Lila
-
అలనాటి స్టార్ హీరోయిన్ రీఎంట్రీ, 16 ఏళ్ల తర్వాత వెండితెరపై సందడి
Laila Returns To Movies After 16 Years: ‘ఎగిరే పావురమా..’ మూవీతో టాలీవుడ్ వెండితెరపై మెరిసిన అలనాటి తార, సొట్టబుగ్గల బ్యూటీ లైలా రీఎంట్రీ ఇవ్వబోతోంది. వివాహం అనంతరం సినిమాలకు గుడ్‌బై చెప్పిన ఆమె దాదాపు 16ఏళ్ల తర్వాత కోలీవుడ్ రీఎంట్రీ ఇస్తోంది. హీరో కార్తీ తాజా చిత్రం సర్ధార్ మూవీలో లైలా ప్రధాన పాత్ర పోషిస్తోంది. ఇప్పటికే ఆమె షూటింగ్లో పాల్గొందని, ఆమెకు సంబంధించిన 15 రోజుల షూటింగ్ షెడ్యుల్ కూడా అయినట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో లైలా పాత్ర కీలకంగా ఉండబోతోందని సినీ వర్గాల నుంచి సమాచారం. కాగా ‘దుష్మన్ దునియా కా’ అనే హిందీ మూవీతో మొదట సినీరంగ ప్రవేశం ఇచ్చిన లైలా ఎగిరేపావురంతో టాలీవుడ్‌కు పరిచయమైంది. చదవండి: సౌత్ ఇండస్ట్రీపై రాశీ ఖన్నా షాకింగ్ కామెంట్స్ ఆ తర్వాత తెలుగులో ఆమె నటించిన సినిమాలు తక్కువే అయిన తన క్యూట్ స్మైల్‌తో కుర్రకారు మనసులను దొచుకుంది. ‘నా హృదయంలో నిదురించే చెలి’, ‘పెళ్లి చేసుకుందాం’ వంటి చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరైన లైలా చివరిగా ‘నువ్వే కావాలి’ సినిమాలో స్పెషల్ సాంగ్‌తో మెప్పించింది. తెలుగులో నటిస్తూనే తమిళంలోనూ ఎంట్రీ ఇచ్చింది. తక్కువ కాలంలో లైలా తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో పలు చిత్రాల్లో నటించి టాప్ హీరోయిన్గా గుర్తింపు పొందింది. ఈ క్రమంలో పెళ్లి చేసుకుని నటకు బ్రేక్ ఇచ్చి ముంబై వెళ్లిపోయిన లైలా వెండితెరపై కనిపించి 16 ఏళ్లు గడిచిపోయింది. చదవండి: రాధేశ్యామ్ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్, ఆ రోజు నుంచే స్ట్రీమింగ్ ఈ నేపథ్యంలో హీరో కార్తీ సినిమాతో లైలా కోలీవుడ రీఎంట్రీ ఇస్తుండంతో ఆమె ఫ్యాన్స్ తెగ సంబరపడిపోతున్నారు. ఈ విషయం తెలిసి టాలీవుడ్‌కి కూడా ఆమె త్వరలోనే రీఎంట్రీ ఇవ్వాలని తెలుగు ప్రేక్షకులు, ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. కాగా లైలా తమిళంలో చివరిగా అజిత్ హీరోగా 2006లో వచ్చిన ‘తిరుపతి’ సినిమాలో కనిపించింది. సర్ధార్ మూవీలో మొదట లైలా పాత్రకు నటి సిమ్రాన్ అనుకున్నారట. ఆమె వేరే ప్రాజెక్ట్స్‌తో బిజీ ఉండటంతో తన స్థానంలో లైలాను పరిశీలించి సంప్రదించారట దర్శక-నిర్మాతలు. కథ నచ్చడంతో లైలా వెంటనే గ్రీన్ సిగ్నిల్ ఇచ్చిందని సమాచారం. కాగా ఈ సినిమాలో కార్తీకి జోడిగా రాశీ ఖన్నా నటిస్తుంది. క్రైమ్ థ్రిల్లర్‌గా రూపొందుతోన్న ఈ మూవీకి పీఎస్ మిత్రాన్ దర్శకత్వం వహిస్తున్నాడు. -
రెండు గతాల సంభాషణ
కొత్త బంగారం మారిలిన్ రాబిన్సన్ ‘లైల’ నవల, ఐవా రాష్ట్రంలో కాల్పనిక ఊరైన గిలియడ్ నేప«థ్యంగా రాసినది. చింకి బట్టలు తొడుక్కున్న నాలుగో, ఐదో ఏళ్ళున్న లైల తన ఇంటి బయట చలికి వణుకుతూ, ఏడుస్తూ కనబడ్డప్పుడు–స్థిరత్వం లేని కుటుంబం నుంచి ఆ పిల్లని దొంగిలించి, కాపాడిన డాల్‌తో నవల ప్రారంభం అవుతుంది. ‘డాల్ ప్రపంచంలో అతి ఒంటరి స్త్రీ అయి ఉండవచ్చు. లైల ఒంటరి పిల్ల. ఇద్దరూ వర్షంలో ఒకరినొకరు వెచ్చగా ఉంచడానికి ప్రయత్నిస్తూ కలిసి ఉన్నవారు’ అంటారు రచయిత్రి. ఒక చోటనుండి మరొక దానికి మారుతూ, దొరికిన రోజు తింటూ, లేనినాడు పస్తులుంటూ ఉన్నప్పుడు కూడా వారిద్దరి జీవితాల్లో ప్రేమకి కొదవుండదు. దశాబ్దాలు గడుస్తాయి. డాలీ చేసిన హత్యవల్ల ఆమె జైల్లో పడ్డాక, లైల వేశ్యాగృహంలోకి ప్రవేశిస్తుంది. అయితే, ఆమె రూపురేఖలు ఆకర్షణీయంగా లేకపోవడంతో అక్కడ ఎక్కువ కాలం మనలేకపోతుంది. లాస్ ఏంజెలెస్‌లో ఒక చిన్న గుడిసెలో తల దాచుకుని, పక్కనే ఉన్న గిలియడ్ ఊరుకి వెళ్ళినప్పుడు, కురుస్తున్న వానని తప్పించుకుంటూ లైల చర్చిలోకి అడుగు పెడుతుంది. అక్కడ ఫాదరీ అయిన 67 ఏళ్ళ జాన్ ఏమ్స్ను కలుసుకుంటుంది. తన ఒంటరితనం ఇంక దూరం అయే అవకాశమే లేదనుకున్న ఏమ్స్కీ, సంవత్సరాల శ్రమనోడ్చి, ఒంటరితనం అంటే ఏమిటో తెలిసి, ఎవరినీ నమ్మే స్వభావం లేకపోయి, కత్తి తన స్టాకింగ్స్‌లో దాచుకుని తిరిగే లైలకీ స్నేహం కుదురుతుంది. అతన్ని కలుసుకోడానికి తరచూ అతని ఇంటికి వెళ్తుంది. పురిట్లో చనిపోయిన అతని భార్యా, కొడుకూ సమాధులని శుభ్రం చేయడం మొదలెడుతుంది. సంకోచంతో, లాంఛనప్రాయంగా మొదలయిన వారి స్నేహం, ఆకర్షణగా మారి పెళ్ళి చేసుకుంటారు. వారి మధ్యపెంపొందుతున్న సాన్నిహిత్యానికి వారి గతాలు అడ్డం పడుతూ ఉంటాయి.అతను బైబిల్ గురించి చెప్తూ ఉండే మాటలు ఆమెకి అర్థం కావు. మతం, విశ్వాసం గురించి నేర్చుకుంటూ– భర్తని నమ్మే సమర్థత తనకి లేదనుకుంటూనే లైల అతని మీద నమ్మకం ఏర్పరచుకుంటుంది. గర్భవతి అయినప్పుడు పుట్టబోయే బిడ్డమీద తన గతం ప్రభావం చూపుతుందేమోనని భయపడినా, తండ్రి ప్రభావం పడితే చాలనుకుంటుంది. కొడుకు పుట్టిన తరువాత, తల్లితనం వల్ల ఉపశమనం పొందుతుంది. కథనం ప్ర«థమ పురుషలో, చైతన్య స్రవంతిలో సాగుతుంది. నవలంతటా బైబిల్యుతమైన భాష కనిపిస్తుంది. రచయిత్రి స్వరం సరళతకూ, నిస్పృహతత్వానికీ మధ్య ఊగిసలాడుతూ–తేలికైన హాస్యాన్నీ, తీవ్రమైన భావోద్వేగాన్నీ సమపాళ్ళల్లో కనబరుస్తుంది. లైల, ఏమ్స్ మధ్య జరిగే సంభాషణలు– గతం, ఉనికి, జీవితానికున్న అర్థం మీద కేంద్రీకరిస్తాయి. అవే నవలకి ఆయువు పట్టు. ‘ఉనికిలో ఉంటూ ప్రేమలో పడిన పాత్రలు కావు వారిద్దరివీ. ప్రేమలో పడ్డానికి ఉనికిలో ఉన్నవి’ అంటారు రచయిత్రి. 2014లో అచ్చయిన ఈ నవల రాబిన్సన్ రాసిన నాలుగవది. గిలియడ్ ట్రియోలజీకి మూడవ భాగం. కథాకాలం 1920. 2014లో ‘నేషనల్ బుక్ క్రిటిక్స్ సర్కిల్ అవార్డ్’ పొంది, 2015లో ‘మాన్ బుక్ ప్రైజ్’కు లాంగ్ లిస్ట్ అయిన ఈ నవల, మరెన్నో అవార్డులు కూడా గెలుచుకుంది. - కృష్ణ వేణి -
‘సమ’భావనమూ, సమతావాదము...
తక్కువ ఆదాయంతో, చాలా సాధారణంగా బతుకీడ్చే వారుంటారు. తమ ప్రతిభతో మంచి స్థాయి సంపాదనతో బతికే వారూ ఉంటారు. కానీ కొంతమంది టాలెంట్‌తో తాము బాగా బతకడంతో పాటు తమ చుట్టూ ఉన్న వారి లైఫ్‌స్టైల్‌ను కూడా మార్చేస్తూ వారి జీవితాలను తీర్చిదిద్దుతూ తాము కూడా వెలిగిపోతారు. అలాంటి వ్యక్తే లీల జనా. ఒక ఎన్ఆర్ఐ కుటుంబానికి చెందిన ఈ యువతి ప్రస్థానం ఇది... అవకాశం ఉంటే ఆసియా, ఆఫ్రికాఖండాల్లోని అభివృది ్ధచెందుతున్న దేశాల ప్రజల స్థితిగతులను మార్చేయాలనే తపన చాలా మందిలో ఉంటుంది. అలాంటి తపననే కలిగి అవకాశం కోసం ఎదురు చూడకుండా, అవకాశాన్ని సృష్టించుకుంది లీల. స్కాలర్షిప్ చదువులు... పుట్టింది సాధారణ మధ్య తరగతి కుటుంబంలోనే అయినా... స్కాలర్‌షిప్‌ల సాయంతో మంచి మంచి విద్యాసంస్థల్లోనే చదువుతూ వచ్చింది లీల. హార్వర్డ్ యూనివర్సిటీలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశాక అనేక ప్రముఖ సంస్థల్లో ఇంటర్న్‌షిప్ చేయడానికి అవకాశాన్ని సంపాదించుకొంది. ముందుగా ఆఫ్రికాలోని ఘనా వెళ్లి అక్కడ కొన్ని రోజుల పాటు పరిస్థితులను పరిశీలించి వచ్చింది. ఆ తర్వాత ప్రపంచబ్యాంకు తరపున అనేక ఆఫ్రికా దేశాల్లో పర్యటించి అక్కడ అభివృద్ధి కార్యక్రమాల పర్యవేక్షకురాలిగా పనిచేసింది. ఈ సందర్భంలో అక్కడి పరిస్థితులను చూసి చలించి పోయింది లీల. వారిని అభివృద్ధి పథంలో నడిపించడానికి ఏదో ఒకటి చేయాలని తపించింది. తిరిగి అమెరికాకు వెళ్లిపోయాకా దీని గురించి సొంతంగా అధ్యయనం చేయసాగింది. ఔట్‌సోర్సింగ్‌ను ఆధారం చేసింది... ఈ క్రమంలో ఆఫ్రికాలో పేదరికం, నిరక్షరాస్యత లు తీవ్రమైన సమస్యలుగా గుర్తించింది. అయితే అక్కడ సరైన అవకాశాలు లేకపోవడంతో చదువుకున్న వారు కూడా ఉపాధి లేకుండా నిరక్షరాస్యులతో పాటే మనుగడ సాగిస్తున్నట్టు అర్థం చేసుకొంది. వారిని లక్ష్యంగా చేసుకొని, ఔట్సోర్సింగ్పద్ధతిని అమల్లో పెట్టాలని లీల ప్రణాళిక రచించింది. ‘ఆఫ్రికన్ డెవలప్మెంట్’ అనే సబ్జెక్ట్‌తో గ్రాడ్యుయేషన్ చేసిన నేపథ్యం, ప్రపంచ బ్యాంకుతో కలిసి పనిచేసిన అనుభవం ఆమెకు లాభించాయి. ఆమె ప్రణాళికకు ప్రముఖ కంపెనీలు సహకరించేలా చేశాయి. ఈ క్రమంలో లీల ‘సమా సోర్స్’ అనే సంస్థను నెలకొల్పింది. అందరికీ అవకాశాలు కల్పించాలనే లక్ష్యంతో ‘సమ’ అనే సంస్కృత పదం స్ఫూర్తితో తన సంస్థకు ఆ పేరు పెట్టింది లీల. సక్సెస్ సాధించింది... ముందుగా తాను గుర్తించిన అభివృద్ధి చెందిన దేశాల్లో పర్యటించి అక్కడ చదువుకొన్న యువతను సమీకరించుకొంది. వారికి కంప్యూటర్ టెక్నాలజీ మీద ప్రాథమిక అవగాహన పెంపొందించుకోవడానికి శిక్షణా కార్యకమాలను ఏర్పాటు చేసింది. అలాంటి వారి చేత ఔట్సోర్సింగ్ పద్ధతిలో ప్రముఖ కంపెనీ ఉద్యోగులను చేయాలన్నదే లీల ఉద్దేశం. ఈ విషయంలో ఆమెకు గూగుల్, లింక్డిన్, ఈబే, మైక్రోసాఫ్ట్, ఈవెంట్ బ్రైట్ వంటి కంపెనీలు సహాకారం అందించాయి. తమకు కావాల్సిన పనులను లీల ద్వారా అభివృద్ధి చెందిన నిపుణుల ద్వారా చేయించుకోవడం మొదలెట్టాయి. దీంతో లీల ప్రణాళిక ఫలించింది. వేలమందికి ఉపాధి లభించింది. ప్రస్తుతానికి సబ్ సహారన్ ఆఫ్రిక దేశాల్లో, దక్షిణాసియా, కరేబియన్ దేశాల్లో ‘సమాసోర్స్’ కార్యకలాపాలను విస్తరించింది. దాదాపు ఐదువేల మందికి ప్రత్యక్ష ఉపాధిని కల్పిస్తోంది. ఈ స్థాయిని మరింత విస్తరించాలన్నదే తన లక్ష్యమని లీల చెబుతోంది. తాను గుర్తించిన అభివృద్ధి చెందిన దేశాల్లో పర్యటించి అక్కడ చదువుకొన్న యువతను సమీకరించుకొంది. వారికి కంప్యూటర్ టెక్నాలజీ మీద ప్రాథమిక అవగాహన పెంపొందించుకోవడానికి శిక్షణా కార్యక్రమాలను ఏర్పాటు చేసింది. అలాంటి వారి చేత ఔట్సోర్సింగ్ పద్ధతిలో ప్రముఖ కంపెనీ ఉద్యోగులను చేయాలన్నదే లీల ఉద్దేశం. -
పద్ధతులే దిద్దుతాయి!
పిల్లల పెంపకం చాలా ఈజీ అట! అచ్యుతుని గోపాలకృష్ణమూర్తి అంటున్నారు. ఈజీనా! ఇక్కడంతా కిందమీద అవుతుంటే... చలం ‘బిడ్డల శిక్షణ’ని,నామిని ‘ఇస్కూలు పుస్తకాల్ని’ ముందేస్కుని కూర్చుంటే... ఈయనేమో వెరీ సింపుల్ అని తేల్చేస్తారా? రస్నా యాడ్‌తో బుట్టలో వేసుకున్నంత మాత్రాన... ఏం చెప్పినా పిల్లలు వినేస్తారనుకోవడమేనా! ఈమాటకు చిన్న స్మైల్ ఇస్తారు లీల, గోపాలకృష్ణలు. ‘ఎవరు చెప్పమన్నారు?’ అని ఆ నవ్వులకర్థం! చెప్పకుండా ఎలా? ‘చెప్పాలి... కానీ చెప్పీచెప్పనట్లు, చేసీ చూపినట్లు.’ ఇదే... లీలపాఠం, గోపాలపాఠం... ఈవారం మన ‘లాలిపాఠం’ కూడా. ఎనభైలలో టీవీ సామాన్యులకు అందివచ్చిన రోజులవి. వాణిజ్య ప్రకటనలను కూడా ఆసక్తిగా చూసిన కాలం. చక్కగా సూట్, కోట్ ధరించిన క్రికెట్ దిగ్గజాలు, బాలీవుడ్ నటులు తమ హుందాతనానికి కారణం ఈ దుస్తులే అన్నట్లు పోజిచ్చేవారు... బ్యాక్‌గ్రౌండ్‌లో ‘ఓన్లీ విమల్’ అనే వాయిస్ వినిపించేది, అది విమల్ సూటింగ్స్ అండ్ షర్టింగ్స్ ప్రకటన. అలాగే ఫిబ్రవరి దాటి మార్చినెలలో అడుగుపెట్టామంటే ‘పదేళ్లు నిండని పాప ఎర్రని సాఫ్ట్ డ్రింకు తాగుతూ ఆ గ్లాసును బుగ్గకు తాకించుకుని ‘ఐ లవ్ యూ రస్నా’ అనేది. ఇప్పుడు ఈ ప్రస్తావన ఎందుకంటే... కలకాలం గుర్తుండిపోయిన ఈ ప్రకటనల రూపకర్త అచ్యుతుని గోపాలకృష్ణమూర్తి దంపతులు వాళ్ల పిల్లలను పెంచిన విధానమే ఈ వారం మన లాలిపాఠం. మీ పిల్లల వివరాలు చెప్తారా? లీల: మాకు ముగ్గురమ్మాయిలు, ఒకబ్బాయి. అనూరాధ, సుధారాణి, సుజాత, కల్యాణ్. యాడ్ ఏజెన్సీ నిర్వహణతోపాటు మైకా (ముద్రా ఇన్స్టిట్యూట్ ఆఫ్ కమ్యూనికేషన్స్, అహ్మదాబాద్) విద్యాసంస్థను స్థాపించి శిక్షణనిచ్చిన యాడ్ ఎక్స్‌పర్ట్‌గా మీ పిల్లలను ఎలా తీర్చిదిద్దారు? కృష్ణమూర్తి: మేము పిల్లలను పెంచాం అంతే, ఇక తీర్చిదిద్దుకోవడం అంటారా... వాళ్లను వాళ్లే తీర్చిదిద్దుకున్నారు. నా ఉద్యోగం, వ్యాపారరీత్యా 45 ఏళ్లు గుజరాత్లో ఉన్నాం. పిల్లల వ్యక్తిత్వ వికాసానికి, సౌమ్యంగా వ్యాపారం చేసుకోవడానికి అనువైన గుజరాత్ సమాజం కూడా కారణమే అనుకుంటాను. గుజరాత్ సామాజిక వాతావరణం మనకు భిన్నంగా ఉంటుందంటారా? కృష్ణమూర్తి: అక్కడివాళ్లు వ్యాపారం చేయడానికి ఇష్టపడతారు. ఎక్కువమంది చిన్నదో పెద్దదో వ్యాపారం చేస్తుంటారు. ‘లాభనష్టాల రిస్కుతో కూడిన వ్యాపారంకంటే చదువుకుని ఉద్యోగం చేసుకోవచ్చు కదా’ అని సలహా ఇస్తే... ‘చదువుకున్న వాళ్లకు మేము ఉద్యోగాలిస్తాం’ అంటారు. అహ్మదాబాద్ ఐఐఎంలో గుజరాతీలకంటే బయటి రాష్ట్రాల వాళ్లే ఎక్కువగా ఉంటారు. పిల్లలకు మీరు నేర్పించినదేమీ లేదంటారా? కృష్ణమూర్తి: తెలుగు మాట్లాడడం అలవాటు చేశాను. జాతీయస్థాయిలో రాణించడానికి ఇంగ్లిష్ మీడియంలో చదివించాను, గుజరాత్లో సెకండ్ లాంగ్వేజ్‌గా గుజరాతీ చదివారు. అయినా పిల్లలెవర్నీ తెలుగు భాషకు దూరం కానివ్వలేదు. మేము నేర్పించిందల్లా మాతృభాష మీద మమకారం, పెద్దల పట్ల గౌరవం, సంస్కారం మాత్రమే. పిల్లల మీద తల్లిదండ్రుల ప్రభావం ఎంతవరకు ఉంటుందంటారు? కృష్ణమూర్తి: ‘యథారాజా తథా ప్రజా’ అన్నట్లు పిల్లల మీద నూటికి నూరు శాతం తల్లిదండ్రుల ప్రభావమే ఉంటుంది. పెద్దయ్యేకొద్దీ వాళ్లపరిధి విస్తరించి సమాజం ప్రభావం చూపిస్తుంది. కానీ ఆ ప్రభావం... తల్లిదండ్రులు ఇంట్లో ఎనిమిది- పదేళ్ల వరకు వేసిన పునాది మీదనే ఆధారపడి ఉంటుంది. ఆ పునాదే పిల్లలను చక్కటి పౌరులను చేస్తుంది. ఇంట్లో సంస్కారవంతమైన వాతావరణం ఉండేటట్లు చూసుకోవడం, మంచి స్కూల్లో చేర్పించడం... ఈ రెండూ జాగ్రత్తగా చేస్తే చాలనుకునేవాణ్ని. మంచి స్కూలంటే..? కృష్ణమూర్తి: ఎక్కువ ఫీజులు వసూలు చేసే స్కూల్ కాదు. ఈ స్కూలుకి పిల్లలు ఏయే కార్లలో వస్తున్నారు... వంటివి కాదు. పాఠశాల మోటో ఏంటి, టీచర్ల దృక్పథం ఎలా ఉంది, మన సంస్కృతిని, నైతిక విలువలను నేర్పించే వాతావరణం ఉందా... వంటి విషయాలకు ప్రాధాన్యం ఇచ్చాను. ఏ తరంలోనైనా మధ్యతరగతి జీవితాలు పాటించే విలువలే అత్యున్నతమైన విలువలని నమ్ముతాను. ఆ విలువలు పాటించే స్కూల్లోనే చేర్పించాను. ఇక మిగిలినదంతా ఈవిడే చూసుకున్నది. మరి కాలేజ్ చదువులు... కోర్సుల గెడైన్స్ ఎలా ఉండేది? లీల: ఈయనకేమో పిల్లలు అహ్మదాబాద్ ఐఐఎమ్‌లో ఎంబిఎ చదివి మా యాడ్ ఏజెన్సీ చూసుకోవడానికి వస్తే బావుణ్నని ఉండేది. కానీ నలుగురిలో ఎవరితోనూ ఈ విషయం చెప్పలేదు. పిల్లలు ఏది చదువుతానంటే అదే చదివించాం. పెద్దమ్మాయి బిఎ, రెండో అమ్మాయి ఫ్యాషన్ టెక్నాలజీ, మూడవ అమ్మాయి ఫైన్ ఆర్ట్స్, యానిమేషన్ కోర్సులు చేశారు. అబ్బాయి బీటెక్ చేసి అమెరికాలో ఎం.ఎస్ చదివాడు. కృష్ణమూర్తి: మనిషికి ఉండేది ఒక్కటే జీవితం. దానిని ఎవరికి వారు తమకు ఇష్టమైనట్లు జీవించాలి, తమ ఆశలకు ఇష్టాలకు అనుగుణంగా మలుచుకోవాలి. అలా మలుచుకునే స్పేస్‌ని పిల్లలకు ఇవ్వాలి. ‘నేను ఫలానా వృత్తిలో ఉన్నాను కాబట్టి నువ్వు కూడా ఇదే మార్గంలో నడువు’ అని వాళ్ల దారిని మనం నిర్దేశించకూడదు. తమ అభిప్రాయాలకు విలువ ఉందనే భరోసా కలిగించాలి. తర్వాత వాళ్లకు అసంతృప్తి కలిగినప్పుడు ‘అంతా మీరే చేశారు’ అనే అవకాశం ఉంది. ఆ మాట అంటారని మాత్రమే కాదు, అనడానికి ముందు వాళ్లలో కలిగే సంఘర్షణ చిన్నదిగా ఉండదు. వీటన్నింటినీ ఆలోచించి వాళ్లకు ఇష్టమైన ప్రొఫెషన్ని ఎంచుకునే అవకాశాన్నిచ్చాను. పెళ్లి విషయంలోనూ పూర్తి స్వేచ్ఛనిచ్చాం, అన్నీ మేము కుదిర్చిన పెళ్లిళ్లే. మా పిల్లల భవిష్యత్తు, మా కుటుంబ నేపథ్యానికి సరిపోతాయనుకున్న సంబంధాలను షార్ట్ లిస్ట్ చేసి వాళ్ల ముందు పెడితే ఫైనల్ సెలెక్షన్ ఎవరికి వాళ్లే చేసుకున్నారు. బాల్యంలో కథల రూపంలో విలువలు చెప్పే ప్రయత్నం జరిగిందా? లీల: నేను పేదరాశి పెద్దమ్మ కథలు, విదుర నీతి, చందమామ కథలు చెప్పేదాన్ని. ఒకే పెంపకంలో పెరిగినప్పటికీ నలుగురిలో స్పష్టమైన మార్పులు కొన్ని ఉంటాయేమో!? లీల: నిజమే, పెద్దమ్మాయికి ఫ్రెండ్స్ ఎక్కువ. రెండో అమ్మాయి నా కొంగు పట్టుకుని తిరిగేది. మూడో అమ్మాయి గుంటూరులో మా అమ్మ దగ్గర పెరిగింది. ఒకరికొకరికి రెండు- మూడేళ్లు తేడానే. పెద్దమ్మాయికి, అబ్బాయికి మధ్య పదేళ్లు తేడా ఉండడంతో తమ్ముడి బాధ్యత తనే చూసుకునేది. కృష్ణమూర్తి: ఒకే నేపథ్యంలో పెరిగినప్పటికీ పిల్లల్లో మార్పులు అంటే... కోపం, శాంతం వంటి జెనెటికల్‌గా వచ్చే వాటిని ఎవరూ మార్చలేరు. కానీ నడవడిక, మాట, మన్నన వంటివి అమ్మానాన్నల నుంచే నేర్చుకుంటారు కాబట్టి నలుగురినీ ఒకే విధంగా ఉండేటట్లు పెంచవచ్చు. నా ఇన్నేళ్ల కెరీర్లో ‘కృష్ణమూర్తి ఈ విషయంలో అబద్ధం చెప్పాడు, లంచం తీసుకున్నాడు’ వంటి ఆరోపణలు చేసే వాళ్లు లేరు. అంత కచ్చితంగా ఉన్నాను కాబట్టి ఆ మాటను ధైర్యంగా చెప్పగలుగుతున్నాను. ఈ ప్రభావం పిల్లల మీద ఉండి తీరుతుంది. గుజరాత్ వ్యాపార సంస్కృతిని మీ పిల్లలూ అలవరుచుకున్నారా? లీల: అవును, ముగ్గురమ్మాయిలు కలిసి అహ్మదాబాద్‌లో రెండు బొటిక్స్(దుస్తులు డిజైనింగ్, స్టిచింగ్) పెట్టారు. పెద్దమ్మాయి పెళ్లయిన తర్వాత మిగిలిన ఇద్దరూ చూసుకునేవాళ్లు. ఇప్పుడు కుటుంబాలను చూసుకుంటూ ఇద్దరు హైదరాబాద్, ఒకరు చెన్నైలో ఉంటున్నారు. మా అబ్బాయి చిన్నప్పటి నుంచి టీవీ, రేడియోలను విప్పి సెట్ చేస్తుండేవాడు. అలాగే ఎలక్ట్రానిక్స్ వైపే వెళ్లాడు. కృష్ణమూర్తి: ఇష్టమైన పనిని ఎన్ని గంటలు చేసినా శ్రమ అనిపించదు. నేను పద్దెనిమిది గంటలు పని చేశానంటే నాకు ఇష్టమైన క్రియేటివ్ ఫీల్డు కాబట్టి చేయగలిగాను. అకౌంట్స్ సాల్వ్ చేయమంటే అరగంట కూడా కూర్చోలేను. అయితే ఆ తరంలో గుంటూరులో మా కుటుంబ నేపథ్యంలో నాకిలా గైడ్ చేసే వాళ్లు లేకపోవడంతో హిస్టరీ చదివి మ్యూజియంలో పనిచేశాను, తర్వాత క్యాలికో మిల్స్ ఉద్యోగం కోసం అహ్మదాబాద్ వెళ్లాను. ముప్పై ఏళ్లకు నాకు సరైన ప్రొఫెషన్ ఏదో తెలుసుకోగలిగాను. అంటే... పిల్లలకు కెరీర్ గెడైన్స్ అవసరమేనంటారా? కృష్ణమూర్తి: గెడైన్స్ అవసరమే కానీ అది ఆదేశం కాకూడదు. మంచిచెడుల గురించి గెడైన్స్ ఇచ్చినట్లే ఇది కూడ. ఎందుకంటే ఎవరి నడకను వాళ్లు నడవాల్సిందే, ఎవరి జీవితాన్ని వాళ్లు జీవించాల్సిందే. ఆ ఫిలాసఫీనే ఎప్పుడూ నమ్ముతాను. మా తరంతో పోల్చుకుంటే ఈ తరం పిల్లలకు ఎక్స్పోజర్ ఎక్కువ. ఎన్ని రకాల కెరీర్ ఆప్షన్లు ఉన్నాయనే సమాచారం వాళ్ల ముంగిట్లో ఉంటోంది. అందులో, తనకు ఇష్టమైన రంగాన్ని ఎంచుకునే అవకాశాన్ని వాళ్లకే ఇవ్వాలి. - వాకా మంజులారెడ్డి, సాక్షి ఫీచర్స్ ప్రతినిధి వాళ్ల నాన్నగారి నుంచి టైమ్ మేనేజ్మెంట్ నేర్చుకున్నారు. ఆయన రోజూ టంచన్‌గా తొమ్మిదిన్నరకు ఆఫీసులో ఉండేవారు. సొంత ఆఫీసే కదా అని ఆలస్యంగా వెళ్లడం ఆయనకు అలవాటు లేదు. ఇప్పటికీ ఏదో ఒకటి రాస్తూనే ఉంటారు. డెబ్బై ఏళ్ల వయసులో కూడా కన్సల్టెన్సీ నడుపుతున్నారు. ఆయన అబద్ధాలు చెప్పరు. పిల్లలకు అదే అలవాటైంది. - లీల మా అమ్మగారు, అత్తమామలు కూడా మాతోనే ఉండేవారు. అలా పిల్లలకు చిన్నప్పటినుంచి గ్రాండ్పేరెంట్స్కి సహాయం చేయడం అలవాటైంది. ఇవన్నీ వ్యక్తిని తీర్చిదిద్దే అంశాలే. మనం బాధ్యతగా ఉంటే పిల్లలూ అదే నేర్చుకుంటారు. మనం మన అమ్మానాన్నలను, ఇతరులను ఎవరినైనా కించపరిచేటట్లు మాట్లాడితే పిల్లలూ అదే నేర్చుకుంటారు. మా అమ్మగారితో ఈవిడ పోట్లాడిన సందర్భం ఒక్కటీ లేదు. భార్యాభర్తలు ఇంటిని యుద్ధరంగం చేయకుండా ప్రశాంతంగా ఉంచడంలో సక్సెస్ అయితే పిల్లల పట్ల బాధ్యతగా ఉన్నట్లే. - కృష్ణమూర్తి