Vivaram
-
వివరం: ప్రాణవాయువులలో పాండే ఆత్మ
ఆగస్టు 15, 1947. దేశం తలెత్తుకున్న రోజు! మార్చి 29, 1857. ఈ దేశ పౌరుడు తుపాకీ ఎత్తిన రోజు! ఒకటి స్వాతంత్య్ర దినం. ఇంకొకటి స్వాతంత్య్ర కాంక్షను రగిలించిన దినం. ఆగస్టు 15 అంటే మహాత్మాగాంధీ. మార్చి 29 అంటే మంగళ్ పాండే. కానీ మనకు మహాత్ముడొక్కరే గుర్తుండిపోయారు. మంగళ్ పాండే చరిత్రలోనే ఉండిపోయాడు. పాండేని ఇవాళ తలుచుకుంటే సినిమా వాళ్లు తలుచుకోవాలి. లేదంటే చరిత్రకారుల రిఫరెన్సుల్లోకి మనమే వెళ్లి పాండేని వెతుక్కోవాలి. అయితే ఈ ఏడాది ఎవరూ తలచుకోకుండానే, ఎవరూ వెతుక్కోకుండానే పాండే బయటపడ్డాడు. మార్చి 4న అమృత్‌సర్‌లోని ఒక బావిలోంచి బయట పడ్డాడు!! ఎలా? ఆత్మగానా? అవక్షేపంగానా? అంతరాత్మగానా? అంతరాత్మగానే. కానీ ఒక అంతరాత్మగా కాదు. 1857 నుంచి 2014 వరకు ఈ 157 ఏళ్లలో ఒక్కనాడూ పాండేకు భరతజాతి ఘనంగా నివాళులు అర్పించలేదని ఘోషిస్తున్న వందల అంతరాత్మలుగా! అమృత్సర్ దగ్గరి అజ్నాలా గ్రామంలో... ఒక సిక్కు ప్రార్థనాలయం ప్రాంగణంలో ఉన్న బావిలో నూటాయాభై ఏళ్లనాటి తిరుగుబాటు సిపాయిల అస్థికల్లోంచి, మట్టిలో కలిసిపోయిన వారి ప్రాణవాయువుల్లోంచి పాండే బయటపడ్డాడు. పడ్డాడూ అంటే... అస్థికల్లో అతడి అస్థికలూ ఉన్నాయని కాదు. అతడి స్ఫూర్తితో, ఆవహించిన అతడి ఆత్మతో బ్రిటిష్‌వాళ్లపై తిరగబడి, పోరాడి మరణించిన వీరుల శిథిలాలలో పాండే ఆవరించి ఉన్నాడని. గాంధీ అంటే గాంధీ ఒక్కరే. తనకు తానుగా ఒక మహాశక్తి. పాండే అంటే వందలు, వేలుగా ఎక్కుపెట్టిన సిపాయిలందరి తుపాకుల శక్తి. కంకాళాలు, కపాలాలు, విరిగిన కాళ్లూ చేతులు, పగిలిన పుర్రెలు... ఎప్పటికీ ఇవి మాత్రమేనా పాండే స్మారక చిహ్నాలు? జాతిపితలా మహాత్ముడిని గౌరవించినట్లు, తొలి తిరుగుబాటు వీరుడిగా పాండేని మనం గుర్తించలేమా? గాంధీజీ లేకుండా స్వాతంత్య్ర సంగ్రామం లేనట్లే... పాండే లేకుండా ఆ సంగ్రామానికి ఉప్పు, ఊపిరి రెండూ లేవన్న వాస్తవాన్ని గ్రహించలేమా? పాండే ఒక జ్వాల. ఉత్తర భారతదేశంలోని మీరట్, ఢిల్లీ, లక్నో, కల్పి, కాన్పూర్, బెనారస్, రాణీగంజ్, కలకత్తాల మీదుగా దేశంలోని తూర్పు, మధ్య ప్రాంతాలకు వ్యాపించిన తిరుగుబాటు జ్వాల. 1857-59 మధ్య... స్వేచ్ఛాకాంక్షగా రగిలి, దేశాన్ని యుద్ధభూమిగా మార్చిన జ్వాల. అప్పటికి వందేళ్ల క్రితం - సరుకులు అమ్ముకుంటూ వచ్చి భారత భూభాగంలో తక్కెడ పెట్టి కూర్చుంది ఈస్ట్ ఇండియా కంపెనీ. బ్రిటన్ నుంచి వచ్చి భారత్‌పై పట్టు బిగించింది. 1757లో బెంగాల్ నవాబు సిరాజ్ ఉద్దౌలాను ఓడించింది. మైసూరులో టిప్పు సుల్తాన్నీ, మరి కొందరు ప్రాంతీయ పాలకుల్ని గద్దె దించింది. 1857 నాటికి యావద్భారతాన్ని తన అధీనంలోకి తెచ్చుకుంది. ఆ కొసలో జరిగిందే సిపాయిల తిరుగుబాటు. అదే మన ప్రప్రథమ స్వాతంత్య్ర సంగ్రామం. ఆ సంగ్రామానికి మీసాన్ని మెలితిప్పి వత్తిగా వెలిగించినవాడే మంగళ్ పాండే! పాండే ధిక్కారం తర్వాత తొలిసారి మీరట్ (ఉత్తర ప్రదేశ్)లో భారతీయ సిపాయిలు బ్రిటిష్ వారిపై విరుచుకుపడ్డారు. అక్కడ ఇద్దరు బ్రిటిష్ అధికారులను హతమార్చి, ఢిల్లీ వైపు కదిలారు. ఝాన్సీ (ఉ.ప్ర.) నుంచి లక్ష్మీబాయి, మరాఠా పీష్వా నానా సాహెబ్, మొఘల్ చక్రవర్తి బహదూర్ షా తిరుగుబాటు సంగ్రామంలో పాల్గొన్నారు. అంతిమంగా బ్రిటిష్ వాళ్లదే పైచేయి అయింది. ఝాన్సీ లక్ష్మీబాయి, తాంతియా తోపే ఆ పోరాటంలో మరణించారు. బహదూర్ షాను తీసుకెళ్లి బర్మా జైల్లో పడేసింది బ్రిటిష్ ఆర్మీ. హైదరాబాద్ నిజాం, గ్వాలియర్ సింధియాలు విదేశీ పాలకులకు అనుకూలంగా ఉండిపోయారు. అక్కడి తో పాండే వెలిగించిన మహాజ్వాల కొడిగట్టింది. సిపాయిల తిరుగుబాటు తర్వాత సంభవించిన కీలక పరిణామం... ఈస్టిండియా కంపెనీ శకం ముగియడం. దాని స్థానంలో ఇంగ్లండ్ ప్రభుత్వం వైశ్రాయ్లను, గవర్నర్ జనరల్స్నీ పెట్టి భారతదేశాన్ని పాలించింది. ఆ తర్వాత 1885 నుంచి 1947 వరకు బ్రిటిష్ పాలకులకు వ్యతిరేకంగా జరిగిందే... భారత జాతీయోద్యమం. మార్చి 29న బరక్‌పూర్ (ప.బెంగాల్) లో మంగళ్ పాండే తిరగబడ్డాడు. సైనిక న్యాయస్థానం అతడిని ఏప్రిల్ 8న ఉరితీసింది. మే 10న మీరట్‌లో అక్కడి సిపాయిలు తిరుగుబాటు చేశారు. అయితే స్వతంత్ర భారతదేశం మీరట్ తిరుగుబాటును మాత్రమే అధికారికంగా గుర్తించింది! మంగళ్ పాండే స్ఫూర్తిని పూర్తిగా విస్మరించింది, 1957 నాటి తొలిసిపాయిల తిరుగుబాటు శతాబ్ది వేడుకలలో... 1857 మే 10న బ్రిటిష్ పాలకులపై భారతీయ సిపాయిలు తిరగబడిన సందర్భాన్ని మాత్రమే అప్పటి భారత ప్రధాని జవహర్లాల్ నెహ్రూ, రాష్ట్రపతి బాబూ రాజేంద్ర ప్రసాద్ ‘కుల మతాలకు అతీతమైన సమైక్య పోరాటం’గా అభివ ర్ణించారు. అంతేకాదు, కలకత్తా విశ్వవిద్యాలయ చరిత్రకారుడు ఎస్.ఎన్.సేన్ తో తొలి స్వాతంత్య్ర సంగ్రామంపై రాయించిన అధికారిక గ్రంథాన్ని భారత ప్రభుత్వం ఆ ఉత్సవాల సందర్భంగా విడుదల చేసింది. ‘మత విశ్వాసాలను కాపాడుకునేందుకు మొదలైన పోరాటం... విజయవంతమైన స్వాతంత్య్ర సమరంగా సమాప్తమయింది’’ అని సేన్ తన పుస్తకాన్ని ముగించాడు! ఆ పుస్తకంలో ఎక్కడా పాండే ప్రస్తావన ప్రముఖంగా లేదు! పాలక పక్షాల ఒత్తిళ్ల మేరకే గ్రంథరచయిత పాండేను నామమాత్రంగా ఉంచేశాడని అంటారు. ఎందుకని పాండేని మనం తిరుగుబాటుకు తొలి వీరుడిగా గుర్తించలేకపోతున్నాం? 1857 మే 10న జరిగిన సిపాయిల తిరుగుబాటుకు బీజాలు వేసింది మార్చి 29 నాటి పాండే ధైర్యసాహసాలే అనే విషయమై ఎందుకని నేటికీ ఒక ఏకాభిప్రాయానికి రాలేకపోతున్నాం. ఆట్చఠ్ఛి ఝ్చట్టడట ౌట అఛిఛిజీఛ్ఛ్ట్చీ ఏ్ఛటౌ గ్రంథకర్త రుద్రాంక్షు ముఖర్జీ పాండేను దేశభక్తునిగా గుర్తించలేమనీ, భారత తొలి స్వాతంత్య్ర సమరానికీ, పాండే తిరుగుబాటుకూ సంబంధమే లేదని రాశారు. ‘హిందూ మహాసభ’ సంస్థాపకులలో ఒకరైన వి.డి.సావర్కర్ తను రాసిన ‘ది ఇండియన్ వార్ ఆఫ్ ఇండిపెండెన్స్’ (1909) గ్రంథంలో తిరుగుబాటు గొప్పతనాన్నంతా మంగళ్పాండేకే ఇచ్చారని ఇప్పటికీ డాల్రింపుల్‌వంటి కొందరు బ్రిటిష్ చరిత్రకారులు విమర్శిస్తూనే ఉన్నారు! ఏది తొలి తిరుగుబాటు? ఈ విషయమై 157 ఏళ్లుగా అస్పష్టత కొనసాగుతూనే ఉంది. మార్చి 29 నాటి ఒక ఉక్కబోత మధ్యాహ్నపు వేళ బరక్పూర్లోని 34వ ‘నేటివ్ ఇన్ఫాంట్రీ’ దళ సభ్యుడు, 26 ఏళ్ల సిపాయి అయిన మంగళ్‌పాండే... పరేడ్ గ్రౌండ్లో బ్రిటిష్ అధికారులకు ఎదురు తిరగడమా లేక మే 10న మీరట్‌లో సిపాయిలంతా తిరగబడడమా... ఏది బీజం భారత స్వాతంత్య్ర సంగ్రామానికి? ఎలా చూసినా బరక్‌పూర్, మంగళ్ పాండే దగ్గరే మన సందిగ్ధతలు, సంశయాలన్నీ ముగుస్తున్నాయి. ఉత్తర భారతదేశం పొడవునా వ్యాపించిన మీరట్ దావానలం తాలూకు మసి జాడలను వెదుక్కూంటూ వెనక్కి వెనక్కి వెళ్లిన చరిత్రకారులు బరక్‌పూర్‌లో ఆగిపోతున్నారు! మొదట చిచ్చు పెట్టిన సిపాయిగా మంగళ్ పాండే మాత్రమే కనిపిస్తున్నాడు. మార్చి 29న అసలేం జరిగిందన్న విషయమై అప్పటి బ్రిటిష్ అధికారులు ఇచ్చిన లిఖితపూర్వక వివరాలు నేటికీ మనకు అందుబాటులో ఉన్నాయి. వాటి ఆధారంగా చూసినా పాండే నే మన తొలి కథానాయకుడు. అతడు తిరగబడిందే మన తొలి తిరుగుబాటు. పాండే తిరగబడిన తక్షణ కారణం... కొత్త ఎన్ఫీల్డ్ తుపాకులలో వాడేందుకు బ్రిటిష్ ఆర్మీ... సిపాయిలకు పంపిణీ చేసిన తూటాలేననీ, సులువుగా జారేందుకు వీలుగా ఆ తూటాలకు జంతువుల కొవ్వుతో తయారుచేసిన గ్రీసును అద్ది ఇవ్వడం వల్ల పాండే తీవ్ర మనస్తాపం చెంది బహిరంగంగా ఆగ్రహావేశాలు వ్యక్తం చేశాడనీ బ్రిటిష్ చరిత్రకారులు రాశారు. ఆ సంఘటన జరిగినప్పుడు పాండేతో పాటు అక్కడ అవధ్ బ్రాహ్మణ సిపాయిలు కూడా ఉన్నారు. బ్రిటిష్ వారి అప్రాచ్య విధానాల వల్ల తమ కులం, మతం మంటగలిసి పోతాయని వారంతా భయపడ్డారు. అంతే, పాండే తుపాకీ పైకి లేచింది. దానిని అతడు గాలిలో ఊపుతూ ‘‘అంతా బయటికి వచ్చేయండి, ఈ తూటాలను నోటితో తెరిచామంటే మనమంతా మత విశ్వాస ఘాతకులం అయినట్లే. ఇంకా ఆలోచిస్తారేమిటి? యూరోపియన్ల పని పడదాం రండి’’ అని అరిచాడు. అక్కడే ఉన్న ఇద్దరు బ్రిటిష్ అధికారులు సార్జెంట్ మేజర్ హ్యూసన్, లెఫ్ట్‌నెంట్ బాగ్‌లతో కలియబడి వారిని తన కత్తితో, తుపాకీతో గాయపరిచాడు. ఈ గొడవకి ప్రెసిడెన్సీ విభాగపు కమాండింగ్ ఆఫీసర్ జనరల్ హియర్సే రాగానే పాండే తనని తాను కాల్చుకున్నాడు. అయితే ఆ తూటా అతడిని చంపే విధంగా తగల్లేదు. ఇదే సంఘటన కొన్ని చరిత్ర పుస్తకాలలో మరింత వివరంగా ఉంది. ఆవుకొవ్వు, పంది కొవ్వు ఉపయోగించి తయారుచేసిన తూటాలను కొరికి ప్రయోగించడానికి నిరాకరించిన మంగళ్ పాండే ఆ కోపంలో తన పై అధికారిని హతమార్చాడు. షేక్ పల్టూ అనే సహ సిపాయి పాండేను అడ్డుకునే ప్రయత్నం చేశాడు. ఈ విషయం తెలిసిన వెంటనే అక్కడికి చేరుకున్న జనరల్ జాన్‌హెర్పే... పాండేను పట్టుకోమని జమేదార్ ఈశ్వరీ ప్రసాద్‌ను అదేశించాడు. ప్రసాద్ కదల్లేదు. ఈలోపు పాండే తన తుపాకితో తనే కాల్చుకుని ఆంగ్లేయుల చేతిలో కాక, ఆత్మాభిమానంతో చచ్చిపోవాలని ప్రయత్నించి విఫలమయ్యాడు. బ్రిటిష్ సైనికులు వెంటనే అతడిని నిర్బంధించి హత్యానేరం మోపారు. సైనిక న్యాయస్థానం పాండేను ఏప్రిల్ 18న ఉరి తియ్యాలని తీర్పు చెప్పింది. అయితే అతడిని పది రోజుల ముందుగానే ఉరితీశారు. అతడిని పట్టుకునేందుకు నిరాకరించిన ఈశ్వరీ ప్రసాద్‌ను కూడా రెండు వారాల తర్వాత ఏప్రిల్ 22న ఉరి తీశారు. పాండే తిరుగుబాటు చేస్తున్నప్పుడు చూస్తూ నిలబడిపోయారన్న ఆరోపణలపై తక్కిన సిపాయిల దుస్తులు విప్పించి పరేడ్ చేయించారు. చరిత్ర పుస్తకాలలో ఎన్ని రకాలుగా ఉన్నా భారతీయులలో అత్యధిక సంఖ్యాకులకు మాత్రం ఇప్పటికీ పాండేనే తొలి తిరుగుబాటు హీరో. కలకత్తాకి సమీపంలో బరక్‌పూర్‌లో 2005లో స్థానిక పాలక మండలి పాండే విగ్రహాన్ని ప్రతిష్టించింది. ఆ ఊరిలో ఆర్మీ బ్యారక్ల మధ్య పాండే ఒక్కడే ఒంటరి యోధుడిలా కనిపిస్తాడు. ఛాతీ వరకు ఉన్న ఆ స్మారక విగ్రహం కింద ‘మంగళ్‌పాండే, సిపాయి నెంబరు 1446, 34వ రెజిమెంట్. 1857 మార్చి 29న పట్టపగలు బ్రిటిష్ అధికారులపై ఇతడు తుపాకీ పేల్చాడు’ అని రాసి ఉంటుంది. ఎవరివీ అస్థికలు? అమృత్‌సర్‌లోని ‘కలియన్వాలా ఖు’ (నల్లవాళ్ల బావి)లో ప్రభుత్వ ప్రమేయం గానీ, సహకారం గానీ లేకుండా గురుద్వార యాజమాన్యం చొరవతో చరిత్ర పరిశోధకులు, స్థానికులు కలిసి కొంతకాలంగా తవ్వకాలు జరుపుతున్నప్పుడు మార్చి మొదటి వారంలో 282 మంది సిపాయిల అస్థికలు బయట పడ్డాయి. వాటితో పాటు 1830-1835 కాలం నాటి నాణేలు, క్వీన్ విక్టోరియా హయాంలోని రెండు బ్రిటిష్ పతకాలు, మూడు బంగారు గోళీలు, ఒక తాయెత్తు, అరవైకి పైగా ఈస్టిండియా కంపెనీ వారి రూపాయి కాసులు లభ్యమయ్యాయి. అందుబాటులో ఉన్న రికార్డుల ప్రకారం ఈ అస్థికలన్నీ 26వ స్థానిక పదాతి దళానికి చెందిన భారతీయ సిపాయిలవి. 1857 జూలై 30న లాహోర్ సమీపంలోని మియాన్ మిర్ సైనిక పటాలంలో దాదాపు 500 మంది సిపాయిలు ప్రకాష్ పాండే అనే సిపాయి నాయకత్వంలో తిరుగుబాటు లేవదీసి, బ్రిటిష్ పాలకులకు వ్యతిరేకంగా ఢిల్లీ, మీరట్‌లలోని సిపాయిలతో చేయికలిపారు. వారిలో 282 మందిని బ్రిటిష్ అధికారులు అజ్నాలా తీసుకొచ్చి అప్పటి అమృత్సర్ డిప్యూటీ కమిషనర్ ఎఫ్.హెచ్.కూపర్ ఆదేశాలపై కాల్చి చంపారు. మృతదేహాలను ఓ ఎండిపోయిన బావిలో పడేశారు. ఆ బావికి బ్రిటిష్‌వాళ్లు పెట్టిన పేరే ‘కలియన్వాల ఖు’. తర్వాత గురుద్వార యాజమాన్యం ఆ పేరును ‘షహీదన్వాలా ఖు’ (అమరవీరుల బావి) గా మార్చింది. మిగతా 200 మంది సైనికులను కూడా బ్రిటిష్ అధికారులు వదిలిపెట్టలేదు. గాలిచొరబడని ఒక చిన్న గదిలో బంధించి, ఊపిరి ఆడకుండా చేసి చంపేశారు. మంగళ్ పాండే ఎక్కడివాడు? తెలీదు! రెండు ప్రాంతాలున్నాయి. వాటిల్లో కచ్చితంగా ఏదో తెలీదు. చరిత్రకారులు తేల్చుకోలేకపోయారు. రెండిటినీ అవుననేందుకు, కాదనేందుకు కొన్ని కొన్ని ఆధారాలున్నాయి. మొదటిది: నగ్వా. ఉత్తరప్రదేశ్‌కు తూర్పున బల్లియా జిల్లాలో గంగానది ఒడ్డున ఉంది. ఊర్లో అక్కడక్కడా పాండే విగ్రహాలు కనిపిస్తుంటాయి! ‘‘అతడు మా ఊరి వాడు’’ అని గ్రామంలోని పెద్దలు అంటుంటారు. అంతకుమించి రుజువుల్లేవు. రెండోది: సురహర్పూర్. ఇదీ ఉత్తరప్రదేశ్లోనిదే. ఫజియాబాద్ జిల్లాలో అక్బర్పూర్ నియోజకవర్గంలో ఉంది. ఏడేళ్ల క్రితం సురహర్పూర్ అకస్మాత్తుగా మంగళ్‌పాండే జన్మస్థలం అయింది! సిపాయిల తిరుగుబాటుకు 150 ఏళ్లు అయిన సందర్భంగా 2007లో... అప్పటి కేంద్రమంత్రి మణిశంకర్ అయ్యర్ మీరట్ నుంచి పెద్ద ర్యాలీని ప్రారంభించినప్పుడు ఆ యువజన శాఖ వ్యవహారాల మంత్రిని చాలామంది అడిగారు - పాండే పుట్టిన సురహర్పూర్ను వదిలి ఇక్కడి నుంచి సెలబ్రేట్ చెయ్యడం ఏమిటని! ప్రభుత్వం లెక్కలు వేరు. మార్చి 29న తిరగబడిన వాడు పాండే ఒక్కడే. ఆ ఒక్కణ్నీ ఉరేశారు. ఆ తర్వాత మే 10న తిరగబడిన మీరట్ సిపాయిలు వందలు వేలు. అందుకే నూటాయాభై ఏళ్ల సన్నాహక ఉత్సవాలు ‘అధికారికం’గా మే 10న మొదలయ్యాయి. అదే రోజు మీడియా కొంతమంది ప్రతినిధులను సురహర్పూర్ పంపింది. ఆ ప్రతినిధులకు అక్కడ సీతారామ్ సింగ్ అనే స్వాతంత్య్ర సమరయోధుడు కనిపించాడు. అప్పటికి ఆయన వయసు తొంభై నాలుగు. సీతారామ్ చరిత్రకారుడు కూడా. ఐదారు పుస్తకాలు రాశారు. పాండే జనన విషయాలు ఆయన దగ్గర కొన్ని ఉన్నాయి. ‘‘పాండే తండ్రి దినకర్ పాండే. ఆయన మొదట్లో ఫైజాబాద్ జిల్లా ... దుగ్వాన్-రహీమ్‌పూర్‌లో ఉండేవారు. అక్కడి నుంచి సురహర్పూర్ వలస వచ్చాడు. మంగళ్‌పాండే తల్లి అభయ్‌రాణి సురహర్పూర్ అమ్మాయి. అభయ్రాణిని చేసుకున్నాక దినకర్ ఇక్కడే స్థిరపడిపోయాడు. ఇక్కడే పాండే కూడా పుట్టాడు’’ - తనదగ్గరున్న ఆధారాలేవో చూపించారు సీతారామ్. అలా సురహర్పూర్ పాండే జన్మస్థలం అనుకోడానికి ఒక నిదర్శనం లభించింది. -
వివరం: ఆకాశ రహస్యం శివస్వరూపం
ఎంతో శ్రద్ధతో పూజ చేసుకోవాలనుకుంటూ ఏవేవో పనుల కారణంగా ఆలస్యాన్ని చేసుకుని, పూజ దగ్గరకొచ్చేసరికి మరింత వేగంగానూ, ఇక అష్టోత్తర శతనామాల దగ్గరకొచ్చేసరికి మరికాస్త వేగవంతంగానూ కార్యక్రమం జరుగుతూండటం అనుభవంలో కనిపిస్తూండే సత్యం. ఇదెవరినో తక్కువ చేయటానికీ, పరిహసించటానికీ చెప్పబడుతూన్న విషయం కాదు గాని, ‘నామాల్లో దాగిన అర్థాన్ని గాని గ్రహించినట్టయితే, అలాగే నిదానంగా ఆ దైవరూపాన్ని గాని పరిశీలించినట్లయితే ఎన్ని రహస్యాలు తెలుస్తాయో వాటిని దాదాపు తరువాతి తరానికి అందించకుండా పోతున్నా’మని చెప్పటానికి మాత్రమే. ఈ నేపథ్యంలో శివ రూపాన్నీ కొన్ని నామాలనీ పరిశీలిద్దాం! వ్యోమకేశుడు ‘వ్యోమ కేశాయ నమః’ అనేది ఓ నామం. వ్యోమ అంటే ఆకాశమని అర్థం. ఆ ఆకాశమే తనకి శిరోజాలుగా కలిగినవాడనేది ఈ నామానికర్థం. దీనికి ఇంత మాత్రమే అర్థమని చెప్తే ఏమీ తెలియదు. లో అర్థం తెలియాల్సిందే. పంచభూతాల్లోనూ కొన్ని కొన్ని రహస్యాలు దాగున్నాయి. అయితే మొత్తం రహస్యాలన్నింటికీ ఓ నిధీ పుట్టా వంటిది ఆకాశం. ఆ కారణంగానే ఆకాశం నుండి వాయువూ, వాయువు నుండి అగ్నీ, అగ్ని నుండి నీరూ, నీటి నుండి నేలా, నేల నుండి ఆహారానికి సంబంధించిన మొక్కలూ... వాటిని తినడం ద్వారా సకల ప్రాణులూ కలుగుతున్నారు, జీవిస్తున్నారు (ఆకాశా ద్వాయుః... అన్నాత్ ప్రజాః) అంది ఉపనిషత్తు. ఇలా మిగిలిన నాలుగు భూతాలకీ మూలమైన ఆకాశమనేది ఎన్నెన్నో రహస్యాలని తెలియజేయగల శక్తివంతమైనది. అందుకే విజ్ఞాన శాస్త్ర పరిశోధకులెప్పుడూ తమ పరిశోధనలని అంతరిక్షాన్ని కేంద్రంగా చేసుకునే సాగిస్తుంటారు. ఐన్‌స్టీన్ వంటి శాస్త్రవేత్త కూడా ‘ఆకాశాన్ని అంతులేని ఇంత అని ఊహించ వీలులేని రహస్యాల నిధి’ అన్నాడు. అలాంటి ఆకాశం తనకి శిరోజాలుగా కలవాడు శంకరుడట. శిరోజాన్ని పెకలించితే ఎలా కన్పించీ కన్పించకుండా ఉంటుందో, అలాంటి శిరోజాల సమూహాలతో శిరసు కళకళలాడుతూ ఉంటుందో, అలా ఆకాశం కూడా అనేక సూక్ష్మ రహస్యాలని తనలో ఇముడ్చుకుని ఉన్నదన్నమాట. అందుకే ఇప్పటికీ నాకు వాడి గురించి ఇన్ని రహస్యాలు తెలుసంటూ తల జుట్టుని పట్టుకు చెప్తుంటాం. అలాంటి ఆకాశ రహస్యాలన్నింటినీ తనదిగా చేసుకున్న శిరసు కలవాడు శంకరుడని ఈ నామానికర్థం. శంకరుని శిరసు ఆకాశం కాబట్టే ఆకాశంలో ఉండే చంద్రుడాయనకి ఆభరణంగా ఉంటాడు. (హిమాంశు శేఖరః - చల్లని కిరణాలు కల చంద్రుడే తన ఆభరణంగా కలవాడు అనేది శివుని పేర్లలో ఒకటి). నక్షత్రాలు కూడా ఆయన శిరోజాలకి అలంకారాలుగా ఉంటాయి (ఆహార్యం చంద్ర తారాది తం వందే...) తనకి ఆ శిరసే ఆకాశం కాబట్టి అక్కడ ప్రవహించే గంగ ఆయన శిరసు మీద కన్పిస్తూంటుంది. గంగని ధరించిన దైవం కాబట్టే ఆయన్ని ‘గంగాధరు’డని పిలుస్తారు. ఇంతటి శాస్త్ర రహస్యం ఇక్కడ గోచరిస్తుంటే కవులు తమదైన ధోరణిలో శంకరుని భార్య పార్వతి అనీ, కాలక్రమంలో ఆయన గంగమ్మ మీద మనసు పడ్డాడనీ, ఆమె ఆయన తలనెక్కి కూర్చున్నదనీ, దాంతో గంగా పార్వతులకి సవతి పోరు ఉందనీ... ఇలా చెప్తూ శాస్త్ర విశేషాన్ని మరో తోవకి తీసుకెళ్లిపోయారు. గంగాధరుడు గంగ అంటే ఓ స్త్రీ కాదు. గంగ అనేది జ్ఞానానికి సంకేతం. అందుకే అలా ప్రవాహంలా ఉపన్యాసం సాగిపోతుంటే, దాన్ని గంగా ప్రవాహంతో పోల్చి చెప్తారు. జ్ఞానమనేది శిరసులో కదా నిక్షిప్తమై ఉంటుంది! అలా జ్ఞాన గంగని తన శిరసులో గల శంకరుడు దాన్ని తలా కొంత పంచిపెడితే, మరెందరో కూడా తనని మించిపోతారనే దృష్టితో ఉండనే ఉండడు. తనకున్న జ్ఞానాన్ని పదిమందికీ పంచడమే సరైనదని భావిస్తూ, మనకి సూచిస్తూ తన తలమీద ఉన్న గంగమ్మ నోటి నుండి ఓ జలధార కిందికి పడుతున్నట్టుగా చిత్రంలో కన్పిస్తాడు. అంటే ఏమన్నమాట? జ్ఞానవంతుడైన ఎవరైనా తనకున్న జ్ఞానాన్ని తన కిందివారికి పంచి తీరాలని చెప్తున్నాడన్నమాట శంకరుడు. (అధీతి బోధా చరణ ప్రచారణైః...) చదువుకోవడం (అధీతి), దాన్ని ఇతరులకి అర్థమయ్యేలా చెప్పడం (బోధ), దాన్ని తాను ఆచరించడం (ఆచరణ), అందరికీ వ్యాప్తమైందా? లేదా అని పరిశీలిస్తూ ఆ చదివినదాన్ని ప్రచారం చేస్తూ ఉండటం (ప్రచారణం) అనేవి విద్యకున్న నాల్గు దశలు. అలా చేసిన వ్యక్తినీ చేసే వ్యక్తినీ మాత్రమే పండితుడనాలి. అందుకే గంగమ్మ నోటి నుండి జలధార నాలుగుగా విడివడుతూ నేలకి చేరుతూ కన్పిస్తుంది గంగాధరుని చిత్రంలో. నీలగ్రీవుడూ హితుడూ ‘అసౌ యో వసర్వతి నీలగ్రీవో విలోహితః...’ అని నమక మంత్రం చెప్తుంది. శంకరుడు సాక్షాత్తూ సూర్యుడే అని ఈ మంత్రం నిరూపిస్తుంది. సూర్యుడు ఆకాశంలో ఉంటాడు. శంకరుడు నేలమీద ఉంటాడు. సూర్యుడు మనకి ప్రసాదించేది వర్షాన్ని (ఘన వృష్టిః అపాం మిత్రః...). అలాంటి వర్షం మాకు కావాలంటూ మనం మన దరఖాస్తుని ఇయ్యాలంటే మనమంతా ఆ సూర్యుని వద్దకెళ్లాలి. అది దుస్సాధ్యం. మరేం చెయ్యాలి? రాజధాని ఉండే ప్రదేశంలో ప్రభుత్వ సచివాలయం ఉన్నా, ప్రభుత్వానికి చెల్లించాల్సిన పన్నుని మనం గాని చెల్లించవలసి వస్తే, రాజధానికి వెళ్లనక్కరలేకుండా, ఆ ప్రభుత్వానికి సంబంధించిన ప్రతినిధిగా మనం నివసించే ప్రదేశంలో ఉన్న ప్రభుత్వ కార్యాలయంలో (దేనికి సంబంధించిన ద్రవ్యమైతే, దానికి సంబంధించిన కార్యాలయంలో) చెల్లిస్తున్నాం కదా! అదే తీరుగా వర్షాన్నిచ్చే సూర్యునికి చేసుకోవలసిన విన్నపాన్ని నేలమీది సూర్య ప్రతినిధి అయిన శంకరునికి నివేదించుకుంటూ ఈయనకి సహస్ర ఘటాభిషేకాన్ని చేస్తున్నాం. ఇలా ఆ అభిషేకం ముగిసిందో లేదో అలా వర్షం కురవడాన్ని ప్రత్యక్షంగా గమనిస్తున్నాం. ఇదే తీరుగా ఏ సూర్యుడు బుద్ధికి అధిష్ఠాతగా ఉంటూ బుద్ధి వికాసాన్ని కలిగిస్తున్నాడో, ఆ బుద్ధి శక్తి పెరగడం కోసం కూడా ఆ సూర్యుని ప్రతినిధి అయిన శంకరుణ్నే మనం పరిగణనలోకి తీసుకుంటున్నాం. ఇది నిజం కాబట్టే మూడేళ్ల బుజ్జిగాడి పిడికిలిని తన పిడికిలిలో సున్నితంగా బిగించి దానిలో బలపాన్ని పెట్టి అక్షరాభ్యాసమనే పేరిట, చదువుల తల్లి అయిన సరస్వతి పేరునీ, అలాగే విద్యలకెల్ల ఒజ్జ అయిన వినాయకుని పేరునీ రాయించకుండా నమశ్శివాయ సిద్ధం నమః అనే రాయిస్తూ దిద్దిస్తున్నారు గురువులు తొలి రాత వేళ. రూపంలో కూడా శివ సూర్యులొక్కరే నీల - నీలి రంగు కల, గ్రీవః - మెడ కలిగినవాడు; వి - విశేషంగా అంటే మరింత, లోహితః - ఎర్రని శరీరచ్ఛాయ కలవారూ ఇటు సూర్యుడూ అటు శివుడూ అని తీర్మానిస్తోంది ఇంతకు వెనుక అనుకున్న ‘నీలగ్రీవో విలోహితః’ అనే మంత్ర భాగం. దీన్ని కొద్దిగా సమన్వయించుకు చూసుకోవాలి. సూర్యుణ్ని గాని తేలిపార చూస్తే సూర్యబింబం ముందుగా మరింత ఎర్రగా కన్పిస్తుంది (వి-లోహితః) . అలా చూస్తూన్న దశలో ఎర్రని రంగులో నీలిరంగు గుండ్రని బిళ్ల కూడా కనిపిస్తుంది (నీల - గ్రీవః). నీలిరంగు అనేది జలానికి సంకేతం. అందుకే సముద్రాలని గుర్తించే సందర్భంలో దేశ పటాల్లో సముద్రానికి నీలి రంగుని పులుముతారు. మరో విశేషం కూడా ఉంది. నీల-గ్రీవః అంటే నీలిరంగుతో ఉన్నవాడనేది మాత్రమే అర్థం కాకుండా నీలిరంగు కిరణాల ప్రసారం కూడా చేయగల శక్తి ఉన్నవాడని మరో అర్థం కూడా కనిపిస్తుంది. నీలిరంగు అనేది జలానికి సంకేతం కాబట్టే సూర్యుని నుండి పడే కిరణాలు నీటిని పీల్చి మేఘాలని ఏర్పాటు చేస్తాయి. ఆ నీరుపడే ఎండనే నీరెండ అని, అలాంటి నీరెండ పడే కాలంలో నీళ్లని తెచ్చుకునే స్త్రీల గమ్యం (వెళ్లే చోటు) ‘నీలాటి రేవు’ అనీ (నీరు+ఆడు+ రేవు - నీటితో నిండిన కిరణాలు ప్రసరిస్తున్న చెరువు ఒడ్డు) వ్యాఖ్యాన కర్తలు చెప్పారు. ఈ రెండు నామాలనే ఇటు శంకరునిక్కూడా సమన్వయించుకు చూడాల్సి ఉంది. ‘నీల - నీలి రంగు కల, గ్రీవః - మెడ కలవాడు శివు’డని దీనర్థం. శంకరుడు విషాన్ని స్వీకరించినప్పుడు గుటక వేయకుండా పార్వతి ఆయన కంఠాన్ని పట్టుకుంటే, అక్కడే పేరుకున్న విషం కాస్తా ‘నీలి రంగు’ మచ్చగా మెడమీద నిలిచిపోయింది. శంకరుడు నల్లని కంఠం కలవాడు కాడు. నీలకంఠుడు మాత్రమే. ఇక అదే శంకరుడు విశేషమైన ఎర్రని రంగు శరీరచ్ఛాయతో ఉంటాడు కూడా (వి-లోహితః). మరి తెల్లనివాడుగా ఎందుకు కన్పిస్తాడంటే తన ఎర్రని రంగు ఏమాత్రమూ కనిపించనంత దట్టంగా విభూతిని ఒంటికి పూసుకుని కన్పిస్తాడు కాబట్టి. ఇలా శివునికీ సూర్యునికీ సంపూర్ణ సంబంధం ఉంది. ఆ కారణంగానే సంధ్యావందనానికి అతి ముఖ్యమైన గాయత్రి మంత్రం శివపరంగా కూడా చెప్పబడింది. (భర్గో దేవస్య ధీమహి. భర్గః అంటే శివుడని కదా అర్థం!). శివుడూ సూర్యుడూ ఒక్కరు కాబట్టే సూర్యుని వేడి కిరణాల ప్రసారం కారణంగా ఏ చంద్రుడు కరిగి అమృతాన్ని లోకానికి అందిస్తున్నాడో, సరిగా అదే విధంగా శంకరుడు కూడా తన తలమీది చంద్రుని నుండి అమృతాన్ని (చావులేని తనాన్ని; అ-మృతాన్ని) లోకానికి అందిస్తూ ఉంటాడు. వ్యక్తులకి మరణం లేనితనాన్ని ఇవ్వగల శక్తిమంతుడు శంకరుడు కాబట్టే నమక మంత్రం ఆయన్ని ‘మొదటి భిషక్కు’ (ప్రథమో దైవ్యో భిషక్) అంది. భిషక్కు అనే మాటకి వైద్యుడని భావమంటారు సాధారణంగా. భిషక్కుకీ వైద్యుడికీ భేదం ఉంది. వైద్యుడంటే ఫలాని వ్యాధికి ఫలానిది ఔషధమని చెప్పే వైద్య శాస్త్ర నిపుణుడని అర్థం. అదే మరి భిషక్కంటే ఆ వ్యాధి నివారణానికి ఏది ఔషధమో తెలిసి, దాన్ని స్వయంగా తయారుచేసి ఇచ్చేవాడని అర్థం. కాలంలో కొద్ది వెనక్కి జరిగి చూస్తే, ఆనాటి వాళ్లంతా భిషక్కులేగాని వైద్యులుగా ఉండేవారు కాదు. వ్యాధితో వెళ్లడమే మన కర్తవ్యం - పరిశీలించడం ఔషధాన్నీయడం వాళ్ల బాధ్యతగా ఉండేది ఆ రోజుల్లో. ఎదుటి రోగికి వ్యాధిని నయం చేయడమనేదాన్ని ఈశ్వరారాధన అనే భావించేవారు నాటివారు. రుద్రుడు మరి ఇంతటి గొప్పవాడైన శంకరుడు ఎందుకు ఎర్రని నేత్రాలతో కోపంతో రుద్రునిగా ఉంటాడనేది మన అనుమానం. శివాభిషేకం చేయాలనుకోవడం తడవుగా మొదటగా వచ్చే మంత్రం ‘నమస్తే రుద్ర! మన్యవే ఉత’... అని. మహా కోపం కల రుద్రా! నీకు నమస్కారమని దీని భావం. ఆ కోపంతో మామీద బాణాన్ని ఎక్కుపెట్టవద్దని కూడా దానిలోని ప్రార్థన. ఏమిటి దీనిలో విశేషం? 84 లక్షల ప్రాణులనీ వాటికి సంబంధించిన వివిధ వివిధ ఆహారాలనీ, అవి నిత్యం తినబడుతూంటే తరిగిపోకుండా ఉండేలా ఎప్పటికప్పుడు చిగురించే మొక్కల్నీ (హరికేశేభ్యః...), ఇక ఒకే ఆహారపదార్థం కాకుండా ఒక్కో ప్రాణికీ అనేక ఆహార పదార్థాలనీ మనుష్యులకి యవలు మినుగులు నువ్వులు గోధుమలు - యవాశ్చమే మాషాశ్చమే తిలాశ్చమే గోధూమాశ్చమే.. ఇలా అడక్కుండా నేనిస్తూంటే, ఈ ద్రవ్యాలని సద్వినియోగపరుచుకోకుండా ఎందుకు వ్యర్థపరుచుకుంటున్నారనీ ద్వేషం, అసూయ, పగ... మొదలైన వాటితో ఎందుకు ఐకమత్యంతో ఉండటం లేదనీ ఆయన తన కన్నులని ఎర్రజేస్తే, ఆ ఎర్రని కన్నులు ‘రుద్రు’డనే పేరుని తనకి రప్పించాయి. ఆ పేరుని మన ప్రవర్తన ద్వారా మనం ఆయనకి తెప్పించాం తప్ప ఆయన ఎప్పుడూ (స్మేరాననః) చిరునవ్వుతో కనిపించే బేల శంకరుడు. (బోళా శంకరుడని లోకానికొచ్చింది. అమాయకుడని సరైన అర్థం). అందుకే ఈ మహాశివరాత్రి పర్వదినాన ఆ శంకరుణ్ని (లౌకిక సుఖాన్ని కలిగించేవాణ్ని) మయ-స్కరునిగా (అలౌకికమైన మోక్ష సుఖాన్ని ఇచ్చేవానిగా) చేయవలసిందిగా ప్రార్థిస్తూ అభిషేకాన్నీ జాగారాన్నీ ఉపవాస విధినీ పాటించాల్సి ఉంది మనం! తత్పురుషాయ విద్మహే మహాదేవాయ ధీమహి! త న్నో రుద్రః ప్రచోదయాత్! - డా॥మైలవరపు శ్రీనివాసరావు -
వివరం: కాళోజీ గొడవ
కాళోజీ అనే పదానికి సమానార్థకంగా నిలబడగలిగే మాట ఏమిటి? ప్రశ్న. తిరుగుబాటు. నిలదీత. గేయకవిత. దుఃఖం. ధిక్కారం. ఆత్మీయత. చట్టబద్ధత. నిజాయితీ. స్వీయపరిశీలన. వీటితోపాటు ‘తెలంగాణ ఆత్మ’ను అందులో చేర్చవచ్చేమో! జీవితమంతా పోరాటాల్లో మమేకమైన కాళోజీ నారాయణరావు... కాళన్నగా పరిణామం చెందడం ఒక చరిత్ర! ఉద్యమాలు జరుగుతున్నప్పుడు వాటిని ముందుండి నడిపించినా, తోడై వెంట నడిచినా, కవితై ప్రభవించినా... అప్పటికి మించినదేదో కూడా మాట్లాడగలిగినప్పుడే ఎవరికైనా ప్రాసంగికత! ప్రాంతాలకు అతీతంగా వారిని జనం కళ్ల కద్దుకుంటారు. కాళోజీ వ్యక్తిత్వం చాటేదిదే! 1914 సెప్టెంబర్ 9న జన్మించిన కాళోజీ శతజయంతి సంవత్సరమిది. ఆ ప్రజాకవి యాదిలో ఈ ప్రత్యేక కథనం... జరిగినదంతా చూస్తూ ఎరగనట్లు పడివుండగ సాక్షీభూతుణ్నిగాను సాక్షాత్తు మానవుణ్ని కాళోజీతో ఏ కొంత పరిచయమున్నవాళ్లయినా, ఆయన గురించిన అనెక్డోట్స్ ఇట్టే చెప్పేస్తూ ఉంటారు: ఒకసారి వరంగల్‌లో ఏదో సాహిత్య సమావేశం ప్రారంభం కావాల్సి ఉంది. సభికులు వచ్చారు. అతిథులు వచ్చారు. సమయం కూడా దగ్గరపడింది. అయినా అందరూ నిలబడే ఉన్నారు. కారణం? టెంట్‌హౌజ్ నుంచి వచ్చిన కుర్చీల బొత్తి మనిషెత్తు అలాగే ఉంది. వేసే మనిషి ఏమయ్యాడో తెలీదు. ఓహో, అయితే ఆ పనాయన వచ్చి, వేస్తేగానీ, ఈ కుర్చీలు వేసుకోమూ, కూర్చోమా; కాళోజీ చకచకా కుర్చీలు తీసి వేయడం మొదలుపెట్టారు. మిగిలినవాళ్లు ఆయన్ని అనుసరించారు. ‘మనిషంటే శ్రమ చేసేవాడే; అదే అసలైన నిర్వచనం’ అన్నాడు కాళోజీ మరో సందర్భంలో. ‘అన్యాయాన్నెదిరించినవాడు నాకు ఆరాధ్యుడు’ తండ్రి నుంచి మహారాష్ట్ర సత్వాన్ని, తల్లి నుంచి కర్ణాటక వారసత్వాన్ని పొంది, తెలుగు తత్వంతో పెరిగినవాడు కాళోజీ. ఆయన పూర్వీకులు ఎప్పుడో వరంగల్‌లో స్థిరపడ్డారు. జిల్లాలోని మడికొండ గ్రామం భవిష్యత్తులో కాళన్నగా మారబోయే కాళోజీని ప్రపంచానికి పరిచయం చేసింది. తండ్రి రంగారావు సహవ్యవస్థాపకుడైన ఊరి గ్రంథాలయం కాళోజీకి ప్రపంచాన్ని పరిచయం చేసింది. స్పందన కాళోజీ జీవగుణం. అది దుఃఖంలోంచి రావొచ్చు, అన్యాయం వల్ల కావొచ్చు. నూనుగు మీసాలు రాని పదహారేళ్ల ప్రాయపు కౌమారంలో ఆయన భగత్‌సింగ్ ఉరితీత(1931)కు బాధపడుతూ తన తొలి కవిత రాశాడు. వరంగల్ కాలేజియేట్ హైస్కూల్ విద్యార్థి సంఘం ప్రధాన కార్యదర్శిగా, యాజమాన్యం గణపతి ఉత్సవాలకు సెలవు నిరాకరిస్తే, 1400 మంది విద్యార్థుల్లో 1200 మంది విశ్వాసానికి అది వ్యతిరేకమైనదని భావించి, సుమారు 1100 మంది విద్యార్థుల చేత వ్యక్తిగత సెలవుచీటీలు ఇప్పించి మాస్ ప్రొటెస్ట్ చేయించాడు. మాటలేక నేను లేను కాళోజీ మనసంత గట్టిది కాదు శరీరం. ఇంటర్ చదువుతున్నప్పుడు క్షయ సోకింది. క్షయ ప్రాణాంతకమైన కాలం అది. వరంగల్‌లో పెదవి విరిచారు. హైదరాబాద్ ఉస్మానియా ఆసుపత్రికి తెస్తే, శస్త్రచికిత్స చేసి ఒక ఊపిరితిత్తిని తొలగించారు. ఆపరేషన్ తర్వాత విశ్రాంతి తీసుకొమ్మన్నారు వైద్యులు. ఆ సమయంలో కాళోజీ ఎవరితోనో మాట్లాడుతుంటే, ‘ఇలా ఎక్కువసేపు మాట్లాడితే ఆరు మాసాల్లో చనిపోతా’వన్నాడట డాక్టర్. ‘మాట్లాడకుంటే ఆరు రోజుల్లోనే చనిపోతా’నన్నాడట కాళోజీ. ఆ మాట అనేదాన్ని పోరాట ప్రతీకగా తీసుకుంటే, కాళోజీ మౌనంగా ఎన్నడూ లేడు; చివరిదాకా మాట్లాడుతూనే ఉన్నాడు. జీవితకాలమంతా మిగిలిన ఆ ఒక్క ఊపిరితిత్తితోనే బతికిన కాళోజీ, దాంతోనే ధైర్యాన్ని ఉచ్ఛ్వసించాడు; కవిత్వాన్ని నిశ్వసించాడు: అవనిపై జరిగేటి అవకతవకల చూసి ఎందుకో నా హృదిని ఇన్ని ఆవేదనలు పరుల కష్టము జూచి కరిగిపోవును గుండె మాయమోసము జూచి మండిపోవును ఒళ్లు ఇలా ప్రకటించుకున్నవాడు కాబట్టే, ఆంధ్రమహాసభ ఉద్యమంలో చేరాడు. ఆర్యసమాజ్‌లో పనిచేశాడు. భారత స్వాతంత్య్రానికి మునుపు, 1946లో వరంగల్ కోట మీద జాతీయ జెండా ఎగరేసిన కాంగ్రెస్ వాళ్లలో కాళోజీ ఉన్నాడు. కత్తులతో, కఠార్లతో రజాకార్లు స్వైరవిహారం చేస్తున్న సందర్భం అదని చెబితే ఈ సంఘటన తీవ్రత తెలుస్తుంది. స్వాతంత్య్రానంతరం హైదరాబాద్ సంస్థానాన్ని భారత యూనియన్‌లో కలిపే పోరాటంలోనూ కాళోజీ పాల్గొన్నాడు. తెలంగాణ ఉద్యమానికి, మానవ హక్కుల ఉద్యమానికి, పౌర హక్కుల ఉద్యమానికి మద్దతుగా నిలిచాడు. ఏ పోరాటాలైతే ఆయన్ని ప్రజాకవిని చేశాయో, ఆ పోరాలన్నింటిలోనూ ఆయన ప్రజలకు బాధ్యుడిగా ఉన్నాడు. రచయితవల్ల ఏమవుతుంది? సాహిత్య సమాజంలో విశిష్టస్థానం ఉన్నవాడు, అందునా వేమన మళ్లీ పుట్టాడనిపించుకున్నంత పాటివాడు అతిశయపు బారిన పడటం సహజం. కానీ కాళోజీకి సాహిత్య పరిమితుల పట్ల చాలా స్పష్టత ఉండేది. ‘సమాజంలో విలువలను మార్చగలనన్న విశ్వాసం, మారుస్తానన్న ధీమా, మార్చవలెనన్న ఆతురత రచయితకు ఉంటుంది. అదంతా వట్టి భ్రమే,’ అన్నాడు. ఎందుకంటే, విలువలు మారడానికి కారణాలు వేరే ఉంటాయి. ‘(పాఠకుడి) వ్యక్తిగత టెంపరిమెంటు వల్ల, టెంపరిమెంటు వ్యక్తికి ఒక రకమైన సంస్కారాన్ని, అభిరుచులనూ, అలవాట్లనూ కలగజేస్తుంది. ఆ సంస్కారాన్నీ అభిరుచులనూ బట్టీ ఆ వ్యక్తి తన రచయితలనూ, సాహిత్యాన్నీ ఎంచుకుంటాడు. రచన పట్ల పాఠకునికి ఏర్పడే అభిమానం రచన యొక్క విశేషం కాదు,’ అన్నాడు. అయితే, సాహిత్యానికి ప్రయోజనం ఏమిటి? ‘రాజకీయ విప్లవాల ద్వారా స్వాతంత్య్రాన్ని సాధించవచ్చు. విప్లవానంతరం ఏర్పడిన ప్రభుత్వాలు తమ కృషి ద్వారా సమానత్వాన్నీ స్థాపించవచ్చు. కానీ సౌభ్రాతృత్వం లేనిదే ఈ రెండింటివల్ల కలిగే ఫలితం సర్వేజనులకు చెందదు. ఈ సౌభ్రాతృత్వానికి కృషి చేయవలసింది రాజకీయనాయకులూ, విప్లవ కోవిదులూ కాదు; రచయితలు. నాయకులు విఫలమైనచోట రచయిత విజయం సాధించగలిగేది ఇక్కడే,’ అన్నాడు. సాహిత్యం సర్వస్వం కాదని చెబుతూనే, సముచిత పీఠాన దాన్ని కూర్చోబెట్టాడు. తలవంచిన శిఖరం సాహిత్యమే కాదు, జీవితపు పరిమితులను కూడా ఎరిగినవాడు కాళోజీ. ఆయనకు జీవితం, సాహిత్యం వేర్వేరుకాదు; అయినప్పటికీ తనలో ఉన్న ఆ లేశమాత్రపు దారితప్పడాన్ని కూడా వెల్లడించకుండా ఊరుకోలేదు. గాంధీజీలాగా, చలంలాగా తన పొరపాట్లను తాను ప్రశ్నించుకున్నాడు. మానవ బలహీనతల గురించిన అత్యంత స్పృహ ఉన్నవాళ్లకు తప్ప ఇది సాధ్యం కాదు. కాళోజీ ఉద్యమ జీవితంలో ఎన్నోసార్లు జైలుపాలయ్యాడు. ఒకసారి తప్పనిసరై నేరస్థజాతికి చెందిన మనిషితో లాకప్‌ను పంచుకోవాల్సి వచ్చింది. రాజకీయఖైదీ తను. ‘వాడు’ నేరగాడు. ఇక సమానత ఎక్కడ? అలాంటిది అతడు గాంధీజీ పేరెత్తగానే విచిత్రపడిపోయి కౌగిలించుకున్నాడట. ‘నైజాం సంస్థానం మారుమూల గ్రామాల్లో అంత అట్టడుగు జీవితాల్లో కూడా గాంధీ పేరు చొచ్చుకుపోయింది. మేము మాత్రం మా అజ్ఞానంతో, అహంకారంతో గ్రామీణులను దూరం చేసుకున్నం. గ్రామీణులతో కల్సిమెల్సి ఉండాలనే గాంధీ బోధనలు మామీద ఏ ప్రభావం వెయ్యలేదన్న విషయం ఆ రోజున నాకు సాక్షాత్కారం జరిగిందన్నమాట. నా జీవితంల మరపురాని ఘట్టం. ఆ విషయం చెప్తుంటె ఇప్పుడు కూడా కన్నీరాగడం లేదు,’ అని ఆ అనుభవాన్ని పంచుకున్నాడు. అది తన గర్వభంగపు ఘటనగా చాటుకున్నాడు. చట్టబద్ధమైన పౌరుడు కాళోజీకి దేశమంతా పరిచయస్థులే, మిత్రులే! రావి నారాయణరెడ్డి, దేవులపల్లి రామానుజరావు, మాడపాటి హనుమంతరావు, సురవరం ప్రతాపరెడ్డి, పొట్లపల్లి రామారావు, టి.హయగ్రీవాచారి, గాడిచర్ల హరిసర్వోత్తమరావు, గార్లపాటి రాఘవరెడ్డి, విశ్వనాథ సత్యనారాయణ, జాషువా, దాశరథి, సినారె, బిరుదురాజు రామరాజు, కన్నాభిరాన్, ఎస్ ఆర్ శంకరన్, సంజీవదేవ్, చలసాని ప్రసాద్, మో, శ్రీశ్రీ, కృష్ణాబాయి, కాళీపట్నం రామారావు, మహాశ్వేతాదేవి, జ్వాలాముఖి, ఆరుద్ర, నగ్నముని, జయశంకర్, నాగిళ్ల రామశాస్త్రి, గద్దర్, వరవరరావు, ఎన్.వేణుగోపాల్; వయసులు, సిద్ధాంతాలు, ప్రాంతాలు, హోదాలతో సంబంధం లేకుండా అందరూ ఆయనతో స్నేహం చేశారు. అటుగా వచ్చిన ప్రతివాళ్లూ కాళోజీని పలకరించకుండా, ఎటుగా వెళ్లినా వాళ్లను కాళోజీ పలకరించకుండా వచ్చేవాడు కాదు. కొండపల్లి సీతారామయ్య కూతురి వివాహం తన చేతుల మీదుగా జరిపించాడు. మిత్రుల జాబితాలో సాక్షాత్తూ పీవీ నరసింహారావులాంటి వ్యక్తి కూడా ఉన్నారు. పీవీ ప్రధాని కాబట్టి ఈ అదనపు విలువ ఇవ్వడం కాదు; ప్రధాని తన స్నేహితుడిగా ఉన్నా తన నిబద్ధత తను ఎరిగినవాడు కాళోజీ అని చెప్పడానికి. మద్య నిషేధం అమల్లో ఉన్నప్పుడు, ఒకాయన ఇంటికివెళ్తే కాళోజీకి మద్యం ఆఫర్ చేశాడట. ‘ప్రభాకర్! బయట మద్యనిషేధ చట్టం ఉన్నది గనక తాగవద్దు. ఐనా తాగుదామంటవు ఖైరతాబాద్ చౌరస్తాకు బోయి, విశ్వేశ్వరయ్య విగ్రహం దగ్గర నడీ చౌరస్తాల నిలబడి ఈ చట్టాన్ని మేము ఒప్పుకోవడం లేదు, కాబట్టి దీన్ని ఉల్లంఘిస్తున్నం అని తాగుదాం,’ అన్నాడు. అదీ ఆయన తత్వం. చాటుమాటుగా కాదు, ఏదైనా బాజాప్తాగా చేయాలనేవాడు. చేతికింద నలుగురు కుర్రాళ్లు ఉండగలిగే ‘పెద్దరికం’ వచ్చాక కూడా, కరెంటు బిల్లు కట్టడానికి వరుసలో నిలబడ్డవాడు కాళోజీ. పలుకుబడుల భాష కావాలి! శిష్ట వ్యవహారికం కాదు, వ్యవహార శిష్టత కావాలనేవాడు కాళోజీ. ‘నీ భాషల్నే నీ బతుకున్నది; నీ యాసల్నే నీ సంస్కృతున్నది... ఎవని వాడుక భాష వాడు రాయాలె. ఇట్లరాస్తే అవతలోనికి తెలుస్తదా అని ముందర్నే మనమనుకునుడు, మనను మనం తక్కువ చేసుకున్నట్లె. ఈ బానిస భావన పోవాలె. నేనెన్నోసార్లు చెప్పిన. భాష రెండు తీర్లు- ఒకటి బడిపలుకుల భాష, రెండోది పలుకుబడుల భాష. పలుకుబడుల భాష గావాలె,’ అనేవాడు కాళోజీ. తెలంగాణ వరకే కాదు, తన భాషా సోయిని కళింగాంధ్ర, రాయలసీమకు కూడా వ్యాపింపజేసిన ‘వ్యవహార’దక్షుడు. రామలక్ష్మణులు కాళోజీ అన్న కాళోజీ రామేశ్వరరావు ‘షాద్’ పేరుతో ఉర్దూ కవిత్వం రాశాడు. తమ్ముడి హైపర్‌యాక్టివ్‌తనం వల్ల ఆయన ప్రభ వెనకబడిపోయినా వాళ్లిద్దరూ అన్యోన్యంగా బతికారు. న్యాయ శాస్త్రం చదివుండీ కాళోజీ ఏనాడూ రూపాయి సంపాదించకపోయినా ఆయనే ఇల్లు గడుపుతూ వచ్చాడు. ఒకవిధంగా తండ్రి తర్వాత తండ్రిలా సాక్కుంటూ వచ్చాడు. 1996లో రామేశ్వరరావు చనిపోయినప్పుడు, ‘నేను నా ఆరవయేట మా అన్న భుజాల మీదికెక్కినాను. ఆయన మరణించేదాకా దిగలేదు. నేను ఆయన భుజాల మీదికి ఎక్కడం గొప్ప కాదు. 70 ఏళ్ల వరకూ ఆయన నన్ను దించకుండా ఉండడం గొప్ప,’ అన్నాడు. అపురూప అతిథి ‘ఇచ్ఛయే నా ఈశ్వరుడని కచ్చితముగ నమ్ముతాను. ఇచ్ఛ వచ్చినట్టు నేను ఆచరించి తీరుతాను. జరిగిన దానిని తలవను. జరిగేదానికి వగవను. ఒరగనున్నదిది యని ఊహాగానము చేయను. సంతసముగ జీవింపగ సతతము యత్నింతుగాని ఎంతటి సౌఖ్యానికైన ఇతరుల పీడింపలేను- ఇది అభిలాష, ఆదర్శము,’ అని ప్రకటించుకున్న కాళోజీ తన సోదరుడు మరణించిన ఆరేళ్లతర్వాత, 2002లో భూమాత భుజాలు శాశ్వతంగా దిగిపోయాడు. జీవనశైలిలో గాంధీతత్వాన్ని నింపుకుని, సామాజిక కోణంలో సామ్యవాదిగా బతికిన కాళోజీ మరణానంతరం తన భౌతికకాయాన్ని కాకతీయ మెడికల్ కాలేజీకి దానం చేసేలా చూసుకున్నాడు. ‘అతిథి వోలె ఉండి ఉండి అవని విడిచి’ వెళ్లిపోయాడు. ‘ఎవడో కాళోజీ అట...’ చిన్న చిన్న ఉద్వేగాలకు కూడా కాళోజీ కళ్లనీళ్లు పెట్టుకునేవాడు. ‘మనమే నయం’, ‘తెలియక ప్రేమ తెలిసి ద్వేషము’, ‘విభూతి లేక ఫేస్‌పౌడర్’, ‘లంకా పునరుద్ధరణ’, ‘ఆగస్టు పదిహేను’ లాంటి కథలు రాశాడు. పురాణకథలను రీటోల్డ్ మాదిరిగా తిరగరాస్తూ, ప్రతికూల సామాజిక విలువలను నిరసించేవాడు. ఎక్కువగా మనుషుల బుద్ధిమారనితనం ఆయన కథావస్తువు. ఓసారి కమ్యూనిస్టు నాయకుడు రావి నారాయణరెడ్డి ఆయనకు రాసిన ఉత్తరం సాక్ష్యంగా అరెస్టయ్యాడు. కాళోజీ నివాసమున్న హన్మకొండలోని నక్కలగుట్ట ప్రాంతాన్ని కాళోజీనగర్ అంటున్నారు. కాళోజీ 86వ జన్మదినం రోజున జరుగుతున్న సన్మానసభలో మాజీ ప్రధాని పీవీ నర్సింహారావు ‘పెద్దలు శ్రీ కాళోజీ నారాయణరావు గారు’ అని ఉపన్యాసం ప్రారంభించగానే, ‘గారెక్కడిదిరా?’ అని గర్జించాడు. ఏదో ఒక పార్టీకో, సిద్ధాంతానికో గుడ్డిగా కట్టుబడి ఉండటాన్ని పార్టీవ్రత్యం అనేవాడు. 32 మంది కవులు, పండితులకు ప్రభుత్వం ఉగాది పురస్కారాలు ఇచ్చే సందర్భం అది. వేదిక మీద మూడే కుర్చీలు వేశారు. ఆ మూడు ఎవరికీ అని వేస్తున్నతణ్ని అడిగితే, సీఎం, సంబంధిత మంత్రి, సాహిత్య సలహాదారుకని చెప్పాడు. సన్మానం అందుకునేవాళ్లలో వృద్ధులున్నారు. 90-95 ఏండ్ల రాజమండ్రి పండితుడు కూడా ఉన్నారు. వీళ్లందరూ వేదిక ఎక్కి, శాలువా కప్పించుకుని, సత్కారం అందుకునేదాకా నిలబడే ఉండాలా? ఇదేనా పెద్దలకిచ్చే మర్యాద? అందరికీ వేదిక మీద కుర్చీలు వేయాలన్నాడు కాళోజీ. నాకు అదంతా తెలియదని అతడు బదులిచ్చాడు. ‘నీకు ఇట్ల వెయ్యాలని చెప్పినోని దగ్గరికిపో, పోయి, ఎవడో కాళోజీ అట, ఇట్లన్నడు అని చెప్పు, నీదేమున్నది’ అన్నడట. తర్వాత అందరికీ వేదిక మీద కుర్చీలు ప్రత్యక్షమైనాయి. కాళోజీ జీవనరేఖలు జననం 9 సెప్టెంబర్ 1914 తల్లిదండ్రులు కాళోజీ రంగారావు (మహారాష్ట్ర), రామాబాయి (కర్ణాటక) భార్య రుక్మిణీబాయి (వివాహం; 1940) కొడుకు రవికుమార్ కాళోజీ కవితల సంకలనం ‘నా గొడవ’ ‘ఇదీ నా గొడవ’ పేరుతో ఆత్మకథ రాశాడు. ఆంధ్ర సారస్వత పరిషత్తు వ్యవస్థాపక సభ్యుడు ఆంధ్ర ప్రదేశ్ సాహిత్య అకాడెమీలో సభ్యుడు శాసనమండలి సభ్యుడు(1958-60) 1992లో పద్మవిభూషణ్ పురస్కారం అందుకున్నాడు. మరణం 13 నవంబర్ 2002 తెలుగు బిడ్డవురోరి తెలుగు మాట్లాడుటకు సంకోచపడియెదవు సంగతేమిటిరా? - కాళోజీ -
వివరం: తెలుగు తెలుగే కనెక్షన్
పదేళ్ల తర్వాత, ‘మనం’ అంటే ఎవరిని ప్రతిబింబిస్తుందో ఇప్పుడు చెప్పడం కష్టం. ఇప్పటికైతే మనం అంటే మనమే! భాషగా తెలుగువాళ్లమే!! ప్రాంతంగా భారతీయులమే!!! ఇలాంటి ‘మనవాళ్లు’ వీరందరూ! వీళ్లంతా తెలుగువాళ్లు; లేదా, తెలుగు నేలతో ముడిపడినవాళ్లు; వీళ్లకు తెలుగుతో సంబంధముందని చెబితే, ‘అవునా’ అని ఆశ్యర్యం పుట్టించేవాళ్లు. అందులో కొందరి గురించైనా కొంతమేరకు ఈ ప్రత్యేక కథనం. బెంగాలీ అమ్మాయి సుస్మితాసేన్‌కు 1994లో ‘విశ్వ సుందరి’ కిరీట ధారణ జరిగినప్పుడు, హైదరాబాద్‌లో కూడా ఆనందం వెల్లివిరిసింది; ఆమెను పల్లకీలో కూడా ఎక్కించి తిప్పారు. కారణం? సుస్మిత కళ్లు తెరిచింది హైదరాబాద్ నగరంలో. వాళ్ల నాన్న శువేర్ సేన్ ఎయిర్ ఫోర్స్ ఉద్యోగంలో భాగంగా ఇక్కడ పనిచేస్తున్నప్పుడు సుష్ పుట్టింది. అదీ విషయం! కోపం ప్రదర్శించడానికి కారణాలు కావాలిగానీ, సంతోషం పంచుకోవడానికి ఏమీ అక్కర్లేదు; అది సంతోషం కలిగించే విషయమైతే చాలు. హర్షా మనవాడే! క్రికెట్ వ్యామోహం ఉన్నవాళ్లకు హర్షా భోగ్లే ఇట్టే తెలుసు. ఏ క్రికెట్ సీజన్లోనైనా ఈఎస్పీఎన్లోనో, స్టార్ స్పోర్ట్స్లోనో తెరమీదకు వచ్చేది హర్షానే. ఇరవై ఏళ్లలో ఆటగాళ్లు ఎందరో రిటైర్ అయివుండవచ్చుగానీ, కామెంటేటర్‌గా హర్షా ఇప్పటికీ ‘క్రీజు’లోనే ఉన్నారు. ఈ మరాఠీ ప్రొఫెసర్(ఎ.డి.భోగ్లే) కొడుకు హైదరాబాద్‌లోనే పుట్టారు; ఇక్కడి గల్లీల్లోనే క్రికెట్ నేర్చుకున్నారు; హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో చదివారు; ఉస్మానియా యూనివర్సిటీలో కెమికల్ ఇంజినీరింగ్ చదువుతూ క్రికెట్ జట్టుకు ప్రాతినిధ్యం వహించారు; 19 ఏళ్లప్పుడు హైదరాబాద్ ఆల్ ఇండియా రేడియోలో కామెంటేటర్‌గా తొలి అడుగులు వేశారు; కాబట్టి, హర్షా తెలుగు మాట్లాడగలుగుతారని చెప్పడం చాలా చిన్న విషయం. ‘‘ఇది మన తెలుగువాళ్ల కోసం...’’ అని ఓసారి ట్వీట్ కూడా పెట్టారు. స్పందనలన్నీ తెలుగులోనే వస్తుంటే, ‘‘ఇదేంటి! రెండు ట్వీట్స్ తెలుగులో చేస్తే మీరు అందరూ తెలుగులోనే జవాబులు ఇస్తున్నారు. అంత బాగా తెలుగు రాదు,’’ అని రాదంటూనే వచ్చని నిరూపించుకున్నారు. నా మాతృభాష తెలుగు హర్షా రాదన్నారుగానీ, క్రికెటర్ రోహిత్ శర్మ అయితే, ‘అవును, నా మాతృభాష తెలుగు. మా అమ్మది వైజాగ్,’ అని చెప్పేశారు. ఐపీఎల్లో ఎవరున్నా లేకున్నా పదేళ్ల పాటు రోహిత్ కచ్చితంగా ఉంటాడన్నంతగా తన ప్రతిభను చాటుకున్న ఈ తెలుగు బిడ్డ నాగ్‌పూర్‌లోనే పుట్టి పెరిగినప్పటికీ, ఇక్కడి వైజాగ్ సముద్రంతో సంబంధం ఉంది. వాళ్ల అమ్మ పూర్ణిమ, అమ్మమ్మ విశాలాక్షి ఇక్కడివాళ్లే. వాళ్లమ్మ తెలుగు, మరాఠీల్లో ఇంటర్వ్యూలు ఇచ్చేస్తూ తన కొడుకు గురించి మురిసిపోతూ ఉంటారు. ఉండరా మరి! మరాఠీ ప్రాంతంలో ఉంటూ కూడా రోహిత్ తెలుగులో చక్కగా మాట్లాడేస్తుంటే! తెలుగు రేఖ! బాలీవుడ్ నటీమణి రేఖకు తెలుగుతో ఏమైనా సంబంధం ఉందా? రేఖ తల్లి పుష్పవల్లి తెలుగు వనిత. వరవిక్రయం, చెంచులక్ష్మి లాంటి సినిమాల్లో నటించారు. తమిళంలోనూ నటించినప్పుడు జెమినీ గణేశన్‌తో జీవితాన్ని ముడేసుకున్నారు. రేఖ అక్కడే జన్మించొచ్చుగాక, కానీ తన 180 చిత్రాల సుదీర్ఘ కెరీర్‌ను ‘రంగుల రాట్నం’లో బాలనటిగా ప్రారంభించారు. అంతకంటే సంబరపడే విషయం, తనదైన గొంతుతో తెలుగును పలికించగలగడం! జానీ జానీ తెలుగు పప్పా! హిందీ సినిమాలు చూసేవాళ్లకు చెప్పే పనిలేదుగానీ, చూడనివాళ్లకు జానీ లీవర్ను పరిచయం చేయాలంటే ఈ పోలిక తప్పదు. టాలీవుడ్లో బ్రహ్మానందం ఎంతో, బాలీవుడ్లో జానీ లీవర్ అంత. కామెడీలో ఇద్దరూ కింగులే అనేది పక్కనపెడితే, బ్రహ్మానందంలాగే జానీ లీవర్ కూడా అచ్చమైన తెలుగువాడు. ప్రకాశం జిల్లాలో జాన్ ప్రకాశ్ రావుగా పుట్టి, బతుకుతెరువుకోసం ముంబై వెళ్లి, తనకు సహజంగా అబ్బిన మిమిక్రీలు ప్రదర్శిస్తూ, హిందుస్తాన్ లీవర్ కంపెనీలో చేరి, అక్కడివాళ్లను తెగనవ్వించి, ఆ పేరులోని లీవర్ను తనకు తగిలించుకుని, హిందీ సినిమాల్లో జానీ లీవర్‌గా తెలుగు కేతనం ఎగరవేశారు. 300 సినిమాల్లో నటించిన జానీ ఏకైక తెలుగు చిత్రం ‘క్రిమినల్’ ఇది బాధే అయినా, సంతోషపెట్టే విషయం ఏమిటంటే ఆయన ఇక్కడి అమ్మాయి సుజాతనే పెళ్లి చేసుకున్నారు. వాళ్ల పిల్లలిద్దరూ(కూతురు జేమీ, కొడుకు జెస్సీ) బ్రహ్మాండంగా తెలుగు మాట్లాడతారు. గొప్ప దర్శకుడి ఇష్టురాలు భారతీయ సినిమాను సుసంపన్నం చేసిన నట దర్శకుడు గురుదత్ మెచ్చిన వహీదా రెహమాన్ రాజమండ్రి అమ్మాయి. ‘రోజులు మారాయి’లో ‘ఏరువాకా సాగారో రన్నో చిన్నన్నా’ పాటలో నృత్యం చేసిన అందగత్తె వహీదాను హైదరాబాద్‌లో చూసి, ఈ కొత్తముఖమే తన సినిమాలకు కావాలనుకున్నాడు గురుదత్. వహీదాకు ఉర్దూ కూడా రావడం ఇద్దరికీ లాభించింది. లేదంటే, ప్యాసా, కాగజ్ కే ఫూల్ లాంటి సినిమాల్లో వహీదాను ఎవరు భర్తీ చేయగలరు! అలాగే, గైడ్, నీల్ కమల్ లాంటి చిత్రాలను ఎవరు పూరించగలరు! అందాల ఝరి! 1970ల్లో ‘చిత్ చోర్’, ‘గోపాల్ కృష్ణ’ లాంటి హిందీ సినిమాల్లో నటించిన జరీనా వాహబ్ ఇక్కడివారంటే కొంచెం ఆశ్చర్యమే! కడపలో పుట్టిన జరీనా పుణె ఫిలిం ఇన్స్టిట్టూట్లో శిక్షణ పొందారు. ‘గాజుల కిష్టయ్య’ ‘అమర ప్రేమ’ ‘హేమాహేమీలు’ లాంటి తెలుగు సినిమాల్లో నటించినా, ఈ నాచురల్ బ్యూటీ బాలీవుడ్ వైపు వెళ్లిపోయారు. ‘రక్త చరిత్ర’లో ప్రతాప్ వాళ్లమ్మ పాత్ర వేసింది కూడా జరీనానే! ఇంకో విషయం ఏమిటంటే, తను ప్రేమించి పెళ్లాడిన నటుడు ఆదిత్య పంచోలి ‘షాడో’ చిత్రంలో నటించడానికి కారణం కూడా ఈ తెలుగు సంబంధమే. శంకరయ్య వస్తావయ్యా! నట లెజెండ్ రాజ్‌కపూర్ నటించి దర్శకత్వం వహించిన ‘శ్రీ 420’ చిత్రంలో ఒక హిందీ పాట ‘రామయ్యా వస్తావయ్యా’ లాంటి తెలుగు మాటతో మొదలైందంటే దానిక్కారణం సంగీతద్వయం ‘శంకర్-జై కిషన్’లోని శంకర్! అసలు పేరు శంకర్ సింగ్ రఘువంశీ. గుజరాత్ వాడైనా తండ్రి ఇక్కడ హోటల్ వ్యాపారంలో ఉండటంతో హైదరాబాద్‌లో పెరిగారు. సంగీతంలో ఆసక్తికొద్దీ తబలా పట్టుకుని ముంబై పయనమయ్యారు. జై కిషన్ జోడీగా ‘చోరీ చోరీ’ ‘బ్రహ్మచారి’ ‘మేరా నామ్ జోకర్’ ‘జిస్ దేశ్ మే గంగా బెహ్తీ హై’ ‘సంగం’ లాంటి చిత్రాలకు స్వరకల్పన చేశారు. హిందీలో ఉటంకించిన ఆ తెలుగు మాటతోనే ఇటీవల ఒక హిందీ చిత్రం వచ్చింది, ఇంకో తెలుగు సినిమా రాబోతోంది. ఎంత శక్తిమంతమైన పాట! ఎంత శక్తిమంతమైన సంగీత దర్శకుడు! తొలి సూపర్‌స్టార్! బాలీవుడ్ ఇంకా ఏర్పడకముందు, (ఇంగ్లీషు) మూకీల్లో నటించి, హిందీ టాకీలు వచ్చాక అందులో సూపర్‌స్టార్ ఇమేజ్ తెచ్చుకున్న నటుడు పైడి జయరాజ్. ఆయనది కరీంనగర్ జిల్లా. నిజాం కాలేజీలో చదువుతూ నటన మీది ఆసక్తితో 1929లో బొంబాయి వెళ్లారు. షాజహాన్, పృథ్వీరాజ్, రాణా ప్రతాప్, టిప్పు సుల్తాన్ లాంటి చారిత్రక పాత్రలకు పెట్టింది పేరైన జయరాజ్ మొహర్, సాగర్ లాంటి సినిమాలకు దర్శకత్వం కూడా వహించారు. 1980లో జయరాజ్‌ను దాదాసాహెబ్ ఫాల్కే పురస్కారంతో ప్రభుత్వం గౌరవించింది. వాహ్ అజీజ్! గజల్ గాయకుడు తలత్ అజీజ్ హైదరాబాదీ! ఎన్నో ఆల్బమ్స్ విడుదల చేశారు. ఉమ్రావ్ జాన్, బజార్ లాంటి సినిమాల్లో పాడారు. దీవార్, నూర్జహాన్, ఎహ్సాస్, సురూర్ లాంటి టెలీ సీరియల్స్‌కు సంగీత దర్శకత్వం వహించారు. సానియా మీర్జా అంకుల్ కూడా! మన శ్యామ్! అంకుర్, నిషాంత్, మంథన్, భూమిక లాంటి హిందీ చిత్రాలతో 1970ల్లో న్యూ వేవ్ శకానికి తెరలేపిన శ్యామ్ బెనెగల్ సికింద్రాబాద్‌లోని తిరుమలగిరిలో పుట్టారు. నిజాం కాలేజీ, ఉస్మానియా యూనివర్సిటీల్లో చదివారు. జన జీవితాన్ని ఆకళింపు చేసుకున్నారు. స్వాతంత్య్రపు పూర్వ తెలంగాణ భూస్వామ్య వ్యవస్థను, ఉత్సవాలను తన సినిమాల్లో బొమ్మకట్టారు. ‘‘ఇది నా జన్మభూమి,’’ అంటారు బెనెగల్. యాభై ఏళ్ల క్రితం ముంబై తరలివెళ్లినా ఇక్కడిలాంటి సంస్కృతిని మరెక్కడా చూడలేదంటారు దాదాసాహెబ్ ఫాల్కే, పద్మభూషణ్ పురస్కారాలను అందుకున్న ఈ దేశం గర్వించదగ్గ దర్శకుడు. మన రిపోర్టర్! ‘రూరల్ రిపోర్టర్’ పి.సాయినాథ్ కూడా తెలుగువాడే! రైతుల వెతల మీద ఆయన ఎన్నో విలువైన కథనాలు రాశారు. కరువు, ఆకలి మీద గొప్ప పట్టున్న నిపుణుడిగా సాయినాథ్ నోబెల్ గ్రహీత ఆమర్త్యసేన్ కితాబు పొందారు. తమిళ తెలుగులు ద్రవిడోద్యమ నేత అన్నాదురై తెలుగు మూలాలు ఉన్నవారు. ఒక ఇంటర్వ్యూలో, ‘మా అమ్మ బంగారమ్మ, కంచిగుళ్లో దేవదాసీ, స్పష్టంగా తెలుగు మాట్లాడుతుంది,’ అని చెప్పారు. అన్నాదురై వారసుడు, మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి కూడా ఇక్కడివారే! నట ముఖ్యమంత్రి ఎమ్జీయార్ మలయాళీయుడు అని కరుణ వర్గం ‘నాన్-తమిళ్’ ఇష్యూ తెచ్చినప్పుడు, కరుణానిధి కూడా తమిళుడు కాదు; వాళ్లది కృష్ణా జిల్లా మువ్వ ప్రాంతం అని ఎమ్జీయార్ ప్రకటించారు. ఎండీఎంకే పార్టీ నేత, వై.గోపాలస్వామి(వైగో) మూలాలూ ఇక్కడివే. నటదర్శకుడు కె.భాగ్యరాజా అంతే! అలాగే, డీఎండీకే పార్టీ వ్యవస్థాపకుడు, సినీ నటుడు విజయ్‌కాంత్ కూడా తెలుగు వేర్లున్నవారే! ఇంట్లో తెలుగు మాట్లాడుతారు కూడా. అంటే, తమిళ రాజకీయాల్ని మలుపు తిప్పేదంతా తెలుగువాళ్లే! ఇంకా ఎందరో... బాలీవుడ్లో భిన్నమైన సినిమాలు చేస్తున్న దర్శకుడు, నటుడు నగేశ్ కుకునూర్ జన్మించింది హైదరాబాద్‌లోనే. లిటిల్ ఫ్లవర్ కాలేజీలో చదువుకున్నారు; నారాయణగూడ టాకీసుల్లో సినిమాలు చూశారు. అందువల్లే ‘హైదరాబాద్ బ్లూస్’ లాంటి సినిమా పుట్టింది. తర్వాత నగేశ్ ‘రాక్‌ఫోర్డ్’ ‘బాలీవుడ్ కాలింగ్’ ‘ఇక్బాల్’ లాంటి భిన్నమైన సినిమాలను అందించారు. ఇక్కడి అల్లుళ్లు... తమిళ నటుడు, దర్శకుడు, నిర్మాత, సంగీత దర్శకుడు లాంటి బహుముఖ ప్రజ్ఞాశాలి టి.రాజేందర్ తెలుగు నటి ఉషను పెళ్లి చేసుకున్నారు. వీళ్లబ్బాయే ఇప్పటి సూపర్ హీరో శింబు. సంగీత దర్శకుడు అనూ మాలిక్ తమ్ముడిగా డాబూ మాలిక్‌ను పరిచయం చేయొచ్చు. కానీ, డాబూ తెలుగు సినిమా ‘సర్వర్ సుందరం గారి అబ్బాయి’లో నటించారు. దానికన్నా ముఖ్య విషయం, తెలుగమ్మాయి జ్యోతిని పెళ్లి చేసుకున్నారు. ఎంటీవీలో ప్రాక్టికల్ జోకుల షో ‘బక్రా’ యాంకర్ సైరస్ బ్రోచా కూడా హైదరాబాద్ అల్లుడే! ఆయేషాను సైరస్ వివాహం చేసుకున్నారు. ఇక్కడే పుట్టినవాళ్లు... అంతర్జాతీయ నటి, పద్మభూషణ్ గ్రహీత షబానా అజ్మీ జన్మస్థలం హైదరాబాదే! సామాజిక కార్యకర్తగా కూడా పేరుమోసిన షబానా అంకుర్, నిషాంత్, అర్థ్, మాసూమ్, మండి, ఫైర్ లాంటి ఎన్నో విమర్శకుల మెప్పు పొందిన సినిమాల్లో నటించారు. ఈ నగరంలో పుట్టిన తారకు ఏఎన్నార్ అవార్డు ఇవ్వడం మరింత సముచితంగా ఉందని అప్పటి వక్తలు అభినందించారు కూడా! తన గొంతుతో ప్రత్యేకంగా కనిపించే శతాధిక చిత్రాల హిందీ నటుడు సురేశ్ ఒబెరాయ్‌ను అక్కున చేర్చుకున్నది హైదరాబాదే! దేశ విభజన అనంతరం వాళ్ల కుటుంబం పాకిస్తాన్ నుంచి ఇక్కడికి తరలివచ్చింది. ఇక్కడే వృద్ధిలోకి వచ్చింది. సురేశ్ ఇక్కడే పెరిగారు, సెయింట్ జార్జ్ గ్రామర్ స్కూల్లో చదివారు, ముంబై వెళ్లి నటుడిగా పేరు ప్రతిష్టలు సంపాదించారు. కొడుకు వివేక్ ఒబెరాయ్‌ను కూడా నటుడిగా తీర్చిదిద్దారు. సురేశ్ తెలుగు మాట్లాడటంలో ఆశ్చర్యం లేదు, ‘కంపెనీ’ ‘రక్త చరిత్ర’ లాంటి సినిమాల్లో నటించిన వివేక్‌కు కూడా తెలుగువచ్చు. వివేక్ పుట్టింది హైదరాబాద్‌లోనే మరి! భారత ద్వితీయ రాష్ట్రపతి, భారతరత్న గ్రహీత సర్వేపల్లి రాధాకృష్ణన్ పుట్టింది తెలుగు కుటుంబంలోనే. ఓ సందర్భంలో చిత్రకారుడు బుజ్జాయి గీసిన సర్వేపల్లి చిత్రం మీద ‘సర్వేపల్లి రాధాకృష్ణయ్య’ అని తెలుగులో సంతకం కూడా చేశారు. భారతీయ జనతా పార్టీకి పాష్ లుక్ తేవడంలో కీలక పాత్ర పోషించిన ప్రమోద్ మహాజన్ మహబూబ్‌నగర్‌లో జన్మించారు. నటుడు అజిత్ సికింద్రాబాద్‌లోనే పుట్టారు. నవరంగ్, దో ఆంఖే బారా హాత్ లాంటి చిత్రాల దర్శకుడు, దాదాసాహెబ్, పద్మవిభూషణ్ గ్రహీత వి.శాంతారాం వాళ్లది తెనాలి దగ్గరేనని చెబుతారు. చెన్నైలో ఉంటున్న కన్నడిగుడిగా కనిపించే ఆధ్యాత్మిక గురువు జగ్గీ వాసుదేవ్ తెలుగువాడు. విజయనగరానికి చెందిన వీళ్ల కుటుంబం కర్ణాటకకు తరలివెళ్లింది. జగ్గీ వాసుదేవ్ తెలుగు మాట్లాడటమే కాదు, నెమ్మదిగా చదవగలరు కూడా! ముగింపు... మనది అనిపించే ప్రతిదీ మనిషికి ఒక ఆనందాన్ని, స్వీయ గౌరవాన్ని కలిగిస్తుంది. అది సహజం కూడా! అయితే, ఈ మన అనేదాన్ని విస్తరించుకుంటూ పోవడం మరింత ఆరోగ్యకరం. రుషులు, విశ్వమానవులు, మహనీయులు చేసేది అదే! మన ఊరు, మన జిల్లా, మన ప్రాంతం, మన దేశం, చివరగా మన ప్రపంచం! ప్రేమ అనే ఒక మూలకం ఒంట్లో సజీవంగా ఉన్నంతవరకూ ఎవరూ మనవాళ్లు కాకుండాపోరు.