Ravuri Bharadhwaja
-
రంగస్థలంపై పాకుడు రాళ్ళు
‘పాకుడు రాళ్ల’ మీద స్థిరంగా నిలవడం కష్టం. కుడు రాళ్లు పట్టుకుని పైపైకి ఎగబాకడమూ కష్టమే. సినిమా రంగంలో స్త్రీల కెరీర్ పాకుడు రాళ్లపై నడక వంటిదని రావూరి భరద్వాజ రాసిన నవల ‘పాకుడు రాళ్లు’జ్ఞానపీఠ్ అవార్డు గెలుచుకుంది. తెలుపు నలుపు కాలం నాటి నటీమణి జీవితాన్ని ఆధారం చేసుకుని 1978లో రాసిన ఈ నవల ఇప్పుడు నాటకంగా ప్రదర్శితమవుతోంది. ఒక భారీ నవలను నాటకంగా మలచడం కష్టమైనా దర్శకురాలు నస్రీన్ ఇషాక్ విజయం సాధించింది. ఒక మహిళ ప్రధాన పాత్ర వహించే ఈ నాటకానికి మరో మహిళ దర్శకత్వం వహించడం, వస్తువు ఈ కాలానికి కూడా రిలవెంట్గా ఉండటంతో ఇప్పటికి ఆరు ప్రదర్శనలు పూర్తి చేసుకుంది. నస్రీన్ ఇషాక్ పరిచయం... నవలను నాటకంగా మలచడంలో ఆమె సాధక బాధకాలు... గుంటూరు జిల్లాలోని ఒక ఊరిలో నాటకాలు ఆడే అమ్మాయి మంగమ్మ మొదట చెన్నైకి చేరి, అక్కడ ‘మంజరి’గా మారి, నటిగా టాప్‌స్టార్ అయ్యి, ఆ తర్వాత బొంబాయిలో ఎదిగి, భారతదేశం తరఫున సాంస్కృతిక రాయబారిగా అమెరికా వరకూ వెళ్లగలిగింది. అయితే ఆమె ముగింపు? ఆత్మహత్య. సినిమా రంగపు పాకుడురాళ్లు ఆమెను చివరకు పతనం అంచునే పడేస్తాయి. ఈ మంగమ్మ అను మంజరి కథనే రచయిత రావూరి భరద్వాజ ‘పాకుడురాళ్లు’ నవలగా రాశారు. నవల వచ్చాకగాని ఆ తర్వాతగాని ఈ మంజరి ఎవరి కథ అనేది ఆయన బహిరంగ పరచలేదు. మూకీల నుంచి టాకీలుగా సినిమా మారుతుండగా టాప్‌స్టార్ అయిన ఒక హీరోయిన్ కథ అని కొంతమంది, 1950లలో టాప్‌స్టార్ అయిన మరో హీరోయిన్ కథ అని మరి కొంతమంది అంటూ ఉంటారు. అయితే రచయిత రావూరి భరద్వాజ జర్నలిస్టు కూడా కావడం వల్ల తనకు తెలిసిన సమాచారంతో, ముగ్గురు నలుగురు హీరోయిన్ల జీవితాన్ని ఒక మంజరికి ఆపాదించి రాశారని నవలలోని ఘటనలను బట్టి అర్థమవుతుంది. ఇది ఒక రకంగా కొంతమంది హీరోయిన్ల ఉమ్మడి బయోగ్రఫీ. అందుకే ఆ నవలకు అంత బలం, చారిత్రక విలువ. ఇప్పుడు నాటకంగా ‘పాకుడురాళ్లను నాటకంగా చేయడం చాలా పెద్ద సవాలు. దీనిని గంటన్నర నిడివి గల నాటకంగా చేద్దామనుకున్నాను. కానీ గంటా యాభై నిమిషాల కంటే తగ్గించలేకపోయాను’ అంటారు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ థియేటర్ విభాగంలో గెస్ట్ ఫ్యాకల్టీగా పని చేస్తున్న 52 ఏళ్ల నస్రీన్ ఇషాక్. ఈమె దర్శకత్వం వహించిన ‘పాకుడు రాళ్లు’ నాటకం మొన్న జనవరి ఒకటిన విశాఖలో హౌస్‌ఫుల్ గా ప్రదర్శితమైంది. దానికి ముందు హైదరాబాద్, అద్దంకిలలో కూడా ప్రదర్శితమైంది. షోస్ రిపీట్ అవుతున్నాయి కూడా. ‘ఈ నాటకంలో మంజరి ఎదుర్కొన్న ఘటనలు నేటికీ సినిమా రంగంలో అలాగే ఉన్నాయి. ఆ మధ్య వచ్చిన మీటూ ఉద్యమాన్ని కూడా చూశాం. భరద్వాజ గారు ఈ నవలను విస్తృత ఘటనలతో రాశారు. మంజరి తానే బాధితురాలిగా ఉండి ఆ తర్వాత ఎదుటివారిని ఆడించే శక్తిమంతురాలు అవుతుంది. నవలలో ఆమె పాత్ర అంతర్గత పెనుగులాటను, దాని గాఢతను రచయిత రాయ లేదు. మంజరి పాత్రను సహానుభూతితో అర్థం చేసుకునేలా నాటకం ముగింపును మలచడానికి నవలను శోధించాల్సి వచ్చింది’ అంటారు నస్రీన్ ఇషాక్. ‘పైకి చూడటానికి ఈ నవల మంజరి తన శరీరాన్ని చూపిస్తూ ఇతరులతో ఆడిన ఆటగా ఉంటుంది. కాని లోన చూస్తే ఆ ఆట వల్ల ఆమె పడే వేదన తెలుస్తుంది’ అంటారు ఆమె. 18 మంది నటీనటులు వేదిక మీద 18 మంది నటీనటులు ఈ నాటకాన్ని ప్రదర్శిస్తారు. నవలలో ఎదురు పడే ముఖ్యపాత్రలు– కల్యాణి, రాజమణి, చంద్రం, చలపతి, మాధవరావు... ఈ పాత్రలన్నీ మంజరితో తలపడతాయి. నాటకంలో ఐదు పాటలు ఉన్నాయి. మంజరి పాత్రను భావనా వఝపాండల్ పోషించింది. ‘ఒక నటి బయోపిక్‌ను స్టేజ్ మీద ఏ మేరకు నిజాయితీగా చూపించగలమో ఆ మేరకు పాకుడురాళ్లలో చూపించాం’ అంటారు నస్రీన్ ఇషాక్. తెలుగు రాకపోయినా నస్రీన్ ఇషాక్ది ఢిల్లీ. అక్కడే ఢిల్లీ యూనివర్సిటీలో వీధి నాటకాల నుంచి నాటకరంగం మీద ఆసక్తి పెంచుకున్నారు. నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామాలో సీటు సాధించి చదువుకున్నారు. 2009 నుంచి హైదరాబాద్‌లో ఉన్నారు. ‘మొదట నేను ఇంగ్లిష్, హిందీ నాటకాలు వేయించేదాన్ని. కాని ఇక్కడ ఉన్నదంతా తెలుగు నటులు. మాతృభాషలో నాటకం ఆడటం నటులకు చాలా ముఖ్యం. అందుకని తెలుగు సాహిత్యం నుంచి నాటకాలను ఎంచుకోవాలని నిశ్చయించుకున్నాను. మొదట ‘మైదానం’ నవలను నాటకం చేశాను. ఇప్పుడు ‘పాకుడు రాళ్లు’ చేశాను. నాటకం చేయాలని అనుకున్నాక ఒక నెల రోజుల పాటు రీడింగ్ సెషన్స్ ఉంటాయి. మా నటీనటులు ఒక్కో చాప్టర్ చదువుతూ దాని సారాంశం నాకు హిందీలోనో ఇంగ్లిష్‌లోనో చెబుతూ వెళతారు. నవల ఆత్మను పట్టుకుంటే నాటకం వేయడానికి భాష అడ్డంకి కాదు అని నా భావన. సన్నివేశాల వరుస, నటీనటుల ఎక్స్ప్రెషన్స్, ఎనర్జీ, ఇన్వాల్వ్మెంట్, ఫీలింగ్, వేరియేషన్స్... వీటిని నేను చూసుకుంటాను. నాకు తెలిసిపోతాయి’ అంటారు నస్రీన్. ఆమె భర్త నౌషాద్ ముహమ్మద్ది కేరళ. అతను సెంట్రల్ యూనివర్సిటీ థియేటర్ డిపార్ట్మెంట్లో ప్రొఫెసర్‌గా పని చేస్తున్నాడు. ‘పాకుడురాళ్లు నాటకాన్ని మరెన్నో ప్రదర్శనలు వేయాలని ఉంది’ అంటున్న నస్రీన్ కోరిక నెరవేరాలని కోరుకుందాం. (క్లిక్ చేయండి: స్త్రీ శక్తి.. సూపర్ ఫైటర్) -
రావూరి భరద్వాజ: ఉడతమ్మ ఉపదేశం.. కథ
గోదావరీ నదీతీరాన ఒకప్పుడు చిక్కని అడవులు ఉండేవి. ఆ అరణ్యాల నిండా రకరకాల జంతువులు ఉండేవి. ఆ జంతువులను చూడడానికీ, అడవిలోని చెట్లను చూడడానికీ, దూరప్రాంతాల నుంచి చాలామంది వస్తూ పోతూ ఉండేవారు. ఆ వచ్చినవారు తమ వెంట రకరకాల కాయలనూ, పళ్లనూ, మిఠాయిలనూ తెచ్చుకొనేవారు. తిన్నంత తిని, మిగిలిన వాటిని దూరంగా విసిరేస్తూ ఉండేవారు. ఒకసారి– ఈ అడవిని చూడడానికి ఒక కుటుంబం వచ్చింది. వస్తూ వస్తూ వాళ్లు రకరకాల ఫలహారాలు తెచ్చుకున్నారు. మధ్యాహ్నం దాకా అడవిలో తిరిగారు. చూడవలసినవన్నీ చూశారు. అలసిపోయి ఒక చెట్టు కిందకొచ్చారు. వచ్చాక– తాము తెచ్చుకున్న మూటలు, పొట్లాలు విప్పుకొని కడుపునిండా తిన్నారు. తినగా మిగిలిన వాటిని చెట్టు కిందే పారబోశారు. కాసేపు విశ్రాంతి తీసుకున్నాక వెళ్లిపోయారు. ఇదంతా ఆ చెట్టుతొర్రలో ఉన్న ఉడతపిల్లాడు చూస్తూనే ఉన్నాడు. ఎక్కడి వాళ్లక్కడకు వెళ్లిపోయాక, ఆ ఉడతబ్బాయి కిందకు దిగివచ్చాడు. చెల్లాచెదురుగా చెట్టు కింద పడి ఉన్న మిఠాయి ముక్కల్ని ముందు కొంచెం రుచి చూశాడు. అవి తియ్యగానూ, రుచిగానూ ఉన్నాయి. తాను తినగలిగినన్ని తిని, మిగిలిన వాటిని అమ్మకోసం అట్టేపెట్టాడు. సాయంకాలం అయ్యేసరికి, ఆపసోపాలు పడుతూ అమ్మ ఉడత వచ్చింది. రాగానే– ఒక ఆకులో కాసిని మిఠాయి తునకలుంచి అమ్మ ముందుంచాడు ఉడతబ్బాయి. కొడుకు వైపు ఆశ్చర్యంగా చూసింది ఉడతమ్మ. జరిగిన సంగతంతా తల్లికి చెప్పాడు ఉడతబ్బాయి. చెప్పీ చెప్పీ చివరికిలా అన్నాడు– ‘అమ్మా! నువ్వు ఇంతకాలమూ, ఈ అడవిలో దొరికే పిందెల్నీ, కాయల్నీ మాత్రమే నాకు పెడుతున్నావు. నేనూ తింటున్నాను. ఈ ప్రపంచంలో మనం తినగలిగినవి ఇవేనేమో, ఇలాంటి వాటినే మనం తినాలేమో అనుకున్నాను. నువ్వయినా– నాకెప్పుడూ ఈ మిఠాయిల సంగతి చెప్పనన్నా చెప్పలేదు. ఎందుకని?’ అన్నాడు ఉడతబ్బాయి. ఉడతమ్మ సన్నగా నిట్టూర్చింది. ‘నాన్నా! ఇలాంటివి నాకూ తెలుసు. కావాలనే, వీటి గురించి నీకు చెప్పలేదు. సుఖాలకు అలవాటుపడడం తేలిక. ఆ అలవాటు నుంచి బయటపడడం కష్టం. ముందుగా– కష్టాలంటే ఏమిటో తెలియాలి. అవి బాగా అనుభవించాలి. ఆ తర్వాత సుఖాలను రావాలి.’ ‘కొంతకాలం సుఖపడిన తర్వాత కష్టాలు వచ్చాయనుకో– అప్పుడు, ఆ కష్టాలను అనుభవించడానికి పెద్దగా ఇబ్బందులు పడనవసరం ఉండదు. అందుకే– నీకీ మిఠాయిలను గురించి, అవి తినడంలో ఉండే సుఖాలను గురించి చెప్పలేదు. అంతేగాని, నీ మీద కోపంతో కాదు’ అంది ఉడతమ్మ. ‘ఈ మిఠాయిలూ అవీ దొరకడం చాలా కష్టమా?’ అన్నాడు ఉడతబ్బాయి దూరంలోకి చూస్తూ, ఏదో ఆలోచిస్తూ. ‘ఒకరకంగా కష్టం! ఇంకోరకంగా కష్టం కాదు. అయినా– నాకు తెలీక అడుగుతున్నాను; ఈ గొడవలన్నీ నీకెందుకురా నాన్నా?’ అంది ఉడతమ్మ. ‘ఎప్పుడో ఒకప్పుడు తప్పకుండా తెలుసుకోవలసినవి, ఇప్పుడే తెలుసుకోవడంలో దోషమేమీ లేదు కదా! అందుకే– అన్నీ అడుగుతున్నాను.’ ‘నేనో విషయం స్పష్టంగా చెబుతున్నాను వినమ్మా! నేను ఇకముందు నుంచి ఈ పచ్చికాయలు, పిచ్చికాయలు తినను. నాకు ఖరీదైన భోజనమే కావాలి. అవి– నువ్వెలా తెస్తావో కూడా నాకు అవసరం లేదు. అవి నీవు తెచ్చిపెడుతున్నంత కాలం నీతో ఉంటాను. మానేసిన రోజున, చెప్పాపెట్టకుండా ఎటో పోతాను. అప్పుడు నాకోసం నువ్వు ఏడ్చినా, మొత్తుకున్నా లాభంలేదు. తర్వాత నీ ఇష్టం’ అన్నాడు ఉడతబ్బాయి. ఉడతమ్మ గుండెలు గుభేలుమన్నాయి. ‘నిన్న సాయంకాలం దాకా కుర్రాడు బాగానే ఉన్నాడు. ఈరోజు ఉదయం తాను బయటకెళుతున్నప్పుడు కూడా బాగానే ఉన్నాడు. ఇంత తిండి మూటగట్టుకుని ఇంటికి వచ్చేసరికి కుర్రాడిలా తయారయ్యాడేమిటి?’ ఉడతమ్మ కొడుకుని కావలించుకుంది. బంగారు కన్నయ్యలాంటి తన కొడుకు ఇలా బండబారిపోవడానికి కారణాలేమిటో ఉడతమ్మ సరిగ్గానే ఊహించింది! ‘బుజ్జినాన్నా! నువ్వెప్పుడూ నన్ను ఏదీ అడగలేదు. ఇంతకాలానికిగాను, నువ్వు నన్ను అడిగిందల్లా మిఠాయిలు మాత్రమే! ఇలా నువ్వు అడగడం కూడా సహజమేరా! పిచ్చితండ్రీ!’ ‘చిన్నతనంలో అవీ ఇవీ తినాలని అందరికీ అనిపిస్తుంది. నా చిన్నప్పుడు మా అమ్మనూ, నాన్ననూ ఏవేవో కావాలని నేనూ అడిగాను. కాకపోతే ఒక చిన్నసంగతి మాత్రం నువ్వు గుర్తుంచుకో!’ అంది ఉడతమ్మ. ‘ఏమిటది?’ అడిగాడు ఉడతబ్బాయి. ‘రేపు– నాకూ చిన్నతనం రావచ్చు. నాక్కూడా, అవీ ఇవీ తినాలని అనిపించవచ్చు. అప్పుడు నేనూ నిన్ను అడుగుతాను. అలా అడిగినప్పుడు, నువ్వు ముఖం చిట్లించుకోకుండా, విసుక్కోకుండా తెచ్చిపెడితే నాకు అంతే చాలు’ అంది ఉడతమ్మ. ఉడతబ్బాయి ఆశ్చర్యపోయి, అమ్మవైపు చూశాడు. ‘అదేమిటీ? మళ్లీ నీకు చిన్నతనం రావడమేమిటీ?’ అన్నాడు ముఖం చిట్లిస్తూ. ‘ఎల్లకాలం నేను ఇలాగే ఉండను కదా! ఎప్పటికో అప్పటికి ముసలితనం ముంచుకొస్తుంది కదా! అప్పుడు నేనూ– నీకు మల్లేనే ఎక్కడికీ కదలలేను కదా! ఏమీ సొంతంగా తెచ్చుకోలేను కదా! ఆ రెండో చిన్నతనంలో, నాకు అవీ ఇవీ తినాలనిపించినప్పుడు– నువ్వీ విషయాలన్నీ గుర్తుంచుకొని, విసుక్కోకుండా తెచ్చిపెట్టు. నాకంతకన్నా ఇంకేమీ అవసరం లేదు’ అంది ఉడతమ్మ. ‘అమ్మా! నువ్వు నన్ను చూసినంత బాగా నేనూ నిన్ను చూడాలని, ఇన్నిసార్లు ఎందుకు చెబుతున్నట్టు? ఇప్పుడలా జరగడంలేదా?’ అన్నాడు ఉడతబ్బాయి. ‘మొన్నమొన్నటిదాకా అలానే జరుగుతూ ఉంది నాన్నా! ఈ మధ్యనే మనవాళ్లు మనుషుల్ని చూసి చెడిపోవడం ప్రారంభించారు. అందుకే ఇంతగా చెప్పవలసి వస్తోంది’ అంది ఉడతమ్మ కొడుకు వైపు జాగ్రత్తగా చూస్తూ. ఉడతబ్బాయి కళ్లనిండా నీళ్లుతిరిగాయి. ‘అమ్మా! నాకేమీ వద్దు. నాకోసం నువ్వు కష్టపడను కూడా వద్దు. నువ్వు తప్ప– ఇంకేమీ నాకు వద్దు’ అన్నాడు ఉడతబ్బాయి వాళ్లమ్మ కాళ్లను చుట్టుకుపోతూ. – రావూరి భరద్వాజ, జ్ఞానపీఠ అవార్డు గ్రహీత చదవండి: గబగబా చదివి పారేస్తే ఘబుక్కుని పెద్దాళయిపోతాంగా!! -
నా కథా వ్యవసాయం
జూలై 5 రావూరి భరద్వాజ జయంతి ప్రతి శిఖరం వెనుకా ఒక కృషి ఉంటుంది..... నా మొదటి కథ 1945లో అచ్చయింది. దాన్ని అచ్చువేసిన పత్రిక ‘ప్రజామిత్ర’. అప్పుడు దాని సంపాదకవర్గంలో ఏడిద కామేశ్వరరావు పని చేస్తుండేవారు. ఆ కథ పేరు ‘విమల’. ఆ కథ ఇలా ఉంటుంది. ఓ సనాతనపరుడైన తండ్రికి విమల అనే కూతురు ఉంటుంది. కథాసౌలభ్యం కోసం ఆవిడ విధవరాలయింది. చాలామంది ఆమెకు మళ్లీ పెళ్లి చెయ్యమని ఆ తండ్రితో చెబుతారు. ఆయన చస్తే విననంటాడు. ఓ రోజున ఆయనగారు రాత్రిపూట లేస్తాడు. పక్క ఇంటి ఇల్లాలు ఇంకెవరితోనో గుసగుసలాడుతూ ఉండటం కనిపిస్తుంది. ఆ సంఘటనను గురించే ఆయన ఒకటి రెండు రోజులాలోచిస్తాడు. ఇద్దరు బిడ్డల తల్లికే శరీర వాంఛల పట్ల అంత ఆసక్తి ఉన్నప్పుడు తన కూతురెలా ఆలోచిస్తూ ఉంటుందోననుకుంటాడు. ఆఖరుకు తెగించి పెళ్లి చేస్తాడు. అప్పట్లో ఆ కథ రాసి నేనేదో ఘనకార్యం చేశాననే అనుకున్నాను. ఆ రోజుల్లో పత్రికల్లో కథలు రాసేవాళ్లంతా నాకు చాలా గొప్పవాళ్లుగా కనిపించేవాళ్లు. ఇలా రాయడం వాళ్లకెలా చేతనయిందా అనుకునేవాణ్ణి. కలం పుచ్చుకుని కూచుంటే- కాదు- ఆ రోజుల్లో పెన్సిల్‌తోనే రాసేవాడ్ని- ఒక్క సంఘటన తట్టేది కాదు. ఒక్కవాక్యం కుదిరేది కాదు. చచ్చీ చెడీ నాలుగు లైన్లు రాస్తే అయిదో లైను రాయడానికి ఏమీ ఉండేది కాదు. ఆ అయిదోలైను రాసేందుకుగాను కొన్ని గంటల సేపు ప్రయత్నించిన విషయం నాకిప్పటికీ జ్ఞాపకం ఉంది. అయిదులైన్లు రాయడానికే నేనింత ఉట్టు గుడిచి పోతున్నానే మరి పదేసి పేజీలు పదిహేనేసి పేజీలు వాళ్లెలా రాస్తున్నారు? ఆ కీలకం ఏమిటి? ఆ సంగతి తెలుసుకోవడానికే చదవడం మొదలుపెట్టాను. పత్రికల్లో అడ్డమొచ్చిన ప్రతి కథా చదివాను. క్రమంగా నాకు కుటుంబరావు కథలు దొరికాయి. చదివాను. గోపీచంద్‌గారి కథలు దొరికాయి. చదివాను. చలంగారి యువప్రచురణలన్నీ చదివాను. చక్రపాణిగారి అనువాదాలు మునిమాణిక్యం, ధనికొండ పుస్తకాలూ అన్నీ చదివాను. వీటితో పోల్చి చూసినప్పుడు నేనిదివరకు చదివిన కథలన్నీ చాలా పిందెలనిపించింది. ఓ కొత్త ప్రపంచంలోకి వచ్చినట్టు అనిపించింది. చలం పుస్తకాల తరువాత అంతగానూ నన్నాకర్షించిన గ్రంథాలు కవిరాజు రామస్వామి చౌదరిగారివి. ఆ తరువాత గోపరాజు రామచంద్రరావుగారివి. రామస్వామి పుస్తకాలు పురాణాలనూ భారత రామాయణాలనూ నిలువునా ఖండించి పారేస్తున్నాయి. చలంగారు పాతకాలపు నీతి విలువలను పటాపంచలు చేస్తున్నారు. గోరాగారు అసలు దేవుణ్ణే ఎత్తిపారేస్తున్నారు. ఉక్కిరిబిక్కిరయిపోతున్న దశ అది. అంత వరకూ నేనుంటున్న సమాజం ఎలాంటిదో వీరు విడమరిచి విప్పి చెప్పినట్లనిపించింది నాకు. ఆ తరువాతనే నేను విరివిగా కథలు రాయడం ప్రారంభించాను. కథారచనలో నన్నమితంగా ప్రోత్సహించినవారు ధనికొండ హనుమంతరావుగారు. ఆయన రచయితగానేగాక, సంపాదకుడుగా కూడా పేరు ప్రతిష్టలు సంపాదించారు. రచయిత ప్రకటించే ఆశయాలతో వారికెపుడూ పేచీ ఉండేదికాదు. ప్రకటించే విధానంలోని శిల్పం, నాజూకుతనం నైపుణ్యం మాత్రమే వారు పరిగణించేవారు. అచ్చుకు పంపని కథలూ అచ్చయికూడా నా దగ్గర లేని కథలూ మరీ ప్రారంభ దశలో పత్రికల్లో వచ్చిన కథలు మినహాయిస్తే దాదాపుగా నావి 300 వరకూ ఉంటాయి. వీటిల్లో చాలాభాగం హనుమంతరావుగారి సంపాదకత్వాన వెలువడిన పత్రికల్లోనే వచ్చాయి. దాదాపు 3, 4 సంవత్సరాల పాటు నేను అట్టడుగు ప్రజలతో కలసి మెలసి ఉన్నాను. వాళ్లలో సచ్ఛీలురు, సన్మార్గులు, భక్తులు, తాగుబోతులు, వ్యభిచారులు, కూలీలు, సోమరులు, అబద్ధాలకోర్లు, చిల్లర దొంగలు ఎన్నో రకాలవాళ్లు ఉన్నారు. పతితలైన స్త్రీలు కూడా వీరిలో ఉన్నారు. 1947- 53 వరకు చాలా కథలకు ఇతివృత్తాన్ని వీరి జీవితాల నుంచే తీసుకున్నాను. ఆ కథలు ఏ ఫలితాలు ఇచ్చాయన్నదానికి నా దగ్గర జవాబు సిద్ధంగా లేదు. అవి అవాస్తవికం అని సులభంగా తోసి పారేసేవారు అలానే జీవిస్తున్నవారిని సమాజం నుంచి తోసిపారేయలేకపోతున్నారు. ‘కథావస్తువు మంచిది లేదండి’ అనడం నాకిప్పటికీ అర్థం కావడం లేదు. ఆ లేకపోవటమన్నది చూసే శక్తిగాని ‘వస్తువు’ కాదనుకుంటాను. ఒకే విషయాన్ని ఒకే పద్ధతిలో చెప్పడం నాకు గిట్టదు. ఒక విషయాన్ని పది పద్ధతుల్లో చెప్పడాన్ని కూడా నేనట్టే మెచ్చుకోలేను. పది విషయాలను పది పద్ధతుల్లో చెప్పడం నాకిష్టం. ఒక్కవారంలో మూడు నాలుగు కథలు రాసిన సందర్భాలున్నాయి. 5, 6 నెలల పర్యంతం ఒక్క లైను గూడా రాయని సందర్భాలున్నాయి. ‘అపశ్రుతులు’, ‘ఉన్నది-ఊహించేది’, ‘త్రినేత్రుడు’, ‘జయంతి’ లాంటి కథలను ఒకే ఊపున పూర్తి చేశాను. 1954లో ప్రారంభించిన ‘అసతోమా సద్గమయ’ అన్న కథను ఈనాటికీ పూర్తి చేయలేకపోయాను. నా ఉద్దేశాలు, ఆశయాలు, కలలు, నా చుట్టూ ఉన్నవారితో కలసి పంచుకోవాలన్నదే నా కుతూహలం. ఈ సందర్భంలో కొత్త ప్రయత్నాలు కొత్త ప్రయోగాలు అని నేననుకొన్న వాటిని చేసి చూశాను. అవి ఫలించాయో లేదో చెప్పవలసిన వారు పాఠకులు. (శార్వరి సంకలనం చేసిన కథలెలా రాస్తారు పుస్తకం నుంచి) -
రావూరి భరద్వాజ మననుంచి దూరమయ్యారు
సంచలన రచనల కలం ఆగింది... అక్షర రుషి ప్రస్థానం ముగిసింది... ఎక్కడో పుట్టి... ఎక్కడో పెరిగి... సమాజంలోని స్థితిగతులను అధ్యయనం చేసి... సరస్వతీ కటాక్షాన్ని పొంది... అద్భుత రచనలు సాగించి... అత్యున్నత పురస్కారమైన జ్ఞానపీఠ్ అవార్డును దక్కించుకున్న మన జిల్లావాసి... అటు పల్నాడు... ఇటు డెల్టా గాలి పీల్చిన రావూరి భరద్వాజ మననుంచి దూరమయ్యారు. ఆయన లేరన్న వార్త విన్న జిల్లా సాహితీ లోకం విషాదంలో మునిగిపోయింది. రావూరి భరద్వాజతో జిల్లాకున్న అనుబంధాన్ని ఓ సారి అవలోకనం చేసుకుంటే.. - సాక్షి, గుంటూరు / న్యూస్‌లైన్, తెనాలిరూరల్ దరిద్రం వెన్నాడుతుంటే తిండికే కనాకష్టంగా ఉన్న రోజుల్లో రోజుగడవటానికి ఎన్నో పనులు చేసినా చివరకు రచనా వ్యాసంగాన్నే నమ్ముకున్నారు రావూరి భరద్వాజ. 1950కి ముందు ‘ఒక్క పుస్తకం అచ్చయినా చాలు’ అనుకొన్న భరద్వాజ 140 పుస్తకాలు తీసుకొచ్చారంటే నిజంగా ఆశ్చర్యమే. ఆ పుస్తకాలు ఆయనకు కేంద్ర, రాష్ట్ర సాహిత్య అకాడమీ అవార్డులు తెచ్చిపెట్టాయి. యూనివర్సిటీలు గౌరవడాక్టరేట్లను బహూకరించాయి. పలు పుస్తకాలు ఇతర భాషల్లోకి అనువాదమయ్యాయి. అందులోని ‘పాకుడురాళ్లు’ పుస్తకానికి జ్ఞానపీఠ్ అవార్డును ప్రకటించారు. తన చిన్నతనంలో పడిన బాధలు, కష్టాలు, అవమానాలు, ఈసడింపులు అనుభవించకపోతే రచయితను అయివుండేవాణ్ని కాదనేవారు భరద్వాజ. బీడీలకెవరిస్తారు..? 1948లో తెనాలి చేరుకున్న ఆయన ఆలపాటి రవీంద్రనాథ్ ప్రారంభించిన పత్రికల్లో ఉద్యోగం, నెలకు రూ.25 జీతం. హోటల్లో భోజనం చేసి, ప్రెస్లోనే నిద్రించేవాడు. భోజనం అర్ధరూపాయి. రెండుపూటలా తింటే చాలవనీ, మధ్యాహ్నం లేటుగా అంటే 2.30 గంటల ప్రాంతంలో భోంచేసేవాడు. అదేమిటనీ హోటల్ యజమాని అడిగితే, ముందుగా తింటే రాత్రికి మళ్లీ ఆకలవుతుందని సమాధానమిచ్చాడట. దీంతో ఆయన జాలిపడి నెలకు రూ.30 విలువైన 60 భోజనం టికెట్లు రూ.25కే ఇస్తాను తీసుకొమన్నాట్ట. జీతం మొత్తం భోజనానికి పెడితే బీడీలకెవరిస్తారు? అనుకున్న భరద్వాజ ఆ మాటే పైకన్నాట్ట...నవ్వుకున్న హోటల్ యజమాని రూ.20 తీసుకుని నెల టికెట్లు ఇచ్చాడు. జీవితం అవస్థలమయమే.. తెనాలిలో ఉద్యోగం చేస్తున్నా, అవస్థల జీవితమే. అయినా తనకు పెద్ద రచయితలు తెలుసుననీ, ఆ విషయాన్ని ఊళ్లో గొప్పగా చెప్పుకోవాలని అనుకున్న భరద్వాజ, అప్పటికే రచయితగా పేరొందిన శారద (నటరాజన్)ను తీసుకొని అత్తగారింటికెళ్లి వారం రోజులున్నారు. తాను అనుకున్నట్టే ఊరంతా బాగా చూశారు.. తెనాలిలో ప్రెస్ పనవగానే ‘వృత్తి’చేసుకుని బతుకుతుండే లక్ష్మి దగ్గరకెళ్లి కూర్చునేవాడు. అక్కడ జైబూన్, చిత్ర అనే మరో ఇద్దరుండేవారు. రోజూ అక్కడకు వెళుతుంటే ‘అవసరం’ కోసం వెళుతున్నట్టే అనుకున్నారు. ‘అందుకు’రావడం లేదని నమ్మకం కుదిరాక, తమ గొడవలన్నీ భరద్వాజతో చెప్పుకునేవారు. వాటిని ఆధారం చేసుకుని కథలల్లిన భరద్వాజ, వాటిని వారికి వినిపించాకనే పత్రికలకు పంపేవారు. లక్ష్మి, జైబూన్, చిత్ర కలిసి, నాలుగు రూపాయల ఎనిమిదణాలకు తనకో కళ్లజోడు కొనిపెట్టారు. ఈ కళ్లజోడు ఇప్పటికీ భరద్వాజ దగ్గర పదిలంగా ఉంది. ‘ఈ లోకమంతా ‘చెడిపెలు’గా దుమ్మెత్తిపోసిన ముగ్గురు కరుణాంతరంగిణులు కొనిపెట్టిన ఆ కళ్లజోడును, ఓ గొప్ప బహుమానంగా నెనిప్పటికీ భావిస్తుంటాను’ అని చెప్పేవారు ఆయన. అవార్డులెన్నో.. జిల్లాలో ఆయన రచనలకు అవార్డులెన్నో వరించాయి. ఆచార్య నాగార్జున, విజ్ఞాన్ యూనివర్సిటీలు గౌరవ డాక్టరేట్లతో సత్కరిస్తే కేంద్ర ప్రభుత్వ జ్ఞానపీఠ్ పురస్కారం అందించింది. అవార్డు అందుకున్న కొన్నిరోజులకే ఆయన కన్నుమూశారు. తాడికొండలో విషాదఛాయలు తాడికొండ, న్యూస్‌లైన్ : జ్ఞానపఠ్ అవార్డు గ్రహీత రావూరి భరధ్వాజ మరణంతో శుక్రవారం తాడికొండలో విషాదఛాయలు అలముకున్నాయి. ఆయన మరణవార్త విని ఇక్కడివారు దిగ్భ్రాంతికి గురయ్యారు. తాడికొండలో మల్లంపల్లి అయ్యవార్లు, ఇనగంటి నరసింహరావుల ఇళ్లల్లో భరద్వాజ ఉండేవారు. 1947లో తాడికొండకు వచ్చిన భరద్వాజ 1967 వరకు స్థానిక ఎస్.వి.వి హైస్కూల్లో ఎస్ఎస్ఎల్సీ వరకు చదివారు. ప్రస్తుతం ఆయనకు వారసులు గాని బంధువులగాని ఇక్కడ లేరు. రావూరికి నివాళి గుంటూరు కల్చరల్, న్యూస్‌లైన్ : తెలుగు భాషకు ఖండాంతరాల ఖ్యాతిని తెచ్చిపెట్టిన సాహితీమూర్తి, గొప్ప మానవతావాది రావూరి భరద్వాజ మృతిపై సాహితీలోకం తెలుగు భాషాభిమానులు దిగ్భ్రాంతి చెందారు. నగరంలోని సాహిత్యవేత్తలు ఆయనకు అశ్రునివాళులర్పించారు. వారిలో కొందరి మనోభావాలు... చాలా బాధాకరం.. కావూరి మృతి అకాలం కాకపోయినా తెలుగు సాహితీపరులను చాలాకాలం బాధిస్తుంది. భరద్వాజ నేటి యువకులకు, రచయితలకు గొప్ప ఆదర్శంగా నిలుస్తారు. వ్యక్తిగా అత్యంత దారిద్య్రం నుంచి అత్యున్నత స్థాయికి ఎదిగారు. తెలుగు గ్రామీణ మూలాల నుంచి ఎదిగిన గొప్పరచయిత భరద్వాజ. తెలుగు సాహిత్యంలో అంతకు ముందు ఎవరూ స్పృశించని అట్టడుగు జీవిత కోణాలను తడిమారు. రచనా స్వభావంలో బెంగాలీ మహారచయిత శరత్‌బాబుకు, రావూరికి ఎంతో పోలిక ఉంది. ఆయన మానవతావాదం నేటి రచయితలకు మార్గదర్శకం. - డాక్టర్ పాపినేని శివశంకర్, సాహితీవేత్త మానవతావాది.. భరద్వాజ గుంటూరు నగరానికి వచ్చినప్పుడల్లా మా ఇంట్లోనే బస చేసేవారు. విజయవాడ రేడియోలో పనిచేసే సమయంలో ఓ రిక్షావాలా ఎక్కువ ఎత్తుకు రిక్షా లాగలేకపోతుంటే భరద్వాజ ఒక కిలోమీటరు వరకు రిక్షా వెనుక ఉండి తోసిన ఘటన ఆయన మనసును ప్రతిబంబిస్తుంది. తన రచనల్లోనే కాకుండా వ్యక్తిగతంగానూ ఎవరికి కష్టం వచ్చినా కన్నీళ్లు పెట్టుకునే స్వభావం ఆయనది. ఆయనకు జ్ఞానపీఠ్ వచ్చిందని ఆనందిస్తున్న సమయంలో కొద్దిరోజులకే ఈ విషాద వార్త సాహితీ ప్రియులను కలచివేస్తోంది. ఆయన రచనల్లోని భావాన్ని లక్ష్యాన్ని తర్వాత తరాల వారు కొనసాగించడమే ఆయనకు నిజమైన నివాళి. - డాక్టర్ కడియాల రామ్మోహనరాయ్, జేకేసీ కళాశాల విశ్రాంత అధ్యాపకుడు