అంపశయ్య నవీన్‌కు కాళోజీ పురస్కారాన్ని ప్రదానం చేస్తున్న స్పీకర్ మధుసూదనాచారి. చిత్రంలో నందిని సిధారెడ్డి, కేవీ రమణాచారి, పాతూరి సుధాకర్‌రెడ్డి, నాయిని నర్సింహారెడ్డి, మహమూద్ అలీ, బుర్రా వెంకటేశం, మామిడి హరికృష్ణ, శివకుమార్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ప్రజా కవి కాళోజీ నారాయణ రావు 104వ జయంతి ఉత్సవాలు హైదరాబాద్‌లోని రవీంద్రభారతిలో ఆదివారం ఘనంగా జరిగాయి. రాష్ట్ర భాషా సాంస్కృతికశాఖ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ప్రముఖ రచయిత అంపశయ్య నవీన్‌కు కాళోజీ నారాయణ రావు సాహితీ పురస్కారాన్ని ప్రదానం చేశారు. 2018వ సంవత్సరానికి గానూ ఆయన ఈ పురస్కారాన్ని తెలంగాణ హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి, ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ, స్పీకర్ మధుసూదనాచారి చేతుల మీదుగా అందుకున్నారు. కార్యక్రమానికి తెలంగాణ ప్రభుత్వ సలహాదారు కేవీ రమణాచారి అధ్యక్షత వహించారు. కార్యక్రమంలో శాసనసభ స్పీకర్ మధుసూదనాచారి మాట్లాడుతూ.. నమ్మిన సిద్ధాంతానికి కట్టుబడిన వ్యక్తి కాళోజీ అని, జీవితాంతం పేదవాడి పక్షాన నిలిచిన ప్రజాకవి అని కొనియాడారు.
జీవన సారాంశాన్ని రెండు మాటల్లో చెప్పిన మహోన్నత వ్యక్తి కాళోజీ అన్నారు. ప్రభుత్వ పురస్కారాలు పొందగానే కొందరిలో మార్పు వస్తుందని.. పద్మవిభూషణ్ వంటి ప్రఖ్యాత పురస్కారం పొందినప్పటికీ కాళోజీలో ఎలాంటి మార్పు రాలేదని పేర్కొన్నారు. ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ మాట్లాడుతూ.. కాళోజీ జన్మదినాన్ని తెలంగాణ భాషా దినోత్సవంగా నిర్వహించుకోవడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి మాట్లాడుతూ.. గత ప్రభుత్వాలు తెలంగాణ కవులను విస్మరించాయని విమర్శించారు. కాళోజీ కవితలు వాస్తవానికి దగ్గరగా ఉంటాయని కొనియాడారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు కాళోజీ మార్గదర్శిగా నిలిచిన విషయాన్ని గుర్తు చేశారు. కాళోజీ సాహిత్య పురస్కార ప్రదానం అనంతరం అంపశయ్య నవీన్ మాట్లాడారు. కాళోజీ నారాయణరావు, ఆయన సోదరుడు రామేశ్వరరావుతో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. వరంగల్‌లో మిత్రమండలి స్థాపించిన కాళోజీ సోదరులు ఎంతో సాహితీ సేవ చేశారన్నారు.
కాళోజీది మహోన్నత వ్యక్తిత్వమని కొనియాడారు. గాంధీజీ గురించి ప్రముఖ శాస్త్రవేత్త ఐన్‌స్టీన్ చెప్పిన ‘ఇలాంటి వ్యక్తి ఒకరు రక్తమాంసాలతో ఈ భూమి మీద నడియాడారంటే భవిష్యత్ తరాలు విశ్వసించవు’ అన్న వ్యాఖ్యలు.. కాళోజీకి సరిగ్గా సరిపోతాయన్నారు. తన తొలి నవల అంపశయ్య రాతప్రతిని చదివి కాళోజీ తనను అభినందించిన విషయాన్ని నవీన్ గుర్తు చేసుకున్నారు. కాళోజీ పురస్కారం లభించాలన్న తన కల నెరవేరడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ సుధాకర్‌రెడ్డి, తెలంగాణ సాహిత్య అకాడమీ చైర్మన్ నందిని సిధారెడ్డి, సాంస్కృతిక శాఖ కార్యదర్శి బుర్రా వెంకటేశం, తెలంగాణ రాష్ట్ర శాట్స్ చైర్మన్ అల్లిపురం వెంకటేశ్వర్‌రెడ్డి, సంగీత నాటక అకాడమీ అ«ధ్యక్షుడు శివకుమార్, రాష్ట్ర సాంస్కృతిక శాఖ డైరెక్టర్ మామిడి హరికృష్ణ, ప్రముఖ కవి దేవులపల్లి ప్రభాకర్‌లతో పాటు పలువురు కాళోజీ అభిమానులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment