వివరం: ప్రాణవాయువులలో పాండే ఆత్మ | Mangal Pandey's Spiritual diary | Sakshi
Sakshi News home page

వివరం: ప్రాణవాయువులలో పాండే ఆత్మ

Published Sun, Mar 23 2014 2:00 AM | Last Updated on Sat, Sep 2 2017 5:01 AM

వివరం: ప్రాణవాయువులలో పాండే ఆత్మ

వివరం: ప్రాణవాయువులలో పాండే ఆత్మ

ఆగస్టు 15, 1947.  దేశం తలెత్తుకున్న రోజు! మార్చి 29, 1857. ఈ దేశ పౌరుడు తుపాకీ ఎత్తిన రోజు! ఒకటి స్వాతంత్య్ర దినం. ఇంకొకటి స్వాతంత్య్ర కాంక్షను రగిలించిన దినం. ఆగస్టు 15 అంటే  మహాత్మాగాంధీ. మార్చి 29 అంటే మంగళ్ పాండే. కానీ మనకు మహాత్ముడొక్కరే గుర్తుండిపోయారు. మంగళ్ పాండే చరిత్రలోనే ఉండిపోయాడు. పాండేని ఇవాళ తలుచుకుంటే సినిమా వాళ్లు తలుచుకోవాలి. లేదంటే చరిత్రకారుల రిఫరెన్సుల్లోకి మనమే వెళ్లి పాండేని వెతుక్కోవాలి. అయితే ఈ ఏడాది ఎవరూ తలచుకోకుండానే, ఎవరూ  వెతుక్కోకుండానే పాండే బయటపడ్డాడు. మార్చి 4న అమృత్‌సర్‌లోని ఒక బావిలోంచి బయట పడ్డాడు!! ఎలా? ఆత్మగానా? అవక్షేపంగానా? అంతరాత్మగానా?
 
 అంతరాత్మగానే. కానీ ఒక అంతరాత్మగా కాదు. 1857 నుంచి 2014 వరకు ఈ 157 ఏళ్లలో ఒక్కనాడూ పాండేకు భరతజాతి ఘనంగా నివాళులు అర్పించలేదని ఘోషిస్తున్న వందల అంతరాత్మలుగా! అమృత్‌సర్ దగ్గరి అజ్నాలా గ్రామంలో... ఒక సిక్కు ప్రార్థనాలయం ప్రాంగణంలో ఉన్న బావిలో నూటాయాభై ఏళ్లనాటి తిరుగుబాటు సిపాయిల అస్థికల్లోంచి, మట్టిలో కలిసిపోయిన వారి ప్రాణవాయువుల్లోంచి పాండే బయటపడ్డాడు. పడ్డాడూ అంటే... అస్థికల్లో అతడి అస్థికలూ ఉన్నాయని కాదు. అతడి స్ఫూర్తితో, ఆవహించిన అతడి ఆత్మతో బ్రిటిష్‌వాళ్లపై తిరగబడి, పోరాడి మరణించిన వీరుల శిథిలాలలో పాండే ఆవరించి ఉన్నాడని.
 
 గాంధీ అంటే గాంధీ ఒక్కరే. తనకు తానుగా ఒక మహాశక్తి. పాండే అంటే  వందలు, వేలుగా ఎక్కుపెట్టిన సిపాయిలందరి తుపాకుల శక్తి. కంకాళాలు, కపాలాలు, విరిగిన కాళ్లూ చేతులు, పగిలిన పుర్రెలు... ఎప్పటికీ ఇవి మాత్రమేనా పాండే స్మారక చిహ్నాలు? జాతిపితలా మహాత్ముడిని గౌరవించినట్లు, తొలి తిరుగుబాటు వీరుడిగా పాండేని మనం గుర్తించలేమా?  గాంధీజీ లేకుండా స్వాతంత్య్ర సంగ్రామం లేనట్లే... పాండే లేకుండా ఆ సంగ్రామానికి ఉప్పు, ఊపిరి రెండూ లేవన్న వాస్తవాన్ని గ్రహించలేమా?
    
 పాండే ఒక జ్వాల. ఉత్తర భారతదేశంలోని మీరట్, ఢిల్లీ, లక్నో, కల్పి, కాన్పూర్, బెనారస్, రాణీగంజ్, కలకత్తాల మీదుగా దేశంలోని తూర్పు, మధ్య ప్రాంతాలకు వ్యాపించిన తిరుగుబాటు జ్వాల. 1857-59 మధ్య... స్వేచ్ఛాకాంక్షగా రగిలి, దేశాన్ని యుద్ధభూమిగా మార్చిన జ్వాల. అప్పటికి వందేళ్ల క్రితం - సరుకులు అమ్ముకుంటూ వచ్చి భారత భూభాగంలో తక్కెడ పెట్టి కూర్చుంది ఈస్ట్ ఇండియా కంపెనీ.  బ్రిటన్ నుంచి వచ్చి భారత్‌పై పట్టు బిగించింది. 1757లో బెంగాల్ నవాబు సిరాజ్ ఉద్దౌలాను ఓడించింది. మైసూరులో టిప్పు సుల్తాన్‌నీ, మరి కొందరు ప్రాంతీయ పాలకుల్ని గద్దె దించింది. 1857 నాటికి యావద్భారతాన్ని తన అధీనంలోకి తెచ్చుకుంది. ఆ కొసలో జరిగిందే సిపాయిల తిరుగుబాటు. అదే మన ప్రప్రథమ స్వాతంత్య్ర సంగ్రామం. ఆ సంగ్రామానికి మీసాన్ని మెలితిప్పి వత్తిగా వెలిగించినవాడే మంగళ్ పాండే!
 
 పాండే ధిక్కారం తర్వాత తొలిసారి మీరట్ (ఉత్తర ప్రదేశ్)లో భారతీయ సిపాయిలు బ్రిటిష్ వారిపై విరుచుకుపడ్డారు. అక్కడ ఇద్దరు బ్రిటిష్ అధికారులను హతమార్చి, ఢిల్లీ వైపు కదిలారు. ఝాన్సీ (ఉ.ప్ర.) నుంచి లక్ష్మీబాయి, మరాఠా పీష్వా నానా సాహెబ్, మొఘల్ చక్రవర్తి బహదూర్ షా తిరుగుబాటు సంగ్రామంలో పాల్గొన్నారు. అంతిమంగా బ్రిటిష్ వాళ్లదే పైచేయి అయింది. ఝాన్సీ లక్ష్మీబాయి, తాంతియా తోపే ఆ పోరాటంలో మరణించారు. బహదూర్ షాను తీసుకెళ్లి బర్మా జైల్లో పడేసింది బ్రిటిష్ ఆర్మీ.  హైదరాబాద్ నిజాం, గ్వాలియర్ సింధియాలు విదేశీ పాలకులకు అనుకూలంగా ఉండిపోయారు. అక్కడి తో పాండే వెలిగించిన మహాజ్వాల కొడిగట్టింది.
 సిపాయిల తిరుగుబాటు తర్వాత సంభవించిన కీలక పరిణామం... ఈస్టిండియా కంపెనీ శకం ముగియడం. దాని స్థానంలో ఇంగ్లండ్ ప్రభుత్వం వైశ్రాయ్‌లను, గవర్నర్ జనరల్స్‌నీ పెట్టి భారతదేశాన్ని పాలించింది. ఆ తర్వాత 1885 నుంచి 1947 వరకు బ్రిటిష్ పాలకులకు వ్యతిరేకంగా జరిగిందే... భారత జాతీయోద్యమం.
 
    
మార్చి 29న బరక్‌పూర్ (ప.బెంగాల్) లో మంగళ్ పాండే తిరగబడ్డాడు. సైనిక న్యాయస్థానం అతడిని ఏప్రిల్ 8న ఉరితీసింది. మే 10న మీరట్‌లో అక్కడి సిపాయిలు తిరుగుబాటు చేశారు. అయితే స్వతంత్ర భారతదేశం మీరట్ తిరుగుబాటును మాత్రమే అధికారికంగా గుర్తించింది! మంగళ్ పాండే స్ఫూర్తిని పూర్తిగా విస్మరించింది, 1957 నాటి తొలిసిపాయిల తిరుగుబాటు శతాబ్ది వేడుకలలో... 1857 మే 10న  బ్రిటిష్ పాలకులపై భారతీయ సిపాయిలు తిరగబడిన సందర్భాన్ని మాత్రమే అప్పటి భారత ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ, రాష్ట్రపతి బాబూ రాజేంద్ర ప్రసాద్ ‘కుల మతాలకు అతీతమైన సమైక్య పోరాటం’గా అభివ ర్ణించారు.
 
 అంతేకాదు, కలకత్తా విశ్వవిద్యాలయ చరిత్రకారుడు ఎస్.ఎన్.సేన్ తో తొలి స్వాతంత్య్ర సంగ్రామంపై రాయించిన అధికారిక గ్రంథాన్ని భారత ప్రభుత్వం ఆ ఉత్సవాల సందర్భంగా విడుదల చేసింది. ‘మత విశ్వాసాలను కాపాడుకునేందుకు మొదలైన పోరాటం... విజయవంతమైన స్వాతంత్య్ర సమరంగా సమాప్తమయింది’’ అని సేన్ తన పుస్తకాన్ని ముగించాడు! ఆ పుస్తకంలో ఎక్కడా పాండే ప్రస్తావన ప్రముఖంగా లేదు! పాలక పక్షాల ఒత్తిళ్ల మేరకే గ్రంథరచయిత పాండేను నామమాత్రంగా ఉంచేశాడని అంటారు.
 
 ఎందుకని పాండేని మనం తిరుగుబాటుకు తొలి వీరుడిగా గుర్తించలేకపోతున్నాం? 1857 మే 10న జరిగిన సిపాయిల తిరుగుబాటుకు బీజాలు వేసింది మార్చి 29 నాటి పాండే ధైర్యసాహసాలే అనే విషయమై ఎందుకని నేటికీ ఒక ఏకాభిప్రాయానికి రాలేకపోతున్నాం. ఆట్చఠ్ఛి ఝ్చట్టడట ౌట అఛిఛిజీఛ్ఛ్ట్చీ ఏ్ఛటౌ గ్రంథకర్త రుద్రాంక్షు ముఖర్జీ పాండేను దేశభక్తునిగా గుర్తించలేమనీ, భారత తొలి స్వాతంత్య్ర సమరానికీ, పాండే తిరుగుబాటుకూ సంబంధమే లేదని రాశారు. ‘హిందూ మహాసభ’ సంస్థాపకులలో ఒకరైన వి.డి.సావర్కర్ తను రాసిన ‘ది ఇండియన్ వార్ ఆఫ్ ఇండిపెండెన్స్’ (1909) గ్రంథంలో తిరుగుబాటు గొప్పతనాన్నంతా మంగళ్‌పాండేకే ఇచ్చారని ఇప్పటికీ డాల్రింపుల్‌వంటి కొందరు బ్రిటిష్ చరిత్రకారులు విమర్శిస్తూనే ఉన్నారు!
 
 ఏది  తొలి తిరుగుబాటు?
 ఈ విషయమై 157 ఏళ్లుగా అస్పష్టత కొనసాగుతూనే ఉంది. మార్చి 29 నాటి ఒక ఉక్కబోత మధ్యాహ్నపు వేళ బరక్‌పూర్‌లోని 34వ ‘నేటివ్ ఇన్‌ఫాంట్రీ’ దళ సభ్యుడు, 26 ఏళ్ల సిపాయి అయిన మంగళ్‌పాండే... పరేడ్ గ్రౌండ్‌లో బ్రిటిష్ అధికారులకు ఎదురు తిరగడమా లేక మే 10న మీరట్‌లో సిపాయిలంతా తిరగబడడమా... ఏది బీజం భారత స్వాతంత్య్ర సంగ్రామానికి?
 
 ఎలా చూసినా బరక్‌పూర్, మంగళ్ పాండే దగ్గరే మన సందిగ్ధతలు, సంశయాలన్నీ ముగుస్తున్నాయి. ఉత్తర భారతదేశం పొడవునా వ్యాపించిన మీరట్ దావానలం తాలూకు మసి జాడలను వెదుక్కూంటూ వెనక్కి వెనక్కి వెళ్లిన చరిత్రకారులు బరక్‌పూర్‌లో ఆగిపోతున్నారు! మొదట చిచ్చు పెట్టిన సిపాయిగా మంగళ్ పాండే మాత్రమే కనిపిస్తున్నాడు. మార్చి 29న అసలేం జరిగిందన్న విషయమై అప్పటి బ్రిటిష్ అధికారులు ఇచ్చిన లిఖితపూర్వక వివరాలు నేటికీ మనకు అందుబాటులో ఉన్నాయి. వాటి ఆధారంగా చూసినా పాండే నే మన తొలి కథానాయకుడు. అతడు తిరగబడిందే మన తొలి తిరుగుబాటు.
 
 పాండే తిరగబడిన తక్షణ కారణం... కొత్త ఎన్‌ఫీల్డ్ తుపాకులలో వాడేందుకు బ్రిటిష్ ఆర్మీ... సిపాయిలకు పంపిణీ చేసిన తూటాలేననీ, సులువుగా జారేందుకు వీలుగా ఆ తూటాలకు జంతువుల కొవ్వుతో తయారుచేసిన గ్రీసును అద్ది ఇవ్వడం వల్ల పాండే తీవ్ర మనస్తాపం చెంది బహిరంగంగా ఆగ్రహావేశాలు వ్యక్తం చేశాడనీ బ్రిటిష్ చరిత్రకారులు రాశారు. ఆ సంఘటన జరిగినప్పుడు పాండేతో పాటు అక్కడ అవధ్ బ్రాహ్మణ సిపాయిలు కూడా ఉన్నారు. బ్రిటిష్ వారి అప్రాచ్య విధానాల వల్ల తమ కులం, మతం మంటగలిసి పోతాయని వారంతా భయపడ్డారు. అంతే, పాండే తుపాకీ పైకి లేచింది.
 
 దానిని అతడు గాలిలో ఊపుతూ ‘‘అంతా బయటికి వచ్చేయండి, ఈ తూటాలను నోటితో తెరిచామంటే మనమంతా మత విశ్వాస ఘాతకులం అయినట్లే. ఇంకా ఆలోచిస్తారేమిటి? యూరోపియన్ల పని పడదాం రండి’’ అని అరిచాడు. అక్కడే ఉన్న ఇద్దరు బ్రిటిష్ అధికారులు సార్జెంట్ మేజర్ హ్యూసన్, లెఫ్ట్‌నెంట్ బాగ్‌లతో కలియబడి వారిని తన కత్తితో, తుపాకీతో గాయపరిచాడు. ఈ గొడవకి ప్రెసిడెన్సీ విభాగపు కమాండింగ్ ఆఫీసర్ జనరల్ హియర్సే రాగానే పాండే తనని తాను కాల్చుకున్నాడు. అయితే ఆ తూటా అతడిని చంపే విధంగా తగల్లేదు.
 
 ఇదే సంఘటన కొన్ని చరిత్ర పుస్తకాలలో మరింత వివరంగా ఉంది. ఆవుకొవ్వు, పంది కొవ్వు ఉపయోగించి తయారుచేసిన తూటాలను కొరికి ప్రయోగించడానికి నిరాకరించిన మంగళ్ పాండే ఆ కోపంలో తన పై అధికారిని హతమార్చాడు. షేక్ పల్టూ అనే సహ సిపాయి పాండేను అడ్డుకునే ప్రయత్నం చేశాడు. ఈ విషయం తెలిసిన వెంటనే అక్కడికి చేరుకున్న జనరల్ జాన్‌హెర్పే... పాండేను పట్టుకోమని జమేదార్ ఈశ్వరీ ప్రసాద్‌ను అదేశించాడు. ప్రసాద్ కదల్లేదు.
 
 ఈలోపు పాండే తన తుపాకితో తనే కాల్చుకుని ఆంగ్లేయుల చేతిలో కాక, ఆత్మాభిమానంతో చచ్చిపోవాలని ప్రయత్నించి విఫలమయ్యాడు. బ్రిటిష్ సైనికులు వెంటనే అతడిని నిర్బంధించి హత్యానేరం మోపారు. సైనిక న్యాయస్థానం పాండేను ఏప్రిల్ 18న ఉరి తియ్యాలని తీర్పు చెప్పింది. అయితే అతడిని పది రోజుల  ముందుగానే ఉరితీశారు. అతడిని పట్టుకునేందుకు నిరాకరించిన ఈశ్వరీ ప్రసాద్‌ను కూడా రెండు వారాల తర్వాత ఏప్రిల్ 22న ఉరి తీశారు. పాండే తిరుగుబాటు చేస్తున్నప్పుడు చూస్తూ నిలబడిపోయారన్న ఆరోపణలపై తక్కిన సిపాయిల దుస్తులు విప్పించి పరేడ్ చేయించారు.
 
 చరిత్ర పుస్తకాలలో ఎన్ని రకాలుగా ఉన్నా భారతీయులలో అత్యధిక సంఖ్యాకులకు మాత్రం ఇప్పటికీ పాండేనే తొలి తిరుగుబాటు హీరో. కలకత్తాకి సమీపంలో బరక్‌పూర్‌లో 2005లో స్థానిక పాలక మండలి పాండే విగ్రహాన్ని ప్రతిష్టించింది. ఆ ఊరిలో ఆర్మీ బ్యారక్‌ల మధ్య పాండే ఒక్కడే ఒంటరి యోధుడిలా కనిపిస్తాడు. ఛాతీ వరకు ఉన్న ఆ స్మారక విగ్రహం కింద ‘మంగళ్‌పాండే, సిపాయి నెంబరు 1446, 34వ రెజిమెంట్. 1857 మార్చి 29న పట్టపగలు బ్రిటిష్ అధికారులపై ఇతడు తుపాకీ పేల్చాడు’ అని రాసి ఉంటుంది.
 
 ఎవరివీ అస్థికలు?
 అమృత్‌సర్‌లోని ‘కలియన్‌వాలా ఖు’ (నల్లవాళ్ల బావి)లో ప్రభుత్వ ప్రమేయం గానీ, సహకారం గానీ లేకుండా గురుద్వార యాజమాన్యం చొరవతో చరిత్ర పరిశోధకులు, స్థానికులు కలిసి కొంతకాలంగా తవ్వకాలు జరుపుతున్నప్పుడు మార్చి మొదటి వారంలో 282 మంది సిపాయిల అస్థికలు బయట పడ్డాయి. వాటితో పాటు 1830-1835 కాలం నాటి నాణేలు, క్వీన్ విక్టోరియా హయాంలోని  రెండు బ్రిటిష్ పతకాలు, మూడు బంగారు గోళీలు, ఒక తాయెత్తు, అరవైకి పైగా ఈస్టిండియా కంపెనీ వారి రూపాయి కాసులు లభ్యమయ్యాయి. అందుబాటులో ఉన్న రికార్డుల ప్రకారం ఈ అస్థికలన్నీ  26వ స్థానిక పదాతి దళానికి చెందిన భారతీయ సిపాయిలవి.
 
 1857 జూలై 30న లాహోర్ సమీపంలోని మియాన్ మిర్ సైనిక పటాలంలో దాదాపు 500 మంది సిపాయిలు ప్రకాష్ పాండే అనే సిపాయి నాయకత్వంలో తిరుగుబాటు లేవదీసి, బ్రిటిష్ పాలకులకు వ్యతిరేకంగా ఢిల్లీ, మీరట్‌లలోని సిపాయిలతో చేయికలిపారు. వారిలో 282 మందిని బ్రిటిష్ అధికారులు అజ్నాలా తీసుకొచ్చి అప్పటి అమృత్‌సర్ డిప్యూటీ కమిషనర్ ఎఫ్.హెచ్.కూపర్ ఆదేశాలపై కాల్చి చంపారు. మృతదేహాలను ఓ ఎండిపోయిన బావిలో పడేశారు. ఆ బావికి బ్రిటిష్‌వాళ్లు పెట్టిన పేరే ‘కలియన్‌వాల ఖు’. తర్వాత గురుద్వార యాజమాన్యం ఆ పేరును ‘షహీదన్‌వాలా ఖు’ (అమరవీరుల బావి) గా  మార్చింది. మిగతా 200 మంది సైనికులను కూడా బ్రిటిష్ అధికారులు వదిలిపెట్టలేదు. గాలిచొరబడని ఒక చిన్న గదిలో బంధించి, ఊపిరి ఆడకుండా చేసి చంపేశారు.  
 
 మంగళ్ పాండే ఎక్కడివాడు?
 తెలీదు! రెండు ప్రాంతాలున్నాయి. వాటిల్లో కచ్చితంగా ఏదో తెలీదు. చరిత్రకారులు తేల్చుకోలేకపోయారు. రెండిటినీ అవుననేందుకు, కాదనేందుకు కొన్ని కొన్ని ఆధారాలున్నాయి. మొదటిది:  నగ్వా. ఉత్తరప్రదేశ్‌కు తూర్పున బల్లియా జిల్లాలో గంగానది ఒడ్డున ఉంది.  ఊర్లో అక్కడక్కడా పాండే విగ్రహాలు కనిపిస్తుంటాయి! ‘‘అతడు మా ఊరి వాడు’’ అని గ్రామంలోని పెద్దలు అంటుంటారు. అంతకుమించి రుజువుల్లేవు. రెండోది: సురహర్పూర్. ఇదీ ఉత్తరప్రదేశ్‌లోనిదే. ఫజియాబాద్ జిల్లాలో అక్బర్‌పూర్ నియోజకవర్గంలో ఉంది. ఏడేళ్ల క్రితం సురహర్పూర్ అకస్మాత్తుగా మంగళ్‌పాండే జన్మస్థలం అయింది!  సిపాయిల తిరుగుబాటుకు 150 ఏళ్లు అయిన సందర్భంగా 2007లో... అప్పటి కేంద్రమంత్రి మణిశంకర్ అయ్యర్ మీరట్ నుంచి పెద్ద ర్యాలీని ప్రారంభించినప్పుడు ఆ యువజన శాఖ వ్యవహారాల మంత్రిని చాలామంది అడిగారు - పాండే పుట్టిన సురహర్పూర్‌ను వదిలి ఇక్కడి నుంచి సెలబ్రేట్ చెయ్యడం ఏమిటని! ప్రభుత్వం లెక్కలు వేరు. మార్చి 29న తిరగబడిన వాడు పాండే ఒక్కడే. ఆ ఒక్కణ్నీ ఉరేశారు. ఆ తర్వాత  మే 10న తిరగబడిన మీరట్ సిపాయిలు వందలు వేలు.
 
 అందుకే నూటాయాభై ఏళ్ల సన్నాహక ఉత్సవాలు ‘అధికారికం’గా మే 10న మొదలయ్యాయి. అదే రోజు మీడియా కొంతమంది ప్రతినిధులను సురహర్పూర్ పంపింది. ఆ ప్రతినిధులకు అక్కడ సీతారామ్ సింగ్ అనే స్వాతంత్య్ర సమరయోధుడు కనిపించాడు. అప్పటికి ఆయన వయసు తొంభై నాలుగు. సీతారామ్ చరిత్రకారుడు కూడా. ఐదారు పుస్తకాలు రాశారు. పాండే జనన విషయాలు ఆయన దగ్గర కొన్ని ఉన్నాయి. ‘‘పాండే తండ్రి దినకర్ పాండే. ఆయన మొదట్లో ఫైజాబాద్ జిల్లా ... దుగ్వాన్-రహీమ్‌పూర్‌లో ఉండేవారు. అక్కడి నుంచి సురహర్పూర్ వలస వచ్చాడు. మంగళ్‌పాండే తల్లి అభయ్‌రాణి సురహర్పూర్ అమ్మాయి. అభయ్‌రాణిని చేసుకున్నాక దినకర్ ఇక్కడే స్థిరపడిపోయాడు. ఇక్కడే పాండే కూడా పుట్టాడు’’ - తనదగ్గరున్న ఆధారాలేవో చూపించారు సీతారామ్. అలా సురహర్పూర్ పాండే జన్మస్థలం అనుకోడానికి ఒక నిదర్శనం లభించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement