సాహిత్యం ద్వారా హరిజనోద్ధరణకు కృషి చేసిన స్వాతం త్య్రోద్యమ వీరుడు ఉన్నవ లక్ష్మీ నారాయణ. ఆయన న్యాయ వాది. 1877 డిసెంబర్ 4న గుంటూరు జిల్లా వేములూరు పాడు గ్రామంలో జన్మించారు. అనేక సాహిత్య గ్రంథాలు చదివిన స్ఫూర్తితో 1900 సంవ త్సరంలో గుంటూరులో యంగ్‌మెన్ లిటరరీ అసోసియేషన్ స్థాపించారు. సంస్కరణ దృక్పథంతో 1902లో గుంటూరులో వితంతు శరణాలయం స్థాపించారు. సంఘ సంస్కర్త కందుకూరి వీరేశలింగాన్ని ఆహ్వానించి ఆయన అధ్యక్షతన తొలి వితంతు వివాహం జరిపించారు.
సామాన్య ప్రజల అభ్యుదయాన్ని కోరే రచనలు, సామాన్య ప్రజలకు సులభంగా అర్థమయ్యే వాడుక భాషలో ఉండాలన్నది ఉన్నవ ఆశయం. సమాజంలో సాంఘిక, ఆర్థిక అసమానతలను తొలగించి సమతా ధర్మాన్ని స్థాపించడం ఆయన లక్ష్యం. కులవ్యవస్థను నిరసించారు. అగ్రవర్ణాలు, హరిజనులు కలిసి మెలసి ఉండాలని భావించారు. సహపంక్తి భోజనాలను ఏర్పాటు చేశారు. ఆ లక్ష్య సాధనకై విప్లవాత్మకమైన ‘మాలపల్లి’ రచించారు. జాతీయోద్యమంలో రాజకీయ వాతావరణాన్ని, గాంధీ ఆశయాలను, తెలుగు వారి జీవన విధానాన్ని ప్రతిబింబించిన నవల మాలపల్లి. ( వివక్షకు విరుగుడు ప్రశ్నించడమే!)
ఉన్నవ 1922లో పల్నాడు పుల్లరి సత్యాగ్రహంలో పాల్గొని అరెస్టయి రాయవెల్లురు జైలుకు వెళ్లారు. అక్కడే ఈ నవల రాశారు. మంగళపురంలో రామదాసు, మాలక్ష్మి దళిత రైతు దంపతులు. వాళ్లకు వెంకటదాసు, సంగదాసు, రంగడు అనే ముగ్గురు కొడుకులు. ఆ ఊరి భూస్వామి చౌదరయ్య. సంగదాసు చదువుకున్నాడు. దేనిమీదనైనా సొంత అభిప్రాయాలు ఉన్నవాడు. అతడు చౌదరయ్య దగ్గర పాలేరు. అతనికి చౌదరయ్య కుమారుడు రామానాయుడు స్నేహితుడు. చౌదరయ్యకు అది నచ్చదు. వరి కోతల సమయంలో రైతులు ధాన్యానికి బదులు రోజుకు ఆరణాల కూలీ ఇస్తామంటే కూలీలు అందుకు ఒప్పుకోకుండా ధాన్యమే కావాలన్నప్పుడు సంగదాసు కూలీల అభిప్రాయాన్ని సమర్థిస్తాడు. కూలీల తిరుగుబాటుకు సంగదాసు కారణమని చౌదరయ్యకు కోపం వస్తుంది. ఆనాటి సమాజంలో హరిజనుల కుటుంబ బాధను ఇతివృత్తంగా తీసుకుని హరిజనుడిని నాయకుడిగా చేసి నవల రాయడం సాహసం. అందుకే ఈ నవలకు నాయకుడి పేరు కలిసి వచ్చేలా ‘సంగ విజయం’ అనే మరో పేరు సార్థకమైంది.
ఆ నవల నూరేళ్ల సందర్భం ఈ సంవత్సరం. ఈ నవలలో చరమగీతం, సమతాధర్మం అనే రెండు గేయాలను వాడుకభాషలో రాసి ప్రజల్లో చైతన్యాన్ని కలిగించారు. బెల్లంకొండ రాఘవరావు ఆర్థిక సహ కారంతో 1922లో రెండు భాగాలుగా ప్రచురితమైన ఈ నవల 1923, 1936లో మద్రాసు ప్రభుత్వం వారి నిషేధానికి గురైంది. రాజాజీ ముఖ్యమంత్రి అయిన తర్వాత 1937 నిషేధాన్ని తొలగించారు. గాంధేయ సిద్ధాంతాలను, శాంతి అహింసలను ఆచరణలో చూపిన వ్యక్తి ఈ నవలలో రామదాసు. భూస్వామి చౌదరయ్య తన కుమారుడిని చంపినపుడు, భార్య మరణించినపుడు, కుమారుడు వెంకటదాసు క్షతగాత్రు డైనప్పుడు, శాంతి, సహనం రూపుదాల్చినట్లు ప్రవర్తించాడు. భారతజాతి నెత్తురు బొట్టు కారకుండా స్వాతంత్రాన్ని పొందగలిగితే అది మహా అద్భుత కార్యంగా పరిగణిస్తారని రామదాసు గాంధేయ మార్గాన్ని ప్రతి పాదించాడు. (Mannu Bhandari: రాలిన రజనీగంధ)
ఈ నవలకు పీఠిక రాసిన కాశీనాథుని నాగేశ్వరరావు పంతులు ఆంధ్రసాహిత్య హృదయ పరి ణామాన్ని గ్రహించడానికి మాలపల్లి ఉత్తమ కావ్యమ న్నారు. నగ్నముని ఈ నవలని నాటకీకరించారు. ఆచార్య రంగా దీన్ని టాల్‌స్టాయ్ బృహన్నవల ‘వార్ అండ్ పీస్’తో పోల్చదగినది అన్నారు. ’మాలపల్లి’ని అనుసరించి ఆయన ‘హరిజన నాయకుడు’ నవల రాశారు. గుంటూరు శేషేంద్రశర్మ ప్రశంసించినట్లు ‘తెలుగు విప్లవ సాహిత్యంలో వచ్చిన ప్రథమ మహా కావ్యం మాలపల్లి’ అనడం అతిశయోక్తి కాదు.
గాంధేయవాదిగా, స్వాతంత్య్రయోధుడిగా, సంఘ సంస్కర్తగా, గుంటూరు శారద నికేతన్ వ్యవస్థాపకుడిగా, తెలుగు నవల సాహిత్య వైతాళికుడిగా గణనీయమైన కీర్తి పొందిన ఉన్నవ లక్ష్మీనారాయణ 1958 సెప్టెంబర్ 25వ తేదీన పరమపపదించాడు. తెలుగు నవలా సాహిత్యంలో ‘మాలపల్లి’ చిరస్మరణీయం.
- డా. పీవీ సుబ్బారావు
వ్యాసకర్త సాహితీ విమర్శకులు
(ఉన్నవ లక్ష్మీనారాయణ ‘మాలపల్లి’ నవలకు శతవసంతాలు; డిసెంబర్ 4న ఉన్నవ జయంతి)
Comments
Please login to add a commentAdd a comment