కిల్లర్ స్క్రిప్ట్ | athuk.. a movie script that killed somany actors! | Sakshi
Sakshi News home page

కిల్లర్ స్క్రిప్ట్

Published Sun, Aug 3 2014 12:35 AM | Last Updated on Sat, Sep 2 2017 11:17 AM

కిల్లర్ స్క్రిప్ట్

కిల్లర్ స్క్రిప్ట్

నిజాలు దేవుడికెరుక

‘అతుక్’ అనేది వర్కింగ్ టైటిల్ మాత్రమే. ఈ కథను కెనడాకు చెందిన ప్రముఖ రచయిత మొర్దకై రిచ్లర్ రాసిన ‘ద ఇన్‌కంపేరబుల్ అతుక్’ అనే నవల స్ఫూర్తితో తయారు చేశారు. ఎస్కిమోల చుట్టూ తిరిగే కథతో వెలువడిన ఈ నవల చాలా పెద్ద సక్సెస్ అయ్యింది. లాభాలు తెచ్చిపెట్టింది. కానీ దాన్ని సినిమాగా తీయాలన్న ఆలోచన... ఓ పెద్ద సంచలనాన్నే సృష్టించింది. ముడివీడని మిస్టరీగా చరిత్రలో మిగిలిపోయింది.
 
 అది 1982వ సంవత్సరం... అమెరికా... ఉదయం పదిన్నర కావస్తోంది.
 ‘‘సర్... స్టోరీ చెప్పడానికి ఓ డెరైక్టర్ వచ్చాడు’’
 అప్పుడే లేచి కూచున్న జాన్ బెలూషీ ఆ మాట వింటూనే తలెత్తి చూశాడు. ఎదురుగా కాఫీ కప్పుతో నిలబడి ఉన్నాడు పనివాడు. జాన్ తలాడించాడు సరే అన్నట్టుగా. పనివాడు వేడి వేడి కాఫీ అందించాడు. కప్పు అందుకుని మంచం దిగాడు జాన్. ‘‘వ చ్చేస్తాను... వెయిట్ చేయమని చెప్పు’’ అన్నాడు కాఫీ సిప్ చేస్తూ.
 అతడు వెళ్లిపోయాడు. జాన్ కాఫీ తాగేసి బాత్రూములోకి నడిచాడు. గబగబా స్నానం చేసి, రెడీ అయ్యి గదిలోంచి బయటికొచ్చాడు. కిందికి వచ్చేసరికి హాల్లో సోఫాలో కూర్చుని ఫైల్ తిరగేస్తున్నాడు డెరైక్టర్. జాన్‌ని చూస్తూనే ఫైల్ మూసి లేచి నిలబడ్డాడు. నేరుగా అతడి దగ్గరకు వెళ్లి షేక్‌హ్యాండ్ ఇచ్చాడు జాన్.
 ‘‘సారీ... రాత్రి రెండున్నర వరకూ షూటింగ్ జరిగింది. ఇంటికొచ్చేసరికి మూడు దాటేసింది. అందుకే లేవలేకపోయా’’ అన్నాడు సంజాయిషీ ఇస్తున్నట్టుగా.
 ‘‘ఫర్వాలేదు సర్. అర్థం చేసుకోగలను’’ అన్నాడు దర్శకుడు నవ్వుతూ.
 జాన్ బెలూషీ ఓ చిన్న స్థాయి నుంచి ఎదిగినవాడు. కమెడియనే అయినా స్టార్ హీరోలతో సమానంగా ఫేమ్ ఉన్నవాడు. అందుకే తన సినిమాలో అతడితో లీడ్ రోల్ చేయించాలని ఆశపడుతున్నాడు ఆ దర్శకుడు.
 ‘‘చెప్పండి... ఏదో కథ ఉందన్నారు కదా?’’ అన్నాడు జాన్. వెంటనే స్క్రిప్టును జాన్ చేతికి అందించాడు దర్శకుడు.
 ‘‘చాలా మంచి స్టోరీ సర్. మీరు చేస్తే అద్భుతంగా ఉంటుంది. అందుకే ఎవరికీ వినిపించకుండా మీకోసమే అట్టి పెట్టాను. మీరు ఎప్పుడు ఫ్రీ అవుతారా అని నెల రోజుల నుంచీ ఎదురు చూస్తున్నాను. మీరొక్కసారి చదివితే ఇంప్రెస్ అయిపోతారు. వెంటనే ఓకే అనేస్తారు.’’
 అతడి ఎగ్జయిట్‌మెంట్ చూసి జాన్‌కి కూడా ఉత్సుకత కలిగింది. ‘‘తప్పకుండా చదువుతా. మీరింత చెప్పాక బాగుండే ఉంటుంది’’ అన్నాడు నవ్వుతూ. మళ్లీ కలుస్తానని చెప్పి వెళ్లిపోయాడా డెరైక్టర్.
ఆసక్తిగా స్క్రిప్టు ఫైలు తెరిచాడు జాన్. మొదటి పేజీలో బంగారురంగు ఇంకుతో రాసిన ‘అతుక్’ అన్న అక్షరాలు మెరుస్తున్నాయి. ఆ పేరే చాలా ఆసక్తిగా అనిపించింది. చదవడం మొదలుపెట్టాక ఆ ఆసక్తి మరింత పెరిగింది. దాంతో పూర్తిగా ఇన్‌వాల్వ్ అయిపోయాడు. ఎక్కడా బ్రేక్ లేకుండా చివరి వరకూ చదివేశాడు. ఫైల్ మూస్తూ తనలో తనే అనుకున్నాడు... ‘‘వెరీ ఇంటరెస్టింగ్’!
 వెంటనే ఫోన్ చేతిలోకి తీసుకుని డెరైక్టర్‌కి ఫోన్ చేసి చెప్పాడు... ‘‘సూపర్బ్‌గా ఉంది... నేనీ సినిమా చేస్తున్నాను’’ అని!
 ఆ దర్శకుడి ముఖం ఆనందంతో మెరిసింది. ఎంత త్వరగా సినిమా మొదలు పెట్టేద్దామా అన్న ఆలోచనల్లో తేలిపోసాగాడు. కానీ అతడికి తెలియదు. తన సినిమా ఎప్పటికీ చిత్రరూపం దాల్చదని. ఎవరూ ఊహించనన్ని చిత్రాలు చేస్తుందని!
    
సరిగ్గా నెల తరువాత... 1982, మార్చి 5న...
అమెరికాలోని అన్ని టీవీ చానెళ్లలోనూ ఒకటే వార్త వినిపిస్తోంది... ‘ప్రముఖ నటుడు జాన్ బెలూషీ మృతి’ అని. తన ఫ్లాటులో శవమై పడివున్నాడు జాన్. అతడి సలహాలను అనుసరించి స్క్రిప్టులో మార్పులు చేసుకోవడానికి టైపిస్టును తీసుకుని వెళ్లిన దర్శకుడు... నేలమీద అపస్మారక స్థితిలో పడివున్న జాన్‌ని చూసి అవాక్కయ్యాడు. మనిషి కదలడం లేదు. ఊపిరి తీసుకుంటున్నట్టు కూడా అనిపించడం లేదు. దాంతో వెంటనే పోలీసులకు ఫోన్ చేశాడు.

క్షణాల్లో పోలీసులు అక్కడికి చేరుకున్నారు. జాన్ చనిపోయాడన్న విషయాన్ని నిర్ధారించారు. డ్రగ్స్ మితిమీరి తీసుకోవడం వల్లే అతడు మరణించాడని పోస్ట్ మార్టమ్ రిపోర్టులో వెలువడింది. అక్కడితో జాన్ బెలూషీ చరిత్ర ముగిసిపోయింది. ‘అతుక్’ సినిమాకి బ్రేక్ పడింది.ఆ తర్వాత ఆ కథ తో సినిమా తీసేందుకు చాలా సంస్థలు ముందుకొచ్చాయి కానీ ఎవ్వరి ప్రయత్నాలూ ఫలించలేదు. జాన్ మరణించిన ఆరేళ్ల తరువాత, 1988లో నటుడు శామ్ కినిసన్ చేతికి స్క్రిప్టు వెళ్లింది. అతడు కథ చదివి ఆనందపడిపోయాడు. ఎలాగైనా ఆ సినిమా చేయాలని ఉవ్విళ్లూరాడు. ఇంకొద్ది రోజుల్లో షూటింగ్ మొదలవుతుందనగా ఓ కార్ యాక్సిడెంట్లో కన్నుమూశాడు. మళ్లీ ‘అతుక్’ మూలన పడింది.

ఆ తర్వాత ఆరేళ్లకు, 1994లో జాన్ క్యాండీకి ఆ కథను వినిపించాడో దర్శకుడు. ఏది ఏమైనా నేను చేసి తీరతానన్నాడు క్యాండీ. కానీ కథాచర్చలు కూడా పూర్తి కాకుండా గుండెనొప్పితో చనిపోయాడు. అదే యేడు మైఖేల్ డోన్హో అనే రచయిత ‘అతుక్’ ద్వారా నటుడిగా తెరంగేట్రం చేయాలని అనుకున్నాడు. అయితే స్క్రిప్టును చదివీ చదవడంతోనే బ్రెయిన్ హేమరేజ్‌కు గురై ప్రాణాలు కోల్పోయాడు.

ఎన్నో సంస్థలు ‘అతుక్’ని తెరకెక్కించాలనుకున్నాయి. ఎందరో దర్శకులు దానిమీద కసరత్తు చేశారు. ఎందరో నటులు ఆ చిత్రంలో లీడ్ రోల్ చేయాలని తహతహలాడారు. కానీ ఎవ్వరి ప్రయత్నాలూ ఫలించలేదు. లీడ్ రోల్ చేయాలని ఆశపడిన ప్రతి నటుడూ మృత్యువాత పడుతుంటే... అసలేం జరుగుతోందో అర్థం కాని పరిస్థితి. ఆ కథ శాపగ్రస్తమయ్యిందనీ, అదే అందరి ప్రాణాలనూ తీస్తోందనీ ఓ నమ్మకం ప్రబలింది. దాంతో ఆ చిత్రం పేరు చెబితేనే అందరూ బెదిరిపోసాగారు.

కానీ క్రిస్ ఫార్లే మాత్రం భయపడలేదు. అదంతా పిచ్చి నమ్మకం అని నిరూపిస్తానన్నాడు. తాను ఆ చిత్రాన్ని పూర్తి చేసి తీరుతానన్నాడు. 1997లో సినిమా మొదలు పెట్టేందుకు సర్వం సిద్ధం చేయించాడు. అంతలోనే అతడు జాన్ బెలూషీ తరహాలోనే, తన ఇంట్లో నిర్జీవుడిగా కనిపించాడు. డ్రగ్స్ ఓవర్ డోస్ వల్ల చనిపోయాడని వైద్యులు ధృవీకరించారు. కొన్ని నెలలు కూడా గడవక ముందే... ఫిల్ హార్ట్‌మన్ అనే నటుడు తన భార్య చేతిలో హత్యకు గురయ్యాడు. అతడు ‘అతుక్’లో నటించాలని అనుకోలేదు. కానీ ఆ కథ అద్భుతంగా ఉంది, ఓసారి చదవ మంటూ క్రిస్ అతడికి స్క్రిప్ట్ ఇచ్చాడట. అది చదివిన కొద్ది రోజులకే హార్ట్‌మన్ చనిపోయాడు.

వీరి మరణాలు కూడా చూశాక ‘అతుక్’ పేరు చెబితేనే అందరికీ వణుకు మొదలయ్యింది. ఆ స్క్రిప్టును ముట్టుకోవడానికే ఎవరికీ ధైర్యం చాలని పరిస్థితి వచ్చేసింది. ఆ సినిమా తీయాలన్న ఆలోచనను దర్శకులు, చేయాలన్న కోరికను నటులు తమ మనసుల్లోంచి తీసి పారేశారు. ఆ స్క్రిప్టును హాలీవుడ్ స్టూడియోలో ఒకచోట గొయ్యి తీసి పాతిపెట్టేశారు. అలా ‘అతుక్’ కథ ముగిసిపోయింది. అది సృష్టించిన అలజడి సద్దుమణిగిపోయింది!

ఒక సినిమా స్క్రిప్ట్ ఇంతమంది ప్రాణాలను తీస్తుందా? ఇది నిజమా లేక మూఢ నమ్మకమా? ఇది ఇప్పటికీ చాలామంది మదిలో మెదులుతున్న సందేహమే. కథ ప్రాణాలు తీయడమేంటని కొందరంటే... ఎందుకు తీయదు అంటూ నటుల మరణాలను తమ కళ్లతో చూసిన కొందరు ఎదురు ప్రశ్నించారు. ఏది నిజమో, ఏది అబద్ధమో తెలియని సందిగ్ధతని ప్రపంచంలోని చాలా విషయాలు చాలాసార్లు సృష్టించాయి. ‘అతుక్’ కూడా అదే పని చేసింది. ఆ సందిగ్ధత వీడలేదు. ఎప్పటికైనా వీడుతుందన్న నమ్మకమూ లేదు!
 - సమీర నేలపూడి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement