PV subba rao
-
మాలపల్లి నవల: నూరేళ్ల... విప్లవాత్మక సృజన
సాహిత్యం ద్వారా హరిజనోద్ధరణకు కృషి చేసిన స్వాతం త్య్రోద్యమ వీరుడు ఉన్నవ లక్ష్మీ నారాయణ. ఆయన న్యాయ వాది. 1877 డిసెంబర్ 4న గుంటూరు జిల్లా వేములూరు పాడు గ్రామంలో జన్మించారు. అనేక సాహిత్య గ్రంథాలు చదివిన స్ఫూర్తితో 1900 సంవ త్సరంలో గుంటూరులో యంగ్‌మెన్ లిటరరీ అసోసియేషన్ స్థాపించారు. సంస్కరణ దృక్పథంతో 1902లో గుంటూరులో వితంతు శరణాలయం స్థాపించారు. సంఘ సంస్కర్త కందుకూరి వీరేశలింగాన్ని ఆహ్వానించి ఆయన అధ్యక్షతన తొలి వితంతు వివాహం జరిపించారు. సామాన్య ప్రజల అభ్యుదయాన్ని కోరే రచనలు, సామాన్య ప్రజలకు సులభంగా అర్థమయ్యే వాడుక భాషలో ఉండాలన్నది ఉన్నవ ఆశయం. సమాజంలో సాంఘిక, ఆర్థిక అసమానతలను తొలగించి సమతా ధర్మాన్ని స్థాపించడం ఆయన లక్ష్యం. కులవ్యవస్థను నిరసించారు. అగ్రవర్ణాలు, హరిజనులు కలిసి మెలసి ఉండాలని భావించారు. సహపంక్తి భోజనాలను ఏర్పాటు చేశారు. ఆ లక్ష్య సాధనకై విప్లవాత్మకమైన ‘మాలపల్లి’ రచించారు. జాతీయోద్యమంలో రాజకీయ వాతావరణాన్ని, గాంధీ ఆశయాలను, తెలుగు వారి జీవన విధానాన్ని ప్రతిబింబించిన నవల మాలపల్లి. ( వివక్షకు విరుగుడు ప్రశ్నించడమే!) ఉన్నవ 1922లో పల్నాడు పుల్లరి సత్యాగ్రహంలో పాల్గొని అరెస్టయి రాయవెల్లురు జైలుకు వెళ్లారు. అక్కడే ఈ నవల రాశారు. మంగళపురంలో రామదాసు, మాలక్ష్మి దళిత రైతు దంపతులు. వాళ్లకు వెంకటదాసు, సంగదాసు, రంగడు అనే ముగ్గురు కొడుకులు. ఆ ఊరి భూస్వామి చౌదరయ్య. సంగదాసు చదువుకున్నాడు. దేనిమీదనైనా సొంత అభిప్రాయాలు ఉన్నవాడు. అతడు చౌదరయ్య దగ్గర పాలేరు. అతనికి చౌదరయ్య కుమారుడు రామానాయుడు స్నేహితుడు. చౌదరయ్యకు అది నచ్చదు. వరి కోతల సమయంలో రైతులు ధాన్యానికి బదులు రోజుకు ఆరణాల కూలీ ఇస్తామంటే కూలీలు అందుకు ఒప్పుకోకుండా ధాన్యమే కావాలన్నప్పుడు సంగదాసు కూలీల అభిప్రాయాన్ని సమర్థిస్తాడు. కూలీల తిరుగుబాటుకు సంగదాసు కారణమని చౌదరయ్యకు కోపం వస్తుంది. ఆనాటి సమాజంలో హరిజనుల కుటుంబ బాధను ఇతివృత్తంగా తీసుకుని హరిజనుడిని నాయకుడిగా చేసి నవల రాయడం సాహసం. అందుకే ఈ నవలకు నాయకుడి పేరు కలిసి వచ్చేలా ‘సంగ విజయం’ అనే మరో పేరు సార్థకమైంది. ఆ నవల నూరేళ్ల సందర్భం ఈ సంవత్సరం. ఈ నవలలో చరమగీతం, సమతాధర్మం అనే రెండు గేయాలను వాడుకభాషలో రాసి ప్రజల్లో చైతన్యాన్ని కలిగించారు. బెల్లంకొండ రాఘవరావు ఆర్థిక సహ కారంతో 1922లో రెండు భాగాలుగా ప్రచురితమైన ఈ నవల 1923, 1936లో మద్రాసు ప్రభుత్వం వారి నిషేధానికి గురైంది. రాజాజీ ముఖ్యమంత్రి అయిన తర్వాత 1937 నిషేధాన్ని తొలగించారు. గాంధేయ సిద్ధాంతాలను, శాంతి అహింసలను ఆచరణలో చూపిన వ్యక్తి ఈ నవలలో రామదాసు. భూస్వామి చౌదరయ్య తన కుమారుడిని చంపినపుడు, భార్య మరణించినపుడు, కుమారుడు వెంకటదాసు క్షతగాత్రు డైనప్పుడు, శాంతి, సహనం రూపుదాల్చినట్లు ప్రవర్తించాడు. భారతజాతి నెత్తురు బొట్టు కారకుండా స్వాతంత్రాన్ని పొందగలిగితే అది మహా అద్భుత కార్యంగా పరిగణిస్తారని రామదాసు గాంధేయ మార్గాన్ని ప్రతి పాదించాడు. (Mannu Bhandari: రాలిన రజనీగంధ) ఈ నవలకు పీఠిక రాసిన కాశీనాథుని నాగేశ్వరరావు పంతులు ఆంధ్రసాహిత్య హృదయ పరి ణామాన్ని గ్రహించడానికి మాలపల్లి ఉత్తమ కావ్యమ న్నారు. నగ్నముని ఈ నవలని నాటకీకరించారు. ఆచార్య రంగా దీన్ని టాల్‌స్టాయ్ బృహన్నవల ‘వార్ అండ్ పీస్’తో పోల్చదగినది అన్నారు. ’మాలపల్లి’ని అనుసరించి ఆయన ‘హరిజన నాయకుడు’ నవల రాశారు. గుంటూరు శేషేంద్రశర్మ ప్రశంసించినట్లు ‘తెలుగు విప్లవ సాహిత్యంలో వచ్చిన ప్రథమ మహా కావ్యం మాలపల్లి’ అనడం అతిశయోక్తి కాదు. గాంధేయవాదిగా, స్వాతంత్య్రయోధుడిగా, సంఘ సంస్కర్తగా, గుంటూరు శారద నికేతన్ వ్యవస్థాపకుడిగా, తెలుగు నవల సాహిత్య వైతాళికుడిగా గణనీయమైన కీర్తి పొందిన ఉన్నవ లక్ష్మీనారాయణ 1958 సెప్టెంబర్ 25వ తేదీన పరమపపదించాడు. తెలుగు నవలా సాహిత్యంలో ‘మాలపల్లి’ చిరస్మరణీయం. - డా. పీవీ సుబ్బారావు వ్యాసకర్త సాహితీ విమర్శకులు (ఉన్నవ లక్ష్మీనారాయణ ‘మాలపల్లి’ నవలకు శతవసంతాలు; డిసెంబర్ 4న ఉన్నవ జయంతి) -
పెళ్లి కావడంతో సరళం
సర్ కట్టమంచి రామలింగారెడ్డి గొప్ప విద్యావేత్త, సాహితీవేత్త. ఆంధ్ర విశ్వవిద్యాలయ వ్యవస్థాపక అధ్యక్షులు. చమత్కార సంభాషణా ప్రియులు. ఆయన ఆంధ్ర విశ్వవిద్యాలయం ఉపాధ్యక్షులుగా ఉన్నప్పుడు సెనేట్ సభ్యుల్లో పి.కమలమ్మ అనే యువతి ఉండేవారు. ఆమె సమావేశాల్లో చాలా పరుషంగా, కటువుగా మాట్లాడేవారు. అయితే ఆమెకు పెళ్లి కావడంతో ఇంటిపేరు ‘బి’గా మారింది. అదే సమయంలో ఆమె మాట కూడా కొంత మృదువుగా మారింది. సిఆర్ రెడ్డి గారు శ్లేష చమత్కారంతో పరుషంగా ఉన్న పి.కమలమ్మ పెళ్లి కావడంతో సరళంగా (బి.కమలమ్మ) మారారని చమత్కరించారు. దానికి కమలమ్మ సహా అందరూ నవ్వుకున్నారు.-డాక్టర్ పి.వి.సుబ్బారావు -
కలమే కరవాలం.. సంస్కరణే కలకాలం...
శతాధిక గ్రంథకర్త, సం స్కర్త, నవ్యతా ప్రయోక్త కందుకూరి వీరేశలింగం 1848 ఏప్రిల్ 16వ తేదీన పున్నమ్మ, సుబ్బారాయు డు దంపతులకు రాజమం డ్రిలో జన్మించారు. సాహి తీ ప్రీతితో, సంస్కరణ దృ క్పథంతో ఆయన స్పృశిం చని శాఖలేదు, చేపట్టని సాహితీ ప్రక్రియ లేదు. ఆంధ్ర సాహిత్యంలో నవల, నాటకం, ప్రహసనం, జీవిత చరిత్ర, స్వీయ చరిత్ర, కవుల చరిత్ర, వ్యాసం, శాస్త్రవాజ్ఞయ గ్రంథాల ప్రక్రి యలన్నింటికీ శ్రీకారం చుట్టి, సుసంపన్నం చేశాడు. సాహిత్యాన్ని సంఘ సంస్కరణకు ఉపకరణగా చేసుకున్నాడు. కలాన్ని కరవాలంగా ఝళిపించాడు. అవినీతిపరుల అక్రమాలు, అన్యాయాలు, దుండ గాలు, దౌష్ట్యాలను అరికట్టేందుకు పత్రికాధిపతిగా భగీరథ ప్రయత్నం చేశాడు. స్త్రీ జనోద్ధారకుడిగా 1874లో తొలి బాలికా పాఠశాలను ధవళేశ్వరంలో స్థాపించాడు. ఊరూరా బాలికా పాఠశాలలను స్థాపించి, స్త్రీ విద్యను ప్రోత్సహించాడు. మహిళాభ్యు దయ దృక్పథంతో తొలి వితంతు వివాహాన్ని ఎన్నో ప్రతికూల పరిస్థితుల మధ్య 1881 డిసెంబర్లో జరిపించాడు. దాదాపు 55 వితంతు వివాహాలను చేయించాడు. స్త్రీ జనోద్ధారకుడిగా ఆయన కీర్తి ఆంధ్రదేశమంతటా విస్తరించింది. ఆయన సంస్క రణ, గంధం రాష్ట్ర పరిధిని దాటి జాతీయ స్థాయిలో గుబాళించింది, ఆయన అమేయమైన వ్యక్తిత్వం 19వ శతాబ్ది సాంస్కృతిక పునరుజ్జీవనానికి పునాది వేసింది. ఆయన జయంతిని తెలుగు నాటకరంగ దినోత్సవంగా ప్రభుత్వం నిర్వహిస్తోంది. ఆయన నాటక సాహిత్య కృషిని నాలుగు విభా గాలుగా వర్గీకరించవచ్చు. 1. అనువాద నాటకాలు, 2, పౌరాణిక నాటకాలు, 3. సాంఘిక నాటకాలు, 4. ప్రహసనాలు. అనువాద నాటకాలకు 19వ శతాబ్దంలో అధిక ప్రాధాన్యముండేది. ప్రదర్శన ప్రాధాన్య దృష్టితో కందుకూరి... ‘షేక్స్పియర్ కామెడీ ఆఫ్ ఎర్రర్స్’ అనే అంగ్ల నాటకాన్ని ‘చమత్కార రత్నావళి’ పేరుతో (1880) అనువదించి విద్యార్థుల చేత ప్రదర్శిపజేసి మెప్పు పొందారు. వీరేశలింగం గారు రచించిన పౌరాణిక నాటకాల్లో ‘సత్యహరి శ్చంద్ర’ నాటకం విల క్షణమైనది. అందులో వశిష్ట విశ్వామిత్రుల సం వాదం ఆయన కల్పన. అప్పట్లో ఆ నాటకం ఎంతో ప్రసిద్ధి పొందింది. మహాభారత ఇతివృత్తం ఆధారంగా ‘దక్షిణ గోగ్రహణం’ నాటకాన్ని రచించి పాఠకుల మెప్పు పొందాడు. సామాజిక ప్రయోజ నానికి సాంఘిక నాటకం గొప్ప ఉపకరణమని 19వ శతాబ్దిలోనే గుర్తించిన గొప్ప క్రాంతిదర్శి వీరేశలిం గం. వ్యవహారిక భాషలో జాతిని జాగృతం చేసే సంకల్పంతో సామాజిక ప్రయోజనాత్మకాలైన ‘వ్యవ హార ధర్మబోధిని’, ‘బాల్యవివాహం’, ‘స్త్రీ పునర్వి వాహం’ వంటి సాంఘిక నాటకాలు రచించిన మహ నీయుడు. 20వ శతాబ్దిలో విస్తృతంగా అభివృద్ధి చెందిన సాంఘిక నాటకరంగానికి మార్గదర్శకుడ య్యాడు. ఆంగ్ల సాహిత్యంలో ఫార్స్ ప్రక్రియ ఆధారంగా తెలుగులో ప్రహసన ప్రక్రియకు రూప కల్పన చేశాడు. హాస్యస్ఫోరకమైన వ్యంగ్య అధిక్షే పాత్మక ప్రక్రియ ప్రహసనం. దాదాపు 50 ప్రహసనా లను రచించాడు. అప్పటి సమాజంలో ఏ అధికారి లంచం తీసుకున్నా, అక్రమానికి పాల్పడ్డా ప్రహసన రూపంలో ఆయన అధిక్షేపించేవారు. ఆయన ప్రహసనాలు సమకాలీనుల, తదనం తర సాహితీ విమర్శకుల మెప్పు పొందాయి. అయి తే ప్రహసనాల్లో మృదుహాస్యం మృగ్యమై కటు వ్యంగ్య హాస్యం కదనుతొక్కిన కారణంగా వీరేశలిం గం కొందరి దృష్టిలో విరోధిగా మారాడు. ఎవరేమ న్నా ఆయన రచనల్లో విలక్షణమైనవి, సామాజిక ప్రయోజనాలను సాధించినవి ప్రహసనాలనడం నిస్సందేహం. తెలుగు సాహిత్యంలో ప్రక్రియలన్నింటినీ సుసంపన్నం చేసిన ప్రతిభావంతుడు, హేతువాద దృష్టితో మూఢ విశ్వాసాలను నిరసించిన సంస్కర్త, మహిళాభ్యుదయ కాముకుడైన మహోన్నత వ్యక్తి కందుకూరి జయంతిని తెలుగు నాటకరంగ దినోత్స వంగా ప్రభుత్వం నిర్వహించడం ఆవశ్యకం. (నేడు కందుకూరి వీరేశలింగం 167వ జయంతి) వ్యాసకర్త రిటైర్డ్ అసోసియేట్ ప్రొఫెసర్ మొబైల్ : 98491 77594 -
అభ్యుదయ కవిత్వోద్యమానికి ‘అగ్నివీణ’
అనిశెట్టి సుబ్బారావు 36వ వర్ధంతి కవిత్వం, నాటకాలు, నాటికలు, రేడియో నాటికలు, కథానికలు, వ్యాసాలు, అనువాదాలు, సినిమా సాహి త్యం మొదలైన సాహిత్య ప్రక్రియలన్నింటినీ చేపట్టి, సమర్థవంతంగా నిర్వహించిన అభ్యుదయ కవి అనిశెట్టి సుబ్బారావు. తన కవితా ఖండికల్లో బిచ్చగాళ్లు, వేశ్యలు, శ్రామికులు, కార్మికులు, తినడానికి తిండిలేక అలమ టించే దీనులు సాక్షాత్కరిస్తారు. ఆయన ‘అగ్ని వీణ’ అభ్యుదయ కవితా ఉద్యమంలో గొప్ప కవితా సంపు టిగా ప్రశంసలు అందుకుంది. ప్రత్యేకించి బిచ్చగాళ్ల జీవి తపు లోతులను పరిశీలించి కరుణ రసాత్మకంగా చిత్రిం చారు. అనిశెట్టిపై తొలి రోజుల్లో గాంధీజీ ప్రభావం గాఢంగా ఉంది. 1942, ఆగస్టు 8వ తేదీన క్విట్ ఇండియా సందర్భం గా ఉద్యమంలో చురుగ్గా పాల్గొని అరెస్టయ్యాడు. రాయవేలూరు జైలులో రెండేళ్లపాటు జైలుశిక్ష అనుభవించాడు. జపాన్ నగరాలైన హిరోషిమా, నాగసాకిపై అమెరికా అణుబాంబులు పేల్చిన ఘటనపై అణుబాంబు పేరిట సుదీర్ఘ కవితను రాశారు. 1946లో జరిగిన హిందూ ముస్లిం కలహాల మారణహోమంపై అనిశెట్టి భారత హృదయాక్రోశంగా ‘పృథ్వీగీతం’ కవితా ఖండికను రచిం చాడు. 1947లో కశ్మీర్ సమస్యపట్ల కలతచెంది, ‘నవభారతి’ గీతా న్ని రాశాడు. 1952లో అనావృష్టి కారణంగా రాయలసీమలో సంభ వించిన కరువుకు చలించి, ‘ఆకలిపాట’ను రాశాడు. ‘గాలిమేడలు’ నాటకంలో (1950) ఫ్రాయిడ్ మనో విశ్లేషణ సిద్ధాంతాన్ని తొలిసారిగా పాశ్చాత్య ప్రభావంతో ప్రవేశపెట్టిన ఘనత అనిశెట్టిదే. ‘ఫాంటోమేమ్’, డాన్స్ బ్యాలే మొదలైన ప్రక్రియలను తొలిసారిగా తెలుగులో రూపొందించాడు. ఆయన రాసిన ‘శాంతి’ (1950) తెలు గులో తొలి మూకాభినయం (ఫాంటోమేమ్). ఆయన ‘రిక్షావాలా’(1955) తెలుగులో తొలి నృత్య మూకాభినయం (డాన్స్ బ్యాలే). ‘శాంతి’ మూకాభినయం ఏలూరులో 1952లో సాంస్కృతిక మహాసభల ప్రదర్శనలో బంగారు పతకాన్ని పొందింది. తమిళం, కన్నడం, మలయాళం వంటి పలు ప్రాంతీయ భాషల్లోకి అనువదిం చారు. ఇది ఇంగ్లిష్, చైనా, రష్యా భాషల్లో అనువాదమై అనిశెట్టికి అంతర్జాతీయ ఖ్యాతిని ఆర్జించి పెట్టింది. సినీకవిగా, ప్రేక్షకుల హృద యాల్లో నిలిచిపోయే అద్భుతమైన గీతాలు రాశారు. అభ్యుదయ కవిగా, అభ్యుదయ కవితోద్యమ సారథిగా అనిశెట్టికి విశేష స్థానం ఉంది. 1922 అక్టోబర్ 23వ తేదీన నరసరావుపేటలో జన్మించిన అనిశెట్టి 1979, డిసెంబర్ 27వ తేదీన మరణించారు. అధునిక తెలుగు సాహిత్యంలో ఆయన చిరస్మరణీయుడు. డా॥పి.వి.సుబ్బారావు, అనిశెట్టి సాహిత్య పరిశోధకులు -
సమీక్షణం: వ్యక్తిత్వ వికాసం కోసం
పుస్తకం : విజయోస్తు (వ్యక్తిత్వ వికాసం) రచన : శ్రీనివాస్ మిర్తిపాటి పేజీలు: 188 వెల: 89 ప్రతులకు: విశాలాంధ్ర అన్ని శాఖలూ. విషయం : వ్యక్తిత్వ వికాసం మీద కొత్తగా మార్కెట్లోకి ఎన్నో పుస్తకాలు వస్తున్నాయి. నిజం చెప్పే ధైర్యం నాకుంది, మరి చదివే ధైర్యం మీకుందా? అని చెప్పి, ఒక ఛాలెంజ్ చేసి మరీ ఈ పుస్తకం చదివిస్తాడు రచయిత. ప్రతి మనిషికీ ఒక సిద్ధాంతం ఉండాలంటాడు రచయిత. సిద్ధాంతం అంటేనే ఎన్ని పేజీలు అయినా సరిపోవు. కానీ సింపుల్‌గా ఒక్కొక్క పేజీలో చెప్పడం, చెయ్యి తిరిగినవారికే సాధ్యం. బహుశా జర్నలిజమ్‌లో అపారమైన అనుభవం ఇందుకు ఉపయోగపడి ఉండాలి. గాంధీ సిద్ధాంతం, మోడి, సోక్రటిస్... వీరందరివీ రాయడం గొప్ప విషయం. టీవీలు ఎందుకు చూడకూడదు - ఆసక్తికరంగా ఉంటుంది. జాతకాలు... 120 కోట్లమంది ప్రజలకు 12 రాశులు... అంటే ప్రతి 10 కోట్ల మందికీ ఒకేలా జరగడం సాధ్యమేనా? సచిన్, కాంబ్లీ మధ్య వ్యత్యాసం ఏమిటి? మార్పు సాధించిన అశోకుడు, సాధించలేని ఔరంగజేబు... ఇలా ఎన్నో విషయాలతో ఈ పుస్తక రచన సాగింది. - జగదీష్ హాస్య శృంగార సందేశాత్మకం పేజీలు: 140 వెల: 75 ప్రతులకు: ప్రముఖ పుస్తక కేంద్రాలు పుస్తకం : మైత్రీవనం (కథలు) రచన : జిల్లేళ్ల బాలాజీ, రాచపూటి రమేష్, పేరూరు బాలసుబ్రమణ్యం విషయం : మిత్ర కథకత్రయం... ఒక్కొక్కరివి ఆరేసి చొప్పున 18 కథలతో ‘మైత్రీవనం’గా సంపుటీకరించి కథా భారతికి కంఠహారంగా సమర్పించారు. బాలాజీ ‘ఏకాంబరం ఎక్స్ట్రా ఏడుపు’ వస్తు వైవిధ్యంతో నవ్వులు పూయిస్తుంది. రమేష్ ప్రజాస్వామ్యంలో ఎన్నికల ప్రహసనాన్ని అధిక్షేపాత్మకంగా ‘ఏడుకొండలు - ఎలక్షన్ డ్యూటీ’లో ఆవిష్కరించాడు. బాలసుబ్రహ్మణ్యం ‘సుబ్బు ఐడియా’లో అమాయకపు ఇల్లాలు అతి తెలివితో భర్త పడే భంగపాట్లు హాస్యస్ఫోరకంగా చిత్రించాడు. బాలాజీ ‘అమ్మ డైరీ’లో రవిచంద్ర తన తల్లి వద్దని ప్రాధేయపడినా పట్టుదలతో మాతృదేశ రక్షణ కోసం మిలటరీలో చేరేందుకు వెళ్లాడు. రవిచంద్ర పాత్రను ‘జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపీ గరీయసీ’ సిద్ధాంతానికి అక్షర లక్ష్యంగా తీర్చిదిద్దాడు రచయిత. ‘నీడలు-నిజాలు’ కథలో మతోన్మాదాన్ని నిరసిస్తాడు రమేష్. ‘శిశిర స్వప్నం’ కథలో వృద్ధుల దయనీయ స్థితిని వర్ణించాడు సుబ్రమణ్యం. - డా॥పి.వి.సుబ్బారావు పిల్లలు గీసిన వన్నెల చిత్రం! పేజీలు: 54 వెల: 70 పుస్తకం : ఎ పొయెట్ ఇన్ హైదరాబాద్ (కవిత్వం) రచన : ఆశారాజు ప్రతులకు: నవోదయా బుక్ హౌజ్, కాచిగూడ, హైదరాబాద్. ఫోన్: 040-24642387 విషయం : లేటెస్ట్ స్టడీ ఒకటి చెబుతుంది: ‘జ్ఞాపకాల్లోకి వెళ్లిన వాళ్లు తాజాగా ఉంటారు. మనసును పరిమళభరితం చేసుకుంటా’రని. పురాతన నగరం హైదరాబాద్‌తో పెన వేసుకున్న బంధాన్ని జ్ఞాపకాల్లో నుంచి తీసుకువస్తున్నాడు ఆశారాజు. యవ్వనానికి ఊదు పొగలేసిన సుల్తాన్ బజారులో నడిచినప్పుడు, లాడ్‌బజార్‌లో మెరిసే గాజుల పూలసవ్వడి విన్నప్పుడు, గోలుకొండెక్కి మబ్బుల సొగసును ముద్దాడినప్పుడు, పంచమహల్ ముషాయిరాలో శ్రోత అయినప్పుడు కవితో పాటు మనమూ ఉంటాం. హైదరాబాద్ సౌందర్యాన్ని మనసు కాన్వాసుపై బొమ్మలేసుకొని ‘ఇది మా హైదరాబాద్’ అని మురిసిపోతాం. నిద్రపోయిన జ్ఞాపకాలను నగరం తట్టిలేపి, ‘ఫిర్సే షురూ కరెంగే జిందగీ’ అనేలా చేస్తుందని చెప్పడానికి ఈ పుస్తకం విశ్వసనీయ సాక్ష్యం. చదువుతున్నంతసేపు రంజాన్ సాయంత్రాల్లో పాతబస్తీ గల్లీ గల్లీ తిరుగుతున్నట్లు ఉంటుంది. - యాకుబ్ పాషా కొత్త పుస్తకాలు మైల (శుద్ధాత్మక నవల) రచన: వరకుమార్ గుండెపంగు పేజీలు: 168; వెల: 100 ప్రతులకు: రచయిత, సన్నాఫ్ భిక్షం, 5-94, అంబేద్కర్ విగ్రహం దగ్గర, బేతవోలు, చిలుకూరు మం. నల్గొండ జిల్లా. ఫోన్: 9948541711 శాలువా (కథలు) రచన: పిడుగు పాపిరెడ్డి పేజీలు: 152; వెల: 100 ప్రతులకు: రచయిత, 8/137, అప్పయ్యగారి వీధి, కొత్తపేట, కనిగిరి-523230. ఫోన్: 9490227114 1.గ్రేట్ అలెగ్జాండర్ తమిళ మూలం: ఆత్మారవి తెలుగు: ఎజి.యతిరాజులు పేజీలు: 96; వెల: 50 2. పుత్తడిబొమ్మ పూర్ణమ్మ రచన: గురజాడ అప్పారావు బుర్రకథగా అనుసరణ: కమ్మ నరసింహారావు పేజీలు: 32; వెల: 25 ప్రతులకు: ప్రజాశక్తి బుక్‌హౌజ్, 1-1-187/1/2, చిక్కడపల్లి, హైదరాబాద్-20. ఫోన్: 040-27608107 డయాబెటిస్తో ఆరోగ్యంగా జీవించడం ఎలా? (‘మన ఆహారం’ బుక్‌లెట్‌తో) రచన: డా.టి.ఎం.బషీర్ పేజీలు: 232; వెల: 180 ప్రతులకు: స్పందన హాస్పిటల్, ధర్మవరం-515671. ఫోన్: 9908708880 తాత చెప్పిన కథలు రచన: బి.మధుసూదనరాజు పేజీలు: 60; వెల: 60 ప్రతులకు: జి.రామకృష్ణ, లైబ్రేరియన్, శాఖాగ్రంథాలయం, సత్తుపల్లి, ఖమ్మం జిల్లా.