'తెలంగాణను తెలంగాణ కళ్లతో చూడాలి'
హైదరాబాద్: కాళోజీ అరుదైన వ్యక్తి అని తెలంగాణ సీఎం కేసీఆర్ అన్నారు. బాష కోసం ప్రాణమిచ్చే మహానుభావుడు కాళోజీ అని పేర్కొన్నారు. కాళోజీ ఓ ప్రాంతానికి చెందిన వాడు కాదన్నారు. ఆయన పేరు మీద రవీంద్రభారతిని మించిన ఆడిటోరియం వరంగల్ లో కడతామని తెలిపారు. కాళోజీ కళాక్షేత్రం కోసం వరంగల్ నడిబొడ్డున మూడున్నర ఎకరాలు కేటాయించినట్టు చెప్పారు. దీనికోసం ఇప్పటికే రూ.12 కోట్లు మంజూరు చేశామని తెలిపారు.
రవీంద్రభారతిలో మంగళవారం రాత్రి జరిగిన కాళోజీ శతజయంతి సమాపనోత్సవంలో కేసీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కాళోజీ కలగన్న తెలంగాణ కోసం ధైర్యసాహసాలతో ముందుకు పోతామన్నారు. తమ ప్రభుత్వంపై అప్పుడే విమర్శలు చేయడాన్ని కేసీఆర్ తప్పుబట్టారు. గత్తరబిత్తర చేయాలని కొందరు చూస్తున్నారని ఎద్దేవా చేశారు. తెలంగాణను తెలంగాణ కళ్లతో చూడాలన్నారు. ఇంటింటి సర్వే చేసినా తప్పుబట్టారన్నారు. ఎంతో మంది ఉన్నారో తెలుసుకునేందుకు సర్వే చేస్తే తప్పా అని ప్రశ్నించారు. బంగారు తెలంగాణ సాధించే వరకు విశ్రమించబోమని స్పష్టం చేశారు.