natika
-
రంగస్థలంపై పాకుడు రాళ్ళు
‘పాకుడు రాళ్ల’ మీద స్థిరంగా నిలవడం కష్టం. కుడు రాళ్లు పట్టుకుని పైపైకి ఎగబాకడమూ కష్టమే. సినిమా రంగంలో స్త్రీల కెరీర్ పాకుడు రాళ్లపై నడక వంటిదని రావూరి భరద్వాజ రాసిన నవల ‘పాకుడు రాళ్లు’జ్ఞానపీఠ్ అవార్డు గెలుచుకుంది. తెలుపు నలుపు కాలం నాటి నటీమణి జీవితాన్ని ఆధారం చేసుకుని 1978లో రాసిన ఈ నవల ఇప్పుడు నాటకంగా ప్రదర్శితమవుతోంది. ఒక భారీ నవలను నాటకంగా మలచడం కష్టమైనా దర్శకురాలు నస్రీన్ ఇషాక్ విజయం సాధించింది. ఒక మహిళ ప్రధాన పాత్ర వహించే ఈ నాటకానికి మరో మహిళ దర్శకత్వం వహించడం, వస్తువు ఈ కాలానికి కూడా రిలవెంట్గా ఉండటంతో ఇప్పటికి ఆరు ప్రదర్శనలు పూర్తి చేసుకుంది. నస్రీన్ ఇషాక్ పరిచయం... నవలను నాటకంగా మలచడంలో ఆమె సాధక బాధకాలు... గుంటూరు జిల్లాలోని ఒక ఊరిలో నాటకాలు ఆడే అమ్మాయి మంగమ్మ మొదట చెన్నైకి చేరి, అక్కడ ‘మంజరి’గా మారి, నటిగా టాప్‌స్టార్ అయ్యి, ఆ తర్వాత బొంబాయిలో ఎదిగి, భారతదేశం తరఫున సాంస్కృతిక రాయబారిగా అమెరికా వరకూ వెళ్లగలిగింది. అయితే ఆమె ముగింపు? ఆత్మహత్య. సినిమా రంగపు పాకుడురాళ్లు ఆమెను చివరకు పతనం అంచునే పడేస్తాయి. ఈ మంగమ్మ అను మంజరి కథనే రచయిత రావూరి భరద్వాజ ‘పాకుడురాళ్లు’ నవలగా రాశారు. నవల వచ్చాకగాని ఆ తర్వాతగాని ఈ మంజరి ఎవరి కథ అనేది ఆయన బహిరంగ పరచలేదు. మూకీల నుంచి టాకీలుగా సినిమా మారుతుండగా టాప్‌స్టార్ అయిన ఒక హీరోయిన్ కథ అని కొంతమంది, 1950లలో టాప్‌స్టార్ అయిన మరో హీరోయిన్ కథ అని మరి కొంతమంది అంటూ ఉంటారు. అయితే రచయిత రావూరి భరద్వాజ జర్నలిస్టు కూడా కావడం వల్ల తనకు తెలిసిన సమాచారంతో, ముగ్గురు నలుగురు హీరోయిన్ల జీవితాన్ని ఒక మంజరికి ఆపాదించి రాశారని నవలలోని ఘటనలను బట్టి అర్థమవుతుంది. ఇది ఒక రకంగా కొంతమంది హీరోయిన్ల ఉమ్మడి బయోగ్రఫీ. అందుకే ఆ నవలకు అంత బలం, చారిత్రక విలువ. ఇప్పుడు నాటకంగా ‘పాకుడురాళ్లను నాటకంగా చేయడం చాలా పెద్ద సవాలు. దీనిని గంటన్నర నిడివి గల నాటకంగా చేద్దామనుకున్నాను. కానీ గంటా యాభై నిమిషాల కంటే తగ్గించలేకపోయాను’ అంటారు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ థియేటర్ విభాగంలో గెస్ట్ ఫ్యాకల్టీగా పని చేస్తున్న 52 ఏళ్ల నస్రీన్ ఇషాక్. ఈమె దర్శకత్వం వహించిన ‘పాకుడు రాళ్లు’ నాటకం మొన్న జనవరి ఒకటిన విశాఖలో హౌస్‌ఫుల్ గా ప్రదర్శితమైంది. దానికి ముందు హైదరాబాద్, అద్దంకిలలో కూడా ప్రదర్శితమైంది. షోస్ రిపీట్ అవుతున్నాయి కూడా. ‘ఈ నాటకంలో మంజరి ఎదుర్కొన్న ఘటనలు నేటికీ సినిమా రంగంలో అలాగే ఉన్నాయి. ఆ మధ్య వచ్చిన మీటూ ఉద్యమాన్ని కూడా చూశాం. భరద్వాజ గారు ఈ నవలను విస్తృత ఘటనలతో రాశారు. మంజరి తానే బాధితురాలిగా ఉండి ఆ తర్వాత ఎదుటివారిని ఆడించే శక్తిమంతురాలు అవుతుంది. నవలలో ఆమె పాత్ర అంతర్గత పెనుగులాటను, దాని గాఢతను రచయిత రాయ లేదు. మంజరి పాత్రను సహానుభూతితో అర్థం చేసుకునేలా నాటకం ముగింపును మలచడానికి నవలను శోధించాల్సి వచ్చింది’ అంటారు నస్రీన్ ఇషాక్. ‘పైకి చూడటానికి ఈ నవల మంజరి తన శరీరాన్ని చూపిస్తూ ఇతరులతో ఆడిన ఆటగా ఉంటుంది. కాని లోన చూస్తే ఆ ఆట వల్ల ఆమె పడే వేదన తెలుస్తుంది’ అంటారు ఆమె. 18 మంది నటీనటులు వేదిక మీద 18 మంది నటీనటులు ఈ నాటకాన్ని ప్రదర్శిస్తారు. నవలలో ఎదురు పడే ముఖ్యపాత్రలు– కల్యాణి, రాజమణి, చంద్రం, చలపతి, మాధవరావు... ఈ పాత్రలన్నీ మంజరితో తలపడతాయి. నాటకంలో ఐదు పాటలు ఉన్నాయి. మంజరి పాత్రను భావనా వఝపాండల్ పోషించింది. ‘ఒక నటి బయోపిక్‌ను స్టేజ్ మీద ఏ మేరకు నిజాయితీగా చూపించగలమో ఆ మేరకు పాకుడురాళ్లలో చూపించాం’ అంటారు నస్రీన్ ఇషాక్. తెలుగు రాకపోయినా నస్రీన్ ఇషాక్ది ఢిల్లీ. అక్కడే ఢిల్లీ యూనివర్సిటీలో వీధి నాటకాల నుంచి నాటకరంగం మీద ఆసక్తి పెంచుకున్నారు. నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామాలో సీటు సాధించి చదువుకున్నారు. 2009 నుంచి హైదరాబాద్‌లో ఉన్నారు. ‘మొదట నేను ఇంగ్లిష్, హిందీ నాటకాలు వేయించేదాన్ని. కాని ఇక్కడ ఉన్నదంతా తెలుగు నటులు. మాతృభాషలో నాటకం ఆడటం నటులకు చాలా ముఖ్యం. అందుకని తెలుగు సాహిత్యం నుంచి నాటకాలను ఎంచుకోవాలని నిశ్చయించుకున్నాను. మొదట ‘మైదానం’ నవలను నాటకం చేశాను. ఇప్పుడు ‘పాకుడు రాళ్లు’ చేశాను. నాటకం చేయాలని అనుకున్నాక ఒక నెల రోజుల పాటు రీడింగ్ సెషన్స్ ఉంటాయి. మా నటీనటులు ఒక్కో చాప్టర్ చదువుతూ దాని సారాంశం నాకు హిందీలోనో ఇంగ్లిష్‌లోనో చెబుతూ వెళతారు. నవల ఆత్మను పట్టుకుంటే నాటకం వేయడానికి భాష అడ్డంకి కాదు అని నా భావన. సన్నివేశాల వరుస, నటీనటుల ఎక్స్ప్రెషన్స్, ఎనర్జీ, ఇన్వాల్వ్మెంట్, ఫీలింగ్, వేరియేషన్స్... వీటిని నేను చూసుకుంటాను. నాకు తెలిసిపోతాయి’ అంటారు నస్రీన్. ఆమె భర్త నౌషాద్ ముహమ్మద్ది కేరళ. అతను సెంట్రల్ యూనివర్సిటీ థియేటర్ డిపార్ట్మెంట్లో ప్రొఫెసర్‌గా పని చేస్తున్నాడు. ‘పాకుడురాళ్లు నాటకాన్ని మరెన్నో ప్రదర్శనలు వేయాలని ఉంది’ అంటున్న నస్రీన్ కోరిక నెరవేరాలని కోరుకుందాం. (క్లిక్ చేయండి: స్త్రీ శక్తి.. సూపర్ ఫైటర్) -
తెనాలిలో నాటికల పోటీలు; ఉత్తమ ప్రదర్శన ‘వృద్ధోపనిషత్’
సాక్షి, తెనాలి: వైఎస్ రాజశేఖరరెడ్డి నాటక కళాపరిషత్ ప్రథమ జాతీయస్థాయి నాటికల పోటీల్లో గంగోత్రి, పెదకాకాని సమాజం ప్రదర్శించిన వృద్ధోపనిషత్ నాటికకు ఉత్తమ ప్రదర్శన బహుమతి లభించింది. దీంతోపాటు మరో నాలుగు బహుమతుల్ని ఈ నాటిక కైవసం చేసుకోవడం విశేషం. స్థానిక కొత్తపేటలోని తెనాలి రామకృష్ణకవి కళాక్షేత్రమ్‌లో వైఎస్ రాజశేఖరరెడ్డి నాటక కళాపరిషత్ ప్రథమ జాతీయస్థాయి ఆహ్వాన నాటికల పోటీల్లో విజేతలకు బుధవారం రాత్రి బహుమతుల ప్రదానం జరిగింది. గంగోత్రి, పెదకాకాని సమాజం ప్రదర్శించిన ‘వృద్ధోపనిషత్’ నాటిక ఉత్తమ ప్రదర్శనగా ఎంపికైంది. నటించి, దర్శకత్వం వహించిన ప్రసిద్ధ రంగస్థల/సినీ నటుడు నాయుడు గోపి ఉత్తమ సహాయ నటుడిగా, ఉత్తమ దర్శకుడిగా బహుమతులు అందుకున్నారు. సంగీతం అందించిన శ్రీరమణకూ బహుమతి లభించింది. నటుడు ఎన్.సూర్యకు జ్యూరీ బహుమతి వచ్చింది. ► అరవింద ఆర్ట్స్, తాడేపల్లి వారి ‘స్వర్గానికి వంతెన’ నాటిక కూడా పోటాపోటీగా బహుమతుల్ని కైవసం చేసుకుంది. ఉత్తమ ద్వితీయ ప్రదర్శన బహుమతితోపాటు నటించి, దర్శకత్వం వహించిన గంగోత్రి సాయి ఉత్తమ క్యారెక్టర్ నటుడు బహుమతిని గెలుచుకున్నారు. ఉత్తమ రచన బహుమతిని సుప్రసిద్ధ కథ, నాటక రచయిత వల్లూరు శివప్రసాద్‌కు బహూకరించారు. ఉత్తమ ఆహార్యం బహుమతి థామస్‌కు, జ్యూరీ బహుమతి సత్యనారాయణకు లభించాయి. ► కళాంజలి, హైదరాబాద్ వారి ‘మనిషి మంచోడే’ నాటిక ఉత్తమ తృతీయ ప్రదర్శనగా నిలిచింది. శర్వాణి గ్రామీణ గిరిజన సాంస్కృతిక సేవాసంఘం, శ్రీకాకుళం, బొరివంక వారి ‘ది డెత్ ఆఫ్ మేనీటర్’ నాటికలో టైగర్ రాజు పాత్రధారి బెందాళం శోభన్‌బాబు ఉత్తమ నటుడు బహుమతిని గెలిచారు. ► హర్ష క్రియేషన్స్, విజయవాడ వారి ‘అగ్నిసాక్షి’ నాటికలో ఆమనిగా నటించిన అమృతవర్షిణి ఉత్తమ నటి బహుమతిని అందుకున్నారు. స్నేహ ఆర్ట్స్, వింజనంపాడు వారి ‘కొండంత అండ’ నాటికలో రాంబాబు పాత్రధారి నెమలకింటి వెంకటరమణ ఉత్తమ విలన్ బహుమతిని, ‘మనిషి మంచోడే’ నాటికలో టైగర్ బాలు పాత్రధారి గుంటూరు చలపతి ఉత్తమ హాస్యనటుడు బహుమతిని అందుకున్నారు. ‘ది డెత్ ఆఫ్ మేనీటర్’ నాటికకు ఉత్తమ రంగాలంకరణ బహుమతిని రమణ స్వీకరించారు. న్యాయనిర్ణేతలుగా ఎన్.రవీంద్రారెడ్డి, ఎం.రాంబాబు, ఎ.నర్సిరెడ్డి వ్యవహరించారు. తెనాలి ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్, మున్సిపల్ చైర్పర్సన్ సయ్యద్ ఖలేదా నసీమ్, ఇతర అతిథులు బహుమతుల్ని ప్రదానం చేశారు. (చదవండి: జైహింద్ స్పెషల్: కోటప్పకొండ దొమ్మీ) -
గర్భగుడికి నడిచొచ్చిన నంది
మాతృత్వం ఒక వరం. అయితే, కొన్ని కారణాంతరాల వల్ల సహజంగా తల్లి అయ్యే భాగ్యానికి నోచుకో (లే)నివారు, సహజసిద్ధంగా తండ్రి కాలేనివారు సరోగసీ అంటే అద్దె గర్భం ద్వారా సంతానాన్ని పొందుతున్నారు. చట్టాలు కూడా ఇందుకు అనుమతిస్తున్నాయి. సరోగసీ పద్ధతిలో పేద మహిళలు తమ గర్భాలను అద్దెకిచ్చి, పెద్దింటి వారి బిడ్డలను నవమాసాలు మోసి, కని, కూలి తీసుకుని బిడ్డలను వారి చేతిలో పెడుతున్నారు. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే– అద్దె గర్భం అయినా, అసలు గర్భమైనా అమ్మతనంలో తేడా ఏముటుంది? అసలు అమ్మ అయినా, నొప్పులు పడాల్సిందే, అద్దె తల్లి కూడా ఆ భారాన్ని మోయాల్సిందే, అన్ని నొప్పులూ పడాల్సిందే. ఆ తర్వాత బాలింతరాలి బాధలు అనుభవించవలసిందే. మరి వీరిని వేరు చేస్తున్నదేమిటి? ఉన్నవారు, లేని వారు అనే తేడానే కదా! ఆ ఒక్క తేడా వల్లే తన కడుపులోంచి భూమి మీద పడిన పిల్లల పట్ల మమతానురాగాలు పెంచుకోడానికి వీల్లేదా? ఇది ఏమైనా న్యాయమా? సరోగసీ తల్లికి తన కడుపు చించుకుని పుట్టిన బిడ్డల పట్ల కనీసపు హక్కులు ఉండాలనుకోవడంలో అభ్యంతరం ఎందుకు? ఇవన్నీ మిలియన్ డాలర్ల ప్రశ్నలు. ఇలాంటి ఎన్నో విషయాలను ప్రస్తావిస్తూ... అవసరం అయితే చట్టంలో మార్పులు తెచ్చి అయినా సరే, తల్లితనానికి విలువ ఇవ్వాలని చెబుతూ ప్రముఖ జర్నలిస్టు, కథా, నవలా రచయిత డాక్టర్ చింతకింది శ్రీనివాసరావు రాసిన నాటికే ‘గర్భగుడి’. అమ్మతనంలోని కమ్మదనాన్ని అద్భుతంగా వివరిస్తూనే, ఆ కమ్మదనానికి ఖరీదు కట్టడం సమంజసం కాదని, అసలు తల్లిదండ్రులు కిరాయి చెల్లించి, బిడ్డను సొంతం చేసుకున్న తర్వాత తన కడుపు చించుకుని పుట్టిన ఆ పసికందును కనీసం కంటినిండా చూసుకోరాదని, ఒడినిండా తీసుకోరాదని, ఆ బిడ్డకు చనుబాలివ్వరాదనీ అనడం సహేతుకం కాదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇందులోని చట్టబద్ధతపై ప్రభుత్వానికి సవాళ్లు విసిరారు. ఢిల్లీలోని ఒక ఆస్పత్రిలో చూసిన ఒక నిజ జీవిత సంఘటన చింతకిందిని చాన్నాళ్లు ప్రశాంతంగా నిద్రపోనివ్వలేదు. దాంతో తన మనసులో చోటు చేసుకున్న భావ సంఘర్షణలకు ఓ రూపం ఇచ్చారు. గుండె లోతుల్లోంచి తన్నుకొచ్చిన ఆవేదన ఆధారంగా రాసిన చక్కటి ఇతివృత్తంతో కూడిన ఈ నాటికను కళాకారులు ఎంతో అద్భుతంగా ప్రదర్శించారు. ఎంతోమంది కంట తడి పెట్టించి ఎన్నో ప్రదర్శనలను అందుకున్నది ఈ నాటిక. నాటక ప్రియులు, విమర్శకుల ప్రశంసలు వెల్లువెత్తాయి. అంతేనా...దాంతోబాటు 2017 రాష్ట్రప్రభుత్వ నాటకోత్సవాలలో ప్రథమ ఉత్తమ నాటికగా నిలిచిందీ నాటిక. ఆ నాటిక రచయితగా నంది పురస్కారాన్ని గెలుచుకున్నారు చింతకింది.విశాఖపట్నం జిల్లా చోడవరంకు చెందిన చింతకింది చక్కటి ఉత్తరాంధ్ర మాండలికంలో సొగసైన రచనలు చేయడంలో అందె వేసిన చేయి. మానవీయ కోణంతో కూడిన వార్తలు రాయడంలో మేటి. ‘అదిగో ద్వారక’, ‘వికర్ణ’ వంటి పౌరాణిక నవలలు, ‘దాలప్ప తీర్థం’, ‘కాన్పుల దిబ్బ’, ‘కప్పస్తంభం’ కథాసంపుటాలతో అశేష పాఠకాభిమానాన్ని సంపాదించుకున్న చింతకింది, ఇప్పుడు ఈ నాటికతో నంది పురస్కారాన్ని సాధించారు. – డి.వి.ఆర్. -
రసవత్తరంగా పద్యనాటిక పోటీలు
రాజాం: స్థానిక బస్టాండ్ ఆవరణతో పాటు శ్రీ విద్యానికేతన్ స్కూల్ ఆవరణలో ఆదివారం నిర్వహించిన పద్యనాటిక పోటీలు హోరాహోరీగా సాగాయి. ఉత్తరాంధ్ర స్థాయిలో స్థానిక కళాసాగర్ కల్చరల్ అసోసియేషన్ ఏర్పాటు చేసిన ఈ పోటీల్లో మూడు జిల్లాల నుంచి 20 ట్రూప్‌లు హాజరయ్యాయి. వీరిలో మొదటి బహుమతిని జిసిగడాం మండలం ఎందువ గ్రామానికి చెందిన జి.కుమారి ట్రూప్ సత్యహరిశ్చంధ్ర నాటికలో పిడకల సీను వేసి గెలుచుకున్నారు. ద్వితీయ బహుమతిని విశాఖపట్నంకు చెందిన వంకాయల మారుతీప్రసాద్ ట్రూప్ సత్యహరిశ్చంధ్ర నాటికలో అమ్మకం సీను ప్రదర్శించి గెలుచుకున్నారు. తృతీయ బహుమతిని విజయనగరంకు చెందిన వైదాల సూరిబాబు ట్రూప్ చింతామణి నాటికలో చింతామణి పాత్ర వేసి గెలుచుకున్నారు. అనంతరం పార్వతీపురానికి చెందిన కె.రమణ, సావిత్రి, చందన సింహాచలంలు సత్యహరిశ్చంద్రలో వారణాశి సీను, బొబ్బిలికి చెందిన ఎస్ రాము గయోపాఖ్యానంలో యుద్ధ శీను, కోటవానిపాలెంకు చెందిన జనార్ధననాయుడు శ్రీ రామాంజనేయ యుద్ధంలో యుద్ధసీను పాత్రలో అలరించి కన్సొలేషన్ బహుమతిలు అందుకున్నారు. కార్యక్రమానికి న్యాయ నిర్ణేతలుగా విశాఖపట్నంకు చెందిన బగాది అచ్చెన్నాయుడు, డి.జనార్ధనరావులు వ్యవహరించారు. సభాధ్యక్షులుగా మెట్ట దామోదరరావు వ్యవహరించగా కమిషనర్ పి.సింహాచలం జ్యోతి ప్రజ్వలన చేశారు. కార్యక్రమంలో కళాకారులు శీర రామారావు, చీకటి రామారావు, అన్నెపు కామేశ్వరరావు, సలాది రామారావు, కిలారి లక్ష్మి, గట్టి పాపారావు, జాడ కొండలరావు, రెడ్డి అప్పలనాయుడు, మరిపి తిరుపతిరావు, కొలిపాక రామస్వామి, ఆర్నిపల్లి వెంకటనాయుడు, గోకవలస కృష్ణమూర్తి, మీగడ మల్లిఖార్జునస్వామి, రంప జగదీశ్వరశర్మ తదితరులు పాల్గొన్నారు.