‘పాకుడు రాళ్ల’ మీద స్థిరంగా నిలవడం కష్టం. కుడు రాళ్లు పట్టుకుని పైపైకి ఎగబాకడమూ కష్టమే. సినిమా రంగంలో స్త్రీల కెరీర్ పాకుడు రాళ్లపై నడక వంటిదని రావూరి భరద్వాజ రాసిన నవల ‘పాకుడు రాళ్లు’జ్ఞానపీఠ్ అవార్డు గెలుచుకుంది. తెలుపు నలుపు కాలం నాటి నటీమణి జీవితాన్ని ఆధారం చేసుకుని 1978లో రాసిన ఈ నవల ఇప్పుడు నాటకంగా ప్రదర్శితమవుతోంది. ఒక భారీ నవలను నాటకంగా మలచడం కష్టమైనా దర్శకురాలు నస్రీన్ ఇషాక్ విజయం సాధించింది. ఒక మహిళ ప్రధాన పాత్ర వహించే ఈ నాటకానికి మరో మహిళ దర్శకత్వం వహించడం, వస్తువు ఈ కాలానికి కూడా రిలవెంట్‌గా ఉండటంతో ఇప్పటికి ఆరు ప్రదర్శనలు పూర్తి చేసుకుంది. నస్రీన్ ఇషాక్ పరిచయం... నవలను నాటకంగా మలచడంలో ఆమె సాధక బాధకాలు...
గుంటూరు జిల్లాలోని ఒక ఊరిలో నాటకాలు ఆడే అమ్మాయి మంగమ్మ మొదట చెన్నైకి చేరి, అక్కడ ‘మంజరి’గా మారి, నటిగా టాప్‌స్టార్ అయ్యి, ఆ తర్వాత బొంబాయిలో ఎదిగి, భారతదేశం తరఫున సాంస్కృతిక రాయబారిగా అమెరికా వరకూ వెళ్లగలిగింది. అయితే ఆమె ముగింపు? ఆత్మహత్య. సినిమా రంగపు పాకుడురాళ్లు ఆమెను చివరకు పతనం అంచునే పడేస్తాయి. ఈ మంగమ్మ అను మంజరి కథనే రచయిత రావూరి భరద్వాజ ‘పాకుడురాళ్లు’ నవలగా రాశారు. నవల వచ్చాకగాని ఆ తర్వాతగాని ఈ మంజరి ఎవరి కథ అనేది ఆయన బహిరంగ పరచలేదు. మూకీల నుంచి టాకీలుగా సినిమా మారుతుండగా టాప్‌స్టార్ అయిన ఒక హీరోయిన్ కథ అని కొంతమంది, 1950లలో టాప్‌స్టార్ అయిన మరో హీరోయిన్ కథ అని మరి కొంతమంది అంటూ ఉంటారు. అయితే రచయిత రావూరి భరద్వాజ జర్నలిస్టు కూడా కావడం వల్ల తనకు తెలిసిన సమాచారంతో, ముగ్గురు నలుగురు హీరోయిన్ల జీవితాన్ని ఒక మంజరికి ఆపాదించి రాశారని నవలలోని ఘటనలను బట్టి అర్థమవుతుంది. ఇది ఒక రకంగా కొంతమంది హీరోయిన్ల ఉమ్మడి బయోగ్రఫీ. అందుకే ఆ నవలకు అంత బలం, చారిత్రక విలువ.
ఇప్పుడు నాటకంగా
‘పాకుడురాళ్లను నాటకంగా చేయడం చాలా పెద్ద సవాలు. దీనిని గంటన్నర నిడివి గల నాటకంగా చేద్దామనుకున్నాను. కానీ గంటా యాభై నిమిషాల కంటే తగ్గించలేకపోయాను’ అంటారు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ థియేటర్ విభాగంలో గెస్ట్ ఫ్యాకల్టీగా పని చేస్తున్న 52 ఏళ్ల నస్రీన్ ఇషాక్. ఈమె దర్శకత్వం వహించిన ‘పాకుడు రాళ్లు’ నాటకం మొన్న జనవరి ఒకటిన విశాఖలో హౌస్‌ఫుల్ గా ప్రదర్శితమైంది. దానికి ముందు హైదరాబాద్, అద్దంకిలలో కూడా ప్రదర్శితమైంది. షోస్ రిపీట్ అవుతున్నాయి కూడా. ‘ఈ నాటకంలో మంజరి ఎదుర్కొన్న ఘటనలు నేటికీ సినిమా రంగంలో అలాగే ఉన్నాయి. ఆ మధ్య వచ్చిన మీటూ ఉద్యమాన్ని కూడా చూశాం. భరద్వాజ గారు ఈ నవలను విస్తృత ఘటనలతో రాశారు. మంజరి తానే బాధితురాలిగా ఉండి ఆ తర్వాత ఎదుటివారిని ఆడించే శక్తిమంతురాలు అవుతుంది. నవలలో ఆమె పాత్ర అంతర్గత పెనుగులాటను, దాని గాఢతను రచయిత రాయ లేదు. మంజరి పాత్రను సహానుభూతితో అర్థం చేసుకునేలా నాటకం ముగింపును మలచడానికి నవలను శోధించాల్సి వచ్చింది’ అంటారు నస్రీన్ ఇషాక్. ‘పైకి చూడటానికి ఈ నవల మంజరి తన శరీరాన్ని చూపిస్తూ ఇతరులతో ఆడిన ఆటగా ఉంటుంది. కాని లోన చూస్తే ఆ ఆట వల్ల ఆమె పడే వేదన తెలుస్తుంది’ అంటారు ఆమె.
18 మంది నటీనటులు
వేదిక మీద 18 మంది నటీనటులు ఈ నాటకాన్ని ప్రదర్శిస్తారు. నవలలో ఎదురు పడే ముఖ్యపాత్రలు– కల్యాణి, రాజమణి, చంద్రం, చలపతి, మాధవరావు... ఈ పాత్రలన్నీ మంజరితో తలపడతాయి. నాటకంలో ఐదు పాటలు ఉన్నాయి. మంజరి పాత్రను భావనా వఝపాండల్ పోషించింది. ‘ఒక నటి బయోపిక్‌ను స్టేజ్ మీద ఏ మేరకు నిజాయితీగా చూపించగలమో ఆ మేరకు పాకుడురాళ్లలో చూపించాం’ అంటారు నస్రీన్ ఇషాక్.
తెలుగు రాకపోయినా
నస్రీన్ ఇషాక్‌ది ఢిల్లీ. అక్కడే ఢిల్లీ యూనివర్సిటీలో వీధి నాటకాల నుంచి నాటకరంగం మీద ఆసక్తి పెంచుకున్నారు. నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామాలో సీటు సాధించి చదువుకున్నారు. 2009 నుంచి హైదరాబాద్‌లో ఉన్నారు. ‘మొదట నేను ఇంగ్లిష్, హిందీ నాటకాలు వేయించేదాన్ని. కాని ఇక్కడ ఉన్నదంతా తెలుగు నటులు. మాతృభాషలో నాటకం ఆడటం నటులకు చాలా ముఖ్యం. అందుకని తెలుగు సాహిత్యం నుంచి నాటకాలను ఎంచుకోవాలని నిశ్చయించుకున్నాను. మొదట ‘మైదానం’ నవలను నాటకం చేశాను. ఇప్పుడు ‘పాకుడు రాళ్లు’ చేశాను. నాటకం చేయాలని అనుకున్నాక ఒక నెల రోజుల పాటు రీడింగ్ సెషన్స్ ఉంటాయి. మా నటీనటులు ఒక్కో చాప్టర్ చదువుతూ దాని సారాంశం నాకు హిందీలోనో ఇంగ్లిష్‌లోనో చెబుతూ వెళతారు. నవల ఆత్మను పట్టుకుంటే నాటకం వేయడానికి భాష అడ్డంకి కాదు అని నా భావన. సన్నివేశాల వరుస, నటీనటుల ఎక్స్‌ప్రెషన్స్, ఎనర్జీ, ఇన్‌వాల్వ్‌మెంట్, ఫీలింగ్, వేరియేషన్స్... వీటిని నేను చూసుకుంటాను. నాకు తెలిసిపోతాయి’ అంటారు నస్రీన్.
ఆమె భర్త నౌషాద్ ముహమ్మద్‌ది కేరళ. అతను సెంట్రల్ యూనివర్సిటీ థియేటర్ డిపార్ట్‌మెంట్‌లో ప్రొఫెసర్‌గా పని చేస్తున్నాడు.
‘పాకుడురాళ్లు నాటకాన్ని మరెన్నో ప్రదర్శనలు వేయాలని ఉంది’ అంటున్న నస్రీన్ కోరిక నెరవేరాలని కోరుకుందాం. (క్లిక్ చేయండి: స్త్రీ శక్తి.. సూపర్ ఫైటర్)
Comments
Please login to add a commentAdd a comment