కొత్త బంగారం
‘తనకి 16 సంవత్సరాలో, పదిహేడో కోరాకి తెలియదు’ అంటూ కాల్సన్ వైట్హౌస్ ప్రారంభించిన ఈ నవల్లో, ప్రధాన పాత్రయిన కోరా– జోర్జా రాష్ట్రపు, రాండాల్ ప్లాంటేషన్లో ఉండే మూడవ తరపు(1812) బానిస. బానిసల హింస, ఉరితీతలు, మానభంగాలు సామాన్యం అయిన చోటు అది.
కోరా చిన్నపిల్లగా ఉన్నప్పుడు ప్లాంటేషన్ నుండి తప్పించుకు పారిపోయి, పట్టుబడని ఒకే ఒక బానిస–ఆమె తల్లి. కోరా అమ్మమ్మ చరిత్ర కూడా ఉంటుంది నవల్లో. కోరా యజమానిది వక్ర బుద్ధి. కోరా స్వతంత్ర భావాలున్నది. కొత్త బానిస సీసర్ సలహాతో, అతనితోపాటు ఒక రాత్రి పారిపోయి, ఒక తెల్ల ‘స్టేషన్ ఏజెంట్’ సహాయంతో నేలమాళిగ రెయిలెక్కుతుంది. స్వేచ్ఛ వెతుక్కుంటూ పారిపోయే బానిసలకి సహాయపడేందుకు అభివృద్ధి చేయబడిన అండర్‌గ్రౌండ్ రెయిల్ రోడ్ యొక్క అనేకమైన సొరంగాల ద్వారా ప్రయాణిస్తూ– ప్రమాదాలనీ, ప్రతిఘటనలనీ ఎదుర్కుంటుంది. చదువూ,స్వేచ్ఛా గురించిన తన కలలను నిజం చేసుకునేటందుకు వాటన్నిటినీ తట్టుకుంటూ, అణిచివేత గురించి నిర్దిష్టమైన అభిప్రాయాలున్న దక్షిణ రాష్ట్రాలనుంచి ఉత్తర దిక్కుగా ప్రయాణిస్తుంది. ఆ ప్రక్రియలో, ఒక తెల్ల వ్యక్తిని చంపవలిసి వస్తుంది.
కోరా పరుగు మీద నుంచి దృష్టి మళ్ళించకుండానే రచయిత అనేకమైన ఇతర పాత్రలనీ, వారి దృష్టి కోణాలనీ, అంతర్గత జీవితాలనీ కనపరుస్తారు. ‘తనకీ ప్లాంటేషన్కీ మధ్యనున్న ప్రతీ మైలూ ఒక విజయమే’ అనుకున్న కోరా ఏ చోటూ భద్రమైనది కాదని గ్రహిస్తుంది. తను అడుగు పెట్టిన ప్రతీ రాష్ట్రంనుంచీ నేర్చుకుంటూ– మానసికంగా, తాత్వికంగా ఎదుగుతుంది. సౌత్ కారొలీనా వెళ్ళినప్పుడు కొత్త పేర్లూ, కొత్త గుర్తింపూ ఉన్న నూతన జీవితాలు మొదలెడతారు కోరా, సీసర్. అక్కడే సీసర్ హత్య జరుగుతుంది.
పారిపోయిన బానిసలని తిరిగి తెచ్చే రిజ్వే గతంలో కోరా తల్లిని వెతకడంలో విఫలుడైన వ్యక్తి. అతనిప్పుడు కోరాని వెంబడిస్తాడు. మొదటిసారి ఆమె తప్పించుకుంటుంది. రెండోసారి అతన్ని రెయిలు మెట్లమీద నుంచి తోసి, గాయపరిచి– పట్టాలమీదగా పారిపోయి, నేలమాళిగ నుండి బయటకి వచ్చి– పశ్చిమదిక్కుగా ప్రయాణిస్తున్న బిడారుతో కలిపి వెళ్ళిపోతుంది. పారిపోయే వారికి సహాయం చేసేవారిని ‘కండక్టర్స్’ అనీ, బానిసలని ‘కార్గో’ అనీ పిలుస్తారు.
ఈ నవల చారిత్రాత్మక వాస్తవికత యొక్క కాల్పనిక వృత్తాంతం. ఆనాటి రెయిలు వ్యవస్థకి ఆధునిక సౌకర్యాలని కలిపిస్తారు వైట్హౌస్. బానిసల మనస్తత్వాలని సూక్ష్మంగా వ్యక్తీకరిస్తారు. నిషేధించబడిన ‘నీగ్రో, నిగ్గర్’ అన్న మాటలని రచయిత వాడతారు. రచయిత మాటల్లో: ‘మనం గతాన్ని నిర్లక్ష్యపెట్టలేం. భయం సృష్టించడంతో గతాన్ని పునరావృతం చేయలేం. వర్తమానాన్ని గుర్తిస్తూ, గతంతో పాటు జీవించక తప్పదు... సమస్యకి పరిష్కారం ఉండే వీలు లేదు కనుక కథకీ పరిష్కారం లేదు. అమెరికాలో నల్లవారిగా ఉండటం అనేది ఏ విధమైన ముగింపుకీ చేరలేదు.’
రాయడానికి రచయితకి 16 సంవత్సరాలు పట్టిన ఈ నవలని అమెరికా మాజీ అధ్యక్షుడు ఒబామా, టీవీ ప్రయోక్త ఓప్రా విన్‌ఫ్రే చదివారు. ఇది వైట్హౌస్ ఆరవ నవల. మాజికల్ రియలిజం పద్ధతిలో ఉండి, ప్రథమ పురుష స్వరంతో కొనసాగుతుంది. 2016లో అచ్చయి, అదే యేడు ‘నేషనల్ బుక్ అవార్డ్ ఆఫ్ ఫిక్షన్’ పొందింది. 2017లో పులిట్జర్ అవార్డు గెలుచుకుంది. ఆడియో పుస్తకం కూడా ఉంది.
- కృష్ణవేణి
Comments
Please login to add a commentAdd a comment