టారు.
ఈ సందర్భంగా పలువురు విద్యార్థులు మాట్లాడుతూ సరిగా ఉడకని అన్నం తినడంతో కడుపునొప్పితో ఇబ్బంది పడుతున్నామని తహసీల్దార్ అంజిరెడ్డి ఎదుట వాపోయారు. స్పందించిన తహసీల్దార్ వెంటనే పాఠశాలకు చేరుకొని విద్యార్థుల మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించారు. నిత్యం పర్యవేక్షణ చేయాల్సిన హెచ్‌ఎం కూడా సరైన సమాధానం చెప్పకుండా దాటవేయడంతో తహసీల్దార్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
మధ్యాహ్న భోజనాన్ని నాణ్యతగా అందించకుంటే తర్యలు తీసుకుంటామని ఏజెన్సీ మహిళలను హెచ్చరించారు. ఇక ముందు ఎలాంటి సమస్య వచ్చినా కఠిన చర్యలు తీసుకుంటామని, ఈ విషయమై ఉన్నతాధికారులకు నివేదిస్తామని ఆయన తెలిపి విద్యార్థులను శాంతింపజేశారు.
Comments
Please login to add a commentAdd a comment