* తెలంగాణ భాషా దినోత్సవంగా కాళోజీ జయంతి
* కాళోజీ శత జయంతి ఉత్సవాల్లో కేసీఆర్ ప్రకటన
* వరంగల్‌లో మూడున్నర ఎకరాల్లో కాళోజీ కళా కేంద్రం
* రూ.12 కోట్లు మంజూరు చేస్తా.. ఇతర భాషల్లోకి కాళోజీ రచనలు
* వంద రోజుల్లో ఏమీజేయలే... దసరా తర్వాతే అసలు పని
* నాలుగేళ్లలో ప్రతి ఇంటికీ నల్లా.. మూడేళ్లలో నిరంతర విద్యుత్
* మంత్రులకు సీఎం కేసీఆర్ హితవు.. మీడియాకు హెచ్చరికలు
సాక్షి, వరంగల్: ప్రజాకవి కాళోజీ నారాయణరావు జయంతిని తెలంగాణ భాషా దినోత్సవంగా ఖరారు చేస్తున్నట్లు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ప్రకటించారు. కాళోజీ పేరిట పోస్టల్ స్టాంప్ విడుదలకు తెలంగాణ ప్రభుత్వం తరఫున కేబినెట్ తీర్మానం చేసి కేంద్రానికి నివేదిస్తామని చెప్పారు. అన్యాయాన్ని ఎదిరిస్తూ కాళోజీ చేసిన రచనలను ఇతర భాషల్లోకి అనువాదం చేయించనున్నట్లు తెలిపారు. కాళోజీ నారాయణరావు పేరిట సాంస్కృతిక శాఖ నుంచి పురస్కారాలు ఇచ్చేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. త్వరలోనే ఓ యూనివర్సిటీకి కాళోజీ పేరును పెట్టనున్నట్లు సీఎం వెల్లడించారు.
కాళోజీ నారాయణరావు శత జయంతి ఉత్సవాల సందర్భంగా మంగళవారం వరంగల్‌లో జరిగిన కార్యక్రమంలో కేసీఆర్ పాల్గొన్నారు. ముందుగా హన్మకొండలోని కాళోజీ విగ్రహం వద్ద ఆయన నివాళులర్పించారు. అనంతరం కాళోజీ కళా కేంద్రానికి శంకుస్థాపన చేశారు. తర్వాత రాష్ట్ర ప్రభుత్వం, కాళోజీ ఫౌండేషన్ నిర్వహించిన కాళోజీ జయంతి ఉత్సవాల సభలో ప్రసంగించారు.
‘‘కాళోజీ గురించి, ఆయన రచనల గురించి ఎంత చెప్పుకొన్నా తక్కువే. కాళోజీ ఒక్క వరంగల్ జిల్లాకో, తెలంగాణ ప్రాంతానికో, భారత దేశానికో పరిమితమైన వ్యక్తి కాదు. ఆయన నోట్లోంచి వచ్చిన ప్రతి మాట.. కలం నుంచి జాలువారిన ప్రతి కవితా విశ్వజనీనమైనది. సార్వజనీనమైనది. కాళోజీ ‘నా గొడవ’ అన్నడు. వాస్తవంగా అందులో ఆయన గొడవ ఏమీ లేదు. ఆయన గొంతులో, ఆయన కలంలో జాలువారిందంతా ప్రజల దుఃఖమే. ప్రజల గొడవనే తన గొడవ అని చెప్పిన మహానీయుడు. అందుకే ఆయన విశ్వమానవుడు, విశ్వకవి అయ్యాడు.
కాళోజీది రాజీపడని తత్వం. పదవులకో, డబ్బులకో, లొంగని వ్యక్తిత్వం. ఎందుకో అటువంటి వ్యక్తిత్వాలు వరంగల్ జిల్లాలో చాలా ఉంటయి. ఇలాంటి వారిలో కాళోజీ తర్వాత అగ్రగణ్యులు జయశంకర్ సార్. ఏదైనా అంశాన్ని ఎత్తుకోకూడదు. ఎత్తుకుంటే చివరిదాకా పోరాడాలనే తత్వం కాళోజీ నుంచే తనకు వచ్చిందని జయశంకర్‌సార్ అనే వారు. కాళోజీ ఉన్నతమైన శిఖరం. ఆ మహనీయుడు గురించి ఇంతకాలం చెప్పుకోలేకపోయినం. మనకు గొంతులేదు. పరాయిపాలనలో మనం బాధపడ్డం. ఆంధ్రావాళ్లు మామూలు పొట్టోన్ని కూడా పొడుగోన్ని చేసి చూపించిన్రు.
మన కాళోజీని, దాశరథిని పట్టించుకోలేదు. మన పాల్కురికి సోమనాథుడే ఆదికవి. కానీ నన్నయ్య ఆది కవి అని అబద్ధాలు చెప్పిన్రు. కాళోజీ కోసం 500 గజాల స్థలం కావాలని గతంలో సలాం కొట్టినా ఇవ్వలేదు. ఇప్పుడు మూడున్నర ఎకరాల్లో అద్భుతమైన భవనం ఏర్పాటు చేసుకుంటున్నం. కాళోజీ పేరు మీద వరంగల్ పట్టణానికి ఇదో కానుక. ప్రపంచ స్థాయిలో ఈ కట్టడం ఉంటుంది. కాళోజీ కళా కేంద్రానికి రూ. 12 కోట్లు మంజూరు చేస్తున్నా. అక్కడే అర ఎకరంలో కాళోజీ ఫౌండేషన్ భవన్ ఉంటుంది. కాళోజీ పుస్తకాలు, ఫొటోలు చరిత్ర అక్కడ ఉంటాయి.
కాళోజీ కుటుంబం కొంత ఇబ్బందుల్లో ఉంది. కాళోజీ ఫౌండేషన్ పేరిట రూ. 10 లక్షలు ఫిక్స్‌డ్ డిపాజిట్ చేసి దాన్నుంచి వచ్చే మొత్తాన్ని కాళోజీ కుటుంబానికివ్వాలని కలెక్టర్‌కు విజ్ఞప్తి చేస్తున్నా. నేను ఉద్యమం ప్రారంభించిన తర్వాత కాళోజీ ఇంటికెళ్లి కలిశాను. కన్నీరు పెట్టుకుని ఆశీర్వదించారు. బిడ్డా మంచి గనే మొదలు పెట్టినవుగని కొసెల్లెదాక కొట్లాడు అన్నరు. ఆయన స్ఫూర్తీ, దీవెనల అనుగ్రహం, ప్రజల పోరుతో తెలంగాణ సాకారమైంది. ఈ సమయంలో కాళోజీ, జయశంకర్ సార్ ఉంటే చాలా సంతోషపడేవారు’’ అని కేసీఆర్ అన్నారు.
దసరా తర్వాతే అసలు పాలన మొదలు..
పేదలు 50 గజాల ఇంటి స్థలం కోసం అష్టకష్టాలు పడుతుంటే.. ప్రభుత్వ సంస్థల కార్యాలయాలు వంద ఎకరాల్లో ఉన్నాయని, దీన్ని సమీక్షించుకోవాలని కేసీఆర్ అన్నారు. ‘హైదరాబాద్ ఫుట్‌పాత్‌లపై నిత్యం 4 లక్షల మంది పడుకుంటరంటే నేను కన్నీళ్లు పెట్టి ఏడ్చిన. ఇది నగరమా, మనకు సంస్కారం ఉందా... దీనికి నేనో బోడగుండు ముఖ్యమంత్రినా అని బాధపడ్డా. ఈ గొప్పదనానికి.. ఈ మాటలు కేకేతో అన్న. మా వంద రోజుల పాలనలో ఏం జేయలే.
అసలు పనే మొదలు పెట్టలే. కొన్ని విధానాలు రూపొందించినం. దసరా నుంచే అసలు పాలన మొదలైతది. ప్రస్తుత పాలనా కాలంలో లక్ష కుటుంబాలకు పేదరికం నుంచి విముక్తి కలగాలి. కళ్యాణలక్ష్మి పేరిట పేద కుటుంబంలోని మహిళలకు మేలు చేయనున్నాం. ఏమాయె.. గింత ఆలస్యమా అని పీసీసీ నేత పొన్నాల లక్ష్మయ్య రోజూ మెదక్‌లో మొత్తకుంటాండు. పొన్నాలా... మీ జన్మల దళితులకు భూమిలిస్తమని ఆలోచించిన్రా. కళ్యాణలక్ష్మీ ఆలోచించిన్రా. కుండల ఇంత ఉన్నది బిడ్డ. ఎంత తిందామని ప్రజలనే అడుగుదాం. తెలంగాణ వాటర్ గ్రిడ్ అని తీసుకుంటన్న.
నాలుగేళ్ల వరకు మారుమూల పల్లెలో ప్రతి ఇంటికి మంచి నీటి నల్లా లక్ష్యంగా పని చేస్తున్నాం. కరెంటు విషయంలో నేను ముందే చెప్పిన. నేను 107 మీటింగుల్లో మాట్లాడితే ప్రజలారా ఇదీ పరిస్థితి అని 86 సభల్లో చెప్పిన. దాచిపెట్టలే. ఏడాది తిరిగేలోపు కొంత, రెండేళ్లలో ఇంకొంత మెరుగవుతుంది. మూడేళ్ల తర్వాత రెప్పపాటు సేపు కూడా కరెంటు పోదు. కాళోజీ స్ఫూర్తితో పని చేద్దాం’ అంటూ సీఎం ప్రసంగం సాగింది.
తెలంగాణ యాసను ప్రేమించిన వ్యక్తి..
కాళోజీ తెలంగాణ నుడికారాన్ని, యాసను అతిగా ప్రేమించిన వ్యక్తి అని కేసీఆర్ కొని యాడారు. ఈ సందర్భంగా జయశంకర్ సార్ తనకు చెప్పిన ఓ విషయాన్ని సభలో కేసీఆర్ వివరించారు. ‘జయశంకర్ సార్ ఒక పుస్తకం రాసిండు. తెలంగాణలో ఏం జరుగుతోంది అని దాని పేరు. ఏం జరుగుతోంది అని ఆంధ్రోళ్లు అంటరు. తెలంగాణలో ఏం జరుగుతాంది అంటరు.
మల్లెపల్లి లక్ష్మయ్య అలాగే టైటిల్ పెట్టిన్రు. సభకు కాళోజీగారు వచ్చిన్రు. కాళోజీ దాసుకునే రకం కాదు. ఏది ఉన్నా బడుగ్గున చెప్పేత్తడు. ఏమయ్యా జయశంకర్.. ఏం జరుగుతాంది అని అన్నడట. నేను పెట్టలేదు అని జయశంకర్ సార్ చెప్పుదామనుకున్నడట. కానీ, పుస్తకమూ నువ్వు రాయలేదని అంటడేమోనని జయశంకర్‌సార్ ఆగిం డట. యాసపై కాళోజీ అలా వ్యవహరించేవారు’ అని కేసీఆర్ గుర్తు చేసుకున్నారు.
విశ్వకవి కాళోజీ
Published Wed, Sep 10 2014 1:10 AM | Last Updated on Tue, Oct 30 2018 7:57 PM
Advertisement
Advertisement