కాళన్నతో తీపిజ్ఞాపకాలు
కాళోజీ.. ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేని పేరిది. ప్రజల కష్టాలను తనవిగా భావించి కలంతో పోరాడిన ధీరుడు కాళోజీ నారాయణరావు. కవిగా.. పోరాట యోధుడిగా.. ప్రజల మనిషిగా.. మనలో ఒకడిగా జీవించిన ఆయన గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. అయితే... ఆయనను అతి దగ్గరి నుంచి చూసినవారు మాత్రం కాళోజీలోని మరో మనిషిని చూశారు. ఎవరితోనైనా సరే చిన్నపిల్లాడిలా కలిసిపోవడం, ఆత్మీయత పంచడం, ఆప్తుడిలా సలహాలు, సూచనలు ఇవ్వడం..వారికి మాత్రమే తెలుసు. కాళోజీ శతజయంతి ఉత్సవాల సందర్భంగా ఆయనతో పరిచయమున్న ప్రముఖుల అభిప్రాయాలు మీకోసం..
ఓసారి కాళోజీతో పరిచయమైనా, ఆయనతో ఎక్కడైనా మాట్లాడినా ఆ అనుభవాన్ని ఎవరూ మరిచిపోలేరు. చిన్నాపెద్దా తేడా లేకుండా పలకరించడం.. రచనలు ప్రారంభించిన వారికైతే సలహాలు, సూచనలు ఇవ్వడం ఆయన అలవాటు. ఆ సూచనలు పాటించిన ఎందరో ప్రస్తుతం గొప్ప రచయితలుగా పేరు పొందారు. కాళోజీతో పరిచయం ఉన్న వారే కాదు ఒక్కసారి కలిసిన వారినైనా సరే.. పలకరిస్తే చాలు ఆయనతో అనుబంధం, గడిపిన క్షణాలను తమ జ్ఞాపకాల దొంతర నుంచి తెరతెరలుగా బయటకు తీసి ఉద్విగ్నత, ఆనందం కనిపించే కళ్లతో చెప్పుకుంటూ పోతారు. కాళోజీ జయంతి మంగళవారం జరగనున్న నేపథ్యంలో ఆయనతో పరిచయమున్న పలువురిని ‘సాక్షి’ పలకరించింది. ఈ సందర్భంగా వారు చెప్పిన వివరాలు వారి మాటల్లోనే...
- హన్మకొండ కల్చరల్
అప్రజాస్వామిక వ్యవస్థ గజగజలాడేది..
ప్రజాచైతన్య ఉద్యమాలకు నిలువెత్తు సంతకం ప్రజాకవి కాళోజీ నారాయణరావు. తన ఎక్స్‌రే కళ్లతో సమాజాన్ని దర్శించి కవిత్వం రాశారాయన. కాళోజీ ఒక వ్యక్తి కాదు.. శక్తి. కాలంతో నడిచిన ఆయన భాగస్వామ్యం వహించని ప్రజా ఉద్యమం లేదు. ఆయన జ్ఞాపకాలను పుస్తకంలా గ్రంథస్థం చేయడమే కాకుండా విస్తృత పరిశోధనలు జరగాల్సిన అవసరముంది. తనను క్షోభ పెట్టిన ప్రతీ ఘటనను కవిత్వం చేసిన మహానుభావుడాయన. సామాన్య ప్రజల బాధలు, గాథలను చిత్రించేటప్పుడు సామాన్యుడికి అర్థమయ్యే రీతిలోనే కవితా శిల్పం ఉండాలని కాంక్షించారు. కాళన్నను చూస్తే ఆ కాలంలో అప్రజాస్వామిక వ్యవస్థ గజగజలాడేది. ప్రశ్నించని నాడు మనం జీవించడం మరిచిన వాళ్లమవుతామని సూటిగా చెప్పారు కాళన్న.
- ప్రొఫెసర్ బన్నా అయిలయ్య, కాకతీయ యూనివర్సిటీ
‘నా గొడవ’ ఆవిష్కరణ మా స్కూల్‌లోనే..
వరంగల్ మహబూబియా హైస్కూల్‌లో నేను 9వ తరగతి చదువుతున్న కాళోజీ ‘నా గొడవ’ ఆవిష్కరణ జరిగింది. అప్పుడు కాళోజీ గురువు గార్లపాటి రాఘవరెడ్డి మా పాఠశాల హెచ్‌ఎంగా ఉండగా ఆవిష్కరణ సభకు శ్రీశ్రీ కూడా హాజరయ్యారు. ఆ తర్వాత కాళోజీతో పరిచయం పెరిగినా మిత్రమండలి సమావేశాలకు వెళ్లింది తక్కువ. వరంగల్‌లోని జనధర్మ పత్రిక కార్యాలయం లేదా మా మిత్రుడు నిరంజన్ తండ్రి పాములపర్తి సదాశివరావు ఇంట్లోనో కాళోజీని దగ్గరగా చూసేవాడిని. ఆయన సరళమైన భాష, సూటిగా మాట్లాడే విధానం నన్ను ఆకర్షించింది. ఒకసారి వనం మధుసూదన్‌రావు రాసిన జీర్ణజీవితాలు పుస్తకావిష్కరణ సభకు వచ్చిన కాళోజీ.. ఎంతో అభిమానంగా పిలిస్తే వచ్చాను కానీ కానీ పుస్తకాన్ని చదవనందున ఏమీ మాట్లాడలేనని ఆయన చెప్పడం ఇంకా గుర్తే. వరంగల్‌లో అఖిల భారత తెలుగు రచయితల సభలు జరిగినప్పుడు కాళోజీ, దాశరథితో పాటు కవిత చదివే అవకాశం నాకు దక్కడాన్ని మరిచిపోలేను.
- రామా చంద్రమౌళి, కవి