సాక్షి, ఎస్‌ఎస్ తాడ్వాయి(వరంగల్) : మండమెలిగె పండుగకు వచ్చాం.. సల్లంగజూడు సమ్మక్కా అంటూ భక్తుల మొక్కులతో మేడారం మహాజాతర కిక్కిరిసిపోయింది. ములుగు జిల్లా ఎస్‌ఎస్ తాడ్వాయి మండలం మేడారం శ్రీసమ్మక్క–సారలమ్మ మహాజాతరలో భాగంగా బుధవారం అమ్మవార్ల ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించిన పూజారులు మండమెలిగె పండుగను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామ పొలిమేరల్లో దిష్టితోరణాలు కట్టారు. రాత్రి సమక్క, సారలమ్మ పూజారులు గద్దెల వద్ద జాగారం చేసి సంబురాలు జరుపుకున్నారు. ఈ మేరకు గద్దెల వద్ద పూజారులు రహస్య పూజలు చేస్తుండడంతో బుధవారం రాత్రి నుంచి గురువారం ఉదయం 5 గంటల వరకు భక్తుల దర్శనాన్ని నిలిపివేశారు.
తరలివచ్చి.. తరించి..
ఈ సందర్భంగా వనదేవతలను దర్శించుకోవడానికి వివిధ ప్రాంతాల నుంచి వేల సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. జంపన్నవాగు వద్ద స్నానఘట్టాల షవర్ల వద్ద స్నానాలు చేసి తల్లుల గద్దెలకు చేరుకొని దర్శించుకొని బెల్లం, కోళ్లు, చీరెసారెలను సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. భక్తుల రద్దీతో అమ్మవార్ల గద్దెలు కిటకిటలాడాయి. క్యూలైన్లు భక్తులతో నిండిపోయింది. మధ్యాహ్నం వాహనాల రద్దీ పెరగడంతో ట్రాఫిక్ నియంత్రణ కోసం కొత్తూరు నుంచి కన్నెపల్లి బీటీ రోడ్డు నుంచి పార్కింగ్ స్థలానికి వాహనాలు మళ్లించారు.
పగిడిద్దరాజు దేవాలయంలో మండమెలిగె
గంగారం : మహబూబాబాద్ జిల్లా గంగారం మండలం పూనుగొండ్లలోని పగిడిద్దరాజు దేవాలయంలో బుధవారం ప్రత్యేక పూజలు ప్రారంభమయ్యాయి. మేడారం సమ్మక్క–సారలమ్మ జాతర ప్రారంభం కావాలంటే సమ్మక్క భర్త అయిన పగిడిద్దరాజు పూనుగొండ్ల నుంచి బయలుదేరి రావాల్సి ఉంటుంది. ఈ మేరకు పగిడిద్దరాజు దేవాలయంలో బుధవారం మండమెలిగె పూజలు చేశారు. పెనక వంశీయులతోపాటు గిరిజనులు పగిడిద్దరాజు ఆలయం శుద్ధి1 చేసి అమ్మవారికి మొక్కులు చెల్లించారు. ఆ తర్వాత పసుపు, గాజులను, నూతన వస్త్రాలను పట్టుకుని ప్రధాన పూజారులైన పెనక మురళీధర్, సురేందర్, బుచ్చిరాములు, సమ్మయ్య తదితరులు మేడారానికి బయలుదేరారు.
కొండాయిలో..
ఏటూరునాగారం: ఏటూరునాగారం మండలంలోని కొండాయిలో కొలువై ఉన్న గోవిందరాజుల గుడిని పూజారులు దబ్బగట్ల గోవర్ధన్, వడ్డె బాబులు శుద్ధి చేసి ప్రత్యేక పూజలు చేశారు. ఆలయంలో ఉన్న గోవిందరాజులకు దూపదీప నైవేద్యాలను సమర్పించారు. బెల్లం శాక, కొబ్బరికాయలు, కుంకుమ, పసుపులతో పూజలు చేశారు. అనంతరం బెల్లంశాక, పూజ సామగ్రిని తీసుకొని మేడారానికి పూజారులు చేరుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment