ఎన్నికల్లో ఓడిన కాళోజీ, భూపతి
సాక్షిప్రతినిధి, వరంగల్: ‘అభ్యర్థి ఏ పార్టీవాడని కాదు, ఏ పాటి వాడో చూడు... ఎన్నుకుంటే వెలగబెట్టడం కాదు, ఇందాకా ఏం చేశాడో చూడు’ అని ప్రజల అప్రమత్తతను గుర్తు చేసిన కాళోజీ నారాయణరావు సైతం ఎన్నికల్లో నెగ్గుకురాలేక పోయా రు. 1952లో ఆయన వరంగల్ లోక్‌సభ స్థానం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేశారు. పీడీఎఫ్ అభ్యర్థి పెండ్యాల రాఘవరావు కాళోజీ మీద గెలిచారు. ఎమర్జెన్సీకి నిరసనగా కాళోజీ సత్తుపల్లిలో అప్పటి ముఖ్యమంత్రి జలగం వెంగళరావుపై 1978లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి మళ్లీ ఓటమి పాలయ్యారు. వరంగల్ జిల్లాకే చెందిన మరో అదర్శ వ్యక్తి భూపతి కృష్ణమూర్తి కూడా 1972, 1978, 1983 ఎన్నికల్లో వరంగల్ నుంచి అసెంబ్లీకి వేర్వేరు పార్టీల తరఫున బరిలోకి దిగారు. మూడు సార్లూ ఆయన పరాజయం పాలయ్యారు.
గిది మీ ఊరే..
కమలాపూర్, కరీంనగర్ జిల్లా
ఈటెల.. గిటు చూడవేలా!
- గ్రామం…లోని ఆరు పడకల ఆస్పత్రిని 30 పడకలుగా మారుస్తామన్న హామీ.. హామీగానే మిగిలిపోయింది
- 2009లో 68మంది నిరుపేదలకు ఇళ్ల స్థలాల పట్టాలు పంపిణీ చేసినా ఇప్పటి వరకు చూపని భూములు
- గ్రామం…లో ఆర్టీసీ బస్టాండ్ లేక ఇబ్బందులు పడుతున్న జనం
- మంజూరైనా ప్రారంభం కాని పాలశీతలీకరణ పనులు
- రోడ్లపైకి వస్తున్న మురుగునీరు.. కంపుకొడుతున్న వార్డులు
- కలగా మిగిలిన డిగ్రీ, మహిళా జూనియర్ కళాశాలల ఏర్పాటు
- కూరగాయల మార్కెట్ నిర్మాణం ఎక్కడ.
కల్లు పారకపోతే కైకిలికే..
వృత్తి పథం(గౌడ): ‘నాకు యాభై ఎనిమిది ఏండ్లచ్చినయ్. ఒక్కచెట్టు ఎక్కితేనే ఆయసం అత్తాంది. బట్టకు, పొట్టకు తప్పితే కొత్తలేమీ(డబ్బు) కూడబెట్టలే. నా భార్య గిప్పుడు సుత కూలి పనికి పోతాంది. ఇద్దరు బిడ్డలు, కొడుకున్నడు. 14 గుంటల భూమి ఉంటే అమ్మి పెద్ద బిడ్డ పెండ్లి చేసిన. మమ్ములను ఎవ్వలూ పట్టించుకుంటలేరు. మొగిపురుగు దెబ్బకు సగం తాటిచెట్లకు రోగమొచ్చి కల్లు పారుతలేదు. పరుపుతాడు కల్లు వడిశి పారబోసుడే ఐతాంది. పోద్దాటి కల్లు సీజన్‌ల నెలరోజుల్లో దినానికి రూ.200 వస్తాయి. ఇగ పండుతాడు సీజన్‌ల గంతే పారుతది. పారకపోతె కైకిలి(కూలీ)కి పోవుడే. మళ్ల గీ కల్లు తాగేటందుకు ఇదివరకు లెక్క వత్తలేరు. చానా మంది ఎర్రమందు, గుడుంబాకే అలవాటు పడ్డరు.
గప్పట్ల తాటిచెట్ల పెంపకానికి ఐదు ఎకరాల భూమి ఇత్తమన్నరు..ఇయ్యలే. గిదంతా కాదు.. మాకు గుర్తింపు కారట్లు ఇయ్యాలె. మాకు ఎక్కువగా చెట్లెక్కి ఒళ్లు నొప్పులు తయారైతయి. గిదీనికి ఉచితంగా వైద్యం చెయ్యాలె. సపరేటు కారట్లు ఇచ్చి ప్రవేటు దవాఖానల్లో ఉచితంగా ఆపరేషన్లు చెయ్యాలె. చెట్ల మీదికెల్లి పడి కాళ్లు,రెక్కలు ఇరగ్గొట్లుకున్నోళ్లకు రూ.25వేలే ఇస్తున్నరు. గదాన్ని రూ.2లక్షలు జెయ్యాలె. చనిపోయిన వాళ్లకు రూ.5లక్షలు ఇయ్యాలె. తాటిచెట్ల పెంపుకానికి అన్ని గీతకార్మిక సొసైటీలకు పదెకరాల భూమి ఇయ్యాలె. ఎక్కే వాడిదే చెట్టు కావాలె. గిప్పుడున్న పన్నులన్నీ రద్దు కావాలె. మాకు సీజన్ లేనప్పుడు ఇంకేదైన పనిజేసుకోడానికి వడ్డీలేని రుణాలివ్వాలె. మాకు సొంతంగా ఫెడరేషన్‌ను ఏర్పాటు చేసి దానితో మమ్మల్ని పైకి తీసుకరావాలె. గా వైఎస్ రాజశేఖరరెడ్డి అచ్చినంక రొండునూర్ల పింఛన్ వత్తాంది. చానామందిమి తీసుకుంటనం. నాలుగేండ్ల కిందట గా పైసలు సరిపోయేది. గిప్పుడు మందుబిల్లలు సుత అత్తలేవు. గా పింఛన్‌ను వెయ్యిరూపాలు చెయ్యాలె.
- తాళ్లపల్లి తిరుపతిగౌడ్, హుజూరాబాద్(కరీంనగర్ జిల్లా)