పదేళ్ల తర్వాత, ‘మనం’ అంటే ఎవరిని ప్రతిబింబిస్తుందో ఇప్పుడు చెప్పడం కష్టం. ఇప్పటికైతే మనం అంటే మనమే! భాషగా తెలుగువాళ్లమే!! ప్రాంతంగా భారతీయులమే!!! ఇలాంటి ‘మనవాళ్లు’ వీరందరూ! వీళ్లంతా తెలుగువాళ్లు; లేదా, తెలుగు నేలతో ముడిపడినవాళ్లు; వీళ్లకు తెలుగుతో సంబంధముందని చెబితే, ‘అవునా’ అని ఆశ్యర్యం పుట్టించేవాళ్లు. అందులో కొందరి గురించైనా కొంతమేరకు ఈ ప్రత్యేక కథనం.
బెంగాలీ అమ్మాయి సుస్మితాసేన్‌కు 1994లో ‘విశ్వ సుందరి’ కిరీట ధారణ జరిగినప్పుడు, హైదరాబాద్‌లో కూడా ఆనందం వెల్లివిరిసింది; ఆమెను పల్లకీలో కూడా ఎక్కించి తిప్పారు. కారణం? సుస్మిత కళ్లు తెరిచింది హైదరాబాద్ నగరంలో. వాళ్ల నాన్న శువేర్ సేన్ ఎయిర్ ఫోర్స్ ఉద్యోగంలో భాగంగా ఇక్కడ పనిచేస్తున్నప్పుడు సుష్ పుట్టింది. అదీ విషయం! కోపం ప్రదర్శించడానికి కారణాలు కావాలిగానీ, సంతోషం పంచుకోవడానికి ఏమీ అక్కర్లేదు; అది సంతోషం కలిగించే విషయమైతే చాలు.
హర్షా మనవాడే!
క్రికెట్ వ్యామోహం ఉన్నవాళ్లకు హర్షా భోగ్లే ఇట్టే తెలుసు. ఏ క్రికెట్ సీజన్లోనైనా ఈఎస్‌పీఎన్‌లోనో, స్టార్ స్పోర్ట్స్‌లోనో తెరమీదకు వచ్చేది హర్షానే. ఇరవై ఏళ్లలో ఆటగాళ్లు ఎందరో రిటైర్ అయివుండవచ్చుగానీ, కామెంటేటర్‌గా హర్షా ఇప్పటికీ ‘క్రీజు’లోనే ఉన్నారు. ఈ మరాఠీ ప్రొఫెసర్(ఎ.డి.భోగ్లే) కొడుకు హైదరాబాద్‌లోనే పుట్టారు; ఇక్కడి గల్లీల్లోనే క్రికెట్ నేర్చుకున్నారు; హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో చదివారు; ఉస్మానియా యూనివర్సిటీలో కెమికల్ ఇంజినీరింగ్ చదువుతూ క్రికెట్ జట్టుకు ప్రాతినిధ్యం వహించారు; 19 ఏళ్లప్పుడు హైదరాబాద్ ఆల్ ఇండియా రేడియోలో కామెంటేటర్‌గా తొలి అడుగులు వేశారు; కాబట్టి, హర్షా తెలుగు మాట్లాడగలుగుతారని చెప్పడం చాలా చిన్న విషయం. ‘‘ఇది మన తెలుగువాళ్ల కోసం...’’ అని ఓసారి ట్వీట్ కూడా పెట్టారు. స్పందనలన్నీ తెలుగులోనే వస్తుంటే, ‘‘ఇదేంటి! రెండు ట్వీట్స్ తెలుగులో చేస్తే మీరు అందరూ తెలుగులోనే జవాబులు ఇస్తున్నారు. అంత బాగా తెలుగు రాదు,’’ అని రాదంటూనే వచ్చని నిరూపించుకున్నారు.
నా మాతృభాష తెలుగు
హర్షా రాదన్నారుగానీ, క్రికెటర్ రోహిత్ శర్మ అయితే, ‘అవును, నా మాతృభాష తెలుగు. మా అమ్మది వైజాగ్,’ అని చెప్పేశారు. ఐపీఎల్‌లో ఎవరున్నా లేకున్నా పదేళ్ల పాటు రోహిత్ కచ్చితంగా ఉంటాడన్నంతగా తన ప్రతిభను చాటుకున్న ఈ తెలుగు బిడ్డ నాగ్‌పూర్‌లోనే పుట్టి పెరిగినప్పటికీ, ఇక్కడి వైజాగ్ సముద్రంతో సంబంధం ఉంది. వాళ్ల అమ్మ పూర్ణిమ, అమ్మమ్మ విశాలాక్షి ఇక్కడివాళ్లే. వాళ్లమ్మ తెలుగు, మరాఠీల్లో ఇంటర్వ్యూలు ఇచ్చేస్తూ తన కొడుకు గురించి మురిసిపోతూ ఉంటారు. ఉండరా మరి! మరాఠీ ప్రాంతంలో ఉంటూ కూడా రోహిత్ తెలుగులో చక్కగా మాట్లాడేస్తుంటే!
తెలుగు రేఖ!
బాలీవుడ్ నటీమణి రేఖకు తెలుగుతో ఏమైనా సంబంధం ఉందా? రేఖ తల్లి పుష్పవల్లి తెలుగు వనిత. వరవిక్రయం, చెంచులక్ష్మి లాంటి సినిమాల్లో నటించారు. తమిళంలోనూ నటించినప్పుడు జెమినీ గణేశన్‌తో జీవితాన్ని ముడేసుకున్నారు. రేఖ అక్కడే జన్మించొచ్చుగాక, కానీ తన 180 చిత్రాల సుదీర్ఘ కెరీర్‌ను ‘రంగుల రాట్నం’లో బాలనటిగా ప్రారంభించారు. అంతకంటే సంబరపడే విషయం, తనదైన గొంతుతో తెలుగును పలికించగలగడం!
జానీ జానీ తెలుగు పప్పా!
హిందీ సినిమాలు చూసేవాళ్లకు చెప్పే పనిలేదుగానీ, చూడనివాళ్లకు జానీ లీవర్‌ను పరిచయం చేయాలంటే ఈ పోలిక తప్పదు. టాలీవుడ్‌లో బ్రహ్మానందం ఎంతో, బాలీవుడ్‌లో జానీ లీవర్ అంత. కామెడీలో ఇద్దరూ కింగులే అనేది పక్కనపెడితే, బ్రహ్మానందంలాగే జానీ లీవర్ కూడా అచ్చమైన తెలుగువాడు. ప్రకాశం జిల్లాలో జాన్ ప్రకాశ్ రావుగా పుట్టి, బతుకుతెరువుకోసం ముంబై వెళ్లి, తనకు సహజంగా అబ్బిన మిమిక్రీలు ప్రదర్శిస్తూ, హిందుస్తాన్ లీవర్ కంపెనీలో చేరి, అక్కడివాళ్లను తెగనవ్వించి, ఆ పేరులోని లీవర్‌ను తనకు తగిలించుకుని, హిందీ సినిమాల్లో జానీ లీవర్‌గా తెలుగు కేతనం ఎగరవేశారు. 300 సినిమాల్లో నటించిన జానీ ఏకైక తెలుగు చిత్రం ‘క్రిమినల్’ ఇది బాధే అయినా, సంతోషపెట్టే విషయం ఏమిటంటే ఆయన ఇక్కడి అమ్మాయి సుజాతనే పెళ్లి చేసుకున్నారు. వాళ్ల పిల్లలిద్దరూ(కూతురు జేమీ, కొడుకు జెస్సీ) బ్రహ్మాండంగా తెలుగు మాట్లాడతారు.
గొప్ప దర్శకుడి ఇష్టురాలు
భారతీయ సినిమాను సుసంపన్నం చేసిన నట దర్శకుడు గురుదత్ మెచ్చిన వహీదా రెహమాన్ రాజమండ్రి అమ్మాయి. ‘రోజులు మారాయి’లో ‘ఏరువాకా సాగారో రన్నో చిన్నన్నా’ పాటలో నృత్యం చేసిన అందగత్తె వహీదాను హైదరాబాద్‌లో చూసి, ఈ కొత్తముఖమే తన సినిమాలకు కావాలనుకున్నాడు గురుదత్. వహీదాకు ఉర్దూ కూడా రావడం ఇద్దరికీ లాభించింది. లేదంటే, ప్యాసా, కాగజ్ కే ఫూల్ లాంటి సినిమాల్లో వహీదాను ఎవరు భర్తీ చేయగలరు! అలాగే, గైడ్, నీల్ కమల్ లాంటి చిత్రాలను ఎవరు పూరించగలరు!
అందాల ఝరి!
1970ల్లో ‘చిత్ చోర్’, ‘గోపాల్ కృష్ణ’ లాంటి హిందీ సినిమాల్లో నటించిన జరీనా వాహబ్ ఇక్కడివారంటే కొంచెం ఆశ్చర్యమే! కడపలో పుట్టిన జరీనా పుణె ఫిలిం ఇన్‌స్టిట్టూట్‌లో శిక్షణ పొందారు. ‘గాజుల కిష్టయ్య’ ‘అమర ప్రేమ’ ‘హేమాహేమీలు’ లాంటి తెలుగు సినిమాల్లో నటించినా, ఈ నాచురల్ బ్యూటీ బాలీవుడ్ వైపు వెళ్లిపోయారు. ‘రక్త చరిత్ర’లో ప్రతాప్ వాళ్లమ్మ పాత్ర వేసింది కూడా జరీనానే!
ఇంకో విషయం ఏమిటంటే, తను ప్రేమించి పెళ్లాడిన నటుడు ఆదిత్య పంచోలి ‘షాడో’ చిత్రంలో నటించడానికి కారణం కూడా ఈ తెలుగు సంబంధమే.
శంకరయ్య వస్తావయ్యా!
నట లెజెండ్ రాజ్‌కపూర్ నటించి దర్శకత్వం వహించిన ‘శ్రీ 420’ చిత్రంలో ఒక హిందీ పాట ‘రామయ్యా వస్తావయ్యా’ లాంటి తెలుగు మాటతో మొదలైందంటే దానిక్కారణం సంగీతద్వయం ‘శంకర్-జై కిషన్’లోని శంకర్! అసలు పేరు శంకర్ సింగ్ రఘువంశీ. గుజరాత్ వాడైనా తండ్రి ఇక్కడ హోటల్ వ్యాపారంలో ఉండటంతో హైదరాబాద్‌లో పెరిగారు. సంగీతంలో ఆసక్తికొద్దీ తబలా పట్టుకుని ముంబై పయనమయ్యారు. జై కిషన్ జోడీగా ‘చోరీ చోరీ’ ‘బ్రహ్మచారి’ ‘మేరా నామ్ జోకర్’ ‘జిస్ దేశ్ మే గంగా బెహ్‌తీ హై’ ‘సంగం’ లాంటి చిత్రాలకు స్వరకల్పన చేశారు. హిందీలో ఉటంకించిన ఆ తెలుగు మాటతోనే ఇటీవల ఒక హిందీ చిత్రం వచ్చింది, ఇంకో తెలుగు సినిమా రాబోతోంది. ఎంత శక్తిమంతమైన పాట! ఎంత శక్తిమంతమైన సంగీత దర్శకుడు!
తొలి సూపర్‌స్టార్!
బాలీవుడ్ ఇంకా ఏర్పడకముందు, (ఇంగ్లీషు) మూకీల్లో నటించి, హిందీ టాకీలు వచ్చాక అందులో సూపర్‌స్టార్ ఇమేజ్ తెచ్చుకున్న నటుడు పైడి జయరాజ్. ఆయనది కరీంనగర్ జిల్లా. నిజాం కాలేజీలో చదువుతూ నటన మీది ఆసక్తితో 1929లో బొంబాయి వెళ్లారు. షాజహాన్, పృథ్వీరాజ్, రాణా ప్రతాప్, టిప్పు సుల్తాన్ లాంటి చారిత్రక పాత్రలకు పెట్టింది పేరైన జయరాజ్ మొహర్, సాగర్ లాంటి సినిమాలకు దర్శకత్వం కూడా వహించారు. 1980లో జయరాజ్‌ను దాదాసాహెబ్ ఫాల్కే పురస్కారంతో ప్రభుత్వం గౌరవించింది.
వాహ్ అజీజ్!
గజల్ గాయకుడు తలత్ అజీజ్ హైదరాబాదీ! ఎన్నో ఆల్బమ్స్ విడుదల చేశారు. ఉమ్రావ్ జాన్, బజార్ లాంటి సినిమాల్లో పాడారు. దీవార్, నూర్జహాన్, ఎహ్‌సాస్, సురూర్ లాంటి టెలీ సీరియల్స్‌కు సంగీత దర్శకత్వం వహించారు. సానియా మీర్జా అంకుల్ కూడా!
మన శ్యామ్!
అంకుర్, నిషాంత్, మంథన్, భూమిక లాంటి హిందీ చిత్రాలతో 1970ల్లో న్యూ వేవ్ శకానికి తెరలేపిన శ్యామ్ బెనెగల్ సికింద్రాబాద్‌లోని తిరుమలగిరిలో పుట్టారు. నిజాం కాలేజీ, ఉస్మానియా యూనివర్సిటీల్లో చదివారు. జన జీవితాన్ని ఆకళింపు చేసుకున్నారు. స్వాతంత్య్రపు పూర్వ తెలంగాణ భూస్వామ్య వ్యవస్థను, ఉత్సవాలను తన సినిమాల్లో బొమ్మకట్టారు. ‘‘ఇది నా జన్మభూమి,’’ అంటారు బెనెగల్. యాభై ఏళ్ల క్రితం ముంబై తరలివెళ్లినా ఇక్కడిలాంటి సంస్కృతిని మరెక్కడా చూడలేదంటారు దాదాసాహెబ్ ఫాల్కే, పద్మభూషణ్ పురస్కారాలను అందుకున్న ఈ దేశం గర్వించదగ్గ దర్శకుడు.
మన రిపోర్టర్!
‘రూరల్ రిపోర్టర్’ పి.సాయినాథ్ కూడా తెలుగువాడే! రైతుల వెతల మీద ఆయన ఎన్నో విలువైన కథనాలు రాశారు. కరువు, ఆకలి మీద గొప్ప పట్టున్న నిపుణుడిగా సాయినాథ్ నోబెల్ గ్రహీత ఆమర్త్యసేన్ కితాబు పొందారు.
తమిళ తెలుగులు
ద్రవిడోద్యమ నేత అన్నాదురై తెలుగు మూలాలు ఉన్నవారు. ఒక ఇంటర్వ్యూలో, ‘మా అమ్మ బంగారమ్మ, కంచిగుళ్లో దేవదాసీ, స్పష్టంగా తెలుగు మాట్లాడుతుంది,’ అని చెప్పారు.
అన్నాదురై వారసుడు, మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి కూడా ఇక్కడివారే! నట ముఖ్యమంత్రి ఎమ్జీయార్ మలయాళీయుడు అని కరుణ వర్గం ‘నాన్-తమిళ్’ ఇష్యూ తెచ్చినప్పుడు, కరుణానిధి కూడా తమిళుడు కాదు; వాళ్లది కృష్ణా జిల్లా మువ్వ ప్రాంతం అని ఎమ్జీయార్ ప్రకటించారు.
ఎండీఎంకే పార్టీ నేత, వై.గోపాలస్వామి(వైగో) మూలాలూ ఇక్కడివే. నటదర్శకుడు కె.భాగ్యరాజా అంతే! అలాగే, డీఎండీకే పార్టీ వ్యవస్థాపకుడు, సినీ నటుడు విజయ్‌కాంత్ కూడా తెలుగు వేర్లున్నవారే! ఇంట్లో తెలుగు మాట్లాడుతారు కూడా. అంటే, తమిళ రాజకీయాల్ని మలుపు తిప్పేదంతా తెలుగువాళ్లే!
ఇంకా ఎందరో...
బాలీవుడ్‌లో భిన్నమైన సినిమాలు చేస్తున్న దర్శకుడు, నటుడు నగేశ్ కుకునూర్ జన్మించింది హైదరాబాద్‌లోనే. లిటిల్ ఫ్లవర్ కాలేజీలో చదువుకున్నారు; నారాయణగూడ టాకీసుల్లో సినిమాలు చూశారు. అందువల్లే ‘హైదరాబాద్ బ్లూస్’ లాంటి సినిమా పుట్టింది. తర్వాత నగేశ్ ‘రాక్‌ఫోర్డ్’ ‘బాలీవుడ్ కాలింగ్’ ‘ఇక్బాల్’ లాంటి భిన్నమైన సినిమాలను అందించారు.
ఇక్కడి అల్లుళ్లు...
తమిళ నటుడు, దర్శకుడు, నిర్మాత, సంగీత దర్శకుడు లాంటి బహుముఖ ప్రజ్ఞాశాలి టి.రాజేందర్ తెలుగు నటి ఉషను పెళ్లి చేసుకున్నారు. వీళ్లబ్బాయే ఇప్పటి సూపర్ హీరో శింబు.
సంగీత దర్శకుడు అనూ మాలిక్ తమ్ముడిగా డాబూ మాలిక్‌ను పరిచయం చేయొచ్చు. కానీ, డాబూ తెలుగు సినిమా ‘సర్వర్ సుందరం గారి అబ్బాయి’లో నటించారు. దానికన్నా ముఖ్య విషయం, తెలుగమ్మాయి జ్యోతిని పెళ్లి చేసుకున్నారు.
ఎంటీవీలో ప్రాక్టికల్ జోకుల షో ‘బక్రా’ యాంకర్ సైరస్ బ్రోచా కూడా హైదరాబాద్ అల్లుడే! ఆయేషాను సైరస్ వివాహం చేసుకున్నారు.
ఇక్కడే పుట్టినవాళ్లు...
అంతర్జాతీయ నటి, పద్మభూషణ్ గ్రహీత షబానా అజ్మీ జన్మస్థలం హైదరాబాదే! సామాజిక కార్యకర్తగా కూడా పేరుమోసిన షబానా అంకుర్, నిషాంత్, అర్థ్, మాసూమ్, మండి, ఫైర్ లాంటి ఎన్నో విమర్శకుల మెప్పు పొందిన సినిమాల్లో నటించారు. ఈ నగరంలో పుట్టిన తారకు ఏఎన్నార్ అవార్డు ఇవ్వడం మరింత సముచితంగా ఉందని అప్పటి వక్తలు అభినందించారు కూడా!
తన గొంతుతో ప్రత్యేకంగా కనిపించే శతాధిక చిత్రాల హిందీ నటుడు సురేశ్ ఒబెరాయ్‌ను అక్కున చేర్చుకున్నది హైదరాబాదే! దేశ విభజన అనంతరం వాళ్ల కుటుంబం పాకిస్తాన్ నుంచి ఇక్కడికి తరలివచ్చింది. ఇక్కడే వృద్ధిలోకి వచ్చింది. సురేశ్ ఇక్కడే పెరిగారు, సెయింట్ జార్జ్ గ్రామర్ స్కూల్లో చదివారు, ముంబై వెళ్లి నటుడిగా పేరు ప్రతిష్టలు సంపాదించారు. కొడుకు వివేక్ ఒబెరాయ్‌ను కూడా నటుడిగా తీర్చిదిద్దారు. సురేశ్ తెలుగు మాట్లాడటంలో ఆశ్చర్యం లేదు, ‘కంపెనీ’ ‘రక్త చరిత్ర’ లాంటి సినిమాల్లో నటించిన వివేక్‌కు కూడా తెలుగువచ్చు. వివేక్ పుట్టింది హైదరాబాద్‌లోనే మరి!
భారత ద్వితీయ రాష్ట్రపతి, భారతరత్న గ్రహీత సర్వేపల్లి రాధాకృష్ణన్ పుట్టింది తెలుగు కుటుంబంలోనే. ఓ సందర్భంలో చిత్రకారుడు బుజ్జాయి గీసిన సర్వేపల్లి చిత్రం మీద ‘సర్వేపల్లి రాధాకృష్ణయ్య’ అని తెలుగులో సంతకం కూడా చేశారు. భారతీయ జనతా పార్టీకి పాష్ లుక్ తేవడంలో కీలక పాత్ర పోషించిన ప్రమోద్ మహాజన్ మహబూబ్‌నగర్లో జన్మించారు. నటుడు అజిత్ సికింద్రాబాద్‌లోనే పుట్టారు. నవరంగ్, దో ఆంఖే బారా హాత్ లాంటి చిత్రాల దర్శకుడు, దాదాసాహెబ్, పద్మవిభూషణ్ గ్రహీత వి.శాంతారాం వాళ్లది తెనాలి దగ్గరేనని చెబుతారు. చెన్నైలో ఉంటున్న కన్నడిగుడిగా కనిపించే ఆధ్యాత్మిక గురువు జగ్గీ వాసుదేవ్ తెలుగువాడు. విజయనగరానికి చెందిన వీళ్ల కుటుంబం కర్ణాటకకు తరలివెళ్లింది. జగ్గీ వాసుదేవ్ తెలుగు మాట్లాడటమే కాదు, నెమ్మదిగా చదవగలరు కూడా!
ముగింపు...
మనది అనిపించే ప్రతిదీ మనిషికి ఒక ఆనందాన్ని, స్వీయ గౌరవాన్ని కలిగిస్తుంది. అది సహజం కూడా! అయితే, ఈ మన అనేదాన్ని విస్తరించుకుంటూ పోవడం మరింత ఆరోగ్యకరం. రుషులు, విశ్వమానవులు, మహనీయులు చేసేది అదే! మన ఊరు, మన జిల్లా, మన ప్రాంతం, మన దేశం, చివరగా మన ప్రపంచం! ప్రేమ అనే ఒక మూలకం ఒంట్లో సజీవంగా ఉన్నంతవరకూ ఎవరూ మనవాళ్లు కాకుండాపోరు.
వివరం: తెలుగు తెలుగే కనెక్షన్
Published Sun, Aug 18 2013 2:30 AM | Last Updated on Fri, Sep 1 2017 9:53 PM
Advertisement