ఆస్పత్రిలో విద్యార్థినులను పరామర్శిస్తున్న సీఐ, ఎస్సైలు, ..పరీక్షిస్తున్న జిల్లా ఉప వైద్యాధికారి గోపాల్‌రావు
చిట్యాల: కలుషిత ఆహారం తిని 22మంది విద్యార్థినులు అస్వస్థతకు గురైన సంఘటన మండల పరిధిలోని సాంఘిక సంక్షేమ బాలికల గురుకుల, కళాశాలలో ఆదివారం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే...గురుకుల పాఠశాల, కళాశాలలో కేర్ టేకర్ లేకపోవడం, భోజన నిర్వహణపై పర్య వేక్షణ కొరవడింది. దీంతో కాంట్రాక్టర్ కుళ్లిన కూరగాయాలతో కూర, సాంబారు, ఉడికి ఉడకని అన్నం పెట్టాడు. దీంతో విద్యార్థినులు తీవ్ర అస్వస్థతకు గురుయ్యారు. ఉదయం ఆలుగడ్డతో కిచిడీ చేసి అందులో పెరుగు కలిపి ఇవ్వడం వల్ల ఐదుగురు విద్యార్థినులు వాంతులు చేసుకున్నారు. అలాగే సాయంత్రం ఉడికి ఉడకని అన్నం, క్యాబేజీ కూర, కుళ్లిన కూరగాయలతో చేసిన సాంబారుతో అన్నం తిన్న విద్యార్థులు రాత్రంతా వాంతులు, విరేచనాలు చేసుకోవడంతో ఆదివారం తెల్లవారుజామున టీచర్లు సాహిత్య, శిరీష, సునీతలు విద్యార్థినులను చికిత్స నిమిత్తం స్థానిక సివిల్ ఆస్పత్రిలో చేర్పించారు.
చికిత్స పొందుతున్న విద్యార్థినులు..
చిట్యాల సివిల్ ఆస్పత్రిలో ప్రస్తుతం 8 మంది విద్యార్థినులు చికిత్సపొందుతున్నారు. అందులో రమ్య, ఝాన్సీ, సౌజన్య, ప్రవళిక, స్నేహ, నందిని, కావ్య, ప్రవళిక ఉన్నారు. ప్రాణాపాయం లేదని వైద్యులు తెలిపారు. మిగతా 14 మందిని వైద్యులు డిశ్చార్జీ చేశారు. ఈ విషయం తెలుసుకున్న జిల్లా వైద్యాధికారి అప్పయ్య, ఉప వైద్యాధికారి నాగూర్ల గోపాల్‌రావు, సీఐ శ్రీనివాస్, ఎస్సై అనిల్‌కుమార్ ,రెవెన్యూ అధికారులు ఆస్పత్రిని సందర్శించారు. అలాగే గురుకుల పాఠశా లను సందర్శించి విద్యార్థినుల బాగోగులు అడిగి తెలుసుకున్నారు. ప్రిన్సిపాల్ జయశ్రీతో పరిస్థితిపై చర్చించారు.
బాధ్యులపై చర్య తీసుకోవాలి: ఎస్‌ఎఫ్‌ఐ
బాలికల గురుకుల పాఠశాలలో ఉడికి ఉడకని అన్నం, కుళ్లిన కూరగాయలతో చేసిన కూర, సాంబారు పెట్టిన బాధ్యులపై కలెక్టర్ చర్యలు తీసుకోవాలని ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి పసుల వినయ్‌కుమార్, అంబేద్కర్ యువజన సంఘం మండల అధ్యక్ష, ప్రధానకార్యదర్శులు బొడ్డు ప్రభాకర్, గుర్రపు రాజేందర్, ఏబీవీపీ మండల నాయకులు గుండా మణికుమార్, తిరుపతి, రాహుల్ డిమాండ్ చేశారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న విద్యార్థినులను వారు పరామర్శించారు. అనంతరం వారు మాట్లాడుతూ గురుకుల విద్యాలయంలోని ప్రిన్సిపాల్ జయశ్రీని జిల్లా కోఆర్డినేటర్‌గా నియమించడం వల్ల ఆమె స్థానికంగా ఉండడం లేదన్నారు. గురుకులంలో పరిశుభ్రత లేదని విమర్శించారు. మెను ప్రకారం భోజనం పెట్టడం లేదని మండి పడ్డారు. పేరుకే సంక్షేమ వసతి గృహమని సకల సమస్యలకు నిలయంగా ఉందని వారు విమర్శించారు. బాధ్యుల పై చర్య తీసుకోకపోతే ఆందోళనలు తప్పవని వారు హెచ్చరించారు.
భోజనం చేసిన అరగంటకే కడుపులో నొప్పి..
క్యాబేజీ, సాంబారుతో అన్నం తిన్న అరగంటకే కడుపులో నొప్పి వచ్చిందని బాధిత విద్యార్థినులు సౌమ్య, దివ్య, అఖిల, నవ్య, నిఖిత తెలిపారు. అనంతరం వాంతులు, విరేచనాలు అయ్యాయి. గమనించిన టీచర్లు తొందరగా స్పందించి ఆస్పత్రికి తీసుక వచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment