
ఓయూలో ఘనంగా కాళోజీ జయంతి
సాక్షి, హైదరాబాద్ : ఉస్మానియా విశ్వవిద్యాలయం ఆర్ట్స్ కళాశాలలో ప్రజాకవి, పద్మభూషణ్ కాళోజి నారాయణ రావు జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఆయన జన్మదినం సందర్భంగా తెలంగాణ భాషా దినోత్సవాన్ని, కాళోజీ జయంతిని సంయుక్తంగా ఆర్ట్స్ కళాశాల తెలుగు శాఖ ఆధ్వర్యంలో జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఆచార్యులు, పరిశోధకులు మాట్లాడుతూ కాళోజీ వ్యక్తిత్వాన్ని కొనియాడారు. తెలంగాణ భాషా వైశిష్ట్యాన్ని, తెలంగాణ మాండలికాన్ని కాళోజి నిర్భయంగా ఉపయోగించిన తీరును వివరించారు.
ఆయన నిరాడంబర జీవితాన్ని గుర్తు చేస్తూ, జీవితాంతం బడుగు బలహీనుల కోసం కలాన్ని కదిపిన మహనీయుడని అన్నారు. ఎవరికి కష్టం వచ్చినా కంటతడిపెట్టే సున్నితమైన మనసుగలవారని, అదే సమయంలో ఎక్కడ అన్యాయం జరిగినా ఒంటరిగా ప్రశ్నించే దీశాలి అని కొనియాడారు. కాళోజి అందించిన స్ఫూర్తిని ప్రతిఒక్కరూ అందుకోవాలన్నారు. తెలంగాణా భాష, యాసల ఖ్యాతిని నలుదిశలా విస్తరింపజేయాల్సిన బాధ్యత భావి పరిశోధకులపై ఉందన్నారు. ఈ కార్యమంలో ఆర్ట్స్ కళాశాల ఉప ప్రధానాచార్యులు, తెలుగు శాఖ అధ్యక్షులు పరిశోధక విద్యార్థులు పాల్గొన్నారు.