ఘనంగా కాళోజీ జయంతి
నాంపల్లి: గ్రేటర్‌లో కాళోజీ శతజయంతిని ఘనంగా జరుపుకున్నారు. తెలంగాణ యాసకు సాహిత్య గౌరవాన్ని కల్పించిన గొప్ప కవి కాళోజీ నారాయణరావు అని తెలంగాణ ప్రభుత్వ సలహాదారు డాక్టర్ కేవీ రమణాచారి అన్నారు. తెలుగు విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో మంగళవారం జరిగిన కాళోజీ శతజయంతి ఉత్సవాలకు ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు.
కాళోజీ సాహిత్య సేవలను వివరించారు. తెలుగు విశ్వవిద్యాలయం ఉపాధ్యక్షులు ఆచార్య ఎల్లూరి శివారెడ్డి అధ్యక్షోపన్యాసం చేశారు. భాషా సాంస్కృతిక శాఖ సంచాలకులు డాక్టర్ రాళ్లబండి కవితా ప్రసాద్, ప్రము ఖ కవి డాక్టర్ నందిని సిధారెడ్డి ఉపన్యసించారు. రిజిస్ట్రార్ ఆచార్య కె.తోమాసయ్య స్వాగతం పలికారు. ప్రోగ్రాం ఇన్‌చార్జ్ ఆర్.రాంమూర్తి వందన సమర్పణ చేశారు.
ట్యాంక్‌బండ్‌పై విగ్రహం ఏర్పాటు చేయాలి
కాళోజీ నారాయణరావు విగ్రహాన్ని ట్యాంక్‌బండ్‌పై ప్రతిష్ఠించాలని టీఎన్జీఓ కేంద్ర సంఘం రాష్ట్ర అధ్యక్షులు దేవీ ప్రసాద్ కోరారు. కాళోజీ శత జయంతి వేడుకలు మంగళవారం నాంపల్లిలోని టీఎన్జీఓ కార్యాలయంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన దేవీ ప్రసాద్, కాళోజీ నారాయణ రావు చిత్రపటానికి పూలమాల నివాళులర్పించారు. టీఎన్జీఓ ప్రధాన కార్యదర్శి కారం రవీందర్‌రెడ్డి, నాయకురాలు రేచల్, హైదరాబాదు జిల్లా అధ్యక్షులు ముజీబ్, నగర అధ్యక్షుడు వెంకట్, జిల్లా కార్యదర్శి ప్రభాకర్, అసోసియేట్ సభ్యులు విజయ్ రావు, నాయకులు యాదగిరి రెడ్డి, లక్ష్మీనారాయణ పాల్గొన్నారు.
దార్శనికుడు..
దోమలగూడ: ప్రజాకవి కాళోజీ మనస్సున్న మనిషి, భవిష్యత్ తరాలకు దార్శనికుడు అని శ్రీపొట్టి శ్రీరాములు తెలుగు విశ్వ విద్యాలయం ఉపాధ్యక్షులు ఆచార్య ఎల్లూరి శివారెడ్డి అన్నారు. దోమలగూడలోని ఏవీ కళాశాలలో తెలంగాణ భాషా సాంస్కతిక మండలి ఆధ్వర్యంలో మంగళవారం ప్రజాకవి కాళోజీ జయంతి ఉత్సవాలు నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆయన కాళోజీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించి మాట్లాడారు.
ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన ప్రముఖ కవి, రచయిత అమ్మంగి వేణుగోపాల్, తెలంగాణ భాషా సాంస్కతిక మండలి అధ్యక్షులు డాక్టర్ గంటా జలందర్‌రెడ్డి మాట్లాడారు. ప్రముఖ రచయిత బుక్కా బాలరాజు, గాంధి గ్లోబల్ ఫ్యామిలీ జాతీయకార్యదర్శి గున్నా రాజేందర్‌రెడ్డి, నేటి నిజం పత్రిక సంపాదకులు దేవదాసు తదితరులు హాజరై మాట్లాడారు. ఈ సందర్భంగా ఆదివారం నిర్వహించిన కాళోజీ స్మారక చెస్ టోర్నమెంట్ విజేతలకు ఎల్లూరి శివారెడ్డి బహుమతులు ప్రదానం చేశారు.
ఎన్‌ఐఎన్‌లో..
తార్నాకలోని జాతీయ పోషకాహార సంస్థ (ఎన్‌ఐఎన్)లో తెలంగాణ సైన్స్ సొసైటీ ఆధ్వర్యంలో కాళోజీ జయంతి సదస్సు జరిగింది. ఎన్‌ఐఎన్ డెరైక్టర్ కల్పగం పొలాస అధ్యక్షతన జరిగిన ఈ సదస్సులో ఎస్‌ఎల్‌ఎన్‌ఎస్ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ టి. మల్లారెడ్డి, కవి, గాయకులు సుద్దాల అశోక తేజ, గోరటి వెంకన్న, పాశం యాదగిరి తదితరులు హాజరై ప్రసంగించారు. డాక్టర్ రాజేందర్‌రావు, భాస్కరాచారి పాల్గొన్నారు.