వివరం: కాళోజీ గొడవ | kaloji narayana rao a complete man | Sakshi
Sakshi News home page

వివరం: కాళోజీ గొడవ

Published Sun, Sep 8 2013 2:45 AM | Last Updated on Fri, Sep 1 2017 10:32 PM

వివరం: కాళోజీ గొడవ

వివరం: కాళోజీ గొడవ

కాళోజీ అనే పదానికి సమానార్థకంగా నిలబడగలిగే మాట ఏమిటి? ప్రశ్న. తిరుగుబాటు. నిలదీత. గేయకవిత.
 దుఃఖం. ధిక్కారం. ఆత్మీయత. చట్టబద్ధత. నిజాయితీ.  స్వీయపరిశీలన. వీటితోపాటు  ‘తెలంగాణ ఆత్మ’ను అందులో చేర్చవచ్చేమో! జీవితమంతా పోరాటాల్లో మమేకమైన కాళోజీ నారాయణరావు... కాళన్నగా పరిణామం చెందడం ఒక చరిత్ర! ఉద్యమాలు జరుగుతున్నప్పుడు వాటిని ముందుండి నడిపించినా, తోడై వెంట నడిచినా, కవితై ప్రభవించినా... అప్పటికి మించినదేదో కూడా మాట్లాడగలిగినప్పుడే ఎవరికైనా ప్రాసంగికత! ప్రాంతాలకు అతీతంగా వారిని జనం కళ్ల కద్దుకుంటారు. కాళోజీ వ్యక్తిత్వం చాటేదిదే! 1914 సెప్టెంబర్ 9న జన్మించిన  కాళోజీ శతజయంతి సంవత్సరమిది. ఆ ప్రజాకవి యాదిలో ఈ ప్రత్యేక కథనం...
 
 జరిగినదంతా చూస్తూ ఎరగనట్లు పడివుండగ సాక్షీభూతుణ్నిగాను సాక్షాత్తు మానవుణ్ని
 కాళోజీతో ఏ కొంత పరిచయమున్నవాళ్లయినా, ఆయన గురించిన అనెక్‌డోట్స్ ఇట్టే చెప్పేస్తూ ఉంటారు:
 ఒకసారి వరంగల్‌లో ఏదో సాహిత్య సమావేశం ప్రారంభం కావాల్సి ఉంది. సభికులు వచ్చారు. అతిథులు వచ్చారు. సమయం కూడా దగ్గరపడింది. అయినా అందరూ నిలబడే ఉన్నారు. కారణం? టెంట్‌హౌజ్ నుంచి వచ్చిన కుర్చీల బొత్తి మనిషెత్తు అలాగే ఉంది. వేసే మనిషి ఏమయ్యాడో తెలీదు. ఓహో, అయితే ఆ పనాయన వచ్చి, వేస్తేగానీ, ఈ కుర్చీలు వేసుకోమూ, కూర్చోమా; కాళోజీ చకచకా కుర్చీలు తీసి వేయడం మొదలుపెట్టారు. మిగిలినవాళ్లు ఆయన్ని అనుసరించారు. ‘మనిషంటే శ్రమ చేసేవాడే; అదే అసలైన నిర్వచనం’ అన్నాడు కాళోజీ మరో సందర్భంలో.
 
 ‘అన్యాయాన్నెదిరించినవాడు నాకు ఆరాధ్యుడు’ తండ్రి నుంచి మహారాష్ట్ర సత్వాన్ని, తల్లి నుంచి కర్ణాటక వారసత్వాన్ని పొంది, తెలుగు తత్వంతో పెరిగినవాడు కాళోజీ. ఆయన పూర్వీకులు ఎప్పుడో వరంగల్‌లో స్థిరపడ్డారు. జిల్లాలోని మడికొండ గ్రామం భవిష్యత్తులో కాళన్నగా మారబోయే కాళోజీని ప్రపంచానికి పరిచయం చేసింది. తండ్రి రంగారావు సహవ్యవస్థాపకుడైన ఊరి గ్రంథాలయం కాళోజీకి ప్రపంచాన్ని పరిచయం చేసింది.
 
 స్పందన కాళోజీ జీవగుణం. అది దుఃఖంలోంచి రావొచ్చు, అన్యాయం వల్ల కావొచ్చు. నూనుగు మీసాలు రాని పదహారేళ్ల ప్రాయపు కౌమారంలో ఆయన భగత్‌సింగ్ ఉరితీత(1931)కు బాధపడుతూ తన తొలి కవిత రాశాడు.
 వరంగల్ కాలేజియేట్ హైస్కూల్ విద్యార్థి సంఘం ప్రధాన కార్యదర్శిగా, యాజమాన్యం గణపతి ఉత్సవాలకు సెలవు నిరాకరిస్తే, 1400 మంది విద్యార్థుల్లో 1200 మంది విశ్వాసానికి అది వ్యతిరేకమైనదని భావించి, సుమారు 1100 మంది విద్యార్థుల చేత వ్యక్తిగత సెలవుచీటీలు ఇప్పించి మాస్ ప్రొటెస్ట్ చేయించాడు.
 
 మాటలేక నేను లేను
 కాళోజీ మనసంత గట్టిది కాదు శరీరం. ఇంటర్ చదువుతున్నప్పుడు క్షయ సోకింది. క్షయ ప్రాణాంతకమైన కాలం అది. వరంగల్‌లో పెదవి విరిచారు. హైదరాబాద్ ఉస్మానియా ఆసుపత్రికి తెస్తే, శస్త్రచికిత్స చేసి ఒక ఊపిరితిత్తిని తొలగించారు. ఆపరేషన్ తర్వాత విశ్రాంతి తీసుకొమ్మన్నారు వైద్యులు. ఆ సమయంలో కాళోజీ ఎవరితోనో మాట్లాడుతుంటే, ‘ఇలా ఎక్కువసేపు మాట్లాడితే ఆరు మాసాల్లో చనిపోతా’వన్నాడట డాక్టర్. ‘మాట్లాడకుంటే ఆరు రోజుల్లోనే చనిపోతా’నన్నాడట కాళోజీ. ఆ మాట అనేదాన్ని పోరాట ప్రతీకగా తీసుకుంటే, కాళోజీ మౌనంగా ఎన్నడూ లేడు; చివరిదాకా మాట్లాడుతూనే ఉన్నాడు. జీవితకాలమంతా మిగిలిన ఆ ఒక్క ఊపిరితిత్తితోనే బతికిన కాళోజీ, దాంతోనే ధైర్యాన్ని ఉచ్ఛ్వసించాడు; కవిత్వాన్ని నిశ్వసించాడు:
 
 అవనిపై జరిగేటి అవకతవకల చూసి
 ఎందుకో నా హృదిని ఇన్ని ఆవేదనలు
 పరుల కష్టము జూచి కరిగిపోవును గుండె
 మాయమోసము జూచి మండిపోవును ఒళ్లు
 
 ఇలా ప్రకటించుకున్నవాడు కాబట్టే, ఆంధ్రమహాసభ ఉద్యమంలో చేరాడు. ఆర్యసమాజ్‌లో పనిచేశాడు. భారత స్వాతంత్య్రానికి మునుపు, 1946లో వరంగల్ కోట మీద జాతీయ జెండా ఎగరేసిన కాంగ్రెస్ వాళ్లలో కాళోజీ ఉన్నాడు. కత్తులతో, కఠార్లతో రజాకార్లు స్వైరవిహారం చేస్తున్న సందర్భం అదని చెబితే ఈ సంఘటన తీవ్రత తెలుస్తుంది. స్వాతంత్య్రానంతరం హైదరాబాద్ సంస్థానాన్ని భారత యూనియన్‌లో కలిపే పోరాటంలోనూ కాళోజీ పాల్గొన్నాడు. తెలంగాణ ఉద్యమానికి, మానవ హక్కుల ఉద్యమానికి, పౌర హక్కుల ఉద్యమానికి మద్దతుగా నిలిచాడు. ఏ పోరాటాలైతే ఆయన్ని ప్రజాకవిని చేశాయో, ఆ పోరాలన్నింటిలోనూ ఆయన ప్రజలకు బాధ్యుడిగా ఉన్నాడు.
 
 రచయితవల్ల ఏమవుతుంది?
 సాహిత్య సమాజంలో విశిష్టస్థానం ఉన్నవాడు, అందునా వేమన మళ్లీ పుట్టాడనిపించుకున్నంత పాటివాడు అతిశయపు బారిన పడటం సహజం. కానీ కాళోజీకి సాహిత్య పరిమితుల పట్ల చాలా స్పష్టత ఉండేది. ‘సమాజంలో విలువలను మార్చగలనన్న విశ్వాసం, మారుస్తానన్న ధీమా, మార్చవలెనన్న ఆతురత రచయితకు ఉంటుంది. అదంతా వట్టి భ్రమే,’ అన్నాడు. ఎందుకంటే, విలువలు మారడానికి కారణాలు వేరే ఉంటాయి. ‘(పాఠకుడి) వ్యక్తిగత టెంపరిమెంటు వల్ల, టెంపరిమెంటు వ్యక్తికి ఒక రకమైన సంస్కారాన్ని, అభిరుచులనూ, అలవాట్లనూ కలగజేస్తుంది. ఆ సంస్కారాన్నీ అభిరుచులనూ బట్టీ ఆ వ్యక్తి తన రచయితలనూ, సాహిత్యాన్నీ ఎంచుకుంటాడు. రచన పట్ల పాఠకునికి ఏర్పడే అభిమానం రచన యొక్క విశేషం కాదు,’ అన్నాడు. అయితే, సాహిత్యానికి ప్రయోజనం ఏమిటి?
 
 ‘రాజకీయ విప్లవాల ద్వారా స్వాతంత్య్రాన్ని సాధించవచ్చు. విప్లవానంతరం ఏర్పడిన ప్రభుత్వాలు తమ కృషి ద్వారా సమానత్వాన్నీ స్థాపించవచ్చు. కానీ సౌభ్రాతృత్వం లేనిదే ఈ రెండింటివల్ల కలిగే ఫలితం సర్వేజనులకు చెందదు. ఈ సౌభ్రాతృత్వానికి కృషి చేయవలసింది రాజకీయనాయకులూ, విప్లవ కోవిదులూ కాదు; రచయితలు.
 నాయకులు విఫలమైనచోట రచయిత విజయం సాధించగలిగేది ఇక్కడే,’ అన్నాడు. సాహిత్యం సర్వస్వం కాదని చెబుతూనే, సముచిత పీఠాన దాన్ని కూర్చోబెట్టాడు.
 
 తలవంచిన శిఖరం
 సాహిత్యమే కాదు, జీవితపు పరిమితులను కూడా ఎరిగినవాడు కాళోజీ. ఆయనకు జీవితం, సాహిత్యం వేర్వేరుకాదు; అయినప్పటికీ తనలో ఉన్న ఆ లేశమాత్రపు దారితప్పడాన్ని కూడా వెల్లడించకుండా ఊరుకోలేదు. గాంధీజీలాగా, చలంలాగా తన పొరపాట్లను తాను ప్రశ్నించుకున్నాడు. మానవ బలహీనతల గురించిన అత్యంత స్పృహ ఉన్నవాళ్లకు తప్ప ఇది సాధ్యం కాదు.  
 
 కాళోజీ ఉద్యమ జీవితంలో ఎన్నోసార్లు జైలుపాలయ్యాడు. ఒకసారి తప్పనిసరై నేరస్థజాతికి చెందిన మనిషితో లాకప్‌ను పంచుకోవాల్సి వచ్చింది. రాజకీయఖైదీ తను. ‘వాడు’ నేరగాడు. ఇక సమానత ఎక్కడ? అలాంటిది అతడు గాంధీజీ పేరెత్తగానే విచిత్రపడిపోయి కౌగిలించుకున్నాడట. ‘నైజాం సంస్థానం మారుమూల గ్రామాల్లో అంత అట్టడుగు జీవితాల్లో కూడా గాంధీ పేరు చొచ్చుకుపోయింది. మేము మాత్రం మా అజ్ఞానంతో, అహంకారంతో గ్రామీణులను దూరం చేసుకున్నం. గ్రామీణులతో కల్సిమెల్సి ఉండాలనే గాంధీ బోధనలు మామీద ఏ ప్రభావం వెయ్యలేదన్న విషయం ఆ రోజున నాకు సాక్షాత్కారం జరిగిందన్నమాట. నా జీవితంల మరపురాని ఘట్టం. ఆ విషయం చెప్తుంటె ఇప్పుడు కూడా కన్నీరాగడం లేదు,’ అని ఆ అనుభవాన్ని పంచుకున్నాడు. అది తన గర్వభంగపు ఘటనగా చాటుకున్నాడు.
 
 చట్టబద్ధమైన పౌరుడు
 కాళోజీకి దేశమంతా పరిచయస్థులే, మిత్రులే! రావి నారాయణరెడ్డి, దేవులపల్లి రామానుజరావు, మాడపాటి హనుమంతరావు, సురవరం ప్రతాపరెడ్డి, పొట్లపల్లి రామారావు, టి.హయగ్రీవాచారి, గాడిచర్ల హరిసర్వోత్తమరావు, గార్లపాటి రాఘవరెడ్డి, విశ్వనాథ సత్యనారాయణ, జాషువా, దాశరథి, సినారె, బిరుదురాజు రామరాజు, కన్నాభిరాన్, ఎస్ ఆర్ శంకరన్, సంజీవదేవ్, చలసాని ప్రసాద్, మో, శ్రీశ్రీ, కృష్ణాబాయి, కాళీపట్నం రామారావు, మహాశ్వేతాదేవి, జ్వాలాముఖి, ఆరుద్ర, నగ్నముని, జయశంకర్, నాగిళ్ల రామశాస్త్రి, గద్దర్, వరవరరావు, ఎన్.వేణుగోపాల్; వయసులు, సిద్ధాంతాలు, ప్రాంతాలు, హోదాలతో సంబంధం లేకుండా అందరూ ఆయనతో స్నేహం చేశారు. అటుగా వచ్చిన ప్రతివాళ్లూ కాళోజీని పలకరించకుండా, ఎటుగా వెళ్లినా వాళ్లను కాళోజీ పలకరించకుండా వచ్చేవాడు కాదు. కొండపల్లి సీతారామయ్య కూతురి వివాహం తన చేతుల మీదుగా జరిపించాడు. మిత్రుల జాబితాలో సాక్షాత్తూ పీవీ నరసింహారావులాంటి వ్యక్తి కూడా ఉన్నారు.
 
  పీవీ ప్రధాని కాబట్టి ఈ అదనపు విలువ ఇవ్వడం కాదు; ప్రధాని తన స్నేహితుడిగా ఉన్నా తన నిబద్ధత తను ఎరిగినవాడు కాళోజీ అని చెప్పడానికి. మద్య నిషేధం అమల్లో ఉన్నప్పుడు, ఒకాయన ఇంటికివెళ్తే కాళోజీకి మద్యం ఆఫర్ చేశాడట. ‘ప్రభాకర్! బయట మద్యనిషేధ చట్టం ఉన్నది గనక తాగవద్దు. ఐనా తాగుదామంటవు ఖైరతాబాద్ చౌరస్తాకు బోయి, విశ్వేశ్వరయ్య విగ్రహం దగ్గర నడీ చౌరస్తాల నిలబడి ఈ చట్టాన్ని మేము ఒప్పుకోవడం లేదు, కాబట్టి దీన్ని ఉల్లంఘిస్తున్నం అని తాగుదాం,’ అన్నాడు. అదీ ఆయన తత్వం. చాటుమాటుగా కాదు, ఏదైనా బాజాప్తాగా చేయాలనేవాడు. చేతికింద నలుగురు కుర్రాళ్లు ఉండగలిగే ‘పెద్దరికం’ వచ్చాక కూడా, కరెంటు బిల్లు కట్టడానికి వరుసలో నిలబడ్డవాడు కాళోజీ.
 
 పలుకుబడుల భాష కావాలి!
 శిష్ట వ్యవహారికం కాదు, వ్యవహార శిష్టత కావాలనేవాడు కాళోజీ. ‘నీ భాషల్నే నీ బతుకున్నది; నీ యాసల్నే నీ సంస్కృతున్నది... ఎవని వాడుక భాష వాడు రాయాలె. ఇట్లరాస్తే అవతలోనికి తెలుస్తదా అని ముందర్నే మనమనుకునుడు, మనను మనం తక్కువ చేసుకున్నట్లె. ఈ బానిస భావన పోవాలె. నేనెన్నోసార్లు చెప్పిన. భాష రెండు తీర్లు- ఒకటి బడిపలుకుల భాష, రెండోది పలుకుబడుల భాష. పలుకుబడుల భాష గావాలె,’ అనేవాడు కాళోజీ. తెలంగాణ వరకే కాదు, తన భాషా సోయిని కళింగాంధ్ర, రాయలసీమకు కూడా వ్యాపింపజేసిన ‘వ్యవహార’దక్షుడు.
 
 రామలక్ష్మణులు
 కాళోజీ అన్న కాళోజీ రామేశ్వరరావు ‘షాద్’ పేరుతో ఉర్దూ కవిత్వం రాశాడు. తమ్ముడి హైపర్‌యాక్టివ్‌తనం వల్ల ఆయన ప్రభ వెనకబడిపోయినా వాళ్లిద్దరూ అన్యోన్యంగా బతికారు. న్యాయ శాస్త్రం చదివుండీ   కాళోజీ  ఏనాడూ రూపాయి సంపాదించకపోయినా ఆయనే ఇల్లు గడుపుతూ వచ్చాడు. ఒకవిధంగా తండ్రి తర్వాత తండ్రిలా సాక్కుంటూ వచ్చాడు. 1996లో రామేశ్వరరావు చనిపోయినప్పుడు, ‘నేను నా ఆరవయేట మా అన్న భుజాల మీదికెక్కినాను. ఆయన మరణించేదాకా దిగలేదు. నేను ఆయన భుజాల మీదికి ఎక్కడం గొప్ప కాదు. 70 ఏళ్ల వరకూ ఆయన నన్ను దించకుండా ఉండడం గొప్ప,’ అన్నాడు.
 
 అపురూప అతిథి
 ‘ఇచ్ఛయే నా ఈశ్వరుడని కచ్చితముగ నమ్ముతాను. ఇచ్ఛ వచ్చినట్టు నేను ఆచరించి తీరుతాను. జరిగిన దానిని తలవను. జరిగేదానికి వగవను. ఒరగనున్నదిది యని ఊహాగానము చేయను. సంతసముగ జీవింపగ సతతము యత్నింతుగాని ఎంతటి సౌఖ్యానికైన ఇతరుల పీడింపలేను- ఇది అభిలాష, ఆదర్శము,’ అని ప్రకటించుకున్న కాళోజీ తన సోదరుడు మరణించిన ఆరేళ్లతర్వాత, 2002లో భూమాత భుజాలు శాశ్వతంగా దిగిపోయాడు. జీవనశైలిలో గాంధీతత్వాన్ని నింపుకుని, సామాజిక కోణంలో సామ్యవాదిగా బతికిన కాళోజీ మరణానంతరం తన భౌతికకాయాన్ని కాకతీయ మెడికల్ కాలేజీకి దానం చేసేలా చూసుకున్నాడు. ‘అతిథి వోలె ఉండి ఉండి అవని విడిచి’ వెళ్లిపోయాడు.
 
 ‘ఎవడో కాళోజీ అట...’
     చిన్న చిన్న ఉద్వేగాలకు కూడా కాళోజీ కళ్లనీళ్లు పెట్టుకునేవాడు.
     ‘మనమే నయం’, ‘తెలియక ప్రేమ తెలిసి ద్వేషము’, ‘విభూతి లేక ఫేస్‌పౌడర్’, ‘లంకా పునరుద్ధరణ’, ‘ఆగస్టు పదిహేను’ లాంటి కథలు రాశాడు. పురాణకథలను రీటోల్డ్ మాదిరిగా తిరగరాస్తూ, ప్రతికూల సామాజిక విలువలను నిరసించేవాడు. ఎక్కువగా మనుషుల బుద్ధిమారనితనం ఆయన కథావస్తువు.
     ఓసారి కమ్యూనిస్టు నాయకుడు రావి నారాయణరెడ్డి ఆయనకు రాసిన ఉత్తరం సాక్ష్యంగా అరెస్టయ్యాడు.
     కాళోజీ నివాసమున్న హన్మకొండలోని నక్కలగుట్ట ప్రాంతాన్ని కాళోజీనగర్ అంటున్నారు.
     కాళోజీ 86వ జన్మదినం రోజున జరుగుతున్న సన్మానసభలో మాజీ ప్రధాని పీవీ నర్సింహారావు ‘పెద్దలు శ్రీ కాళోజీ నారాయణరావు గారు’ అని ఉపన్యాసం ప్రారంభించగానే, ‘గారెక్కడిదిరా?’ అని గర్జించాడు.
     ఏదో ఒక పార్టీకో, సిద్ధాంతానికో గుడ్డిగా కట్టుబడి ఉండటాన్ని పార్టీవ్రత్యం అనేవాడు.
     32 మంది కవులు, పండితులకు ప్రభుత్వం ఉగాది పురస్కారాలు ఇచ్చే సందర్భం అది. వేదిక మీద మూడే కుర్చీలు వేశారు. ఆ మూడు ఎవరికీ అని వేస్తున్నతణ్ని అడిగితే, సీఎం, సంబంధిత మంత్రి, సాహిత్య సలహాదారుకని చెప్పాడు. సన్మానం అందుకునేవాళ్లలో వృద్ధులున్నారు. 90-95 ఏండ్ల రాజమండ్రి పండితుడు కూడా ఉన్నారు. వీళ్లందరూ వేదిక ఎక్కి, శాలువా కప్పించుకుని, సత్కారం అందుకునేదాకా నిలబడే ఉండాలా? ఇదేనా పెద్దలకిచ్చే మర్యాద? అందరికీ వేదిక మీద కుర్చీలు వేయాలన్నాడు కాళోజీ. నాకు అదంతా తెలియదని అతడు బదులిచ్చాడు. ‘నీకు ఇట్ల వెయ్యాలని చెప్పినోని దగ్గరికిపో, పోయి, ఎవడో కాళోజీ అట, ఇట్లన్నడు అని చెప్పు, నీదేమున్నది’ అన్నడట. తర్వాత అందరికీ వేదిక మీద కుర్చీలు ప్రత్యక్షమైనాయి.
 
 కాళోజీ జీవనరేఖలు
     జననం 9 సెప్టెంబర్ 1914
     తల్లిదండ్రులు కాళోజీ రంగారావు (మహారాష్ట్ర), రామాబాయి (కర్ణాటక)
     భార్య రుక్మిణీబాయి (వివాహం; 1940)
     కొడుకు రవికుమార్
     కాళోజీ కవితల సంకలనం ‘నా గొడవ’
     ‘ఇదీ నా గొడవ’ పేరుతో ఆత్మకథ రాశాడు.
     ఆంధ్ర సారస్వత పరిషత్తు వ్యవస్థాపక సభ్యుడు
     ఆంధ్ర ప్రదేశ్ సాహిత్య అకాడెమీలో సభ్యుడు
     శాసనమండలి సభ్యుడు(1958-60)
     1992లో పద్మవిభూషణ్ పురస్కారం అందుకున్నాడు.
     మరణం 13 నవంబర్ 2002
 తెలుగు బిడ్డవురోరి తెలుగు మాట్లాడుటకు సంకోచపడియెదవు సంగతేమిటిరా?
 - కాళోజీ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement