
వైద్య విద్య సీట్లకు 9 నుంచి దరఖాస్తులు
- 18న ముగియనున్న గడువు
- మెరిట్ ఆధారంగా సీట్ల కేటాయింపు
- ప్రకటించిన కాళోజీ ఆరోగ్య విశ్వవిద్యాలయం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని వైద్య కాలేజీల్లో 2017–18 విద్యా సంవత్సరానికి కన్వీనర్ (కాంపిటెంట్ అథారిటీ) కోటా ఎంబీబీఎస్, బీడీఎస్ కోర్సులలో సీట్ల భర్తీ ప్రక్రియను ప్రారంభించినట్లు కాళోజీ నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయం గురువారం ప్రకటించింది. ఈ మేరకు జాతీయ స్థాయి అర్హత ప్రవేశ పరీక్ష (నీట్) ర్యాంకు ప్రకారం ఆన్‌లైన్‌లో జూలై 9 ఉదయం 11 నుంచి దరఖాస్తు చేసుకోవాలని సూచించింది.
ఈ గడువు జూలై 18న సాయంత్రం 5 గంటలకు ముగుస్తుందని తెలిపింది. http://medadm.tsche.in, www.knruhs.in వెబ్‌సైట్లలో దరఖాస్తు చేసుకోవచ్చని పేర్కొంది. ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకున్న వారి వివరాల ఆధారంగా కాళోజీ ఆరోగ్య విశ్వవిద్యాలయం మెరిట్ జాబితాను ప్రకటిస్తుంది. అనంతరం ర్యాంకుల ప్రకారం అభ్యర్థుల విద్యార్హత సర్టిఫికెట్లను పరిశీలించి మరోసారి మెరిట్ జాబితాను ప్రకటిస్తారు. జాబితాలోని అభ్యర్థులు ఎంబీబీఎస్, బీడీఎస్ సీట్ల కోసం ఆన్‌లైన్‌లో ఆప్షన్లు ఇచ్చుకోవాల్సి ఉంటుంది. అభ్యర్థుల ఆప్షన్లను పరిశీలించి మెరిట్ ప్రకారం వర్సిటీ సీట్లను కేటాయిస్తుంది.