సీఎం పర్యటన ఖరారు
- కాళోజీ కళాక్షేత్రానికి శంకుస్థాపన
- నిట్‌లో జయంతి కార్యక్రమం
- సైన్స్‌సెంటర్ ప్రారంభం వాయిదా
- టీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు రవీందర్‌రావు వెల్లడి
సాక్షిప్రతినిధి, వరంగల్ : జిల్లాలో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు తొలి పర్యటన ఖరారైంది. కాళోజీ నారాయణరావు శతజయంతి ఉత్సవాల సందర్భంగా నిర్వహించే అధికారిక కార్యక్రమాల్లో పాల్గొనేందుకు ఈ నెల 9న కేసీఆర్ జిల్లా కేంద్రానికి వస్తున్నారు. కాళోజీ నారాయణరావుకు గుర్తింపు ఇచ్చే విధంగా కార్యక్రమాలు నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నేపథ్యంలో కాళోజీ కళాక్షేత్రానికి శంకుస్థాపన, జయంతి ఉత్సవాల్లో పాల్గొనే కార్యక్రమాలకే ముఖ్యమంత్రి కేసీఆర్ పరిమితం కానున్నారు. సైన్స్ సెంటర్, ఇండోర్ స్టేడి యం నిర్మాణాలు పూర్తయిన నేపథ్యంలో వీటి ప్రారంభోత్సవం నిర్వహించాలని అధికారులు ప్రతిపాదిం చారు. దీనికి ముఖ్యమంత్రి అంగీకరించ లేదు.
ఇతర కార్యక్రమాల్లో పాల్గొంటే కాళోజీ కార్యక్రమానికి ప్రాధాన్యం తగ్గించినట్లు ఉంటుందనే ఉద్దేశంతో కేసీఆర్ నిరాకరించినట్లు తెలిసింది. కాళోజీ జయంతి ఉత్సవాల నేపథ్యంలో టీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు టి.రవీందర్‌రావు గురువారం కేసీఆర్‌ను కలిశారు. ‘సీఎం కేసీఆర్ సెప్టెంబరు 9న ఉదయం 11.45 గం టలకు హెలికాప్టర్‌లో ఆర్ట్స్ కాలేజీ మైదానంలో దిగుతారు. కాళోజీ సెంటర్‌లోని కాళోజీ నారాయణరావు విగ్రహానికి పూలమాలతో నివాళులర్పిస్తారు.
అక్కడి నుంచి హయగ్రీవాచారి మైదానానికి చేరుకుని కాళోజీ కళాక్షేత్రం నిర్మాణానికి శంకుస్థాపన చేస్తారు. అనంతరం నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(నిట్) ఆడిటోరియంలో జరగనున్న కాళోజీ శత జయంతి ఉత్సవాల్లో పాల్గొంటారు. ఆ తర్వాత బాలసముద్రంలోని టీఆర్‌ఎస్ పొలిట్‌బ్యూరో సభ్యుడు కెప్టెన్ వి.లక్ష్మీకాంతరావు ఇంటికి చేరుకుంటారు. అక్కడ భోజనం చేసి మధ్యాహ్నం 2 గంటలకు హైదరాబాద్‌కు వెళ్తారు’ అని రవీందర్‌రావు ‘సాక్షి ప్రతినిధి’కి తెలిపారు. కాళో జీ కళాక్షేత్రం 3 ఎకరాల విస్తీర్ణంలో ఉంటుంది. హైదరాబాద్‌లోని రవీంద్రభారతికి రెట్టింపుస్థాయి సౌకర్యాలతో దీన్ని నిర్మించాలని సర్కారు నిర్ణయించింది.