రావూరి భరద్వాజ మననుంచి దూరమయ్యారు | Jnanpith award winner Ravuri Bharadwaja passes away | Sakshi
Sakshi News home page

రావూరి భరద్వాజ మననుంచి దూరమయ్యారు

Published Sat, Oct 19 2013 2:38 AM | Last Updated on Fri, Aug 24 2018 2:33 PM

రావూరి భరద్వాజ మననుంచి దూరమయ్యారు - Sakshi

రావూరి భరద్వాజ మననుంచి దూరమయ్యారు

 సంచలన రచనల కలం ఆగింది... అక్షర రుషి ప్రస్థానం ముగిసింది... ఎక్కడో పుట్టి... ఎక్కడో పెరిగి... సమాజంలోని స్థితిగతులను అధ్యయనం చేసి... సరస్వతీ కటాక్షాన్ని పొంది... అద్భుత రచనలు సాగించి... అత్యున్నత పురస్కారమైన జ్ఞానపీఠ్ అవార్డును దక్కించుకున్న మన జిల్లావాసి... అటు పల్నాడు... ఇటు డెల్టా గాలి పీల్చిన రావూరి భరద్వాజ మననుంచి దూరమయ్యారు. ఆయన లేరన్న వార్త విన్న జిల్లా సాహితీ లోకం విషాదంలో మునిగిపోయింది. రావూరి భరద్వాజతో జిల్లాకున్న అనుబంధాన్ని ఓ సారి అవలోకనం చేసుకుంటే.. 
 - సాక్షి, గుంటూరు / న్యూస్‌లైన్, తెనాలిరూరల్
 
 దరిద్రం వెన్నాడుతుంటే తిండికే కనాకష్టంగా ఉన్న రోజుల్లో రోజుగడవటానికి ఎన్నో పనులు చేసినా చివరకు రచనా వ్యాసంగాన్నే నమ్ముకున్నారు రావూరి భరద్వాజ. 1950కి ముందు ‘ఒక్క పుస్తకం అచ్చయినా చాలు’ అనుకొన్న భరద్వాజ 140 పుస్తకాలు తీసుకొచ్చారంటే నిజంగా ఆశ్చర్యమే. ఆ పుస్తకాలు ఆయనకు కేంద్ర, రాష్ట్ర సాహిత్య అకాడమీ అవార్డులు తెచ్చిపెట్టాయి. యూనివర్సిటీలు గౌరవడాక్టరేట్లను బహూకరించాయి. పలు పుస్తకాలు ఇతర భాషల్లోకి అనువాదమయ్యాయి. అందులోని ‘పాకుడురాళ్లు’ పుస్తకానికి జ్ఞానపీఠ్ అవార్డును ప్రకటించారు. తన చిన్నతనంలో పడిన బాధలు, కష్టాలు, అవమానాలు, ఈసడింపులు అనుభవించకపోతే రచయితను అయివుండేవాణ్ని కాదనేవారు భరద్వాజ.  
 
 బీడీలకెవరిస్తారు..?
 1948లో తెనాలి చేరుకున్న ఆయన ఆలపాటి రవీంద్రనాథ్ ప్రారంభించిన పత్రికల్లో ఉద్యోగం, నెలకు రూ.25 జీతం. హోటల్లో భోజనం చేసి, ప్రెస్‌లోనే నిద్రించేవాడు. భోజనం అర్ధరూపాయి. రెండుపూటలా తింటే చాలవనీ, మధ్యాహ్నం లేటుగా అంటే 2.30 గంటల ప్రాంతంలో భోంచేసేవాడు. అదేమిటనీ హోటల్ యజమాని అడిగితే, ముందుగా తింటే రాత్రికి మళ్లీ ఆకలవుతుందని సమాధానమిచ్చాడట. దీంతో ఆయన జాలిపడి నెలకు రూ.30 విలువైన 60 భోజనం టికెట్లు రూ.25కే ఇస్తాను తీసుకొమన్నాట్ట. జీతం మొత్తం భోజనానికి పెడితే బీడీలకెవరిస్తారు? అనుకున్న భరద్వాజ ఆ మాటే పైకన్నాట్ట...నవ్వుకున్న హోటల్ యజమాని రూ.20 తీసుకుని నెల టికెట్లు ఇచ్చాడు.
 
 జీవితం అవస్థలమయమే..
 తెనాలిలో ఉద్యోగం చేస్తున్నా, అవస్థల జీవితమే. అయినా తనకు పెద్ద రచయితలు తెలుసుననీ, ఆ విషయాన్ని ఊళ్లో గొప్పగా చెప్పుకోవాలని అనుకున్న భరద్వాజ, అప్పటికే రచయితగా పేరొందిన శారద (నటరాజన్)ను తీసుకొని అత్తగారింటికెళ్లి వారం రోజులున్నారు. తాను అనుకున్నట్టే ఊరంతా బాగా చూశారు.. తెనాలిలో ప్రెస్ పనవగానే ‘వృత్తి’చేసుకుని బతుకుతుండే లక్ష్మి దగ్గరకెళ్లి కూర్చునేవాడు. అక్కడ జైబూన్, చిత్ర అనే మరో ఇద్దరుండేవారు. రోజూ అక్కడకు వెళుతుంటే ‘అవసరం’ కోసం వెళుతున్నట్టే అనుకున్నారు. ‘అందుకు’రావడం లేదని నమ్మకం కుదిరాక, తమ గొడవలన్నీ భరద్వాజతో చెప్పుకునేవారు. వాటిని ఆధారం చేసుకుని కథలల్లిన భరద్వాజ, వాటిని వారికి వినిపించాకనే పత్రికలకు పంపేవారు. లక్ష్మి, జైబూన్, చిత్ర కలిసి, నాలుగు రూపాయల ఎనిమిదణాలకు తనకో కళ్లజోడు కొనిపెట్టారు. ఈ కళ్లజోడు ఇప్పటికీ భరద్వాజ దగ్గర పదిలంగా ఉంది. ‘ఈ లోకమంతా ‘చెడిపెలు’గా దుమ్మెత్తిపోసిన ముగ్గురు కరుణాంతరంగిణులు కొనిపెట్టిన ఆ కళ్లజోడును, ఓ గొప్ప బహుమానంగా నెనిప్పటికీ భావిస్తుంటాను’  అని చెప్పేవారు ఆయన.
 
 అవార్డులెన్నో..
 జిల్లాలో ఆయన రచనలకు అవార్డులెన్నో వరించాయి. ఆచార్య నాగార్జున, విజ్ఞాన్ యూనివర్సిటీలు గౌరవ డాక్టరేట్లతో సత్కరిస్తే కేంద్ర ప్రభుత్వ జ్ఞానపీఠ్ పురస్కారం అందించింది. అవార్డు అందుకున్న కొన్నిరోజులకే ఆయన కన్నుమూశారు.
 
 తాడికొండలో విషాదఛాయలు
 తాడికొండ, న్యూస్‌లైన్ : జ్ఞానపఠ్ అవార్డు గ్రహీత రావూరి భరధ్వాజ మరణంతో శుక్రవారం తాడికొండలో విషాదఛాయలు అలముకున్నాయి. ఆయన మరణవార్త విని ఇక్కడివారు దిగ్భ్రాంతికి గురయ్యారు. తాడికొండలో మల్లంపల్లి అయ్యవార్లు, ఇనగంటి నరసింహరావుల ఇళ్లల్లో భరద్వాజ ఉండేవారు. 1947లో తాడికొండకు వచ్చిన భరద్వాజ 1967 వరకు స్థానిక ఎస్.వి.వి హైస్కూల్‌లో ఎస్‌ఎస్‌ఎల్‌సీ వరకు చదివారు. ప్రస్తుతం ఆయనకు వారసులు గాని బంధువులగాని ఇక్కడ లేరు.   
 
 రావూరికి నివాళి
 గుంటూరు కల్చరల్, న్యూస్‌లైన్ : తెలుగు భాషకు ఖండాంతరాల ఖ్యాతిని తెచ్చిపెట్టిన సాహితీమూర్తి, గొప్ప మానవతావాది రావూరి భరద్వాజ మృతిపై సాహితీలోకం తెలుగు భాషాభిమానులు దిగ్భ్రాంతి చెందారు. నగరంలోని సాహిత్యవేత్తలు ఆయనకు అశ్రునివాళులర్పించారు. వారిలో కొందరి మనోభావాలు...
 
 చాలా బాధాకరం..
 కావూరి మృతి అకాలం కాకపోయినా తెలుగు సాహితీపరులను చాలాకాలం బాధిస్తుంది. భరద్వాజ నేటి యువకులకు, రచయితలకు గొప్ప ఆదర్శంగా నిలుస్తారు. వ్యక్తిగా అత్యంత దారిద్య్రం నుంచి అత్యున్నత స్థాయికి ఎదిగారు. తెలుగు గ్రామీణ మూలాల నుంచి ఎదిగిన గొప్పరచయిత భరద్వాజ. తెలుగు సాహిత్యంలో అంతకు ముందు ఎవరూ స్పృశించని అట్టడుగు జీవిత కోణాలను తడిమారు. రచనా స్వభావంలో బెంగాలీ మహారచయిత శరత్‌బాబుకు, రావూరికి ఎంతో పోలిక  ఉంది. ఆయన మానవతావాదం నేటి రచయితలకు మార్గదర్శకం.
 - డాక్టర్ పాపినేని శివశంకర్, సాహితీవేత్త
 
 మానవతావాది..
 భరద్వాజ గుంటూరు నగరానికి వచ్చినప్పుడల్లా మా ఇంట్లోనే బస చేసేవారు. విజయవాడ రేడియోలో పనిచేసే సమయంలో ఓ రిక్షావాలా ఎక్కువ ఎత్తుకు రిక్షా లాగలేకపోతుంటే భరద్వాజ ఒక కిలోమీటరు వరకు రిక్షా వెనుక ఉండి తోసిన ఘటన ఆయన మనసును ప్రతిబంబిస్తుంది. తన రచనల్లోనే కాకుండా వ్యక్తిగతంగానూ ఎవరికి కష్టం వచ్చినా కన్నీళ్లు పెట్టుకునే స్వభావం ఆయనది. ఆయనకు జ్ఞానపీఠ్ వచ్చిందని ఆనందిస్తున్న సమయంలో కొద్దిరోజులకే ఈ విషాద వార్త సాహితీ ప్రియులను కలచివేస్తోంది. ఆయన రచనల్లోని భావాన్ని లక్ష్యాన్ని తర్వాత తరాల వారు కొనసాగించడమే ఆయనకు నిజమైన నివాళి.
 - డాక్టర్ కడియాల రామ్మోహనరాయ్, జేకేసీ కళాశాల విశ్రాంత అధ్యాపకుడు
 

 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement