వరంగల్ జిల్లాకు ప్రాధాన్యం
మరోసారి జిల్లాకు వచ్చిన సీఎం కేసీఆర్
ఈసారి రెండు రోజుల పర్యటన
నేడు అర్చక సమాఖ్య సభకు హాజరు
భూపాలపల్లిలో నియోజకవర్గ సమీక్ష
జిల్లా కేంద్రం ప్రకటనపై ఆసక్తి!
తెలంగాణలో హైదరాబాద్ తర్వాత వరంగల్ నగరానికి తమ ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తుందని పదే పదే చెబుతున్న ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు.. చేతల్లోనూ ఇదే విషయాన్ని స్పష్టం చేస్తున్నారు. సీఎం కేసీఆర్ మరోసారి జిల్లాకు వచ్చారు. ముఖ్యమంత్రి హోదాలో జిల్లాకు రావడం ఇది నాలుగోసారి. కేసీఆర్ గురువారం సాయంత్రం 4.40 గంటలకు హెలికాప్టర్‌లో హన్మకొండ ఆర్ట్స్‌కాలేజీ మైదానంలో దిగారు. ఈ పర్యటనలో ప్రధానంగా వరంగల్ నగరంపైనే దృష్టి పెట్టారు. వస్తూనే వరంగల్ తూర్పు నియోజకవర్గంలోని లక్ష్మీపురం, శాకరాసికుంట, శివగిరిప్రసాద్‌నగర్ బస్తీల్లో పర్యటించారు. వరంగల్ నగర సమగ్ర అభివృద్ధికి చర్యలు తీసుకుంటామని ప్రకటించారు. రాత్రి 8.20 గంటలకు హన్మకొండలోని మాజీ మంత్రి కెప్టెన్ లక్ష్మీకాంతరావు నివాసంలో బస చేశారు.
నేడు పశ్చిమలో..
శుక్రవారం వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలోని బస్తీల్లో పర్యటించనున్నారు. వరంగల్ నగర సమగ్ర అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. టీఆర్‌ఎస్ అధినేతగా ఉద్యమకాలంలో కేసీఆర్ వరంగల్ జిల్లాకు తరుచూ వచ్చేవారు. ముఖ్యమంత్రి పదవి చేపట్టిన తర్వాత ఇదే పరంపర కొనసాగిస్తున్నారు. కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన 2014 జూన్ 2 నుంచి ఇప్పటివరకు జిల్లాకు నాలుగోసారి వచ్చారు. గతేడాది సెప్టెంబరు 9న కాళోజీ నారాయణరావు జయంతి ఉత్సవాలకు, డిసెంబరు 21న కొమురవెల్లి మల్లికార్జునస్వామి కల్యాణోత్సవానికి, అదే నెల 29న జిల్లాకు వచ్చారు. 29న నిర్వహించిన సమీక్షలోనే పరిపాలన విషయంలో కచ్చితంగా ఉంటామని అధికార యంత్రాంగానికి స్పష్టం చేశారు. త్వరలోనే మళ్లీ వస్తానని రెండు రోజులు జిల్లాలో ఉండి రాత్రి నగరంలోనే బస చేస్తాని అన్నారు. అన్నట్లుగానే పది రోజుల్లోనే మళ్లీ వచ్చారు. ఉద్యమ సమయంలో, ఎన్నికల ప్రచార సభల్లో చెప్పినట్లుగానే ముఖ్యమంత్రి కేసీఆర్ వరంగల్ జిల్లాకు ప్రాముఖ్యత ఇస్తున్నారని టీఆర్‌ఎస్ వర్గాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి.
వరంగల్, భూపాలపల్లిపై నజర్
తాజాగా జిల్లాకు వచ్చిన సీఎం కేసీఆర్.. ప్రధానంగా వరంగల్ నగరం, భూపాలపల్లి నియోజవర్గాలపైనే దృష్టి పెడుతున్నారు. శుక్రవారం భూపాలపల్లి నియోజకవర్గ అభివృద్ధిపై నియోజకవర్గంలోనే అన్ని శాఖల అధికారులతో సమీక్ష నిర్వహిస్తారు. కాకతీయ థర్మల్ విద్యుత్ ఉత్పత్తి కేంద్రం రెండో దశ పనుల తీరు, మూడో దశ పనుల మొదలుపైన అధికారులతో చర్చిస్తారు. శాసనసభ స్పీకర్ ఎస్.మధుసూదనచారి సొంత నియోజకవర్గం కావడంతో కేసీఆర్ భూపాలపల్లి నియోజకవర్గ అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి పెట్టారు. దీంట్లో భాగంగానే భూపాలపల్లి నియోజకవర్గంలోనే సమీక్ష సమావేశం నిర్వహిస్తున్నారు. సింగరేణి గనులతో వేగంగా అభివృద్ధి చెందుతున్న భూపాలపల్లి కేంద్రంగా జిల్లాను ఏర్పాటు చేస్తామని ఎన్నికల ప్రచారంలో కేసీఆర్ ప్రకటించారు.కేసీఆర్ శుక్రవారం స్వయంగా అక్కడికి వెళ్తుండడంతో కొత్త జిల్లా ఏర్పాటుపై ప్రకటన చేస్తారని భూపాలపల్లి వాసులు భావిస్తున్నారు.