కొత్త బంగారం
జిలియన్ ఫ్లిన్ రాసిన ‘గాన్ గర్ల్’ నవల– నిక్, యేమీ ఐదవ వివాహ వార్షికోత్సవం నాడు, యేమీ కనబడకపోవడంతో మొదలవుతుంది. నిక్ డన్, యేమీ వివాహంలో ఉన్న ప్రేమ దూరమవుతూ ఉంటుంది. ఇద్దరూ న్యూయోర్కులో ఉద్యోగాలు పోగొట్టుకుని, క్యాన్సర్‌తో బాధపడుతున్న నిక్ తల్లి వద్దకి మిజోరీ చేరుకుంటారు. యేమీ అక్కడ ఇమడలేకపోతుంది. దంపతుల మధ్య పోట్లాటలు మొదలవుతాయి. నిక్ జర్నలిజం బోధించే యూనివర్సిటీలో, ఒక అమ్మాయితో సంబంధం పెట్టుకుంటాడు. యేమీకి అది తెలిసి నిక్కికి బుద్ధి చెప్పాలనుకుంటుంది. తన హత్యకి అతడిని బాధ్యుడిగా చేసే యుక్తి పన్ని, తన జాడేదీ వదలకుండా మాయం అవుతుంది.
ఆమె దాక్కున్న మోటెల్ గదిలో దొంగతనం జరిగినప్పుడు, పాత బాయ్‌ఫ్రెండ్ అయిన దేసీ కాలింగ్స్‌ను సహాయం అడుగుతుంది. సరస్సు పక్కనున్న తన ఇంట్లో ఆమెని దాచడానికి వొప్పుకుంటాడతను.
ఇంతలో, తన పేరు మీదున్న క్రెడిట్ కార్డుతో ఆమె కొన్న వస్తువులని గమనించీ, తను గర్భవతిని అని అబద్ధం రాసుకుని ఆమె వదిలి వెళ్ళిన డైరీని బట్టీ భార్య ఉద్దేశ్యం అర్థం అయినప్పటికీ, నిక్ తను నిర్దోషినని పోలీసులని నమ్మించలేకపోతాడు. తన లాయర్ సలహాతో, తన గురించిన పబ్లిక్ అభిప్రాయాన్ని మార్చడానికి వొక టీవీ షోలో పాల్గొని– యేమీని క్షమాపణ అడిగినట్టు నటిస్తూ, ఆమెని వెనక్కి రమ్మని అడుగుతాడు.
పబ్లిక్‌కు అతని మీద నమ్మకం ఏర్పడుతుంది కానీ దురదృష్టవశాత్తూ, తనవి కావని నిక్ చెప్పిన పార్న్ వీడియోలూ, యేమీ డైరీ పోలీసులకి దొరుకుతాయి. అతన్ని అరెస్ట్ చేసి బెయిలు మీద వదులుతారు. ఆ ఇంటర్వ్యూ చూసిన యేమీ భర్త తన్ని ప్రేమిస్తున్నాడని నమ్మి, తన మీద అత్యాచారం చేయడానికి ప్రయత్నించిన దేసీని హత్య చేసి, భర్త వద్దకి తిరిగి వస్తుంది. తనని దేసీ బలాత్కారంగా తీసుకెళ్ళాడని కథ అల్లుతుంది. ఆమె అబద్ధం చెప్తోందని నిక్కికి తెలిసినప్పటికీ సాక్ష్యం లేకపోవడం వల్ల, మీడియా గోల తగ్గేటంతవరకూ కలిసే ఉందామనుకుని యేమీ నేరాలు, మోసాల గురించిన కథ రాయడం ప్రారంభిస్తాడు.
అది యేమీకి తెలిసి, తామిద్దరూ గతంలో పిల్లలు పుట్టడం కోసం ప్రయత్నిస్తున్నప్పుడు, ఘనీభవించి పెట్టిన నిక్ వీర్యాన్ని ఇన్సెమినేట్ చేయించుకుని గర్భవతి అయి, నిక్ రాస్తున్న పుస్తకాన్ని కనుక అచ్చు వేస్తే, పుట్టబోయే బిడ్డని తీసుకుని వెళ్ళిపోతానని అనడంతో, గత్యంతరం లేని నిక్ ఆ మాట పాటిస్తాడు.
పుస్తకం– నిక్, యేమీ దృష్టికోణాలని మార్చిమార్చి చూపిస్తూ రాయబడింది. తమ ప్రస్తుత సంబంధాన్ని వర్ణిస్తూ ఉన్న నిక్, తమ గత సంబంధాన్ని తన డైరీ రాతలతో వివరించే యేమీ కోణాలు భిన్నమైనవి. నిక్ బద్ధకస్తుడూ, అస్థిరచిత్తం ఉన్నవాడిగా యేమీ వర్ణిస్తే, ఆమె అనవరమైన కష్టాలని తెచ్చిపెట్టే మొండి స్వభావం ఉన్న వ్యక్తని నిక్ చెప్తాడు. అయితే, ఇద్దరూ తమ పక్షపు కథనాల్లో, నిజాలు వెల్లడించడం లేదని మాత్రం పాఠకులకి అర్థం అవుతుంది.
దీని ఆడియో పుస్తకం కూడా ఉంది. 2012లో అచ్చయిన ఈ నవల ఫ్లిన్ రాసిన మూడవది. ‘న్యూయార్క్ టైమ్స్ బెస్ట్ సెల్లర్’గా ఎనిమిది వారాలున్న దీని ఆధారంగా ఇదే పేరుతో డేవిడ్ ఫించర్ దర్శకత్వంలో సినిమా కూడా వచ్చింది.
- కృష్ణ వేణి
Comments
Please login to add a commentAdd a comment