నెల్లూరు(టౌన్), న్యూస్‌లైన్ : ఇంజనీరింగ్, డాక్టర్ కోర్సులు చదవాలనుకునే విద్యార్థుల కోసం ప్రభుత్వం గురువారం నిర్వహించనున్న ఎంసెట్‌కు జిల్లాలో అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని ఎంసెట్ కన్వీనర్ రామ్మోహన్‌రావు తెలిపారు. పరీక్షలకు సంబంధించిన ఏర్పాట్లు గురించి ఆయన మంగళవారం అధికారులతో కలిసి ‘న్యూస్‌లైన్’తో మాట్లాడారు. 10,943 మంది విద్యార్థులు ఇంజనీరింగ్, 3397 మంది మెడికల్ కోర్సు కోసం పరీక్షలు రాయబోతున్నారని తెలిపారు. ఇందుకోసం మొత్తం 27 కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు. నెల్లూరు నగరానికి దూరంగా కొన్ని కేంద్రాలు ఉన్నాయన్నారు. విద్యార్థులు ఇబ్బంది పడకుండా ఉండేందుకు ముందు రోజు అంటే బుధవారమే పరీక్ష కేంద్రాల వద్దకు వెళ్లి పరిశీలించుకోవాలని సూచించారు.
పరీక్ష సమయానికి ఒక్క నిమిషం ఆలస్యమైనా అనుమతించే ప్రసక్తే లేదన్నారు. పరీక్ష కేంద్రానికి గంటముందే చేరుకోవాలని తెలిపారు. అలా చేరుకున్నప్పుడు విద్యార్థులు ఎలాంటి ఒత్తిడి లేకుండా ప్రశాంతంగా ఉంటారన్నారు. పరీక్ష కేంద్రాలను తనిఖీ చేసేందుకు ఇంజనీరింగ్ విభాగానికి ఇద్దరు, మెడిసిన్ విభాగానికి ఏడుగురు జేఎన్‌టీయూ విశ్వవిద్యాలయం నుంచి ప్రత్యేక పరిశీలికులు వస్తున్నారని చెప్పారు. వీరు ప్రతి కేంద్రాన్ని తనిఖీ చేస్తారన్నారు. వీరు కాక ప్రతి సెంటర్‌కు ఒక పరిశీలకులు ఉంటారని తెలిపారు. 25 మందితో కూడిన తహశీల్దార్ స్థాయి కలిగిన రెవెన్యూ స్క్వాడ్ కూడా కలెక్టర్ ఆధ్వర్యంలో తనిఖీలు నిర్వహిస్తుందని చెప్పారు.
ఎలక్ట్రానిక్ పరికరాలు, కళ్లద్దాలపై డేగకన్ను
ఎలాంటి ఎలక్ట్రానిక్ పరికరాలను విద్యార్థులు తీసుకొచ్చినా వెంటనే డిబార్ చేస్తామని రామ్మోహన్‌రావు తెలిపారు. రంగుల కళ్లద్దాలు, పెన్‌లాంటి పరికరాలు, ఎలక్ట్రానిక్ వాచీలను నిషేధించినట్లు చెప్పారు. చూసేదానికి కళ్లద్దాలు, వాచీలు లాగా ఉన్నప్పటికీ అవి ప్రశ్నపత్రాన్ని స్కాన్ చేస్తాయన్నారు. అందుకే అలాంటి వాటిని నిషేధించినట్లు చెప్పారు. అంతేకాకుండా పరిస్థితులను బట్టి ఎలక్ట్రానిక్ పరికరాలు సమీపంలో బయట కూడా పనిచేయకుండా ఉండేందుకు జామర్‌ను కూడా ఏర్పాటు చేస్తామన్నారు. తగిన పోలీసు బందో బస్తు ఉందన్నారు. పరీక్షలు ఉదయం ఇంజనీరింగ్ విభాగానికి, మధ్యాహ్నం మెడిసిన్ ఎంట్రెన్స్ విభాగానికి జరుగుతాయని తెలిపారు.
రేపు ఎంసెట్
Published Wed, May 21 2014 2:32 AM | Last Updated on Sat, Sep 2 2017 7:37 AM
Advertisement