తెలంగాణలో ఉన్నది ఏకవచనమే! | A single word use to call in Telangana state | Sakshi
Sakshi News home page

తెలంగాణలో ఉన్నది ఏకవచనమే!

Published Sun, Sep 20 2015 3:15 AM | Last Updated on Tue, Oct 30 2018 7:57 PM

- అమ్మంగి వేణుగోపాల్ - Sakshi

- అమ్మంగి వేణుగోపాల్

ఇటీవల, తెలంగాణ ప్రభుత్వ భాషా సాంస్కృతిక శాఖ నుంచి 2015 సంవత్సరానికిగానూ  తొలి ‘ప్రజాకవి కాళోజీ పురస్కారం’ స్వీకరించిన కవి, విమర్శకుడు అమ్మంగి వేణుగోపాల్‌తో ‘సాక్షి సాహిత్యం’ ప్రతినిధి షేర్‌షా జరిపిన సంభాషణ:
 
 కాళోజీ పురస్కారం మీకు ఎందుకు వచ్చిందనుకుంటున్నారు?
 ఒకటేమిటంటే, తెలంగాణ ఉద్యమంలో ఉంటూ ఉద్యమ కవిత్వం రాయడం, అది మొదటి కారణం అనుకుంటున్నా. ఇంకోటి అటు కవిత్వ రంగంలోనూ, ఇటు సాహిత్య విమర్శ రంగంలోనూ ఉండటం. అలాగే, నేను కెరీరిస్టును కాను; నా మానాన నేను మౌనంగా పనిచేసుకుంటూ వెళ్లే మనిషిని. బహుశా వీటన్నింటినీ అవార్డు కమిటీ గుర్తించిందేమో!
 మీ జీవితానికి సంబంధించి ఈ పురస్కారం ఏమిటి?
 
 1962-63లో పద్యకవిగా నా సాహిత్య జీవితం మొదలైంది. ఆ దశ అంత విలువైంది కాదుగానీ ఒక లెక్కకోసం చెప్పడం! లాల్ బహదూర్ శాస్త్రి చనిపోయినప్పుడు, ‘ఉస్మానియా’ ప్రిన్సిపాల్ సంతాప సభ పెడితే పద్యాలు వినిపించిన. అప్పట్నుంచీ ఈ యాభై ఏళ్లుగా సాహిత్య రంగంలో ఉన్న. ‘అనార్కలి’లో ‘జీవితమే సఫలమూ...’ అన్నట్టుగా, ఇది నాకు జీవన సాఫల్య పురస్కారం!
 
 కాళోజీ తన జీవితాంతం సాధన చేసిన ముఖ్య విలువ ఏమిటి? దాని ప్రాసంగికత...
 ‘ఇంటర్‌ప్రిటేషన్ ఆఫ్ డ్రీమ్స్’లో అనుకుంటా సిగ్మండ్ ఫ్రాయిడ్ అన్నడు: ‘కవుల కవితలు కూడా కలలే. అయితే ఆ కలల వేర్లు వాస్తవ జీవితంలో ఉంటాయి’. అట్లా, మానవుడు ఆత్మాభిమానంతో ఎవరికీ తలవంచకుండా సగౌరవంగా బతకాలని కలగన్నడు కాళోజీ. ‘మానవుని మానవుడు మానవుని మాదిరిగా/ మన్నించలేనంత మలినమైనాది/ మానవుని హృదయంబు మలినమైనాది’ అన్నడు. ఈ ఆవేదన ఇప్పటికీ సజీవమే. ఒక మనిషి ఇంకో మనిషితో హెచ్చుతగ్గులతో ప్రవర్తిస్తున్నడు. ఇదంతా ఒక వైపు; మరోవైపు, ‘ఓసీ ప్రభుత్వమా/ దోపిడి వర్గాలను నువ్వు అదుపులో పెట్టజాలనప్పుడు/ పీడితవర్గాల నేను తిరగబడమంటే తప్పా?’ అని ప్రశ్నించిండు. సమసమాజం ఏర్పడేదాకా కాళోజీ రిలవెంటుగానే ఉంటడు.
 ఇంకో పార్శ్వంలో అద్భుతమైన జీవితసత్యాలు చెప్పిండు కాళోజీ: ‘పుటక నీది చావు నీది బతుకంతా దేశానిది’. ఇది ‘జేపీ’ గురించి చెప్పినా అందరికీ వర్తిస్తుంది. డేవిడ్ డేచస్ అనే విమర్శకుడు తన ‘క్రిటికల్ అప్రోచెస్ టు లిటరేచర్’లో ‘జీవితాన్ని ఒక అనంత సత్యంగా ప్రకటించే భావచిత్రమే కవిత’ అని నిర్వచించిండు. అట్లా కాళోజీ జీవిత సత్యాన్ని చెప్పే తాత్వికుడిలా కనిపిస్తడు.
 
 కాళోజీని మొదటిసారి ఎప్పుడు చూశారు?
 సంచార కవి వేమన, భక్త తుకారాంల వారసుడు కాళోజీ. తుకారాం నా దగ్గర ‘మాటలనే రత్నాలున్నాయి, వాటినే పంచుతూ వెళ్తా’ అంటడు. అట్లానే కాళోజీ తెలంగాణ, ఆంధ్ర జిల్లాల్లో కూడా విపరీతంగా తిరిగిండు! మాటల రత్నాలు పంచిండు. వరంగల్ వాళ్లు కాక మిగిలిన జిల్లాలవాళ్లందరూ ఆయన్ని ఏదో ఒక బహిరంగసభలో చూసుంటరు. 1968-69 ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో సుల్తాన్‌బజార్ హైస్కూల్ ప్రాంగణంలో- అప్పుడు ఇంత రద్దీ లేదు కదా, అక్కడ బహిరంగ సభలు జరిగేటివి- అక్కడ ఆయన మాట్లాడిండు. అప్పుడు చూసిన మొదటిసారి. కవిత చదవడం, వ్యాఖ్యానం, ఉపన్యాసం... ఇదీ కాళోజీ పద్ధతి. 20,000-30,000 మంది గల సభలో కవిత్వంతో జనాన్ని ఆకట్టుకోవడం ఆయనకే సాధ్యమైంది. ప్రజాకవి అనడం వెనుక ఔచిత్యం అది.
 
 తర్వాత, నా ఉద్యోగ జీవితం 1970లో జూనియర్ లెక్చరర్‌గా హుజూరాబాద్(కరీంనగర్)లో మొదలైంది. అక్కణ్నుంచి వరంగల్ 30-40 కిలోమీటర్లు . ‘మిత్రమండలి’ సమావేశాలకు వెళ్లేటోడిని. ఒకసారి నరసింహారెడ్డి ఇంట్లో, ఒకసారి తిరుపతయ్య ఇంట్లో, ఇంకోసారి వరవరరావు ఇంట్లో సమావేశాలు జరిగేటివి. యువకులు కవిత చదివి, కాళోజీ వ్యాఖ్య కోసం ఎదరుచూసెటోళ్లు. పొరపాటు ఎత్తిచూపడం కాకుండా ఆయన వ్యాఖ్య లైవ్లీగా ఉండేది. మనముందు జీవిత దృశ్యం ఉంచి కంపారిటివ్‌గా చెప్పెటోడు. యంగ్‌స్టర్‌కు యూజ్‌ఫుల్‌గా ఉండేది.
 
 కాళోజీ జయంతిని ‘తెలంగాణ భాషా దినోత్సవం’గా ప్రకటించడం పట్ల మీ ఆలోచనలు...
 నా ఉద్దేశంలో సీమాంధ్ర నాయకులు, సినిమాలు తెలంగాణ మాటను చిన్నచూపు చూడటంలోంచి వచ్చిన తిరుగుబాటు ధోరణిగా దీన్ని చూడాలి. మొదట్లో కాళోజీ జయంతిని తెలుగు మాండలిక భాషా దినోత్సవంగా పాటించిన్రు. కాని దాని మీద సీమాంధ్ర జిల్లాలు అంత ఉత్సాహం చూపలేదు. తెలంగాణ ఏర్పడినాక, తెలంగాణ జీవితానికి ప్రాముఖ్యత లభించింది. తెలంగాణ పలుకుబడి, మాటతీరు వీటికి పెద్దపీట వేయడం ఇప్పుడు జరుగుతున్నది. ఆత్మగౌరవ సూచకంగా దాన్ని సెలబ్రేట్ చేస్తున్నం.
 ‘తెలంగాణ భాష’ అనడం దీర్ఘకాలికంగా మేలుచేసేదేనా?
 
 నా ఉద్దేశంలో మేలుచేస్తదో చేయదోగానీ కీడు చేయదని మాత్రం చెప్పొచ్చు. మనకు ఉన్నదంతా ఏకవచనమే. బహువచనం లేదు. ఇప్పుడు పాఠ్యపుస్తకాల్లో సింగులర్‌కే ప్రాధాన్యత ఇస్తున్నరు.
 మీరు కొత్తగా పరిచయం నాకు, మిమ్మల్ని మీరు అనకుండా నువ్వు అనగలనా?
 మీకు ఇప్పుడు అభ్యంతరంగా ఉంటుంది కావొచ్చు. అరవై ఏళ్ల కింద నువ్వే అనేటోళ్లం.
 
 ప్రస్తుతం మీ సాహిత్య కార్యకలాపాలు...
 నా నాలుగో కవితా సంపుటి గంధంచెట్టు వారం పది రోజుల్లో విడుదలవుతుంది. నా ఎంపిక చేసిన కవితల్ని ఎలనాగ ఇంగ్లీషులోకీ, ఎం.రంగయ్య హిందీలోకి చేస్తున్నరు. ఇంకా, సగంలో ఆపేసిన నా పుస్తకాలు ‘కాళోజీ జీవితం-సాహిత్యం’, ‘బిరుదురాజు రామరాజు జీవితం- సాహిత్యం’ పూర్తి చేయవలసి ఉంది. కేంద్ర సాహిత్య అకాడమీ సభ్యుడిగా మఖ్దూం మొహియుద్దీన్ లైఫ్ అండ్ వర్క్స్‌ను ఇంగ్లీషు నుంచి తెలుగులోకి చేస్తున్న.
 సంభాషణ ప్రారంభానికి ముందు, మనవడి అనారోగ్యం గురించి వచ్చింది కదా... సాహిత్యకారుడిగా ఇట్లాంటి లౌకిక వ్యవహారాలు ఎలా ఎదుర్కొంటారు?
 
 చిన్న పిల్లలకు జబ్బు చేస్తే ఇల్లంతా సంక్షోభానికి గురవుతుంది. చిన్నపిల్లల పట్ల ఉండే అనుబంధం అలాంటిది. అట్లాంటి సందర్భాల్లో ఎంత పెద్ద సాహిత్యకారుడైనా సాధారణ మనిషిగా మారిపోతడు. మీరు ఫోన్ చేసినప్పుడు రిపోర్టు కోసం పోయినుంటి. డెంగీ కాదని తేలిపోయింది. పెద్ద రిలీఫ్. అయితే, ఇదంతా అధిగమించి ఒక జ్ఞాపకంగా మారినప్పడు దీన్ని సాహిత్యంలోకి తేగలుగుతాం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement