సాక్షి, హైదరాబాద్ : దేశవ్యాప్తంగా సూపర్ స్పెషాలిటీ వైద్య సీట్లు పొందేందుకు తెలంగాణ విద్యార్థులకు భారీగా అవకాశాలు పెరిగాయి. నీట్ ద్వారా ప్రవేశాలు కల్పించడం, అఖిల భారత కోటాలో పోటీ పడేందుకు వీలు కలగడంతో సూపర్ స్పెషాలిటీ వైద్య సీట్లలో పాగా వేసేందుకు మార్గం ఏర్పడిందని వైద్య ఆరోగ్యశాఖ వర్గాలు చెబుతున్నాయి. ప్రస్తుతం తెలంగాణలో 150 సూపర్ స్పెషాలిటీ వైద్య సీట్లే ఉన్నాయి. కాగా దేశవ్యాప్తంగా చూస్తే వెయ్యికి పైగా సీట్లున్నాయి. గతంలో తెలంగాణలో ఉన్న విద్యార్థులు రాష్ట్రంలో ఉన్న సూపర్ స్పెషాలిటీ సీట్లకే దరఖాస్తు చేసుకునే పరిస్థితి ఉండేది.
అయితే గతేడాది నుంచి నీట్ ద్వారా ప్రవేశాలు కల్పించడంతో పరిస్థితి మారింది. అంతేకాదు రాష్ట్రంలోని సీట్లు కూడా అఖిల భారత కోటాలోకి వెళ్లాయి. ఎంబీబీఎస్ సీట్లలో కేవలం 15 శాతమే అఖిల భారత కోటాలోకి ప్రభుత్వ సీట్లు వెళ్లగా, సూపర్ స్పెషాలిటీ సీట్లు నూటికి నూరు శాతం వెళ్లడం గమనార్హం. పైగా ప్రైవేటు కాలేజీల సీట్లు కూడా అఖిల భారత కోటాలోకి వెళ్లాయి. అంటే దేశంలోని సూపర్ స్పెషాలిటీ సీట్లన్నీ కూడా దేశవ్యాప్తంగా జరిగే కౌన్సెలింగ్ ద్వారా భర్తీ చేస్తారు. రిజర్వేషన్లు కూడా ఉండవు. రాష్ట్ర కోటా కూడా లేదు. అంటే దేశంలోని అన్ని సీట్లల్లోనూ రాష్ట్ర విద్యార్థులు పోటీ పడటానికి వీలు కలిగిందని వైద్య ఆరోగ్యశాఖ వర్గాలు చెబుతున్నాయి.
వచ్చే నెల ఒకటి నుంచి వెబ్ కౌన్సెలింగ్..
సూపర్ స్పెషాలిటీ వైద్య సీట్ల కోసం నీట్ పరీక్ష నిర్వహించిన సంగతి తెలిసిందే. వాటి ఫలితాలు ఇటీవల విడుదలయ్యాయి. ఆయా కోర్సుల్లో చేరేందుకు వచ్చే నెల ఒకటో తేదీ నుంచి ఐదో తేదీ వరకు మొదటి విడత వెబ్ కౌన్సెలింగ్ నిర్వహించేందుకు మెడికల్ కౌన్సెలింగ్ కమిటీ (ఎంసీసీ) శుక్రవారం నోటిఫికేషన్ జారీ చేసింది. వెబ్ కౌన్సెలింగ్‌లో సీటు పొందిన విద్యార్థులు తమకు కేటాయించిన సీట్లను లాక్ చేసుకునేందుకు ఐదో తేదీ ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు అవకాశం కల్పించారు. ఆరో తేదీన సీటు కేటాయింపు జరుగుతుంది.
వాటి ఫలితాలను ఏడో తేదీన ప్రకటిస్తారు. సీటు పొందిన విద్యార్థులు అదే నెల 8 నుంచి 13 వరకు కేటాయించిన కాలేజీల్లో చేరడానికి గడువు విధించారు. ఇక రెండో విడత వెబ్ కౌన్సెలింగ్ వచ్చే నెల 16 నుంచి 19వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు ఉంటుంది. విద్యార్థులు తమకు వచ్చిన సీటును 19వ తేదీ ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు లాక్ చేసుకోవాలి. 20వ తేదీన సీటు కేటాయింపు ప్రక్రియ జరుగుతుంది. 21వ తేదీన ఫలితాలు వెల్లడిస్తారు. 22 నుంచి 27వ తేదీ వరకు తమకు కేటాయించిన కాలేజీల్లో చేరేందుకు గడువు విధించారు. ఇదిలావుండగా గతేడాది దేశవ్యాప్తంగా అనేక కాలేజీల్లో సూపర్ స్పెషాలిటీ సీట్లు మిగిలిపోవడంతో విద్యార్థులు ఆందోళన చెందారు. గతేడాది రెండు సార్లు మాత్రమే కౌన్సెలింగ్ నిర్వహించారు. సీట్లు మిగిలిపోవడంతో వాటిని తిరిగి భర్తీ చేసుకునేందుకు సుప్రీంకోర్టు అనుమతి ఇవ్వలేదని కాళోజీ నారాయణరావు ఆరోగ్య వర్సిటీ వీసీ డాక్టర్ కరుణాకర్‌రెడ్డి ‘సాక్షి’తో అన్నారు. ఈసారి ఎలా ఉంటుందో తెలియదని ఆయన వ్యాఖ్యానించారు.
Comments
Please login to add a commentAdd a comment