సాక్షి, ములుగు : మేడారం జాతరలో కీలక ఘట్టం ప్రారంభమైంది. ప్రభుత్వ లాంఛనాల మధ్య చిలకలగుట్ట నుంచి సమ్మక్క మేడారంకు బయల్దేరింది. దీంతో ములుగు జిల్లా మేడారం వనాలు సమ్మక్క నామస్మరణతో మార్మోగాయి. అడవి అంతా జనాలతో నిండిపోయింది. ఆదివాసీ జాతరలో అతి ముఖ్యమైన ఘట్టం ఆవిష్కృతమైంది. సమ్మక్క రాకకు సూచనగా దేవతను ఆహ్వానిస్తూ ప్రభుత్వం తరపున అధికారిక లాంఛనాల ప్రకారం ములుగు జిల్లా ఎస్పీ సంగ్రామ్‌సింగ్ జీ పాటిల్ ఏకే 47 తుపాకీతో గాలిలోకి కాల్పులు జరిపారు. ఈ శబ్దం విన్నవెంటనే ఒక్కసారిగా చిలకలగుట్ట ప్రాంతం భక్తిభావంతో ఉప్పొంగిపోయింది. సమ్మక్క నామస్మరణతో చిలుకల గుట్ట ప్రాంతం మార్మోగింది. ఆదివాసీ యువకుల రక్షణ వలయం, పోలీసు బలగాల రోప్‌పార్టీ నడుమ పూజారులు, వడ్డెలు సమ్మక్క కుంకుమ భరిణె రూపంతో మేడారంవైపు బయలుదేరారు.
లక్షల మంది భక్తుల పారవశ్యం, గిరిజన యువతుల నృత్యాలు, కోయదొరల డోలు వాయిద్యాలు, శివసత్తుల పూనకాలు, హిజ్రాల మొక్కులు, అధికారుల లాంచనాలు, పోలీసు ఉన్నతాధికారుల తుపాకీ కాల్పుల స్వాగతం, భారీ పోలీసుల బందోబస్తు మధ్య ఆదివాసీలు, సమ్మక్క పూజారులు, వడ్డెలు వన దేవత సమ్మక్కను మేడారం గద్దెలపైకి చేర్చారు. ఆదివాసీ జాతరలో పతాక ఘట్టాన్ని చూసేందుకు లక్షల మంది భక్తులు తరలివచ్చారు. సమ్మక్క ఉండే చిలకలగుట్ట జనంతో కిటకిటలాడింది. అక్కడి నుంచి మేడారం వరకు కిలోమీటరున్నర దారి ఇరువైపులా జనంతో నిండిపోయింది. సమ్మక్క స్వాగత కార్యక్రమంలో మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, సత్యవతి రాథోడ్, ఇంద్రకరణ్ రెడ్డి, కలెక్టర్ కర్ణన్, ఎమ్మెల్యేలు సీతక్క, వీరయ్య పాల్గొన్నారు. దారి పొడవునా సమ్మక్కకు లక్షలాది భక్తులు సమ్మక్కకు ఎదురేగి..కోళ్లు, మేకలు బలి ఇస్తూ స్వాగతం పలికారు. (మేడారం.. అన్నీ ‘ప్రత్యేకం’)
కాగా బుధవారం రాత్రి కన్నెపల్లి నుంచి సారలమ్మ మేడడారం గద్దెపై కొలువుదీరారు. అలాగే కొత్తగూడ మండలం పూనుగొండ్ల నుంచి పగిడిద్దరాజు, ఏటూరునాగారం మండలం కొండాయి నుంచి గోవిందరాజులు సైతం సారలమ్మతోటే మేడరం గద్దెల పైకి చేరారు. ముగ్గురి రాకతో మేడారం వన జాతర అంబరాన్నంటింది. ఈ అద్భుత సన్నివేశాన్ని తిలకించేందుకు లక్షలాది మంది భక్తులు పోటెత్తారు.
మేడారం జాతరను జాతీయ పండుగగా గుర్తించాలి
Comments
Please login to add a commentAdd a comment