
బి.పి.కరుణాకర్
22 ఏప్రిల్ 1944 – 20 జూలై 2020
‘‘మామూలుగా రాసేదానికన్నా కాస్త ఎక్కువే రాసాను. చిన్నదిగా రాసేంత సమయం లేకపోయింది’’ అన్నాడట ఫ్రెంచ్ గణిత తత్వవేత్త బ్లైసీ పాస్కల్. కథల విషయంలోనూ ఇదే సూత్రం వర్తిస్తుందేమో. నిడివి అనే పరిమితిలో కథని నడపడం అందరికీ సాధ్యమయ్యే విద్య కాదు. అలాంటి కథలు విరివిగా రాసి పాఠకులని మెప్పించగలిగిన వాళ్లు తెలుగు కథాజగత్‌లో చాలా తక్కువగా కనిపిస్తారు. అలాంటి కథకుల్లో చెప్పుకోవాల్సిన పేరు బి.పి.కరుణాకర్. ఆయన కథల్లో ముగింపులాగే గత శనివారం ఉన్నట్టుండి ఆయన గురించి చివరివాక్యం వినాల్సి వచ్చింది.
ఫ్లాష్ ఫిక్షన్, సడన్ ఫిక్షన్, స్మోక్ లాంగ్ ఫిక్షన్ అంటూ ప్రపంచ భాషల్లో జరుగుతున్న ప్రయోగాలు అన్ని సాహితీ ప్రయోగాల్లాగే మన భాషలో వచ్చి చేరడంలో ఆలస్యం జరుగుతూనే వుంది. అయినా వాటిని పరిశోధించి, ప్రత్యేకించి ఇలాంటి కథలనే రాయాలని సాధన చేసి సాధించిన రచయిత కరుణాకర్. సరిగ్గా ఆరేళ్ల క్రితం ఆయన్ని మొదటిసారి కలిసినప్పుడు ఆయన చెప్పిన సడన్ ఫిక్షన్ కథా నిర్మాణ రహస్యాలు ఇంకా గుర్తున్నాయి.
‘‘నా కథలలోకి మొదటి రెండు పేరాల వరకే నేను పాఠకుడి చెయ్యి పట్టుకొని తీసుకెళ్తాను. మూడో పేరా నుంచి, పాఠకుడు కథలో లీనమైన తర్వాత నేను తప్పుకుంటాను. కథ పూర్తయిన తరువాత పాఠకుడు ముగింపు అర్థం కాక నా కోసం చూస్తాడు, కానీ నేను కనిపించను. దాంతో పాఠకుడే సమాధానాలు వెతుక్కుంటాడు.’’
ఈ నిర్మాణ శైలిని సడన్ ఫిక్షన్ అంటారని తరువాతెప్పుడో తెలిసిందనీ చెప్పారాయన. నిడివి తక్కువగా వున్న అర్థవంతమైన, సంపూర్ణమైన కథ రాయడం అంత సులువు కాదు. చాలామంది ఇలాంటి కథలు రాసినప్పుడు కథలో చిక్కదనం పెరిగినా నడకలో వేగం వచ్చి పఠనానుభూతిని తగ్గిస్తుంది. ఈయన కథ అలా కాదు. చాలా తీరుబడిగా మొదలౌతుంది. సన్నివేశ చిత్రణ, పాత్ర చిత్రణ సవివరంగా వుంటుంది. చాలాసార్లు చివరి రెండు పేరాల వరకు కథ మొదలు కూడా కాదు. ‘‘నీడలేని పందిరి’’ అనే కథ ఓ ఎండాకాలం ఒక స్కూల్ లో మొదలౌతుంది. నాలుగు పేజీల కథలో రెండున్నర పేజీలు వాతావరణం తెలియజేయడానికీ, కథకుడి వ్యక్తిత్వాన్ని పరిచయం చెయ్యడానికే సరిపోతాయి. ఈ కథకుడు ఇంటికి వెళ్లి మధ్యాహ్నం భోజనం చేసి పడుకున్న తరువాత ఒక విద్యార్థి వచ్చి తలుపులు కొట్టడంతో అసలు కథ మొదలౌతుంది. ఆ తరువాత కథ ముగింపు అరపేజీ దూరంలో వుంటుంది.
ఈ కథలన్నీ సూటిగా వెళ్లే బాణాల్లాంటి కథలే అయినా ఒక బాణాన్ని నారిపై పెట్టి నెమ్మదిగా వెనక్కి లాగిన లక్షణం మొదటి పేజీలలో కనిపిస్తుంది. దాని వల్ల కథ నడకలో ఎలాంటి సమస్యా రాకపోగా గోప్యత పెరుగుతుంది. పాఠకుడిలో ఉత్సుకత రేగుతుంది.
అసలు సడన్ ఫిక్షన్ కథలకి ముగింపే ముఖ్యం అంటారు కరుణాకర్. కథ చివర్లో జరిగే ఎఫిఫనీ గురించి మనకి చాలా తెలుసు. అలవాటుగా ఓ హెన్రీ పేరు చెప్పేస్తాం కూడా. కొసమెరుపు కథలు అంటూ కాస్త తక్కువ చేసి మాట్లాడేవాళ్లు లేకపోలేదు. కేవలం పాఠకుణ్ణి విస్మయ చకితుణ్ణి చెయ్యడానికి మాత్రమే ఒక ముగింపుని గుప్పిట్లో దాచిపెట్టి కథని బలవంతంగా ఆ ముగింపు వైపు తోలే కథలని అలా అంటే అనచ్చు కానీ కరుణాకర్ కథలు అలాంటి కొసమెరుపు కథలు కాదు. ఇవి కొసమలుపు కథలు (ముగింపు గురించి చెప్తూ వల్లంపాటి వెంకట సుబ్బయ్య– ఓ హెన్రీ, మొపాస కథలను చర్చిస్తూ ఇలాంటి వ్యత్యాసాన్ని చర్చించారు). ‘‘గుప్పెడుగాలి’’ కథ చూడండి. భర్త ఎవరిదో ఫోన్ నంబర్ రాసి జేబులో పెట్టుకున్నాడు. భార్యకి అనుమానం. భర్త ఆఫీస్‌కి వెళ్లినప్పుడు ఆ నంబర్‌కి ఫోన్ చేస్తే ఒకటే ఎంగేజ్. ఆయన ఎంతసేపు మాట్లాడుతున్నాడో అలా! చివరికి తెలుసుకుంటుంది – తన ఇంటి నంబర్ నుంచి అదే నంబర్‌కి ఫోన్ చెయ్యడం వల్ల ఎంగేజ్ వస్తోందని. గుప్పెట్లో ఎంత గాలి నిలుస్తోందో అదే కథలో వుంది. అంటే ఏమీ లేదా? భర్త సెల్ ఫోన్‌లో ఎప్పుడూ మాట్లాడుతూ వుండటం చూసి ఆ భార్య అనుభవించే అభద్రత కథ మొత్తం పరుచుకొని వుంది. నిజానికి అదే కథ. అందుకే చివరి వాక్యం ‘‘సెల్‌లో ఇంతసేపు ఎవరితో మాట్లాడుతూ వుంటాడు?’’ అన్న ప్రశ్నతో మళ్లీ మొదటికే వస్తుంది.
ఇలాంటి కథలు రాయాలంటే పాఠకుల మీద అపారమైన నమ్మకం వుండాలి. వాళ్ల తెలివితేటల పట్ల గౌరవం వుండాలి. అప్పుడే ఎంత చెప్పాలో అంతకన్నా తక్కువ చెప్పి ఆపేయగల ధైర్యం వస్తుంది. ఇలా తక్కువలో ఎక్కువ చెప్పడం కరుణాకర్ అలవోకగా, అలతి పదాలతో సాధించారు. కథలకు పేర్లు పెట్టడంలోనే ఆ చాకచక్యం కనిపిస్తుంది మనకి – ‘ఇరుకు పదును’, ‘నీటిబీట’, ‘ఊటబాధ’, ‘దూరపు దగ్గర’, ‘ఒంటరి దూరం’. మంటో చివరిగా నిద్రించే చోట రాయించుకున్నాడట – ‘‘చిన్న కథ రహస్యాలని తనతోనే పెట్టుకొని సదత్ హసన్ మంటో ఇక్కడే సమాధిలో వున్నాడు’’ అని. కరుణాకర్‌తో కూడా తెలుగు సడన్ ఫిక్షన్ రహస్యాలు కొన్ని వెళ్లిపోయాయి. అవి ఇక మనం ఆయన కథల్లోనే వెతుక్కోవాలి.
(బి.పి.కరుణాకర్ ఇటీవలే కన్నుమూశారు. ‘అంబాలీస్’, ‘నిర్నిమిత్తం’, ‘రాజితం’, ‘రెల్లు’, ‘డియర్’ ఆయన కథల సంపుటాలు. దాదాపు అన్ని కథలూ సడన్ ఫిక్షన్ కథలే.)
అరిపిరాల సత్యప్రసాద్
Comments
Please login to add a commentAdd a comment