ఎంసెట్-2 సర్టిఫికెట్ల వెరిఫికేషన్ వాయిదా | EAMCET -2 Certificate verification postponed | Sakshi
Sakshi News home page

ఎంసెట్-2 సర్టిఫికెట్ల వెరిఫికేషన్ వాయిదా

Published Mon, Jul 25 2016 2:24 AM | Last Updated on Tue, Oct 30 2018 7:57 PM

ఎంసెట్-2 సర్టిఫికెట్ల వెరిఫికేషన్ వాయిదా - Sakshi

ఎంసెట్-2 సర్టిఫికెట్ల వెరిఫికేషన్ వాయిదా

- రాత్రికి రాత్రే సర్కారు నిర్ణయం
- వారం పాటు వాయిదా వేస్తున్నట్లు కాళోజీ హెల్త్ యూనివర్సిటీ వెల్లడి
 
 సాక్షి, హైదరాబాద్ : ఎంసెట్-2 ప్రశ్నపత్రం లీకేజీ ఆరోపణల వ్యవహారం ప్రభుత్వంలో ప్రకంపనలు సృష్టిస్తోంది. ఇందులో కేసు నమోదు చేస్తే తప్ప లోతైన విచారణ చేపట్టలేమన్న సీఐడీ వాదన నేపథ్యంలో ఎంసెట్-2 కౌన్సెలింగ్‌పై ప్రభుత్వం వెనకడుగు వేసింది. ఎంబీబీఎస్, బీడీఎస్ సీట్లలో ప్రవేశాలకు సోమవారం నుంచి జరగాల్సిన సర్టిఫికెట్ల వెరిఫికేషన్ ప్రక్రియను వారం రోజులపాటు వాయిదా వేసింది. తిరిగి ఎప్పుడు నిర్వహించేదీ ప్రకటించలేదు. కాళోజీ ఆరోగ్య విశ్వవిద్యాలయం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం సోమవారం నుంచి వచ్చేనెల రెండో తేదీ వరకు అభ్యర్థుల సర్టిఫికెట్లను పరిశీలించాల్సి ఉంది.

ఆదివారం సాయంత్రం వరకు కూడా వెరిఫికేషన్ ఉంటుందని చెబుతూ వచ్చిన ప్రభుత్వం... రాత్రి అకస్మాత్తుగా వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది. ఇప్పటికే రాష్ట్రంలోని అనేక మంది విద్యార్థులు సర్టిఫికెట్ల ధ్రువీకరణ కోసం హైదరాబాద్, వరంగల్‌కు ముందుగానే చేరుకున్నారు. ఎంసెట్-1, ఎంసెట్-2, నీట్.. ఇలా ఒకే ఏడాది మూడు పరీక్షలు రాసిన విద్యార్థులు ఇప్పుడు లీకేజీ వ్యవహారం తెరపైకి రావడంతో మానసికంగా నరకయాతనకు గురవుతున్నారు.

 వెంటాడుతున్న అనుమానాలు
 ఎంసెట్-2కు సంబంధించిన అనుమానాలు సీఐడీని కూడా వెంటాడుతూనే ఉన్నాయి. బ్రోకర్ వెంకట్రావ్ పదే పదే విద్యార్థుల తల్లిదండ్రులకు ఫోన్లు చేసి ‘మెడికల్ సీటు గ్యారంటీ’ అని చెప్పడం వెనుక మతలబేంటి..? నిజంగా అతడికి ఎవరితోనైనా సంబంధాలు ఉన్నాయా? అనే కోణంలో అధికారులు లోతుగా విచారణ చేస్తున్నారు. అతనితో మాట్లాడినా సరైన సమాచారం లభ్యం కావడం లేదని పేర్కొంటున్నారు. కొందరు విద్యార్థులు కోచింగ్ సెంటర్ల నుంచి ముందుగానే ఎందుకు వెళ్లారన్న దానిపైనా స్పష్టత రావడం లేదు. బ్రోకర్ వెంకట్రావ్, విద్యార్థుల తల్లిదండ్రులకు మధ్య జరిగిన సంభాషణలను పూర్తిగా పరిశీలించాలని సీఐడీ భావిస్తోంది. కేసు నమోదు కాగానే వెంటనే సెల్‌ఫోన్ కంపెనీల నుంచి కాల్ రికార్డులను తెప్పించుకొని పరిశీలిస్తే స్పష్టత వచ్చే అవకాశం ఉందని భావిస్తోంది.
 
 నేడు కేసు నమోదు!
 ఎంసెట్-2 లీకేజీ వ్యవహారంపై ప్రభుత్వ అనుమతితో సోమవారం కేసు నమోదు చేయాలని సీఐడీ భావిస్తోంది. ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి అనుమానితులందరినీ అదుపులోకి తీసుకొని విచారిస్తేనే వాస్తవాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. కేసు ప్రాధాన్యత దృష్ట్యా ఇన్‌చార్జి అధికారిగా అదనపు ఎస్పీ స్థాయి అధికారిని కేటాయించారు. ఆయనపై డీఐజీ స్థాయి అధికారి ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement