చలాన్ని గొప్ప చేసి మాట్లాడటం చాలా మందికి నచ్చదు... | article about writer chalam | Sakshi
Sakshi News home page

చలాన్ని గొప్ప చేసి మాట్లాడటం చాలా మందికి నచ్చదు...

Published Fri, Feb 28 2014 11:27 PM | Last Updated on Sat, Sep 2 2017 4:12 AM

చలాన్ని గొప్ప చేసి మాట్లాడటం చాలా మందికి నచ్చదు...

చలాన్ని గొప్ప చేసి మాట్లాడటం చాలా మందికి నచ్చదు...

ఆరాధ్యం
 చలం రచనలు కొన్నైనా చదివి స్త్రీలు ప్రభావితం చెందాలంటే అసలు ఆయనేం రాశారో తెలియాలి.
 చలంగారి గురించి చర్చించడానికీ, కొత్తగా చెప్పుకోవడానికీ ఇప్పుడింకేమీ లేదు. నిజానికి ఆయన గురించి చర్చించడానికి ఆయనే ఏమీ మిగల్చలేదు. తన జీవితాన్ని కథల్లో, నవలల్లో, మ్యూజింగ్స్‌లో తనే పూర్తిగా బహిర్గత పరిచారు. మనమెంత చర్చించినా ఆయన మాటల్లో ఆయన అభిప్రాయమే తప్ప కొత్తగా ఇంకేదో చెప్పలేము. సాధారణంగా ఆత్మకథ జీవిత చరమాంకంలో రాస్తారు. కాస్త నిర్భీతిగా ఉన్నదున్నట్లు రాయగానే మనకు చాలా గొప్పగా మహాత్ములుగా కనిపిస్తారు. కాని చలం ప్రారంభం నుంచీ చెప్పింది ఆత్మకథే. కాని చలాన్ని గొప్ప చేసి మాట్లాడటానికి చాలామందికి మనసొప్పదు. ఎంతో నిర్భయంగా, సమాజానికి వెరవకుండా ఇలా కూడా రచన చెయ్యొచ్చా అని తోటి రచయితలు ఆశ్చర్యపోయేరీతిలో రచించారు. ఆయన రాసిన కథల్లో , నవలల్లో నాయకుడు, కథకుడు విడిగా కనపడరు. వారే వీరు వీరే వారు అనిపిస్తారు. పైగా చాలా కథలు ఆయన తన గురించి చెప్తున్నట్టుగా ఫస్ట్ పర్సన్‌లోనే రాశారు. తన భావాల్ని నాయకుడిలో లేదా నాయికలో ప్రవేశపెడ్తారు లేదా తనే నాయకుడిగా ప్రతిబింబిస్తారు. కొన్ని కథలైతే నిజంగా ఆయన జీవితంలో జరిగినవే యథాతథంగా రాశారేమో అనిపించకమానవు.
 
 చలంగారు స్త్రీ పక్షపాతనే విషయం లోకవిదితం. ఆయన రచనల్లో స్త్రీ పాత్రల ద్వారా తను కోరుకున్న స్వాతంత్య్రం, తను కోరే వ్యక్తిత్వం కనిపిస్తాయి. ఇలా స్త్రీలకు నోరిచ్చిన రచయిత ఎవరు? వారి గుండెల్లో ఏముందో బయటకు తెలియనిచ్చింది ఎవరు? చలంగారు తన పాత్రలను దాదాపు రక్షకుల వలే తీర్చిదిద్ది స్త్రీలకు అవసరమైనప్పుడు వారి నుంచి సహాయాన్ని, చైతన్యాన్ని, స్ఫూర్తిని పొందేంత స్థాయిలో శాశ్వతంగా నిలబెట్టారు. దైవమిచ్చిన భార్యలో పద్మావతి, మైదానంలో రాజేశ్వరి, అరుణలో అరుణ, వేదాంతంలో సత్తిరాజు భార్య, మాదిగ అమ్మాయి, ఎరికలమ్మ... వీళ్లంతా స్వతంత్ర స్త్రీలు. వీరి మాటలు తూటాలు, గురి తప్పని బాణాలు. ‘లేచిపోయినానని లోకం అంటే నాకు చాలా బాధగా ఉంటుంది’ అని ప్రారంభిస్తుంది రాజేశ్వరి. ప్లీడరు ఇంట్లోని ఇరుకు పడకగది కంటే మైదానంలో ఆరుబయట పడక, ఏటిలో స్నానం వర్ణించడం ఈ కాలం స్త్రీకైనా సాధ్యపడదు.
 
 
 ‘ప్రేమ గల వాళ్లు నన్నేం చేసినా ఊరుకుని, నన్నెలా అంటే అలా ఉపయోగించనిచ్చి, అసహ్యపెట్టి, అక్కర్లేనప్పుడు నా మొహం చూడక కావల్సినప్పుడు నా మీద దౌర్జన్యం చెయ్యనిచ్చి- అదా ప్రేమ? నేనెప్పుడూ ఒప్పుకోను’ అంటుంది పద్మావతి.
 తనతో రమ్మన్న రాధతో ‘నేను కనపడ్డప్పుడల్లా ఆశతో, ఆనందంతో నీ హృదయం కొట్టుకోవాలి. నన్ను నా నిర్మలత్వం చూసి నవ్వు భ్రమసి పోవాలి. నాకూ అలాగే ఉండాలి నిన్ను చూస్తే ఎన్నాళ్లయినా సరే. నీకు పని చేస్తూ పడి ఉండే దాసిదాన్ని చేస్తావా నీ హృదయేశ్వరిని తీసుకెళ్లి ప్రేమ పేరు పెట్టి. ప్రేమ లేకపోతే పోయిందిగాని ప్రేమని చంపుకోలేను నా చేతులతో’ అని నచ్చచెపుతుంది.
 
 వేదాంతంలో సత్తిరాజు భార్య ‘మనుషులు కుక్కలు. ఒక్కసారి సాయం చేశామా ఇంక వదలరు. కొంచెమిచ్చామా ఇంక ఈ కాముకుల మోస్తరే’ అని ఈసడిస్తుంది.
 ‘ఆపద వస్తే చాలదు. ఆపద ముందు కుంగిపోవాలి. సహాయానికై అరవాలి. సహాయం అక్కరలేదంటే ప్రపంచానికి ఎంతో కోపం వస్తుంది. ముఖ్యం ఆడదాని మీద’ అని తృణీకరిస్తుంది.
 
 మాదిగమ్మాయి తన నిస్సహాయత గురించి చెపుతూ ‘తాకడం కంటే, ఇంకేదో చెయ్యడం కంటే కూడా కొందరి చూపులు అసహ్యంగా. దుర్భరంగా ఉంటాయి. యెదురెళ్లి ముఖం మీద ఉమ్మెయ్యాలనిపించేది’ అంటుంది.అందరి కంటే భిన్నమైనది అరుణ ప్రేమ. ‘జాలీ, ప్రేమా, మోహం, వాంఛా! మాటలు. ఉత్త మాటలు. హృదయంలో ఆరాటం తెలియచేసే విధం తెలీక మాటలు’‘ప్రేమా- ప్రేమ విచిత్రం, నాకేనో అందరికేనో. నేనింత వరకూ ఎవర్నీ ప్రేమించలేదు. ఇప్పుడు తలచుకుంటే నా హృదయంలో గొప్ప ప్రేమ ఉంది. ప్రేమించాలనే ఆశ అపారంగా ఉంది. అందువల్లనే ఇవన్నీ. నా కలల్లో నా ఆదర్శపురుషుడు బతుకుతున్నాడు. ఈ మనుషులని చూస్తే దేహలోపాలు, గుణలోపాలు అన్నీ కనపడతాయి. నాకు మనుషుల్లోనే ఒకరికీ ఒకరికీ భేదం నశించింది. అందరూ అంతే. ఏం చేస్తారు పాపం. అంతకన్నా చేతకాదు’ అని బద్దలు కొడుతుంది.
 
 ఈ చైతన్యం చలం ఇవ్వకపోతే ఈ సమాజం ఇంకెంతకాలం చీకటిలో మగ్గి ఉండేదో.
 చలం రచనలు కొన్నైనా చదివి స్త్రీలు ప్రభావితం చెందాలంటే అసలు ఆయనేం రాశారో తెలియాలి. ఆయన పుస్తకాల్ని మగవారే చదవడానికి భయపడే రోజుల్లోంచి, స్త్రీలు కూడా బాహాటంగా చదవగలిగే రోజుల్లోకి వచ్చి కూడా ఇంకా ఉన్నారు ఆయన గురించి మాట్లాడడానికి, చదివామని నిర్భీతిగా చెప్పడానికి భయపడేవారు. దాదాపు 100 సంవత్సరాల క్రితమే స్త్రీలు, స్త్రీ స్వాతంత్య్రం గురించి తపన పడ్డ రచయిత చలం. స్త్రీల నిర్భీతి, కోపం, అసహాయత అన్నీ ఆయన చర్చించారు. ఎవరంటే వారు తోచిన వ్యాఖ్యానం చేసే రచయిత కాదాయన.నిజానికి, ఆయన ఇంకా మనందరం తడిమి తడిమి తెలుసుకోవాల్సిన గజ స్వరూపుడే.
 
 - ఎం. ఉమాదేవి
 
 డైరీ...
     సినీ జర్నలిస్టులు రాసిన కథలను ‘అంతర్ముఖం’ పేరుతో సంకలనపరిచి మార్చి 3 ఉదయం హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్స్‌లో ఆవిష్కరించనున్నారు. ఆవిష్కర్త: దాసరి. సంకలనకర్త: బత్తుల ప్రసాద్.
 
     శేషేంద్ర ప్రఖ్యాత పద్యకావ్యం ‘ఋతుఘోష’ స్వర్ణోత్సవ సభ మార్చి 3 సాయంత్రం హైదరాబాద్ త్యాగరాయగానసభలో జరుగుతుంది. ఆచార్య అనుమాండ్ల భూమయ్య తదితరులు పాల్గొంటారు.
 
 వివరాలకు: సాత్యకి- 77029 64402
     సౌదా అరుణా థియేటర్ మూవ్‌మెంట్ సమర్పణలో ‘జాతిపిత అంబేద్కర్ వర్ణనిర్మూలన’ బహుజన నాటకం 48వ ప్రదర్శన మార్చి 8 సాయంత్రం గుంటూరు జిల్లా రేపల్లెలోని ఆంధ్రరత్న స్కూల్‌లో ప్రదర్శించనున్నారు. 49వ ప్రదర్శన మార్చి 15న మిర్యాలగూడలో, 50వ ప్రదర్శన ఏప్రిల్ 14న తిరుపతిలో ఉంటుంది.
 
 వివరాలకు: 9247150243
     కార్టూనిస్ట్ శేఖర్ కార్టూన్లకు పాతికేళ్లు వచ్చిన సందర్భంగా రజతోత్సవ వేడుక. మార్చి 2 ఆదివారం, సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో ఉదయం 11 నుంచి.    }నివాస్ వాసుదేవ్ కవితా సంపుటి ‘ఆకుపాట’ ఆవిష్కరణ మార్చి 1 సాయంత్రం హైదరాబాద్ గోల్డెన్ థ్రెషోల్డ్‌లో జరుగుతుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement