కాళోజీ కల సాకారం
-
శిలాఫలకాన్ని ఆవిష్కరించిన ప్రధాని నరేంద్రమోదీ
-
త్వరలో ప్రారంభం కానున్న యూనివర్సిటీ భవన నిర్మాణ పనులు
సాక్షి, హన్మకొండ :
కాళోజీ నారాయణరావు ఆరోగ్య విజ్ఞాన విశ్వవిద్యాలయం భవనాల నిర్మాణానికి ప్రధానమంత్రి నరేంద్రమోడీ శంకుస్థాపన చేశారు. మెదక్ జిల్లా గజ్వేల్ నియోజకవర్గం కోమటిబండలో ఆదివారం ఏర్పాటు చేసిన బహిరంగ వేదికపై ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు సమక్షంలో రిమోట్ ద్వారా ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత జిల్లాకు దక్కిన ప్రతిష్టాత్మక ప్రాజెక్టు కాళోజీ హెల్త్ యూనివర్సిటీ. సమైక్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ విజయవాడలో ఉంది. రాష్ట్ర విభజన తర్వాత ఈ యూనివర్సిటీ ఆంధ్రప్రదేశ్‌కు దక్కడంతో తెలంగాణలో ఆరోగ్య వర్సిటీని వరంగల్‌లో నెలకొల్పేలా అప్పటి ఉప ముఖ్యమంత్రి, ఆర్యోగ్య మంత్రి తాటికొండ రాజయ్య కృషి చేశారు. చివరకు ముఖ్యమంత్రి కేసీఆర్ వరంగల్‌కు ఈ వర్సిటీని మంజూరు చేశారు. తొలుత కాకతీయ మెడికల్ కాలేజీలోని తాత్కాలిక భవనంలో ఈ విశ్వవిద్యాలయాన్ని ప్రారంభించారు. అనంతరం వీసీగా కరుణాకర్‌రెడ్డిని నియమించారు.
రూ. 130 కోట్లతో నిర్మాణం..
వరంగల్ నగరంలో కాళోజీ యూనివర్సిటీ నెలకొల్పి ఏడాది దాటినా పూర్తి స్థాయిలో కార్యకలాపాలు ప్రారంభం కాలేదు. పూర్తి స్థాయిలో భవనం, సిబ్బంది లేకపోవడంతో ఈ పరిíస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో వర్సిటీ భవనాలను రూ. 130 కోట్లతో నిర్మించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇందులో తొలి విడతగా రూ. 25 కోట్లు మంజూరు చేసింది. ఈ నిధులతో ప్రస్తుతం సెంట్రల్ జైలు ఉన్న ప్రాంతంలో ఖాళీగా ఉన్న 30 ఎకరాల స్థలంలో వర్సిటీ పరిపాలన భవనాలను నిర్మించనున్నారు. ఈ భవనాల నిర్మాణ నమూనాలను టీ వన్ అనే కన్సల్టెంట్ సంస్థ రూపొందించింది. ఈ పరిపాలన భవనాన్ని దాదాపు లక్ష చదరపు అడుగుల వైశాల్యంతో నిర్మించనున్నారు. కాగా, శిలాఫలం ఆవిష్కరణ కార్యక్రమంలో కేంద్రమంత్రులు వెంకయ్యనాయుడు, సురేశ్‌ప్రభు, అనంత్‌కుమార్, బండారు దత్తాత్రేయ, రాష్ట్ర మంత్రులు కల్వకుంట్ల తారకరామారావు, హరీశ్‌రావు, జగదీశ్‌రెడ్డి, జిల్లా నుంచి ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి, గ్రేటర్ వరంగల్ మేయర్ నన్నపునేని నరేందర్ తదితరులు పాల్గొన్నారు.