కొత్త బంగారం
1957లో, హార్పర్ లీ తన పబ్లిషరుకి ‘గో సెట్ అ వాచ్ మాన్’ రాతప్రతి ఇచ్చినప్పుడు, అది నవలలా కాక పిట్టకథల సంకలనంలా ఉందంటూ, అచ్చు వేయడానికి నిరాకరించారు. రెండేళ్ళ పాటు, డ్రాఫ్టులు మారుస్తూ రాసిన తరువాత రూపుదిద్దుకున్నది అమరత్వం పొందిన, ‘టు కిల్ అ మాకింగ్‌బర్డ్’. 1960లో అచ్చయిన ఈ నవల 1961లో పులిట్జర్ పురస్కారం గెలుచుకుంది. దీనికి ఇంత పేరు రావడానికి అతి ముఖ్య కారణం– పుస్తకం సరైన సమయాన, దక్షిణ అమెరికాలో జాత్యహంకారం అతి ఎక్కువయిన కాలంలో అచ్చవడం.
మొదటి డ్రాఫ్టయిన, ‘గో సెట్ అ వాచ్ మాన్’ 2015లో పబ్లిష్ అయింది. ఇది జాన్ లూయీస్ 26 ఏళ్ళ వయసులో ఉన్నప్పటి కథ. న్యూయార్క్ నుండి కాల్పనిక ఊరైన మేకాంబ్‌కి, 72 ఏళ్ళున్న తండ్రి అట్టికస్‌ని చూడ్డానికి వస్తుంది. అట్టికస్ కీళ్ళనొప్పులతో బాధపడుతూ, చెల్లెలు అలెక్సాండ్రాతో పాటు ఉంటుంటాడు. తనని పెంచిన నల్లజాతికి చెందిన వంటామె ఇప్పుడు జాన్‌ని ‘తెల్లమ్మాయిగా’ చూస్తుంది.
జాన్ బాల్య జ్ఞాపకాలే నవల అధిక భాగం ఆక్రమించుకుంటాయి. తన చిన్నతనంలో– ఒక నల్ల జాతి యువకుడు తెల్ల జాతి స్త్రీని మానభంగం చేశాడని ఆరోపించబడినప్పుడు, అట్టికస్ కోర్టులో అతని కేసు వాదించి అతన్ని రక్షిస్తాడని చూసి, తండ్రిని ఆదర్శమూర్తిగా ఊహించుకుంటుంది. ఆరేళ్ళ ఆ పిల్ల( అప్పటి పేరు–స్కౌట్) దృష్టిలో తండ్రి ఏనాడూ తప్పు చేయలేడు. అప్పుడు, ‘అందరికీ సమాన హక్కులుండాలి, ఎవరికీ ప్రత్యేకాధికారాలు ఉండకూడదు’ అని జపించిన తండ్రి ఇప్పుడు మూఢమతాభిమానిగా మారి, జాత్యహంకార కరపత్రాలు పంచుతూ, అనుకూల విభజన ప్రచారంలో పాల్గొంటున్నాడని చూసి జాన్ నమ్మలేకపోతుంది.
ఇంక తండ్రిని ఎదుర్కునే సమయం వచ్చిందనుకుని వాదన పెట్టుకుంటుంది. అట్టికస్ తన ప్రస్తుత ఆలోచనలని వదులుకోడు. నలుపు జాతన్న వివక్ష ఉండకూడదన్న సుప్రీమ్ కోర్టు కొత్త నిర్ణయంతో విభేదిస్తాడు. నల్ల జాతీయులు అధికారంలోకి వచ్చి, ప్రభుత్వ ఉద్యోగాలు చేపడతారేమో అని బెంగ పడతాడు. కూతురికి బుద్ధి చెప్పడానికి తమ్ముడైన డాక్టర్ ఫించ్‌ని పిలుస్తాడు. ‘అంతర్యుద్ధంలో దాస్యం యాదృచ్ఛికమైనది. నల్ల జాతీయులు తెల్లవారికన్నా తక్కువ. ఇతరుల అభిప్రాయాలకి గౌరవం ఇవ్వాలి’ అంటూ, జాన్ చెంపమీద కొట్టి మరీ వివరించి, ఆమెని ‘మతోన్మాది’ అని పిలుస్తాడు పినతండ్రి. తండ్రి మెల్లిమెల్లిగా తిరోగమిస్తున్న వ్యక్తని జాన్ గ్రహించి, రాజీ పడుతుంది.
వాచ్‌మాన్‌లోనూ, ప్రామాణిక నవల అయిన మాకింగ్‌బర్డ్‌లోనూ ఉన్న తేడాలు ఆసక్తికరమైనవి. వాచ్‌మాన్‌లోని అట్టికస్ దక్షిణ పట్టణపు జాత్యహంకారి, నైతికంగా దుర్బలుడైన వ్యక్తి. మాకింగ్‌బర్డ్‌లో అతను లోకం ప్రేమించే, న్యాయం పట్ల అక్కర ఉన్న లాయర్. నిర్భయమైన దిక్సూచి. ‘ప్రా«థమికంగా మనుష్యులు మంచివారు’ అన్న ఆశాభావంతో మాకింగ్‌బర్డ్ అంతం అవుతుంది. ‘మనుష్యులెప్పుడూ మారరు’ అన్న వొప్పగింతతో వాచ్‌మాన్ ముగుస్తుంది. మాకింగ్‌బర్డ్‌లో ఉన్న నాటకీయత ఈ నవల్లో లేదు. జాతీ, రాజకీయాలూ గురించిన సుదీర్ఘ ఉపన్యాసాలపైన ఆధారపడుతుంది. దానివల్ల, పాత్రల పట్ల ముందటి ప్రేమ పాఠకులకి కలగదు. మాకింగ్‌బర్డ్‌తో పోల్చి చూస్తే, ఇది ఒక నవల అని కూడా అనిపించుకోదేమో!
- క్రిష్ణవేణి
Comments
Please login to add a commentAdd a comment